Telugu News

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నరా…? అయితే ఇవి తెలుకోండి..!

భరించలేని వైద్య ఖర్చులు, ఊహించని ప్రమాదాల బారిన పడితే.. ధైర్యంగా ఆ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుంది. అంతేకాదు ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. యువతకు కొన్నిసార్లు ఎలాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే పాలసీ ఇస్తున్నాయి కంపెనీలు. ఎందుకంటే వీరిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువ. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే పాలసీని పొందవచ్చు. రెన్యూవల్ సమయంలోనూ ఆర్థిక భారం స్వల్పంగానే పెరుగుతుంది. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటలు ఉంటేనే క్లెయిమ్ అవుతుందని చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండానే వైద్య ఖర్చులను బీమా ద్వారా పొందవచ్చు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

* ఓపీడీ అంటే తెలుసా?

చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా ఆస్పత్రికి వెళ్లడం సాధారణం అయింది. ఒక్కసారి ఓపీ తీసుకుంటే రూ.2000 పైగానే ఖర్చు అవుతుంది. ఈ ఓపీ చికిత్సకు బీమా వర్తించడంలేదని చాలా మంది వాపోయేవారు. అయితే ఇలాంటి సేవల కోసం బీమా తీసుకునే సమయంలో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) అనుబంధ పాలసీ ఎంచుకుంటే కాస్త ప్రీమియం పెరిగినా పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పాలసీ తీసుకునే విషయంలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి మీ అవసరం, బడ్జెట్కు తగిన పాలసీని ఎంచుకోవాలి. మార్కెట్లో సక్సెస్ఫుల్ క్లెయిమ్ రేట్ ఉన్న సంస్థ నుంచి మాత్రమే తీసుకుంటే మేలు. అందుబాటులో ఉన్న వాటన్నింటినీ పరిశీలించి.. మీ బడ్జెట్లో మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఇందులో అదనపు సౌకర్యాలతో కూడినవి కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకున్నాకే పాలసీ తీసుకోవాలి. ఆస్పత్రిలో చేరినప్పుడు చికిత్స ఖర్చులో కొంత మొత్తాన్ని అంటే 10-20 శాతం వరకు భరించే పాలసీలు ఉంటాయి. దీనివల్ల ప్రీమియం తగ్గుతుంది. అయితే ఇది తీసుకోకపోవడమే మేలు. ఒకవేళ తీసుకుంటే 10 శాతానికి మించి ఉండకూడదని గుర్తుంచుకోండి.

* పన్ను మినహాయింపు

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. పర్సనల్, ఫ్యామిలీ మొత్తానికీ తీసుకున్న పాలసీకి చెల్లించిన ప్రీమియానికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల కోసం పాలసీ తీసుకున్నప్పుడు రూ.50 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా పన్నులో ఆదా చేయగా మిగిలిన మొత్తాన్ని.. వచ్చే ఏడాదిలో ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియాన్ని చెల్లించేందుకు మాత్రమే ఉపయోగపడేలా ప్రణాళిక చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. వీటన్నింటితోపాటు అదే పాలసీని తక్కువ ధరకు కొన్ని బీమా సంస్థలు అందిస్తుంటాయి. బీమా రెన్యూవల్ చేసుకునే సమయంలో వేరే సంస్థలకు మారేందుకు అవకాశం ఉంటుంది. షరతులన్నీ అనుకూలంగా ఉంటే ప్రీమియం తక్కువగా ఉన్న కంపెనీకి మారొచ్చు.

* హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ తప్పులొద్దు

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, తీసుకున్నాక చేయకూడనివి కొన్ని ఉంటాయి. వీటివల్ల పూర్తి క్లెయిమ్ లభించకపోవచ్చు. కొన్నిసార్లు బీమా కంపెనీలు క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఆస్కారమూ ఉంటుంది. ఆరోగ్య వివరాలు, ఆహార అలవాట్ల గురించి దాపరికాలు లేకుండా పూర్తిగా తెలియజేయడం మర్చిపోవద్దు. బీమా సంస్థలు కొన్ని వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ నిర్ణయిస్తాయి. దీనికి ముందే క్లెయిమ్ చేసుకుంటే దాన్ని బీమా సంస్థలు ఆమోదించకపోవచ్చు. డెలివరీ (మెటర్నటీ)కి సంబంధించిన కవరేజ్ పొందడానికి సంస్థ నిర్దేశించిన సమయం వరకు ఆగాల్సిందే. కంపెనీని బట్టి వెయిటింగ్ పీరియడ్లో వ్యత్యాసం ఉంటుంది.ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సాధారణంగా చెల్లుబాటు వ్యవధి ఏడాది ఉంటుంది. పాలసీ కవరేజీ పొందాలంటే కచ్చితంగా గడువు తీరకముందే దాన్ని రెన్యూవల్ చేయాలి. గడువు ముగిస్తే పాలసీ పనికిరాదు. అంటే క్లెయిమ్ పొందడానికి అర్హత కోల్పోయినట్టే.

*ఈ వ్యాధులు సమాచారం దాచకూడదు

హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఏయే వ్యాధులకు చికిత్స అందిస్తారో ముందుగా తెలుసుకోవాలి. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మొదట్లోనే తెలియజేస్తాయి. హెచ్ఐవీ వంటి వ్యాధులకు ఇది వర్తించదు. అలాగే ఈ వ్యాధిగ్రస్థులకు కొన్ని చికిత్సలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే వారికి వినియోగించే వస్తువులు కొన్ని మరొకరికి ఉపయోగించడానికి వీలుండదు.

ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీదీ కీలకంగా పరిగణనలోకి తీసుకుంటాయి బీమా కంపెనీలు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇప్పటికే ఉన్న వ్యాధుల గురించి తెలియజేయాలి. ఈ విషయంలో చాలా నిజాయితీగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా దాన్నే సాకుగా చూపి రిజెక్ట్ చేస్తాయి. దాదాపు అన్ని కంపెనీలు ముందస్తు వ్యాధులకు క్లెయిమ్ కవరేజీని అందించవు. పాలసీ నిబంధనల్లో ఇదే కీలకంగా మారుతుంది. కాబట్టి వీటన్నింటి గురించి ఒకటికి రెండు సార్లు అడిగాకే పాలసీ కొనుగోలు చేయాలి.

Show More
Back to top button