CINEMATelugu CinemaTelugu Special StoriesUncategorized

పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన.. సిరివెన్నెల

పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన సిరివెన్నెల సినిమా (20 మే 1986).

ఒక మామూలు వేణు గాన విద్వాంసుడు హరిని, పండిట్ హరిప్రసాద్ ని చేస్తుంది గైడ్ జ్యోతిర్మయి. అతనిలో ఉన్న నిగూఢమైన ప్రతిభను గుర్తించి దానిని సానబెట్టడానికి సహాయం చేస్తుంది. అతనికి తన చేష్టలతో ప్రకృతి స్వభావాన్ని పరిచయం చేస్తుంది. ఆమె సాయంతో కొన్నేళ్ళకు అతను గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకుంటాడు. హరిప్రసాద్ ఆమెకు తెలియకుండానే మనసులో ఆమెను ఆరాధిస్తుంటాడు. తన ఆల్బమ్స్ ఆమెకు అంకితం చేస్తూ ఉంటాడు. “ఎక్కడో రోడ్డు ప్రక్కన ఉన్న గులకరాయిని తీసుకుని పవిత్ర గంగా జలంతో కడిగి మాణిక్యాన్ని చేస్తుంది” జ్యోతిర్మయి.

★★★★★★★★★★★★

హరి.. నీవు ఇంకా పైకి రావాలని, ఇంకా పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము అంటుంది జ్యోతిర్మయి..

అది నా ఒక్కడి చేతుల్లో ఉందా.. అంటాడు హరి..

జ్యోతిర్మయి :- నిజమే, ఇద్దరి చేతుల్లో ఉంది. నువ్వు, నీ మనసు.

హరి :- కానీ నా మనస్సు నీ చేతుల్లో ఉంది.

జ్యోతిర్మయి :- తెలుసు, అందుకనే నేను చెప్పినట్టు వింటుందని నా నమ్మకం.

జ్యోతిర్మయి :-  హరి.. ప్రతీ రికార్డు నాకే అంకితం చేస్తున్నావు. ఎందుకూ..??

హరి :- నా మనస్సు అంకితం చేస్తున్నానని చెప్పడానికి.

జ్యోతిర్మయి :- అది భక్తి చేతా? గౌరవం చేతా?  ప్రేమ చేతా? కామం చేతా?

హరి :- వీటన్నిటిని మించిన ఆత్మీయత చేత..

జ్యోతిర్మయి :-  ఆ ఆత్మీయతకు పరాకాష్ట పెళ్లేనా?  ఈ రెండు శరీరాలు కలవడమేనా?

హరి :- కాదు ఈ రెండు మనసులు కలవడం.

జ్యోతిర్మయి :- ఏం ఇప్పుడు కలిసి లేవా? పెళ్లి చేసుకుంటేనే కలుస్తాయా?

హరి :- పెళ్లి చేసుకోనక్కరలేదు.

జ్యోతిర్మయి :- ఒకవేళ నాతో నీ పెళ్లి జరుగకపోతే నీవు ఇచ్చిన ఆ మనస్సును తీసేసుకుంటావా?

హరి :- లేదు..

జ్యోతిర్మయి :- దానిని హింసించి, బాధపెట్టి నువ్వు బాధపడతావా?

హరి :- పడతాను.

జ్యోతిర్మయి :- ఈ పెళ్లి అనే ఆటలో ఓడిపోయానని మిగిలిన జీవితాన్ని మట్టిపాలు చేస్తావా?

హరి :- చెయ్యను..

జ్యోతిర్మయి :- నేను నీకు దక్కలేదన్న నిరుత్సాహంతో పేరుని…???

హరి :- ప్లీజ్..  ఏనాడూ నేను నీ శరీరాన్ని కోరుకోలేదు. భర్తగా నిన్ను అనుభవించాలని ఆశపడలేదు. నేను కోరుకున్నది నీ మనసులో ఇంత చోటు. ఆశపడింది అక్కడ పొందే ఆర్థత.

