NRI News

వర్క్ పర్మిట్లపై మరోసారి షాక్ ఇచ్చిన అమెరికా..!

వలసదారుల విషయంలో కఠిన విధానాలు అమలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శరణార్థులు (Asylees), ఆశ్రయం పొందాలనుకునేవారు (Asylum seekers), గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారికి (Pending Green Card applicants) ఇచ్చే వర్క్ పర్మిట్‌ల (ఉద్యోగం చేసుకునే అనుమతులు) కాలవ్యవధిని తగ్గిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా ప్రకటించింది.

ఈ వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చే పత్రాన్ని ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) అంటారు. ఇది ఒక వ్యక్తికి నిర్దిష్ట కాలవ్యవధి వరకు అమెరికాలో పనిచేసే అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇంతకుముందు ఈ EAD కాలవ్యవధి అయిదేళ్లుగా ఉండేది. తాజా సవరణల ప్రకారం, ఈ కాలపరిమితిని గణనీయంగా తగ్గించి కేవలం 18 నెలలకు కుదించారు. ఈ EAD పత్రాలు గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, F-1, M-1 వీసాలపై వచ్చే విద్యార్థులు, మరియు డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సంచలన నిర్ణయానికి ముఖ్య కారణం ‘భద్రత’ అని USCIS పేర్కొంది. ఇటీవల అధ్యక్ష భవనం సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఒక దుండగుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో, దేశంలోకి వలస వచ్చేవారిపై కఠినమైన భద్రతా సమీక్షలు (Security reviews) అవసరమని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం భావిస్తోంది. ఈ భద్రతా కారణాల దృష్ట్యా, వలసదారుల వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే వర్క్ పర్మిట్ల కాలవ్యవధిని 18 నెలలకు కుదించినట్లుగా తెలుస్తోంది. ఈ కఠిన విధానం అమెరికాలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేలాది వలసదారులపై, ముఖ్యంగా శరణార్థులు, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Show More
Back to top button