Telugu News

గుజరాత్ స్పెషల్.. దసరా పండుగ విశేషాలు

దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు, దేవీ నవరాత్రులు ఉంటాయి. చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు.

శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారం, శ్రీ గాయత్రి దేవి అలకారం, శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం, శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం,  శ్రీ మహా చండీదేవి అలంకారం, మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారం, శ్రీ దుర్గా దేవి అలంకారం, శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం, విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గ మాత దర్శనం ఇస్తారు.

కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ నాడు బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.  అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. అంతేకాదు విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతారు.  రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేస్తారు. అలాగే దసరా రోజున పాలపిట్టను చూడడం కూడా శుభ సూచికంగా భావిస్తారు. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

 *@ గుజరాత్ లో దసరా ప్రాముఖ్యత…* 

దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవిని ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి, దానిపై మట్టి ఉండ పెట్టి, దానిని నీటితో నింపి, పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు.

గర్భా అనేది సంప్రదాయ గుజరాతీ జానపద నృత్యం. గర్భా అనే పదం ‘గర్భం’ లేదా ‘చిన్న మట్టి దీపం’ అని అర్థం ఈ నృత్యాన్ని ప్రధానంగా నవరాత్రుల సమయంలో ఆడతారు. ఇది దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు శ్రద్ధగా అర్పించే నృత్య రూపం. నవరాత్రి వేడుకలు అంటే కేవలం దుర్గా పూజ, ఉపవాసం, రావణ దహనం మాత్రమే కాదు. గర్భా, దాండియా వంటి ప్రత్యేక నృత్యాలు కూడా ఉండటం ఈ పండుగకు ప్రత్యేకత.

ఈ రెండు నృత్యాలు లేకుండా గుజరాత్‌లోని శరన్నవరాత్రి ఉత్సవాలు జరగవు.

శక్తి దేవతకు అంకితం చేస్తూ చుట్టూ గుండ్రంగా నిలబడి దీపం లేదా శక్తి విగ్రహం చుట్టూ ఈ నృత్యం చేస్తారు.

నవరాత్రి సమయంలో ఈ నృత్యం చెడుపై మంచికి దుర్గాదేవి సాధించిన విజయాన్ని చెబుతారు.

ఈ నృత్యంలో, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు. గర్భా అనేది స్త్రీ శక్తిని, సంతానోత్పత్తి శక్తిని సూచిస్తుంది. 

అందులో భాగంగా జీవన-మరణ చక్రాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.  దాండియా కూడా నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఇది దుర్గాదేవి, మహిషాసురుడి మధ్య యుద్ధానికి ప్రతీకగా ఆడే నృత్యంగా చెప్పవచ్చు.

గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బాలో పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై ఆధారపడి ఉంటాయి. దాండియాలో ఉపయోగించే కర్రలను దుర్గాదేవి ఖడ్గంగా భావిస్తారు. ఇది చెడుపై మంచికి సాధించిన విజయానికి గుర్తుగా ఉంటుంది. గర్బా చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. అయితే దాండియాలో చెక్క కర్రలను ఉపయోగిస్తారు.

గుజరాత్‌లో ఉద్భవించిన మతపరమైన సామాజిక కార్యక్రమం గర్భా. వాయువ్య భారత రాష్ట్రమైన గుజరాత్ సంప్రదాయ నృత్యం ఇది. గర్బా ప్రదర్శించబడే కార్యక్రమాన్ని సూచించడానికి “గర్బా” అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ నృత్యం గుజరాత్ గ్రామాలలో ఉద్భవించి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. గ్రామం మధ్యలో సామూహిక సమావేశ ప్రదేశాలలో పాల్గొని మహిళలు, పురుషులు ఈ గర్భా నృత్యాన్ని చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అనేక సామాజిక కార్యక్రమాల మాదిరిగానే, గర్బాకు కూడా మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద నృత్య ఉత్సవం గర్భా.

