CINEMATelugu Cinema

దక్షిణ భారత సినీరంగానికి కొత్త ఒరవడి తెచ్చిన సినిమా. త్యాగయ్య (1946).

నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగయ్య. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. త్యాగయ్య, త్యాగబ్రహ్మ, త్యాగరాజు అనే పేర్లతో కూడా పిలువబడే ఈయన కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగరాజు తెలుగువాడైనా, తెలుగులోనే కీర్తనలు రచించినా, పుట్టినది తమిళనాడులో గనుక తమిళులు ఆయనను తమ ఆరాధ్య సంగీత దైవంగా భావించేవారు. త్యాగరాజు కర్నాటక శాస్త్రీయ సంగీతంలో పలు రాగాలు, పలు స్వరాలే  కాకుండా పలు కృతులు కూడా సృష్టించారు. అందువలన ఆయన కృతులు పాడేందుకు ఒక నిర్దిష్టత, స్పష్టత ఏర్పడింది. అనుశ్రుతంగా, అదే బాణీలో అదే శైలిలో ఏ సంగీత విధ్వాంసుడైనా పాడవలసిందే. దాదాపు రెండు వందల ఏళ్లకు పూర్వం త్యాగయ్య రచించిన కృతులలోని చరణాలు స్థిరంగా నిలిచిపోవటానికి కారణం ఆయన సాహిత్యంలోని నిర్ధిష్టత, సంగీతంలో సారస్వత.

“ఎందరో మహానుభావులు” అనే పదం తెలుగునాటనే కాక, దక్షిణ ప్రాంతంలో వాడుకలో వినిపించే నానుడియైన చరణం. అలానే “చక్కని రాజమార్గం ఉండగా, సందుల దూరనేల ఓ మనసా!”, “దొరకునా ఇటువంటి సేవ’, “ఏమని పొగడదురా?” వంటి చరణాలు తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయాయి. భారతీయ సంగీతాల్లో ఉత్తరానికి చెందిన హిందుస్థానీ, దక్షిణానికి చెందిన కర్నాటక సంగీతం బాగా ప్రాచుర్యం పొందాయి. త్యాగయ్యకు పూర్వం కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చెందిన సాహిత్యం సంగీత ప్రాచుర్యం గురించి పెద్దగా వినికిడిలో లేదు. జీవిత చరమాంకంలో సన్యాసం స్వీకరించిన తన శేషజీవితాన్ని తిరువయ్యారులోని చిన్న ఇంటిలో ఉంటూ పలు కీర్తనలను రచించి, స్వరబద్ధం చేసిన త్యాగయ్య తన జీవితకాలంలో 24 వేలకు పైగా కీర్తనలను రచించి, స్వరపరచగా, వాటిలో నేడు కేవలం 700 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సంపాదన లేక సంగీతమే పరమావధిగా ఉన్న త్యాగరాజుతో విసిగిన సోదరుడు  ఆయన ఆరాధించే రాముని విగ్రహాన్ని యమునా నదిలో పడవేశాడు. త్యాగరాజు తీర్ధయాత్రలు చేస్తూ దక్షణభారతం పర్యటించారు. భార్య కమలాంబ, కుమార్తె సీతాలక్ష్మిలను కూడా వదలి రామభక్తి సామ్రాజ్యమే ఆనందంగా భవించారు.

సుదీర్ఘమైన ఆలోచన, అపారమైన కృషి, అంకుఠిత దీక్ష చేసి తన మనో తపోబలంతో “మహా నటుడు” అనిపించుకున్న నటులు చిత్తూరు వుప్పల దడియం నాగయ్య (చిత్తూరు వి.నాగయ్య). పత్రికా విలేఖరి ఉద్యోగం చేస్తూ, చిన్నతనంలో నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేస్తూ నాటకాల్లో పాత్రలు ధరిస్తూ, గ్రామ్ ఫోన్ రికార్డులు ఇస్తూ, సినీరంగ ప్రవేశం చేశారు చిత్తూరు వి.నాగయ్య. ఆయన నటించిన తొలిచిత్రం గృహప్రవేశం (1938). అందులో ఆయన కథానాయకులు కాదు. ఒక జాతీయ నాయకుని పాత్ర పోషించారు. ఆయన ప్రతిభను కనిపెట్టిన దర్శకులు బి.యన్.రెడ్డి నాగయ్యను వందేమాతరం (1939) చిత్రంతో హీరోను చేశారు. ఆ తరువాత బి.యన్.రెడ్డి తీసిన “సుమంగళి” (1940) లో వీరేశలింగం లాంటి వృద్ధ పాత్రలో నటించారు. ఆ తరువాత వచ్చిన “దేవత” (194) లో నాగయ్యనే కథానాయకులు. ఇలా సాగిపోతోంది చిత్తూరు వి. నాగయ్య సినీ జీవితం.

