
అమరావతి ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సేకరణ ప్రాజెక్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం. అసలు రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావే సూచించారన్నారు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాం.
యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని ఆయన అన్నారు. అంతేకాకుండా విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీయే చెప్పిందని ఈయన అన్నారు. దీనిని కావాలనే వైసీపీ నేతలు తప్పుపడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ఇక హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం తనకు ఉందని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని కూడా అన్నారు. “రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు భూమిని ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పారు.
కానీ, అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలే చూశారని” సీఎం చంద్రబాబు ఎద్దేవ చేశారు. “జగన్ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. విభజన సమయంలో మనకు లోటు బడ్జెట్‌ఉంది. ప్రాజెక్టు ఏదైనా విన్ విన్ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లా. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. అమరాతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది’’ సీఎం చంద్రబాబు అన్నారు .