జ్యోతిర్మయి :-  హరి.. నాకు తెలుసు హరి. నాకు తెలుసు.. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో…

★★★★★★★★★★★★

ఒక పవిత్ర ప్రేమకు భాష్యం చెప్పిన ఒక నిజమైన ప్రేమికుడి, అజరామర ప్రేమకు నిదర్శనం సిరివెన్నెల సినిమా. తానొక అందమైన యువతి. కానీ తన శరీరం మలినమైపోతుంది. హరి అమ్మవారికి పెట్టిన నైవేద్యం కోరుకుంటున్నాడు, కానీ నేను ఎంగిలిపడ్డ ప్రసాదం కనుక హరి ని పొందే అదృష్టం తనకు లేదని భావించి తన నిజమైన ప్రేమకు చిహ్నంగా తాను తన ప్రాణాన్ని వదిలేసి అంధుడైన హరి కి తన కళ్ళను కానుకగా ఇస్తుంది జ్యోతిర్మయి.

ఇదే త్యాగం. పవిత్రమైన ప్రేమ ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. రెండు శరీరాలు కలిసేదే ప్రేమ అయితే, రెండు మనసులు కలిసేది నిజమైన ప్రేమ. అమర ప్రేమ, అజరామర ప్రేమ…

ప్రేమ అనంతమైనది.. రాసే పదాల్లో.. పలికే మాటల్లో.. చేతల్లో.. వ్యక్తం చేయలేనిది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ప్రేమ విశ్వవ్యాప్తమైన ఓ అందమైన భావన. అది ఏ ఒక్క రోజుకో.. ఏ ఒక్క ఘడియకో సంబంధించింది కానేకాదు..

చిత్ర విశేషాలు

 • దర్శకత్వం    :    కె . విశ్వనాథ్
 • రచన        :        కె.విశ్వనాథ్
 • నిర్మాత      :         ఏడిద నాగేశ్వరరావు
 • తారాగణం     :      సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్, మీనా, సంయుక్త..
 • ఛాయాగ్రహణం    :      ఎం. వి. రఘు
 • కూర్పు          :      జి. జి. కృష్ణారావు..
 • సంగీతం        :     కె.వి.మహదేవన్
 • నిర్మాణ సంస్థ    :   పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
 • విడుదల తేదీ   :   20 మే 1986
 • సంగీత దర్శకత్వం    :   కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు..
 • సినిమా నిడివి    :    181 నిమిషాలు..
 • భాష              :        తెలుగు

నటవర్గం.

 • సర్వదమన్ బెనర్జీ  –  పండిత్ హరిప్రసాద్..
 • సుహాసిని  –  సుభాషిణి..
 • మూన్ మూన్ సేన్  –  జ్యోతిర్మయి..
 • మీనా  –  కుమారి మీన..
 • జె.వి. రమణమూర్తి..
 • ఎస్.కె. మిశ్రో..
 • శుభ..
 • సాక్షి రంగారావు..
 • శుభలేఖ సుధాకర్..
 • వరలక్ష్మి..

చిత్ర కథ సంక్షిప్తంగా.

జైపూర్ సమీపంలోని ఒక గ్రామంలో హరిప్రసాద్ అనే ఒక అంధుడైన వేణుగాన కళాకారుడు తన చెల్లెలితో కలిసి నివసిస్తుంటాడు. అది ఒక అందమైన పర్యాటక ప్రదేశం. అతనికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం తన వేణుగానం ద్వారా అద్భుతమైన పాటలు వాయించి దాని ద్వారా వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తుంటాడు. ఒకసారి పర్యాటకులతో పాటు వచ్చిన జ్యోతిర్మయి అనే గైడ్ అతని వేణు గానానికి ముగ్ధురాలవుతుంది. ఆమె అతనిలో ఉన్న నిగూఢమైన ప్రతిభను గుర్తించి దానిని సానబెట్టడానికి సహాయం చేస్తుంది. అతనికి ప్రకృతి స్వభావాన్ని పరిచయం చేస్తుంది. ఆమె సాయంతో కొన్నేళ్ళకు అతను గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకుంటాడు. హరిప్రసాద్ ఆమెకు తెలియకుండానే మనసులో ఆమెను ఆరాధిస్తుంటాడు. తన ఆల్బమ్స్ ఆమెకు అంకితం చేస్తూ ఉంటాడు. ఇంతలో మాటలు రాని సుభాషిణి అనే చిత్రకారిణి హరిప్రసాద్ ని ఆరాధించడం మొదలుపెడుతుంది.

