CINEMATelugu Cinema

“మాతాపిత పాదసేవే మాధవ సేవ” అని ప్రభోధించిన చిత్రం.. పాండురంగ మహత్యం..

తరాలు మారుతున్నా తెలుగు సినీలోకంలో ఉత్తమ చిత్రాలుగా సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. ఆ కోవకు చెందిన అలనాటి అజరామర చిత్రం “పాండురంగ మహత్యం”. నందమూరి తారక రామారావు గారి నట వైదుష్యాన్ని చాటిన చిత్రాల్లో “పాండురంగ మహత్యం” సినిమా ఒకటి. జీవన మలి సంధ్యలో ఉన్న కన్నవారిని వదిలేసి కాసుల వేటలోనో, మరో వ్యాపకంతోనో సరిహద్దులు దాటేసే కొడుకుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక చెంతనే అమ్మా నాన్నలున్నా వారి ఆలనాపాలనా చూడని కన్న బిడ్డలూ మనకు కనిపిస్తున్నారు. ఎంత సంపాదించినా, ఎన్ని పూజలు చేసినా “మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ” లేదని చాటిన చిత్ర రాజం “పాండురంగ మహాత్మ్యం”.

భగవంతుడు, భక్తుడు,  భగవంతుడిలో భక్తుడు కలిసిపోవడం లాంటివి అనుకుంటే దీనిని పౌరాణిక చిత్రం అనుకోవచ్చు, లేదా పౌరాణిక పాత్ర సంబంధం ఉన్న సినిమా అనుకోవచ్చు. ఈ చిత్ర కథ యొక్క బలీయమైన అంశం తల్లిదండ్రుల ప్రేమించుట. “పాండురంగ మహత్యం” సినిమా 1957లో “మాయాబజార్” సినిమా విడుదలైన సంవత్సరమే విడుదలై ఘనవిజయం సాధించింది. 1957 మొదట్లో “మాయాబజార్” సినిమా విడుదలయితే, చివర్లో “పాండురంగ మహత్యం” సినిమా విడుదలైంది. మాయాబజార్ లో ఎన్టీఆర్ గారు భగవంతుడు (శ్రీకృష్ణుడు) గా నటిస్తే, “పాండురంగ మహత్యం” సినిమాలో భక్తుడిగా నటించారు. ఎన్టీఆర్ గారు ఒకే సంవత్సరంలో భగవంతుడు గాను, భక్తుడుగాను నటించి ఘనవిజయం సాధించారు. నందమూరి తారకరామారావు గారు నటించిన పూర్తి భక్తిరస ప్రధాన్యమైన చిత్రం “పాండురంగ మహత్యం”.

“భక్త పోతన”, “యోగివేమన”, “భక్త రామదాసు” చిత్రాలు చిత్తూరు నాగయ్య గారు భక్తుడిగా తనదైన ముద్ర వేసిన సినిమాలు అయితే, ఆ తర్వాత భక్తుడిగా నటించి విజయం సాధించిన సినిమా నందమూరి తారక రామారావు గారి “పాండురంగ మహత్యం”. ఈ సినిమాలో శ్రీకృష్ణుని స్తుతించి పాడిన అతి పెద్ద పాట “హే కృష్ణా ముకుందా మురారీ, జయకృష్ణా ముకుందా మురారీ, జయగోవింద బృందా విహారీ”. ఈ పాట ఇప్పటికీ చాలా కార్యక్రమాలలో ప్రార్థన గీతంగా వినిపించబోతోంది. 28 నవంబరు 1957 నాడు విడుదలై విజయం సాధించిన మొట్టమొదటి పూర్తిస్థాయి భక్తి రస ప్రాధాన్య చిత్రం. ఈ చిత్రానికి గుర్తింపుల పరంగా, ప్రత్యేకతల పరంగా చాలా విశేషాలు ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో గ్లామరస్ కథానాయిక, తెలుగులో కాకుండా, దక్షిణ భారతదేశం తన నటనతో అలరించిన బి.సరోజా దేవి గారికి ఇది మొట్టమొదటి చిత్రం.

మహిళా దర్శకురాలిగా “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్” లో రికార్డులో ఎక్కిన శ్రీమతి విజయనిర్మల గారికి బాలనటిగా ఇది మొట్టమొదటి తెలుగు సినిమా. భగవంతుడు, భక్తుడు అన్నింటినీ మించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు అనే మహాత్తర సందేశం ఉన్నది కాబట్టే, ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు ముందు కమలాకర కామేశ్వరరావు గారి మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత రోజులలో “పౌరాణిక బ్రహ్మ” గా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి పౌరాణిక వాసనలు ఉన్న చిత్రం “పాండురంగ మహత్యం”.

  చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :   కమలాకర కామేశ్వరరావు

నిర్మాణం     :    త్రివిక్రమరావు

రచన      :     సముద్రాల (జూనియర్)            

కళ         :        తోట తరణి

తారాగణం   :    నందమూరి తారక రామారావు, అంజలీదేవి , బి.సరోజాదేవి, నాగయ్య, కస్తూరి శివరావు, పద్మనాభం, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, పేకేటి శివరాం

సంగీతం    :   టి.వి.రాజు

సంభాషణలు     :     సముద్రాల (జూనియర్) 

నేపథ్య గానం    :    ఘంటసాల, పి.సుశీల, పి.లీల, చిత్తూరు నాగయ్య

గీతరచన    :     సముద్రాల (జూనియర్)

ఛాయాగ్రహణం   :  ఎం.ఎ.రహ్మాన్

నృత్యాలు    :    వెంపటి సత్యం

రికార్డింగ్      :         ఏ.ఆర్.కృస్ణన్

నిర్మాణ సంస్థ  :    ఎన్.ఎ.టి. పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్

పంపిణీ  :     నేషనల్ ఆర్ట్ పిక్చర్స్, చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్

విడుదల తేదీ   :    28 నవంబరు 1957

భాష        :      తెలుగు

కథ…

కన్న తల్లిదండ్రులే తమ ప్రత్యక్ష దైవాలు అనే అద్భుతమైన సందేశాన్నిస్తూ ఈ పురాణగాథ తెరకెక్కింది. జహ్నుశర్మ, లక్ష్మీ దంపతులు పరమ నిష్టాగరిష్ఠులు. వారి కుమారుడు పుండరీకుడు తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. కానీ తనకున్న అభిరుచి కారణంగా వేశ్యా వాటికల్లో విహరిస్తూ ఉంటాడు. తన బాల్యంలోనే రమా అనే అమ్మాయితో వివాహం జరిగుతుంది. తన కుమారుడు తప్పుదారి పడుతుండడం చూసి తల్లిదండ్రులు అతని భార్యను సంసారానికి రప్పిస్తారు. దాంతో తమ తల్లిదండ్రులు తన ఆనందానికి, సుఖాన్ని అడ్డుకుంటున్నారని భావించి, వారిని నోటికొచ్చినట్లు దూషిస్తాడు. తమ ఇంట్లో నగలను దొంగిలించి తనతో సుఖభోగాలను పంచుకుంటున్న కళావతి అనే వేశ్యకు ఇస్తాడు. ఆ దొంగతనాన్ని తల్లిదండ్రులపై నెట్టేస్తాడు.

దాంతో వారు ఆ ఇంటిని వదలి వెళ్ళిపోతారు. వెళుతూ వెళుతూ అతని కన్నతల్లి అతడిని సంతోషంగా ఉండమని దీవిస్తుంది. ఆ సందర్భంలో తాను కాసేపు తప్పుచేశాననే భావన అతని మనసులో కలిగినా కూడా, మళ్ళీ సుఖభోగలాలసుడై తన నెచ్చెలి కళావతి చెంతకే చేరిపోతాడు. తన భార్య నగలను కూడా కళావతికే కట్టబెడతాడు. పుండరీకుని వద్ధ ఉన్న ధనమంతా కరిగిపోగానే, కళావతి ఇంకొకరిని చూసుకుంటుంది. అది కళ్ళారా వీక్షించిన పుండరీకుడు ఆమెను ఏవగించుకుంటాడు. పుండరీకుడి భార్య అతడితో గొడవపడి పుట్టిల్లు చేరుతుంది. అక్కడ ఆమె తండ్రి ఆమెను మందలించి పంపుతాడు. కళావతి చేసిన మోసానికి పుండరీకుడి కాపురం కూలిపోయిందని భావించిన పుండరీకుడి మిత్రుడు రంగదాసు ఆమె చెంత నున్న వీలునామాను తెచ్చి, పంచాయతీలో పెడతాడు. అక్కడ కళావతి నేరం ఋజువవడంతో ఆమెకు గ్రామబహిష్కరణ విధిస్తారు.

