Telugu News

వానలో ఫోన్‌ తడిస్తే.. ఆ పని మాత్రం చేయకండి!

ఈ సీజన్‌లో మనమే కాదు మనం ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా మొబైల్స్‌, ల్యాప్‌ టాప్‌, ట్యాబ్లెట్ ల వంటివి నీరు, తేమను తట్టుకోలేవు. కాబట్టి వానాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువకాలం గ్యాడ్జెట్స్ లైఫ్‌ ఉండేలా, వాటి కెపాసిటీ తగ్గకుండా కాపాడుకోవచ్చు.

మీరు ఏదైనా పనిమీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ లను తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి వస్తే మటుకు వాన చినుకులు, చెమ్మ తగలకుండా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్‌ ప్రూఫ్‌ బ్యాగ్ లేదా బ్యాక్ ప్యాక్‌ లో పెట్టుకోవాలి. జిప్‌లాక్‌ బ్యాగ్‌లైతే ఇంకా మంచిది. వీటికి పెద్దగా ఖర్చేం కాదు. తేలికగా వెంట తీసుకెళ్లొచ్చు. తడికి తడవకుండా డివైజ్‌లను చూసుకోవచ్చు.

మనం ఎక్కువగా రెగ్యులర్‌గా ఫోన్‌లను ఛార్జింగ్‌ పెట్టేందుకు వీలుగా కిటికిల దగ్గర పెడుతుంటాం. ఇలా తేమ ఉండే చోట్ల పరికరాలను పెట్టొద్దు. ఎందుకంటే వాన జల్లు వీటిమీద పడితే స్క్రీన్, లోపలి భాగాలు పాడవుతాయి. వంట గది, బాత్రూమ్ వంటి చోట్లకు కూడా  దూరంగా ఉంచాలి. ఒకవేళ తడిస్తే ఆ డివైజ్‌ను వెంటనే ఆఫ్‌ చేయండి. ఇది ఫర్దర్‌గా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా కాపాడుతుంది లేకపోతే లోపలి భాగాలు దెబ్బతినే అవకాశముంది. తడి మీదనే ఆపరేట్‌ చేయకుండా ఫోన్‌లోని కేస్, సిమ్ కార్డు, మెమరీ కార్డు వంటివి బయటకు తీయాలి. మెత్తటి, పొడి బట్టతో మొత్తం తుడవాలి. పోర్ట్స్ చివర్లకి నీటి తడిని తోయొద్దని గుర్తుంచుకోండి. హెయిర్ డ్రయర్‌తో వేడి గాలి కొట్టటం, నేరుగా ఎండలో పెట్టటం వంటివేవీ చేయవద్దు. ఇవి మరింత దెబ్బతినేలా చేస్తాయి.

ఆ పర్టిక్యులర్‌ డివైజ్‌ను సిలికా జెల్ ప్యాకెట్లతో కూడిన సీల్డ్ బ్యాగ్ లేదా డబ్బాలో పెట్టాలి. సిలికా ప్యాకెట్లు తేమను వెంటనే గ్రహిస్తాయి. ఒకవేళ సిలికా జెల్‌ అందుబాటులో లేకపోతే బియ్యం డబ్బాలోనైనా పరికరాన్ని ఉంచాలి. ఒకట్రెండు రోజుల తర్వాత పూర్తిగా ఎండిపోయిందని తెలుసుకున్నాకే ఆన్ చేయాలి. అప్పటికీ పరికరం పనిచేయకపోతే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లండి. 

మరో విషయమేంటంటే, తడిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జ్ చేయొద్దు. అలా ఛార్జ్ చేస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్స్‌ ఎక్కువగా ఉంటుంది. ఫోన్ తడిగా ఉందని లేదా ఛార్జింగ్ పోర్ట్‌ నుంచి నీరు లోపలికి వెళ్లిందనిపించినప్పుడు పూర్తిగా ఎండేంత వరకూ వేచి చూడాలి. ఆ తర్వాతే ఛార్జింగ్ పెట్టాలి. వానాకాలంలో పవర్‌ కట్‌ ప్రాబ్లం, వోల్టేజీ హై, లో అనేవి అవుతుంటాయి. అందువల్ల పరికరాలను ఛార్జ్ చేస్తున్నప్పుడు సర్జ్ ప్రొటెక్టర్ లేదా యూపీఎస్ ను వాడుకోవటం బెటర్‌.

అలానే డివైజ్‌లను, వాటి పనితీరును చెక్‌ చేస్తూ ఉండాలి. దుమ్ము, తేమను తొలగించటానికి మెత్తటి, పొడి క్లాత్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఛార్జింగ్ పోర్ట్స్, హెడ్ ఫోన్‌ జాక్స్, బటన్ల మీద కొంచెం ఫోకస్‌ ఉంచండి. పోర్టుల్లోకి చేరిన దుమ్ము తీసేందుకు సూదులు, పిన్నీసులు వంటి పదునైన వస్తువులను గుచ్చొద్దు. ఎక్కువకాలం డివైజ్‌ను వాడనప్పుడు చల్లటి, పొడి ప్రాంతాల్లో సేఫ్‌గా ఉండేలా పెట్టాలి. ప్లాస్టిక్ బ్యాగులు తేమను పట్టి ఉంచుతాయి కాబట్టి వీటిల్లో పరికరాలను ఎక్కువసేపు ఉంచొద్దు. గాలి వచ్చిపోయే డ్రాయర్ లేదా కేబినెట్ లో పెట్టుకోవాలి. పైన చెప్పుకున్న టిప్స్‌ వల్ల మీ డివైజ్‌లు ఎక్కువ లైఫ్‌తో పనిచేస్తాయి. ఈసారి గమనించండి.

Show More
Back to top button