ఇదిలా వుంటే నాగయ్య స్నేహితులకు మాత్రం ఆయన పూర్తిస్థాయిలో కథానాయకుడిగా కొనసాగాలన్నది వారి భావన. వాహినీ స్టూడియో వారు నాగయ్యకు మొత్తం ముసలి పాత్రలు, భక్తుల పాత్రలు ఇచ్చి తనలో ఉన్న హీరోను మరుగునపడవేస్తున్నారు అన్నది వారి ఉద్దేశ్యం. అదే విషయం నాగయ్యకు చెప్పి ఆయనను తన మిత్రులు బాగా రెచ్చగొట్టారు. తనే నిర్మాతగా మారి చక్కటి కథానాయకుడి వేషాలు వేసుకోమని ప్రోత్సహించారు. నాగయ్య నిర్మాతగా మారడానికి ఇది కూడా ఒక కారణం. అయితే చిత్తూరు వి.నాగయ్య గూడూరుకు చెందిన మైకా వ్యాపారి దువ్వూరి నారాయణరెడ్డితో కలిసి “రేణుకా ఫిలిమ్స్” స్థాపించారు.

“రేణుకా ఫిలిమ్స్” బ్యానర్ మీద తొలిసారిగా “భాగ్యలక్ష్మి” సినిమా తీశారు. ఆ తరువాత తీసిన రెండవ సినిమా “త్యాగయ్య” (1946). భక్త పోతన (1943) సినిమా నాగయ్యను తెరవేల్పుగా మార్చింది. జనం గుండెల్లో ఆయనను నటయోగిగా, నాదయోగిగా నమోదు చేసింది. ఆయన తెలుగు సినిమాలకు దక్షిణాదిన అద్భుతమైన ఆర్థిక చలామణి ఏర్పడింది. అందువలన త్యాగయ్య చిత్రం మీద కూడా భారీ అంచనాలతో తెరకెక్కించారు. అనుకున్నట్టుగానే త్యాగయ్య సినిమా ఘనవిజయాన్ని నమోదుచేసింది. ఈ సినిమాలో మొత్తం 34 పాటలు ఉన్నాయి. అందులో 28 త్యాగరాజు కీర్తనలు వాడారు. 01 నవంబరు 1946 నాడు విడుదలైన “త్యాగయ్య” సినిమా దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో అజరామర చిత్రంగా నిలచిపోయింది.

కథా రచన…

నిజానికి త్యాగయ్య సినిమాకు పునాది వేసింది “పూర్ణ పిక్చర్స్” అధిపతి జి.కె.మంగరాజు. త్యాగయ్య చిత్రాన్ని రూపొందించడానికి మీరే అర్హులు. మీరు ఆ సినిమాను రూపొందిస్తే వాటి పంపిణీ బాధ్యతలు నేను తీసుకుంటాను అని ఆయన నాగయ్యను ప్రోత్సహించారు. అప్పటికే నాగయ్యకు త్యాగయ్య జీవిత చరిత్ర గురించి ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తే ఆ సినిమాకు ఆయను స్క్రీన్ ప్లే వ్రాసి, దర్శకత్వం వహించేలా చేసింది. అంతకుముందు వరకు ఆయన సంగీతం అందిస్తూ, నటస్తూ ఉండేవారు. ప్రముఖ పాత్రికేయుడు బాబురావు పటేల్ నాగయ్యను “పాల్ ముని ఆఫ్ ఇండియా” అనేవారు. హాలీవుడ్ నటుడు పాల్ ముని ఎక్కువగా ప్రముఖుల “జీవిత చరిత్ర” ఆధారంగా తీసే సినిమాలలో నటించేవారు. ఆ ప్రముఖుల గురించి ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. 