పుండరీకుని ఆస్తి అతని కుటుంబీకులకు కానీ, వారసులకు కానీ అప్పగిస్తామని గ్రామపెద్దలు తీర్పు చెబుతారు. గంగ, యమున, సరస్వతి తమను అంటిన పాపాలను కుక్కుట ముని పాదసేవతో పరిహరించుకొని పావనమై వస్తూండగా, కామాంధుడై పుండరీకుడు వారిని అడ్డగిస్తాడు. పుండరీకుని స్పర్శతో వారు మలినులై మళ్ళీ కుక్కుట ముని పాదస్పర్శతో పునీతలై వెడలిపోతారు. వారిని వెదుకుతూ, వెదుకుతూ ఆ ముని చెంతకు చేరి, వారి జాడ చెప్పమని దుర్మార్గంగా ఆ మునినే తన కాలితో తన్నబోతాడు పుండరీకుడు. వెంటనే అతని కాళ్ళు పోతాయి. కన్నవారి పాదాలను నీ కన్నీటితో కడిగినప్పుడు నీ పాదాలు వాటంతట అవే వస్తాయని పుండరీకుడికి ముని చెబుతాడు.

చేసేది లేక పశ్చాత్తాప హృదయంతో విలపిస్తూ బయలుదేరిన పుండరీకుడి కి కన్నవారు కనిపించగానే, వారి పాదసేవతో అతనికి మళ్ళీ పాదాలు వస్తాయి. రమ సైతం తన భర్తను చేరుకుంటుంది. ఆనాటి నుండి పుండరీకుడు అపరభక్తుడై ఆ చిన్ని కృష్ణయ్యను ధ్యానిస్తూ ఉంటాడు. ఆ గోపాలుడే వచ్చినా, కన్నవారి సేవ చేస్తూ ఆ పంచన ఉండమని చెబుతాడు. గోపాలుని పాదస్పర్శతో అప్పటివరకు పాషాణుడై పడివున్న ఇంద్రుడికి శాపవిమోచన కలుగుతుంది. చివరకు తన కన్నవారితో సహా భార్యాసమేతంగా పరమాత్మలో లీనమవుతాడు పుండరీకుడు. ఆ క్షేత్రమే నేడు పండరీపురంగా భక్తులను అలరిస్తోంది.

తారాగణం…

పుండరీకగా…    ఎన్టీ రామారావు

రమ…   అంజలీ దేవి

కళావతి…    బి.సరోజాదేవి

జాహ్నవి…   వి.నాగయ్య

హరి…    పద్మనాభం

రాముని తండ్రి…   గోవిందరాజుల సుబ్బారావు

పంతులు…    వంగర

వృత్రాసుర మరియు ఋషి కుక్కుట (ద్వంద్వ పాత్ర)…     కె.వి.యస్ శర్మ

రంగదాసు…   కస్తూరి శివరావు

రామదాసు…    బాలకృష్ణ

కళావతి పరమేశ్వరుడు…    పేకేటి శివరామ్

లక్ష్మి…   రుష్యేంద్రమణి

సూరమ్మ…    ఛాయాదేవి

చంపా…    అమ్మాజీ

రామ సోదరి…   సౌకార్ జానకి

శ్రీకృష్ణుడు…     విజయ నిర్మల

నందమూరి నటన…

సాధారణంగా భక్తుల పాత్రలను రంజింపజేయడానికి శాంత, కరుణ రసాలను అద్భుతంగా పలికించవలసి ఉంటుంది. అంతకుముందు భక్తుల పాత్రలను శాంత, కరుణ రసాలను మేళవించి అనితర సాధ్యంగా పోషించిన ఘనత చిత్తూరు నాగయ్య గారిది. ఆ స్థాయిలో నందమూరి తారకరామారావు గారు సైతం తన అభినయంతో భక్త పుండరీకునిగా నటించి మెప్పించిన చిత్రమిది. రామారావు గారిలోని నటునికి కొత్తకోణాన్ని ఆవిష్కరించిన చిత్రంగా ఇది చరిత్రకెక్కితే, తదుపరి కాలంలో అద్భుత పౌరాణిక చిత్రరాజాలను తెలుగువారికి అందించి పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు జనం పట్టం కట్టిన తొలి చిత్రము ఇదే.

తల్లి పై నేరం మోపగా ఋష్యేంద్రమణి చూపిన నటన అమోఘం. నిజం తెలిసిన పుండరీకుడు (రామారావు) తల్లిని చూసి లోలోన మదనపడిన సన్నివేశం, రమ పెద్దలయెడల మర్యాద మన్నన తెలియక ప్రవర్తించిన విధానం, మాట్లాడిన మాటలు, జాహ్నవి (చిత్తూరు నాగయ్య) ఇల్లు విడిచిపోతున్నప్పుడు చూపిన నటన, తల్లి కుమారుని వ్రేలుకు ఉంగరం తొడిగినప్పుడు రామారావు, ఋష్యేంద్రమణి గార్లు చూపిన భావాలు, వారి హృదయ వేదన ప్రేక్షకులను కూడా అనుభవింప చేస్తుంది. కామాందు కాలం నుండి వెలుగు బాటలో పడ్డ తర్వాత పుండరీకుడు (రామారావు) అమ్మ, నాన్న అంటూ పరితపించడం, ఆఖరికి వారిని కలుసుకున్న సన్నివేశంలో రామారావు గారు చూపిన హృదయ వేదన, ఆవేదనలో అతని తల్లిదండ్రులు కూడా తమ ఆవేదనను మిళితం చేయగా అది చూస్తున్న ప్రతీ ప్రేక్షకునికి కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి.

