NRI NewsTelugu News

భారతీయటెక్ నిపుణులకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్‌ కార్డ్ లాటరీ విధానానికి స్వస్తి పలికేలా కొత్త చట్టం?

అమెరికాలో విదేశీ ఉద్యోగుల ప్రవేశానికి కీలకమైన హెచ్‌-1బీ వీసా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా అక్కడి కాంగ్రెస్‌లో ఒక సంచలన ముసాయిదా బిల్లు ఇమిగ్రేషన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస చట్టాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న తరుణంలో.. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు చిప్‌రాయ్ ‘అమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌’ పేరిట ఈ ముసాయిదా బిల్లును సభ ముందుకు తెచ్చారు.

H-1B వీసా వ్యవస్థపై కొత్త బిల్లుతో చర్చలు వేగం

గత నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ప్రస్తుత లాటరీ ఆధారిత విధానం వల్ల గ్రీన్‌ కార్డుల కోసం హెచ్‌-1బీ వీసాలు విపరీతంగా దుర్వినియోగం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. కంపెనీలు చౌకగా లభించే విదేశీ కార్మికులను తెచ్చుకోవడానికే మొగ్గు చూపుతున్నాయని, దీనివల్ల సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లోని స్థానిక అమెరికన్ నిపుణులు తమ స్వదేశంలోనే వివక్షకు గురవుతూ ఉద్యోగాలు కోల్పోతున్నారని వాదించారు.

ఈ పరిస్థితులను మార్చడానికి లాటరీ పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో తాత్కాలికంగా పనిచేసుకునేందుకు వీలు కల్పించే ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌’ (OPT) కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలని బిల్లులో గట్టిగా ప్రతిపాదించారు. ఇకపై కేవలం మెరిట్, వాస్తవ వేతన ప్రమాణాల ఆధారంగా స్థానిక అమెరికన్లకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే పారదర్శక వ్యవస్థను తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనలకు యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌, ఇమిగ్రేషన్‌ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్‌ వంటి స్థానిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

గ్రీన్ కార్డ్ లాటరీ రద్దుకు ప్రతిపాదన.. భారతీయ టెక్ నిపుణుల్లో ఆందోళన

ఈ హఠాత్ పరిణామాలతో అమెరికాలో స్థిరపడాలని భావించే లక్షలాది మంది భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులలో తీవ్ర ఆందోళన, అయోమయం నెలకొనడంతో అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించి వివరణ ఇచ్చింది. తమ దేశ వీసా నిబంధనలు ప్రత్యేకంగా భారతదేశాన్ని గానీ, భారతీయ ఐటీ వర్కర్లను గానీ టార్గెట్ చేస్తూ రూపొందించినవి కావని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్‌ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కొత్తగా తెచ్చే మార్పులు ప్రపంచంలోని అన్ని దేశాల వలసదారులకు సమానంగా వర్తిస్తాయని, ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని పేర్కొన్నారు.

అమెరికన్ వైట్-కాలర్ వర్కర్ జాబ్స్ బిల్లు ప్రభావం ఏమిటి?

గత ప్రభుత్వాలు వీసా చట్టాల అమలును నిర్లక్ష్యం చేశాయని, కానీ ప్రస్తుత ట్రంప్ యంత్రాంగం నిబంధనలను అత్యంత కచ్చితంగా అమలు చేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఏదేమైనప్పటికీ, ఒకవేళ ఈ ముసాయిదా బిల్లు గనుక ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే, అమెరికా ఐటీ రంగంపై ఆధారపడిన విదేశీయులకు.. ముఖ్యంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లే భారతీయ టెక్ నిపుణుల భవిష్యత్తుకు, కెరీర్ అవకాశాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు:

గ్రీన్‌కార్డ్ జాప్యంతో అమెరికా కంపెనీలకు ఇబ్బందులు!

అమెరికాలో వలసదారుల ‘నిర్బంధ’ వేడుకలు: ఇళ్లకే పరిమితమైన హెచ్-1బీ ఉద్యోగులు

అమెరికాలో షట్‌డౌన్ : కారణాలు – మనపై ప్రభావం

Show More
Back to top button