Telugu News

దిగ్గజ పారిశ్రామికవేత్త..రతన్ టాటా.. ఇక లేరు!

ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. ఏ వ్యాపారమైనా నాణ్యత, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసామాన్యమైనది. నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, 

మానవతావాదిగా పేరు గాంచిన రతన్ టాటా.. 86 వయసులో ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(అక్టోబర్ 9న) రాత్రి 11:30.లకు కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపార, జీవిత ప్రస్థానాన్ని తెలుసుకుందాం…

నేపథ్యం

రతన్ నావల్ టాటా.. నావల్ టాటా కుమారుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ టాటా కుమారుడు రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. ఆయన కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టా పొందారు. 1961లో టాటా కంపెనీలో చేరారు. అక్కడే ఆయన టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేశారు. ఆ తర్వాత 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

1937 డిసెంబర్ 28న సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రతన్ టాటా. ఈయనకి 10 ఏళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు. 

తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటిలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.  ఐబీఎంలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆ సమయంలో తండ్రి నవల్ టాటా, రతన్ టాటాను ఇండియాకి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడంతో ఆయన అమెరికా నుంచి ఇండియాకి తిరుగు పయనమయ్యారు. ఆ తర్వాత జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

అది మొదలు టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, కెమికల్స్, టెలీ సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్.. వంటి దాదాపు ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నిర్విరామంగా నడుపుతోంది ఈ సంస్థ. 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థను.. తన ఐడియాలజీతో 23 లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించారు టాటా. 

అత్యున్నత స్థాయి పారిశ్రామికవేత్త అయినప్పటికీ అయన జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి, మీటింగ్ లకు దూరంగా ఉంటారు. ఎటువంటి గర్వం, భీతి కనపడకుండా సాప్ట్ నేచర్ ఉన్న వ్యక్తి రతన్ టాటా.

రతన్ టాటాకు యువత మీద, వాళ్ళ శక్తిసామర్థ్యాల పైన అపార నమ్మకం ఉంది. అందుకే Snapdeal, Paytm, Cardekho, Bluestone, Ola, Xiaomi.. వంటి 39కి పైగా StartUpలలో పెట్టుబడులను పెట్టి, ప్రోత్సహించారు.

1998లో రతన్ టాటా.. టాటా ఇండికా పేరుతో కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్ల వల్ల ఏడాదిపాటు ఆశించిన ఫలితం రాలేదు. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలనే సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకున్నారు.. ఇండికా కార్ల వ్యాపారాన్ని, అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి అమ్మడానికి టాటా, ఆయన టీం కలిసి వెళ్లారు. అయితే ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, రతన్ టాటాతో… “మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ను ఎందుకు స్టార్ట్ చేశారు” అని టాటాను అవమానపరిచారట.

దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారట. కొన్నేళ్ల తరువాత టాటా ఇండికా నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు Jaguar-Land Rover వంటి కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా.. ఫోర్డ్ కంపెనీకి, Jaguar-Land Rover రెండు కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుంచి ముంబైకి చేరుకొని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న Jaguar-Land Roverలను 9,300 కోట్ల రూపాయలకు కొని, ఆ రెండిటిని మళ్ళీ లాభాల్లోకి నడిపించారు టాటా. 

అలాగే టాటా ట్రస్ట్ అనేది దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ లు అందుతున్నాయి. 

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్ లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరును పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషంట్ల కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలను డొనేట్ చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారి కలను సాకారం చేసుకునేందుకు రూ.లక్షకే నానో కారును తీసుకొచ్చి సంచలనం సృష్టించారు టాటా.. ఇవేకాక మరెన్నో కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఆయనది. 

1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారత ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆటోమోటివ్, స్టీల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాల్లో సేవలను అందిస్తోంది. 1990 సంవత్సరం నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత అక్టోబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా కొనసాగారు. 

ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో టాటాను సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయన్ను డాక్టరేట్ లతో గౌరవించాయి. 

అత్యంత నిరాడంబరంగా జీవించిన రతన్ టాటా అవివాహితుడు. ముంబయిలోని అత్యంత చిన్నఇంట్లో ఆయన నివసించేవారు. తన టాటా సెడాన్ కారును ఆయనే నడిపేవారు. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడేవారు. మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతోపాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు. రతన్ టాటా సేవాగుణంలో అత్యున్నతుడు.

85 ఏళ్ల వయసున్న టాటా ఖాళీ సమయాల్లో తన ఫెరారీ కాలిఫోర్నియా కారును నడిపేందుకు ఇష్టపడేవారట. 

‘ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా’ అనే స్వీయపుస్తకాన్ని రాశారు.

యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా భారతీయులు కావడం గొప్ప విశేషం!

సాధారణంగా వ్యాపారం అంటే పెట్టుబడి పెట్టిన దానికి తగ్గ లాభాలు, విస్తరణ, వారసత్వంగా కొనసాగేలా ఉంటుంది. కానీ టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తమ వ్యాపార లాభాల కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టెందుకో స్థాపించలేదు. ఎందుకంటే కంపెనీకి వచ్చిన లాభాలలో సగానికిపైగా అంటే, 66% సమాజ సేవ కోసం ఖర్చు చేస్తుంది.. ఈ  క్రతువుని నిర్విరామంగా కొనసాగిస్తున్న ఏకైక కంపెనీ ప్రపంచంలోనే ఒక్క టాటా గ్రూప్ మాత్రమే. 

రతన్ టాటా.. ఈ పేరు తెలియని వ్యాపారవేత్త గానీ, స్టూడెంట్ గానీ ఉండరేమో..

ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అని అన్నవారే.. ఇప్పుడు టాటా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసి నీరాజనాలు పలుకుతున్నారు.. తరతరాల నుంచి టాటా అంటే ఒక బ్రాండ్.. విలువలకు మారుపేరుగా నిలిచి, ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని, సంస్థ వృద్ధిలో వంద శాతం విజయాలను చవిచూసింది.

Show More
Back to top button