NRI News

గ్రీన్‌కార్డ్ జాప్యంతో అమెరికా కంపెనీలకు ఇబ్బందులు!

ట్రంప్ ప్రభుత్వానంతరం అమెరికాలో వీసాలు, గ్రీన్‌కార్డుల ప్రక్రియ కఠినతరం కావడంతో వలసదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డులు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల్లో అనిశ్చితి పెరుగుతోంది. ముఖ్యంగా వర్క్ పర్మిట్‌లు ముగిసినా, కొత్తవి సమయానికి రాకపోవడంతో, ఎన్నో కంపెనీల్లో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేస్తున్నారు.

తాజా ఉదాహరణగా.. అట్లాంటా నగరంలో సేవలు అందిస్తున్న “మార్టా” ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ సీఈవో కొల్లిన్ గ్రీన్‌వుడ్ రాజీనామా చేశారు. ఆయన వర్క్ పర్మిట్ జూన్ 18న ముగిసినా, గ్రీన్‌కార్డ్ ఇంకా రాలేదు. కెనడా పౌరుడైన ఆయన, 2022 జనవరిలో సీఈవోగా బాధ్యతలు చేపట్టి సంస్థ ఆర్థికంగా బలపడేలా చేశారు. కానీ ఇమిగ్రేషన్ జాప్యం కారణంగా పదవి వీడాల్సి వచ్చింది.

ఇలా సీనియర్ లీడర్లు పదవులు కోల్పోవడం కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతోంది. రవాణా రంగంలో గ్రీన్‌వుడ్‌ వంటి పలువురు అధికారులు ఇదే కారణంగా రాజీనామాలు చేశారు.

ఇక భారతీయుల విషయానికి వస్తే.. గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో మొత్తం 1.13 కోట్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి.

ఫారమ్ I-90 (గ్రీన్‌కార్డ్ రీన్యూవల్) ప్రాసెసింగ్‌ సమయం 0.8 నెలల నుంచి 8 నెలలకు పెరిగింది. అలాగే ఫారమ్ I-765 (వర్క్ పర్మిట్‌ల కోసం) 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అమెరికా వలస విధానాలపై మరోసారి సమీక్ష అవసరమైందనిపిస్తోంది.

Show More
Back to top button