సుభాషిణి హరిప్రసాద్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని తన చిత్రాలలో కనబరుస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఆమె సోదరుడు ఆమెకు హరిప్రసాద్ పట్ల ఉన్న అనురాగాన్ని అర్థం చేసుకుంటాడు. హరిప్రసాద్ మామయ్యను కలిసి సంబంధం మాట్లాడతాడు. కానీ అప్పుడే హరిప్రసాద్ తనకు జ్యోతిర్మయి మీదున్న అభిమానాన్ని బయటపెడతాడు. ఇది తెలుసుకున్న జ్యోతిర్మయి తాను గతంలో ధనవంతులైన పర్యాటకులతో గడిపిన విషయం గుర్తుకువచ్చి తాను అతనికి సరిపోనని భావిస్తుంది. ఆమె హరిప్రసాద్ కి ఈ విషయాన్ని పరోక్షంగా తెలియబరచాలని ప్రయత్నిస్తుంది కానీ తన శరీరం మీద ప్రేమ లేని అతని స్వచ్ఛమైన ప్రేమను చూసి ఆ ప్రయత్నాలు మానుకుంటుంది. ఆమె కూడా మనసులో అతన్ని ఆరాధిస్తుంటుంది కానీ మనసులో ఏ మూలనో తాను అతనికి తగనని భావిస్తూ ఉంటుంది. చివరికి తనకు ఓ వైద్యుడితో నిశ్చితార్థం అయింది కాబట్టి అతన్ని పెళ్ళి చేసుకోలేనని చెబుతుంది. ఆమె సంతోషాన్నే కోరుకున్న హరిప్రసాద్ ఆమె పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు.

ఆమె పెళ్ళి రోజే తన కళ్ళను హరిప్రసాద్ కి దానమివ్వమని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. తన చావు యాత్ర పెళ్ళి యాత్ర లాగా జరగాలనీ, హరిప్రసాద్ కి ఆ విషయం తెలియకూడదని కూడా కోరుకుంటుంది. అందరూ ఆమె కోరిక మేరకు ఆమెను అత్తారింటికి పంపుతున్నట్లే శ్మశానానికి పంపుతారు. హరిప్రసాద్ ఇదంతా ప్రశాంతంగా గమనిస్తూ చివరికి ఆమె సమాధి దగ్గరకు వెళ్ళి తన నివాళులర్పిస్తాడు. అది విచిత్రంగా చూస్తున్న సుభాషిణికి తన దేవత తనకు దూరమైన సంగతి తన దగ్గర ఎవ్వరూ దాచలేరని చెబుతాడు. ఇద్దరూ మౌనంగా జ్యోతిర్మయి సమాధికేసి చూస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

సర్వదమన్ బెనర్జీ.