ప్రముఖులు జీవించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారందరినీ సంప్రదించడమే కాకుండా అక్కడి పరిసరాలను బాగా అవగా అవగాహన చేసుకునేవారు పాల్ ముని. నాగయ్య కూడా అదేకోవకు చెందినవారు. ఆయన త్యాగయ్య గురించి తెలుసుకునే విషయంలో తిరువయ్యారు వెళ్లి ఆ మహాకవి జీవించిన ప్రదేశాలను, ఆయన నివసించిన పరిసరాలను పరిశీలించి అక్కడి గాలిని పీల్చి, ఆ మహానుభావుడిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. తంజావూరులోని సరస్వతి గ్రంధాలయంలో ఆయన కృతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే  తిరువయ్యారులోనే ఉన్న త్యాగరాజ స్వామి వారి సమాధి వద్ద ఉన్న కావేరి నదిలో రోజు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఉపవాసాలు ఉంటూ దీక్షగా కథా రచన ఆరంభించారు.

తారాగణం…

త్యాగయ్య సినిమాకు సంగీత చర్చలు మొదలయ్యాయి. పాటలు వ్రాయించడం, సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా జరగడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. త్యాగయ్యగా ప్రధాన పాత్ర వహిస్తున్న నాగయ్యకు జోడీగా, భార్య పాత్రలో గుబ్బి జయమ్మను తీసుకున్నారు. త్యాగయ్య అన్న జపేశం పాత్రలో ముదిగొండ లింగమూర్తి, వదిన కమల పాత్రలో  హేమలతాదేవి, అన్న జపేశం కూతురు సుందరలక్ష్మి పాత్రలో సీతాలక్ష్మి, రాజనర్తకి చపలగా సరితాదేవి ఎన్నికయ్యారు. తంజావూరు సంస్థానాధీశుడు శరభోజిగా న్యాపతి నారాయణమూర్తిని (ఈయన ఆనాటి మద్రాసు ప్రెసిడెంట్ అసెంబ్లీ సభ్యులు) తీసుకున్నారు. సుందరేశ మొదలియార్ గా దొరస్వామిని ఎంచుకున్నారు (ఈయన మిస్సమ్మ సినిమాలో సావిత్రిని పెంచిన క్రిస్టియన్ తండ్రి పాత్ర పోషించారు). అన్న మాట  మార్తాండ భగవతార్ గా ఎం.సిరాఘవన్, వెంకటరమణ భాగవతార్ గా రాయప్రోలు సుబ్రహ్మణ్యం, ధనపాల చెట్టిగా కె.వి.సుబ్బారావు, బొబ్బిలి కేశవయ్యగా నటేషం ఇంకా తదితరులను పాత్రలకు ఎంచుకున్నారు.

తెరవెనుక కళాకారులు…

ఈ సినిమాకు నృత్య దర్శకత్వం వహించిన వారు వేదాంతం రాఘవయ్య. పిల్లలు ప్రదర్శించిన మధురానగరిలో నృత్య రూపకం, చపలకు నాట్యం మొదలగు నృత్యాలకు నృత్య దర్శకత్వం చేశారు. ఛాయాగ్రకుడు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సన్నివేశాలకు కావలసిన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ చిత్రంలో అబ్దుల్ రెహమాన్ చేసిన లైటింగ్ ఏర్పాట్లు అపూర్వం.. ఆ తరువాత అనేక సినిమాలకు ఈ విధానమే ప్రాతిపదిక అయ్యింది. కాశీ విశ్వనాథుని కోసం రామ్ ఖలీ పాడే బిస్మిల్లాఖాన్ గురించి కూడా మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ నటి భానుమతి భర్త భానుమతి రామకృష్ణ కూడా ఈ సినిమాకు దర్శకత్వ విభాగంలో నాగయ్యకు సహకరించారు. దేవదాసు నిర్మాత డి.ఎల్.నారాయణ త్యాగయ్య సినిమా నిర్మాణ వ్యవహారాలు చూశారు. త్యాగయ్య సినిమా చిత్రీకరణ మొత్తం కీల్ఫాక్ లోని న్యూటోన్ స్టూడియోలో జరిగింది.