అంతకుముందు పలు చిత్రాలతో ధీరోదాత్త పాత్రలు పోషించి మెప్పించిన నందమూరి రామారావు గారు ఈ చిత్రంలో తన నట విశ్వరూపం ప్రదర్శించారు. భోగలాలసుడైన సమయంలోను పశ్చాతాపం పొందినప్పుడు, భగవంతుడి సాక్షాత్కారం కలిగినప్పుడు నందమూరి గారి అభినయం ఎంతో మందికి స్ఫూర్తి కలిగించింది. ఇక పాటలలో ఎన్టీఆర్ గారి నటన అనితర సాధ్యం. “పాండురంగ మహాత్మ్యం” సినిమా ద్వారానే బి.సరోజాదేవి గారు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో బాలకృష్ణునిగా విజయనిర్మల గారు నటించారు. అప్పట్లో ఆమె పేరును “నిమ్మి” గా టైటిల్స్ లో ప్రకటించారు. పుండరీకుడు తన మాతాపిత సతీసమేతంగా శ్రీకృష్ణునిలో లీనమైన దృశ్యాలు బాగున్నాయి. ఈ చిత్రం చూసిన తర్వాత తల్లిదండ్రులను చులకన చేసి విడిపోయిన ఎందరో తనయులు మళ్ళీ కన్నవారితో కలిసి ఉండడం జరిగిందట.

దర్శకులు కమలాకర కామేశ్వరరావు…

ఎన్టీఆర్ గారు కథానాయకునిగా నటించిన “చంద్రహారం” (1954) చిత్రం ద్వారానే కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడిగా పరిచయమయ్యారు. అత్యంత భారీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారితోనే కమలాకర కామేశ్వరరావు గారు రూపొందించిన పెంకి పెళ్ళాం కూడా జనాన్ని ఆకట్టుకోలేదు. రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఇంకేముంది. అదే ఈ రోజుల్లో అయితే ఆదర్శకుని పని ఇక అంతే అనేవారు. కానీ ప్రతిభకు పట్టం కట్టే ఆ రోజుల్లో పాండురంగ మహత్యం నిర్మించిన నందమూరి సోదరులు కమలాకర పై విశ్వాసంతో ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తనకే అప్పగించారు.

ఎన్టీఆర్‌, త్రివిక్రమరావు (చిత్ర నిర్మాత)లకు “ఆయన్నెందుకండీ… మరొకర్ని తీసుకోండి” అని సన్నిహితులు సలహా ఇచ్చారు. అయినా దర్శకుడి మీద నమ్మకంతో చిత్రానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్‌ గారు. పుండరీకుడు తన తల్లిదండ్రులు, సతీ సమేతంగా శ్రీకృష్ణునిలో లీనమైన దృశ్యాలు బాగున్నాయి.  తుకారాం, సక్కుబాయి మొదలైన వారు కూడా భక్తి పారవశ్యంతో పాడిన పాటలు శ్రవణానందకరంగా ఉన్నాయి. ఈ చిత్రంలో వినదగిన పాటలే కాకుండా, కన్నుల పండుగ చేసే సెట్టింగ్ లు కూడా బావున్నాయి. శ్రీకృష్ణ లీలలు, నృత్యాలు కూడా అలరించాయి. ఈ చిత్రంలో వచ్చే ఆయా పాత్రల చేత నవరసాలు ఒలికింపజేసిన ఘనత కూడా దర్శకులు కామేశ్వరరావు గారికే దక్కింది.