ఒక అంధ వేణు విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన కలకత్తా వాసి సర్వదమన్ బెనర్జీ గారు. తన వేణు గానంతో, తన పాటలతో పర్యాటకులను ఆకట్టుకునే తీరు బావుంటుంది. అదే సమయంలో గైడ్ జ్యోతిర్మయితో పరిచయం, దాంతో తన జీవితం మలుపు తిరుగుతుంది. జ్యోతిర్మయి, హరి ప్రసాద్ మధ్యనున్న ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తాను కళ్ళతో చూడలేని ప్రతీ దృశ్యాన్ని, ప్రతీ సన్నివేశాన్ని తాను కళ్లారా చూసినట్లుగా పాడే విధంగా తన స్పర్శతో అత్యద్భుతంగా తనకు అనుభూతి కలిగిస్తుంది. అందుకే ఆమె పట్ల విపరీతంగా అభిమానం పెంచుకుంటాడు. ఎనలేని ఆరాధనా భావం కలిగిఉంటాడు.

ఇవన్నీ పట్టింపు లేక విదేశాలకు వెళ్లిన జ్యోతిర్మయిని తన ఆరాధ్య దేవత గా కొలుస్తుంటాడు. తిరిగిచ్చిన జ్యోతిర్మయి ఇదంతా తెలుసుకుని తనను ఇంతగా అభిమానించడం, ఇంతలా ప్రేమించడం చూసిన తనకు తన గత ప్రవర్తన సిగ్గుపడేలా చేస్తుంది. దాంతో ఆత్మభిమానం అడ్డుగా నిలిచి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదంతా హరికి తెలియకుండా జాగ్రత్త పడమంటుంది. కానీ చివరికి హరికి తెలిసిపోతుంది. కళ్ళు లేవు కనుక చూడలేడు అనుకుంటారు. కానీ తనకు తెలిసిపోతుంది అంటాడు హరి. ఆద్యంతం అంధ పాత్రలో హరి గా అద్భుతంగా అభినయించిన సర్వదామన్ బెనర్జీ గారు తన జీవిత కాలంలో అతి తక్కువ సినిమాలలో నటించి 37 ఏండ్ల వయస్సులోనే నటనకు స్వస్తి చెప్పారు.

సుహాసిని.

మాటలు రాని మూగ పాత్ర పోషణ అద్భుతంగా పోషించారు సుహాసిని గారు. చిత్రకారిణిగా బొమ్మలు గీస్తుంది. పాటలు వ్రాస్తుంది. సంగీత విద్వాంసుడైన హరిప్రసాద్ ప్రేమలో పడుతుంది సుభాషిణి. హరి ప్రసాద్ చిత్రం గీయాల్సిందిగా వాళ్ళ తాత గారు కోరగా సూర్య, చంద్రుల ప్రతిరూపాలను మరియు వేణువును తన ముఖ చిత్రం గా గీస్తుంది. కానీ తాను జ్యోతిర్మయి ని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాడని తన అన్నయ్య ద్వారా తెలుసుకొనిన  సుభాషిణి వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు నిరాకరించిన జ్యోతిర్మయి తన గతం గురించి సుభాషిణికి చెప్పి తనను పెళ్ళాడే అర్హత తనకు లేదని చెబుతుంది. హరి ప్రసాద్ గారి నిజమైన ప్రేమను కళ్లారా చూసిన జ్యోతిర్మయి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది.

ఈ విషయాన్ని కళ్లారా చూసిన సుభాషిణి జ్యోతిర్మయి వ్రాసిన ఉత్తరం చదివి నివ్వెరపోతుంది. ఆ సమయంలో వాళ్ళ తాత గారిని తీసుకువచ్చి ఆ జ్యోతిర్మయి వ్రాసిన ఉత్తరం చూపించి పెళ్లి జరిగినట్లుగానే తన అంత్యక్రియలను జరిపిస్తారు. ఈ సన్నివేశాలలో ఒక మూగ పాత్రలో అద్భుతమైన అభినయం ప్రదర్శించారు సుహాసిని గారు. హరి ప్రసాద్ గారిని వేణువు తో పాడమని అడుగుతుంది సుభాషిణి. డబ్బులు తీసుకొని పాడుతా అంటాడు హరి. తనవద్ద ఉన్న డబ్బులు తక్కువ. ఇంత గొప్ప కళాకారునికి ఈ డబ్బు సరిపోదని తన వద్ధ ఉన్న బ్రేస్లెట్ ఇస్తుంది. ఇది వెండి నా, ఇత్తడి నా, లేక బంగారం నా అని అడుగుతాడు హరి. ఇలాంటి ఎన్నో హృద్యమైన సన్నివేశాలలో అద్భుతంగా అభినయించేశారు సుభాషిణి గారు.