నవరాత్రి అంటే “తొమ్మిది రాత్రులు” అని అర్ధం. ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన పురాతన హిందూ పండుగ. దుర్గాదేవి తొమ్మిది రూపాలు, భయంకరమైన కత్తి పట్టిన కాళరాత్రి నుండి విశ్వం యొక్క నవ్వుతున్న సృష్టికర్త కుష్మాండ వరకు. ఈ పండుగ అనేక విధాలుగా, అమ్మవారి 9 అవతారాలను సూచిస్తూ జరుపుకుంటారు. భారతదేశ ప్రాంతానికి ప్రత్యేకమైన పండుగ ఇది. గుజరాత్‌లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొమ్మిది రాత్రుల నృత్యాలతో పాటిస్తారు. సాయంత్రం నుండి, పురుషులు, మహిళలు ఒక చోట చేరి దుర్గా గౌరవార్థం రాత్రి చివరి వరకు నృత్యం చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది పగలు, రాత్రులలో పరిమిత ఆహారాలతో ఉపవాసం లేదా ప్రత్యేక ఆహారాన్ని పాటిస్తారు. నవరాత్రి సమయంలో మాత్రమే ప్రత్యేకంగా ప్రదర్శించబడదు. వివాహాలు, పార్టీలు వంటి సామాజిక కార్యక్రమాల సమయంలో కూడా గర్బాను ప్రదర్శిస్తారు. గర్భా నృత్యం చేస్తూ ఆటలాడుతూ ఉల్లాసంగా గడుపుతారు.

ఈ గర్భా నృత్యాన్ని స్త్రీలింగ దైవికత, జీవిత చక్రీయ స్వభావానికి ప్రతీకగా ఈ నృత్యం నిర్వహిస్తారు.

 స్త్రీలను, దైవత్వాన్ని గౌరవించి, ఆరాధించి జరుపుకునే నృత్యం. దేవి యొక్క దైవిక శక్తి వారిలోనే ఉందనే వాస్తవాన్ని గౌరవించడానికి గర్బా నృత్యం చేస్తారు.

గర్బా నృత్యాన్ని ఒక వృత్తంలో  ప్రదర్శిస్తారు. ఈ వృత్తం హిందూ కాల దృక్పథాన్ని సూచిస్తుంది. హిందూ మతంలో, కాలం చక్రీయమైనది. పుట్టుక నుండి జీవితం నుండి మరణం వరకు పునర్జన్మ వరకు కాల చక్రం తిరుగుతున్నప్పుడు స్థిరంగా ఉండే ఏకైక విషయం దేవతగా పరిగణిస్తారు. ఈ అంతులేని  అనంతమైన కదలికల మధ్యలో కదలని చిహ్నం దుర్గాదేవి విగ్రహాం.

ఇతర హిందూ ఆచారాలు,  ఆరాధనల మాదిరిగానే, గర్బా మతపరమైన ఆచారంలో భాగంగా చెప్పుకోవచ్చు. ఈ నృత్యాన్ని చెప్పులు లేకుండా  చేస్తారు. చెప్పులు లేకుండా  భూమి పట్ల తమ గౌరవాన్ని చాటుతూ ఇలా నృత్యం చేస్తారు. పాదం భూమిని తాకే శరీర భాగం, అందరికీ పవిత్రమైన తల్లి. భూమి ఉత్పాదక శక్తులతో నిండి ఉంది.  చెప్పులు లేకుండా నృత్యం చేయడం దుర్గ అమ్మవారితో ఆధ్యాత్మికంగా దగ్గర అవ్వడానికి మరొక మార్గంగా కూడా చెప్పవచ్చు.

గుజరాత్ కు చెందిన ప్రముఖ గర్బా నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్)జాబితాలో చేర్చింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చడం అక్కడి సంప్రదాయానికి గర్వకారణంగా చెప్పవచ్చు.

Show More
Back to top button