నిజమైన బ్రాహ్మణులను పిలిపించి…

త్యాగయ్య చిత్రంలో అన్న సంతర్పణ సన్నివేశం కోసం సుమారు రెండువందల మంది గౌడ బ్రాహ్మణులు కావలసి వచ్చింది. అందుకు నిజమైన బ్రాహ్మణులు ఉంటేనే ఆ సన్నివేశం బాగా పండిస్తారని నాగయ్య భావించారు. అందుకోసం ఆయన తన మనుషులను కోస్తాంధ్ర జిల్లాలకు పంపించి వ్యాగేశ్వరపురం, గంగలకుర్రు అగ్రహారం, కాట్రానికోట మిగిలిన ప్రాంతాల నుంచి నిజమైన విప్రులను పిలిపించారు. వారికి రోహిణీ కార్యాలయంలోనే బస ఏర్పాటు చేశారు. బసకు ఆ కార్యాలయం సరిపోకపోవడంతో అక్కడ కొన్ని ఇళ్ళు కూడా తీసుకుని అందరినీ వాటిలో ఉంచారు. త్యాగయ్య సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక వారందరినీ వారి వారి స్వంత ఊర్లకు పంపిస్తూ ఘనంగా సంభావనలు ఇచ్చారు.

త్యాగయ్య సినిమాలో నటించిన ఆ బ్రాహ్మణులకు ఆ రోజుల్లోనే ఒక్కొక్కరికి ఆరు నెలల గ్రాసం ముట్టింది. అర్థణాకి అణాకి సంబర పడిపోయే ఆ బ్రాహ్మణులు నాగయ్య చూపించిన ఆ ఔదార్యానికి చలించిపోయారు. వారు ఆయనను వేనోళ్ల దీవిస్తూ వాళ్ల ఊరికి వెళ్లారు. మొదటినుండి ఉదార స్వభావులు అయిన నాగయ్య కేవలం వీరి విషయంలోనే కాకుండా ఇంకా చాలామంది విషయంలో కూడా ఇలాగే జాలిగుణం చూపించేవారు. సినిమా చిత్రీకరణ చూడడానికి వచ్చిన జనానికి కూడా అన్నం పెట్టమని సినిమా నిర్మాణం వాళ్ళని పురమాయించేవారు. పాపం ఉదయం నుంచి ఎండలో అలాగే కూర్చుండి పోయారు, వాళ్లకు కూడా అన్నపాణాలు చూడండని ఆయన చెబితే అప్పటికప్పుడు వాళ్ళందరికీ వండి వారించేసరికి ప్రొడక్షన్ వారికి చచ్చినంత పనయ్యేది.

కావ్యంలా సాగిన సంగీతం…

ఆది నుండీ సినిమా సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి పొసగదన్న అభిప్రాయాన్ని “త్యాగయ్య” సినిమాతో పటాపంచలు చేసేశారు నాగయ్య. ఈ సినిమాతో తెలుగు సినిమా సంగీతానికి ఒక కొత్త ఒరవడిని, పలుకుబడిని నేర్పింది. ఈ సినిమాలో త్యాగరాజ స్వామి వారి కృతులు మొత్తం 33 ఉన్నాయి. ఆ కృతులను నాగయ్య మధుర మంజులంగా గానం చేశారు. నటి గుబ్బి జయమ్మతో కలిసి ఆయన పాడిన “ఎన్నగా మనసుకురాని పన్నగశాయి”, “శ్రీ కళ్యాణ గుణాత్మక రాం”, “జోజో శ్రీరామా జోజోరఘుకుల తిలకా”, “ఆరాగింపవే పాలారగింపవే” వంటి కృతులు సంగీత ప్రియుల చేత ఆనందభాష్పాలు రాలించాయి. ఈ సినిమాలో జయమ్మ నటనావైదుష్యం, గాత్ర విస్తృతి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. భక్తపోతన సినిమా తెలుగు నేలలోనే కాకుండా కర్ణాటక, మద్రాసు ప్రాంతాలలో కూడా ఘనవిజయాన్ని సాధించింది. దానిని దృష్టిలో ఉంచుకొని త్యాగయ్య సినిమాలో సందర్భానుసారం “రామ మంత్రవ జహిసో హేమానుజ” అనే పురందరదాసు కన్నడ భక్తి గీతం కూడా వాడుకున్నారు. ఆ గీతంలో నాగయ్య కన్నడ భాష ఉచ్ఛారణ ఎంతో స్పష్టంగా ఉంటుంది. 

