
వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక ఆటుపోట్లు పెరుగుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు ఇవి మరింతగా ఉంటాయి. వైద్య ఖర్చు, ఇంటి నిర్వహణ ఖర్చు, కుటుంబ సభ్యులకు కావాల్సిన ఖర్చు ఇలా అనేక రకాల ఖర్చులతో సతమతమవుతుంటారు. ఇలాంటి సమయంలో రుణం తీసుకుందాం అంటే వయసు పైబడిన వారికి రుణం వస్తుందో లేదో..? అనే సందేహంలో ఉంటారు. అయితే, వారికుండే పరిమిత ఆదాయంపై పలు లోన్లను తీసుకోవచ్చు.
పర్సనల్ లోన్: సీనియర్ సిటిజన్లకు కూడా పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్ల పెన్షన్ లేదా వారి ఇతర ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారు ఉంటారు. వారికి ప్రతి నెల ఒక నిర్దిష్ట డబ్బు.. పెన్షన్ రూపంలో వస్తుంది. ఆ ఆదాయం, వారి వయసు ఆధారంగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. కాలవ్యవధి వారికి 70 ఏళ్లు నిండే లోపు అయిపోయేలా ఉంటుంది. ఉదాహరణకు మీకు 67 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాల వరకు మాత్రమే కాల వ్యవధి ఉంటుంది.
రివర్స్ మార్ట్‌గేజ్ లోన్స్: ఇందులో ఇంటిని తాకట్టుగా పెట్టి రుణం తీసుకుంటారు. ఇది ఎలా పని చేస్తుందంటే.. బ్యాంకు ఇంటి విలువ ఆధారంగా నెలవారీగా స్థిర మొత్తాన్ని రుణంగా అందజేస్తుంది. ఇలా తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా రుణ గ్రహీత మరణించిన తర్వాత ఆస్తిని అమ్మి బ్యాంకు వారు వసూలు చేసుకుంటారు.
బంగారు రుణం: ఇది అందరూ తీసుకునే రుణం. సీనియర్ సిటిజన్ల వద్ద బంగారం ఉంటే.. స్వల్పకాలానికి బంగారు రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణంతో పోలిస్తే దీని వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. బంగారం విలువపై 75% వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
NBFCల ద్వారా రుణం: ఏదైనా బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరిస్తే.. మీరు NBFC సంస్థలను సంప్రదించవచ్చు. ఇవి బ్యాంకుల కంటే సులువుగా రుణాన్ని అందజేస్తాయి. కానీ, వీటి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అత్యవసరం అంటేనే రుణం తీసుకోండి.