మూన్ మూన్ సేన్…

గైడ్ గా వచ్చిన జ్యోతిర్మయి, కథనాయకుడు హరి ని ఒక మాములు వేణు గాన విద్వాంసుడి నుండి పండిట్ హరిప్రసాద్ గా మార్చేస్తుంది. హరి వేణుగానానికి ముగ్దురాలై చూపులేని అంధుడైన హరికి తన శరీర స్పర్శతో ప్రకృతిని, సూర్యోదయాన్ని పరిచయం చేస్తుంది. దాంతో పరవషుడైన హరి తన వేణువుతో బూపాల  రాగాన్ని ఆలపిస్తాడు. అంధుడైన వ్యక్తి ప్రకృతిని చూడలేడు. ప్రకృతిలో ఉన్న సూర్యోదయం, ఋతువులు, చంద్రోదయం, వర్షపు తొలి చినుకులు ఇలాంటి వాటిని తన వేణు గానం ద్వారా చూపించాలన్నది హరి తాపత్రయం. కానీ ఎలా సాధ్యం. అప్పుడు జ్యోతిర్మయి అడుగుతుంది హరి ని, నీవు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదంటాడు హరి.

పోనీ ఏ స్త్రీనైనా తాకినవా అని అడుగుతుంది జ్యోతిర్మయి. లేదంటాడు హరి. అయితే నీకు చెప్పడం సులువు అంటుంది జ్యోతిర్మయి. తన రెండు చేతులను తన ముఖం పై గుండ్రంగా తిప్పుతూ సూర్యోదయం ఇలా ఉంటుంది అని తన స్పర్శతో చూపిస్తుంది. వెంటనే తన వేణువుతో బూపాల రాగంలో ఆలపిస్తుంటాడు హరి. అద్భుతంగా వస్తుంది.  తన స్పర్శతో ప్రకృతి అందాలను పరిచయం చేస్తుంది. ఆ విధంగా తన ఎదుగుదలకు పరోక్షంగా సహకరించడాన్ని చూసి ఆమెను ఆరాధిచడం మొదలుపెడతాడు. తనను ప్రేమిస్తాడు. కానీ తన గతాన్ని పరిగణలోకి తీసుకున్న జ్యోతిర్మయి, హరి నిజమైన ప్రేమ ముందు మలినమైన తన శరీరాన్ని హరికి ఇవ్వలేనని జ్యోతిర్మయి తాను ఆతర్పణం చేసుకుంటుంది

సిరివెన్నెల సీతారామ శాస్త్రి…

పాట ఏదైనా సరే సిరివెన్నెల కలం పడితే అద్భుతమై పోవాల్సిందే. ఎలాంటి పాటనైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా సరళమైన పదాలతో వ్రాసి తెలుగు పాటకు సరికొత్త వన్నె తీసుకురాగాల ప్రతిభ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సొంతం. ఎంతో మంది దర్శకుల, నిర్మాతల ఇష్ట గేయ రచయిత. ఎంతో మంది శిష్యులకు ఆరాధ్య గురువు, దైవం సిరివెన్నెల గారు. తన పాటలకు కోట్లాది మంది ప్రేక్షకులు అభిమానులుగా ఉన్నారు. అద్భుతమైన పాటలు, అర్థవంతమైన పాటలు రాయడంలో సీతారామశాస్త్రి గారిది అందెవేసిన చేయి. పాట ఎలాంటిదైనా ప్రేక్షకులను ఉత్తేజపరిచి వారిని మంత్ర ముగ్ధులను చేయగల సత్తా సిరివెన్నెల గారి సొంతం. సిరివెన్నెల సినిమా కవి కాదు.. నిశ్శబ్ధ పాటల విప్లవం.