శరభోజి మహారాజ ఆస్థానంలో రాజనార్తకి చపల చేత “పాపనాశం శివన్ గీతం నినై దురుగుం ఎన్నై” కు నాట్యం చేయించారు. అలాగే శరభోజి రాజావారిని రంజింప చేసేందుకు తన ఆస్థాన గాయని చేత పాడించిన హిందుస్తానీ గీతం “దునియా తెరీ సర్కార్ మే” కూడా సంగీత ప్రియుల చేత వహ్వా అనిపిస్తుంది. ఈ గీతాన్ని జయంతీదేవి ఆలపించడమే గాక, ఈ సినిమాలో ఆమె అభినయిస్తుంది. ఈ సినిమా చివరలో త్యాగయ్య సిద్ధిపొందే సందర్భంలో ఆదిశంకరాచార్య “భజగోవిందం భజగోవిందం” వాడుకున్నారు. ఆ విధంగా సినిమా అంతా కమనీయ సంగీతం కావ్యంలా సాగుతుంది. నాగయ్య దాదాపు రెండు సంవత్సరాలు ఈ సినిమాకు స్క్రిప్టుకు, సంగీతానికి సమయాన్ని వెచ్చించారు. శాస్త్రీయ సంగీతాన్ని బ్రష్టు పట్టించారన్న అపవాదు తనమీద రాకుండా ఉండటానికి పెద్ద పెద్ద సంగీత విద్వాంసులందరినీ తన “రేణుక పిక్చర్స్” కార్యాలయానికి ఆహ్వానించి వారి చేత త్యాగరాయ కీర్తనలు పాడించుకొని వినేవారు. వారి సలహాలు తీసుకుని తాను పాడి వినిపించేవారు. వాళ్ళు ఎక్కడయినా తప్పు ఉందని తెలిస్తే సరిదిద్దుకునేవారు.

కరీం ఖాన్ తంబురా బహుమతిగా పొందిన నాగయ్య…

ఆ రోజుల్లో రేణుకా కార్యాలయం గానసభలా ఉండేది. పారుపల్లి రామకృష్ణయ్య, మహారాజపురం విశ్వనాథయ్యర్, ద్వారం వెంకటస్వామి నాయుడు  చౌడయ్య మణి అయ్యర్, బెంగళూరు నాగరత్నమ్మ, అరియకుడి రామానుజ అయ్యంగార్ వంటి హేమాహేమీలంతా కార్యాలయానికి వస్తూపోతూ ఉండేవారు. కార్యాలయం ఆవరణమంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనించేది. సంగీత సరస్వతి ఇక్కడే తిష్ట వేసుకుందా అన్నట్టుండేది. రేణుక సంస్థకు సొంత ఆర్కెస్ట్రా ఉండేది.

తిరువళ్లూరు సోదరులు కండక్టర్స్ గా వ్యవహరించేవారు. సినిమా సంగీతం శ్రమ అంతా అణువణువునా మనకు కనిపిస్తూ చెవులకు హాయిగా వినిపిస్తుంది. హిందుస్తానీ సంగీత విద్వాంసుడు వుస్తాద్ కరీం ఖాన్ కచేరి మద్రాసలో జరిగింది. ఆ కచేరికి వెళ్లిన నాగయ్య కరీం ఖాన్ బలవంతంపై “ఎందరో మహానుభావులు” పాడారు. ప్రక్కన ఉన్న మిత్రుల ద్వారా ఆకృతి అర్థం తెలుసుకున్న కరీం ఖాన్ పరమానంద భరితులై తన దగ్గర ఉన్న రెండు తంబురాల్లో ఒకటి నాగయ్యకు బహూకరించారు. ఆ రోజుల్లో ఆయన దగ్గర రామ్ లక్ష్మణ్ అని రెండు తంబురాలు ఉండేవి నాగయ్య బహుమతిగా పొందిన రామన్న తంబురా త్యాగయ్య సినిమా అంతటా తంబురాతోనే మనకు కనిపిస్తారు.

బెంగుళూరులో రజతోత్సవం…

త్యాగయ్య సినిమా ఆంధ్రదేశం, కేరళ, మైసూరు మూడు రాష్ట్రాలలో బ్రహ్మాండంగా ఆడింది. బెంగళూరులో ఈ సినిమా రజోత్సవం జరుపుకుంది. త్యాగయ్య సినిమాను ముందస్తు ప్రదర్శనలో చూసిన బి.యన్.రెడ్డి కట్టలు తెగిన కన్నీళ్ళతో మాటలు రాక ఆయనను కౌగిలించుకొని వెన్ను తట్టారు. తనను సినిమా రంగంలో ప్రవేశం కల్పించిన మహానుభావులు బి.యన్.రెడ్డి తనను అభినందించడం నాగయ్యను పరమానంద భరితుడిని చేసింది. అనేకమంది నాగయ్యకు సన్మానాలు చేశారు. మైసూరు, తిరువాన్కూరు సంస్థానాదీశులు “నాగయ్య” కు అపూర్వ సత్కారాలు చేశారు. తిరువాన్కూరు రాజా తన నిండుసభలో నాగయ్యను తన సరసన గద్దెపై కూర్చుండబెట్టుకుని పాదపూజ చేసి, “అభినవ త్యాగరాజు” అన్న బిరుదు ప్రధానం చేశారు.

మైసూరు సంస్థానంలో రాజ బంధువులందరూ త్యాగయ్య సినిమాను ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని మరీ చూశారు. నాగయ్యను రాజభవనానికి ఆహ్వానించి పెద్ద వెండి పళ్లెంలో 101 కాసులు పోసి బహుకరించారు. శ్రీరాముని చిత్రపతకంతో కూడిన బంగారు గొలుసును నాగయ్య మెడలో వేశారు. బెంగళూరులో త్యాగయ్య సినిమా ప్రదర్శించిన థియేటర్లో నాగయ్యకు కనకాభిషేకం జరిగింది. త్యాగయ్య సినిమా విడుదలయ్యాకే మద్రాసు నగరంలో గాన సభలు కుప్పలుతెప్పలుగా వెలిశాయి. సంగీత సభలు ఆంధ్రదేశంలో కూడా  ఏర్పాటయ్యాయి. నాగయ్యకు ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానంది. కానీ రాజకీయాలంటేనే రుచించని నాగయ్య ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. త్యాగయ్య సినిమా ఇచ్చిన ఉత్సాహంతో “ఆదిశంకరాచార్య” తెరకెక్కించమని నాగయ్యను పూర్ణ మంగరాజు ప్రోత్సహించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. త్యాగయ్య విడుదలైన చాలా యేండ్ల తరువాత 1964 లో నాగయ్య “భక్త రామదాసు” తీశారు.