కె. విశ్వనాథ్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీతారామ శాస్త్రి గారు “విధాత తలపున ప్రభవించినది”.. అంటూ తాను వ్రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకు మంచి స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట వ్రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి ఎలా వెలుగులు పంచుతుందో, అలాగే సినీ చిత్ర సీమలో ఎందరు గేయ రచయితలున్నా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్నారు సిరివెన్నెల గారు.

“ఆది భిక్షువు వాడినేమి కోరేదీ”…

“ఈ గాలి ఈ నేల”…

“చినుకు చినుకు”…

“చందమామ రావే జాబిల్లి రావే”…

“పాటల్లో”…

“పొలిమేరు దాటిపోతున్న”…

“ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు”…

“మెరిసే తారలదే రూపం”..

“విధాత తలపున ప్రభవించినది” ..

ఇలా ప్రతీ పాటలోని సాహిత్యానికి వెన్నెల వెలుగులు అద్దిన సిరివెన్నెల గారు ప్రతీ గేయాన్ని అద్భుతంగా, చక్కగా వ్రాశారు. “చేంబోలు సీతారామశాస్త్రి” గా ఉన్న తన పేరు “సిరివెన్నెల సీతారామ శాస్త్రి” గా ప్రసిద్ధికెక్కిందంటే ఆ చిత్రంలోని పాటలు ఎంతటి ఘన విజయం సాధించాయో వేరే చెప్పక్కర్లేదు. “విధాత తలపున ప్రభవించినది” అనే పాటకు సాహిత్యాన్ని అందించినందులకు గానూ 1986 సంవత్సరంలో ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

విశ్వనాథ్ గారిని మానసికంగా ఇబ్బందిపెట్టిన “సిరివెన్నెల సినిమా”…

భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కళాత్మక చిత్రాలకు కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి దర్శకులు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ గారు.  తన  కలలను నిజం చేసుకుంటూ భారతీయ కళలను చిత్రాలుగా మలచిన తీరుకు ప్రశంసలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మక పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులతో సత్కరించింది చిత్ర పరిశ్రమ. విశ్వనాథ్ గారు ఆవిష్కరించిన “శంకరాభరణం” చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా నిలిచిపోయింది.

స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, శుభసంకల్పం, శృతిలయలు .. ఇలా తన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విశ్వనాథ్ గారిని ఒక చిత్రం చిత్రవధకు గురించేసిందట. ఆ చిత్రమే “సిరివెన్నెల”. సినిమా సగం తెరకెక్కించాక ఆ చిత్ర కథ విశ్వనాథ్ గారికి నచ్చలేదట. కథనాయకుడు, కథానాయకి పాత్రల లక్షణాలు, వ్యక్తిగత ఆనవాళ్లు తనను ఇబ్బందికి గురిచేశాయట. కథనాయకుడు గుడ్డివాడు, కథానాయకి మూగ అమ్మాయి కావడమేంటి? వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమేంటి? ఈ కథను నేను ఎలా ముగించాలి ? ఈ కథ నా తలపుకు ఎందుకు వచ్చింది?  ఇలాంటి ప్రశ్నలు తనకు తానే సంధించుకుని మానసిక వేదనకు గురయ్యారట.