కార్యాలయంలో నిత్య అన్నదానం…

“వెలుగుతున్నన్నాళ్ళు తార, వెలుగు తగ్గితే ఉత్తి ప్రమిద” అన్న సామెత కథానాయకులు నాగయ్యకు వర్తిస్తుంది. ఆ రోజులలో నాగయ్య కార్యాలయం ఉచిత భోజనశాలలాగా ఉండేది. ఉదయం పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ లాంటి కమ్మటి ఫలహారాలు పెట్టేవారు. అలాగే మధ్యాహ్నం కమ్మటి భోజనం. ఎవరు? ఎంతమంది? అనే ప్రశ్న లేకుండా వడ్డిస్తూ పోతూనేవుండేవారు. మద్రాసు నగరంలో తిండికి లేక లాటరీలు కొట్టే వారందరికీ నాగయ్య కార్యాలయం కడుపు నింపేది. ఆ విధంగా పెట్టీ పెట్టీ చివరికి తన ఆస్తులన్నీ కరిగిపోయి చివరికి సినిమాలో చిన్న చిన్న వేషాలు, అతిథి పాత్రలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితికి ఆయన వచ్చారు. సినిమాలో పాత్ర పోషించినందుకు ఎంత డబ్బు ఇమ్మంటారని అడిగితే తనదైన శైలిలో చేతులు కదుపుతూ మీ మనసుకి ఎంత తోస్తే అంత ఇమ్మని అనేవారు.  చివరి రోజులలో చిత్రీకరణ సెట్లో కనీసం ఆయనకు కుర్చీ వేయడం కూడా కష్టమైపోయింది. దానిని గమనించిన ఆ తరువాత తరం కథానాయకులు నాగయ్యను చూసి జీవితంలో అయనలా ఉండకూడదని నిర్ణయించుకునేవారు. నాగయ్య నటన జీవితం తరువాత తరం హీరోలకు మార్గదర్శకం అయ్యారు..

నమ్మి చెడిన నాగయ్య…

నాగయ్యను “త్యాగయ్య” సినిమా కుబేరుడిని చేసింది. కానీ ఆ భోగం చాలా కొద్దిరోజులు మాత్రమే ఉండింది. సూపర్ స్టార్ అయ్యి ఉండి, అత్యధిక పారితోషికం తీసుకున్నా కానీ లక్ష్మీదేవి ఆయన ఇంట ఎప్పుడూ స్థిరంగా పట్టుమని పది రోజులు కూడా ఉండేది కాదు. “త్యాగయ్య” సినిమా విడుదలయ్యాక నాగయ్యకు మామూలుగానే చాలా చోట్ల సన్మానాలు, ఇబ్బడి ముబ్బడిగా కానుకలు అందాయి. తన ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. త్యాగయ్య సినిమా తరువాత మద్రాసులో “కోడంబాకం” లో 52 ఎకరాల తోట కొన్నారు. ఇప్పడు దాని ఖరీదు సుమారు వేల కోట్ల రూపాయలు. త్యాగయ్య సినిమా నాటికే నాగయ్య కథానాయకుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా చిత్రపరిశ్రమలో బాగా పేరు సంపాదించుకున్నారు. ఇక మిగిలింది స్టూడియో అధినేత ఒక్కటే.

స్టూడియో కూడా కావాలని ఉబలాటపడ్డ నాగయ్య అది నిజం చేసుకునే క్రమంలో దారుణంగా నష్టపోయారు. స్టూడియో పరికరాల కోసం విదేశీ సంస్థలకు చాలా పెద్ద మొత్తంలో బయానాలు ఇచ్చారు. కానీ ఈలోగా జరగకూడని విషయం జరిగిపోయింది. స్టూడియోలో భాగస్వామ్యం తీసుకుంటానని రంగంలోకి దించిన ఈయన మిత్రుడు పత్తాలేకుండా పోయాడు. దాంతో స్టూడియో నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు మొదలైంది. నాగయ్య ఇచ్చిన బయానాలు వెనక్కి రాలేదు. ఇదిలా ఉంటే మరోవైపు నాగయ్య చేత అప్పుకు హామీ ఇప్పించిన మరో మిత్రుడు కూడా జాడలేకుండా పోయాడు. అప్పు ఇచ్చిన వాళ్ళు నాగాయ్య తోటను తమ స్వాధీనం చేసుకున్నారు. చివరికి నాగయ్య తనకంటూ ఒక స్టూడియో కట్టుకోలేక పోయినా కాలక్రమంలో అదే ప్రాంతంలో శ్యామల, కర్పగం స్టూడియోలు వెలిశాయి. నాగయ్య మాత్రం తన మిత్రులను నమ్మి చెడ్డారు.

Show More
Back to top button