సిరివెన్నెల చిత్రీకరణ సమయంలో కూడా కళాతపస్వి గారి మనస్సులో అనేక సందేహాలు, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయట. కథలో ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్స్ తనను చాలా ఇబ్బంది పెట్టాయట. ఆ మానసిక సంఘర్షణ తట్టుకొని ఎలాగోలా విశ్వనాథ్ గారు చిత్రీకరణ పూర్తి చేసి అపురూపమైన విజయం అందుకున్నారు. విశ్వనాథ్ గారు చెక్కిన పాత్రలు కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎందువలన అనగా తెరపై విశ్వనాథ్ గారి చిత్రాలలో పాత్రలు అంత సహజంగా ఉంటాయి గనుక. చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికలపైన సిరివెన్నెల చిత్రాన్ని ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు విశేష ప్రేక్షకాదరణ పొంది నిర్మాతలకు లాభాలు పంచింది సిరివెన్నెల చిత్రం.

పాటలు.

1. “ఆది భిక్షువు వాడినేమి కోరేదీ”…

2. “ఈ గాలి ఈ నేల”…

3. “చినుకు చినుకు” …

4. “చందమామ రావే జాబిల్లి రావే”…

5. “పాటల్లో”…

6. “పొలిమేరు దాటిపోతున్న” …

7. “ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు”…

8. “మెరిసే తారలదే రూపం”…

9. “విధాత తలపున ప్రభవించినది” …

పురస్కారాలు.

1986 సంవత్సరంలో “విధాత తలపున ప్రభవించినది” పాటకు సాహిత్యాన్ని అందించినందుకు గానూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి లభించింది..

1986 సంవత్సరంలో “విధాత తలపున ప్రభవించినది” పాటకు ఆలపించినందుకు గానూ యస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడుగా నంది బహుమతి వరించింది.. 

1986 వ సంవత్సరంలో సిరివెన్నెల సినిమాలో నటనకు గానూ “మూన్ మూన్ సేన్” గారికి ఉత్తమ సహాయ నటీమణులుగా నంది బహుమతిని స్వీకరించారు..

1986 వ సంవత్సరంలో సిరివెన్నెల సినిమాలో ఛాయాగ్రహణం అందించినందుకు గానూ “ఎం.వి.రఘు” గారు ఉత్తమ ఛాయాగ్రహకులుగా నంది బహుమతిని స్వీకరించారు..

విశేషాలు.

★ కథనాయకుడు అంధుడు ( గుడ్డివాడు ), కథానాయిక మాటలు రాని మూగది, సహా కథానాయిక మలినపరచబడ్డ స్త్రీ.

★ ఇలాంటి పాత్రలతో కథను అల్లడమే ఒక సాహసం. అద్భుతమైన ముగింపునివ్వడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం…

★ కథానాయిక హరిప్రసాద్ బొమ్మను సూర్య చంద్రులు, వేణువు తో కూడిన ఆకారంతో చిత్రించి హరి గొప్పదనాన్ని చాటడం అద్భుతం..

★ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుండి జాలువారిన సాహిత్యం అమోఘం. ఈ చిత్రం నుండే చేబ్రోలు సీతారామ శాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారడం విశేషం..

★ “విధాత తలపున ప్రభవించినది” పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నంది పురస్కారం రావడం, ఇదే పాటను ఆలపించిన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడు గా నంది అవార్డు లభించడం గొప్ప విషయం..

★ ఈ చిత్రంలో సహాయ నటిగా  అభినయించిన మూన్ మూన్ సేన్ గారికి ఉత్తమ సహాయ నటి పురస్కారం రావడం, ఛాయాగ్రహకులు ఎం. వి. రఘు గారికి ఉత్తమ ఛాయాగ్రహకులుగా నంది అవార్డు రావడం చెప్పుకోదగ్గ విషయం…

★ ఈ చిత్రం తమిళంలో “రాగ దేవతై” అనే పేరుతో డబ్ చేయబడింది…

★ ఈ చిత్రం ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ , ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా , మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ మరియు AISFM ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది…

★ ఈ చిత్రం ఎక్కువ భాగం జైపూర్ మరియు కేరళలో చిత్రీకరించబడింది..

★ విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన 50 చిత్రాలలో తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన చిత్రం “సిరివెన్నెల”…

Show More
Back to top button