నిర్మాణం…

నిజానికి పండరీపురం క్షేత్ర మహాత్మ్యం కథను కొన్ని సినిమాలలో అప్పటికే చిత్రీకరించారు. తమిళ చిత్రం “హరిదాసు” 1946లో విడుదలైంది. ఈ చిత్రంలో త్యాగరాజ భాగవతార్‌, వసుంధరాదేవి నటించారు. ఈ భక్తిరస చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇదే సినిమాను మళ్లీ 1955 – 56 లలో విడుదల చేశారు. ఈ సినిమా మద్రాసులోని ఓ థియేటర్లో ప్రదర్శితమవుతోందంటే ఎన్టీఆర్‌, ఆయన సోదరుడు త్రివిక్రమరావు, మరి కొందరు మిత్రులు కలిసి వెళ్లి చూశారు. ఈ సినిమా యొక్క కథాంశం ఎన్టీఆర్‌ గారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ భక్తి కథకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటే తెలుగువాళ్లని మెప్పించవచ్చన్నది ఎన్టీఆర్ గారి ఆలోచన. నందమూరి సోదరులు తమ నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ (ఎన్‌ఏటీ) ద్వారానే “హరిదాసు” కథను “పాండురంగ మహాత్మ్యం” గా నిర్మించాలని సంకల్పించారు.

పండరీపురం క్షేత్ర వైభవాన్ని మరింత శోధించి ఈ చిత్ర కథను తయారుచేసుకున్నారు. కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంచుకున్నారు. నిజానికి ఈ కథ మన తెలుగు వాతావరణానికి చెందినది కాదు. మహారాష్ట్రకు చెందినది. ఏ భాషకు చెందిన కథ అయితేనేమి? దానిని మన వాతావరణానికి మార్చుకోవడంలోనే రచయిత, దర్శకుల ప్రతిభ దాగి ఉంటుంది. “మాతా పిత పాదసేవే మాధవ సేవ” అని చాటే కథాంశం. చిత్రానికి మాటల రచయితగా సముద్రాల జూనియర్‌ని నియమించుకున్నారు. అప్పటికి పాటల రచయితగానే పేరొందిన ఆయనకు ఇది మాటల రచయితగా తొలిచిత్రం. ఇందులోని ప్రతి సన్నివేశంలో సముద్రాల జూనియర్ కలం బలం తెలిసి వస్తుంది.

అంతకు ముందు కొన్ని చిత్రాల్లో గయ్యాలిగా నటించిన అంజలీదేవి గారు ఇందులో రొమాంటిక్ టచ్ మిలితం చేస్తూ అదే గడసరితనం చూపించారు. ఇక అందాల తారగా తన ముద్దు ముద్దు మాటలతో తర్వాత కాలంలో రాణించిన బి.సరోజాదేవి గారికి ఇదే తొలి చిత్రం. తన అందంతో కథానాయకునికే కాదు, ప్రేక్షకులకు కూడా మత్తెక్కించారు. పుండరీకుని సోదరునిగా పద్మనాభం, ఇతర పాత్రల్లో పేకేటి, కస్తూరి శివరావు, ఛాయాదేవి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఒక్కరు కూడా తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు.  దర్శకురాలుగా చరిత్ర సృష్టించిన విజయనిర్మల ఈ సినిమాలో బాలకృష్ణుడిగా అభినయించడము మరో విశేషం.

పాటలు…

పాండురంగ మహత్యం చిత్రానికి టి.వి.రాజు గారు సంగీతం అందించారు. ఘంటసాల, పి.సుశీల, పి.లీల, చిత్తూరు నాగయ్య గార్లు పాటలు పాడారు. ఇందులో ఘంటసాల గారు ఆలపించిన “హే కృష్ణా ముకుందా మురారి” పాట ఏకంగా 15 నిమిషాల నిడివి ఉంటుంది. అజరామరంగా పేర్కొనబడే ఈ పాటకు నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమాలోని పాటలన్నీ పులకింప చేశాయి.

ఈ పాట తరువాత కన్నీరు పెట్టించేలా నందమూరి నటన సాగిన “అమ్మా అని అరచినా” గీతం, “హర హర శంభో”, “సన్నుతిసేయవే మనసా”, “జయ జయ గోకుల”, “లక్ష్మీనృసింహ విభవే”, “అక్కడ ఉండే పాండురంగడు” వంటి భక్తి గీతాలతో పాటు “కనవేర మునిరాజ”, “ఆనందమిదేనోయి”, “తరం తరం నిరంతరం”, “ఎక్కడోయి ముద్దుల బావా”,  “నీవని నేనని”, “చెబితే వింటివ గురూ గురూ”, “తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది”, “ఓ దారి కనని” అంటూ సాగే పాటలూ ప్రేక్షకులను బాగా అలరించాయి.

చివరలో మరికొన్ని భాషల్లో పండరీపురనాథుని గానంతో “శ్రీకామినీ కామితకార”, “ఆది బీజ ఏకలే”, “తుమా బినా మోరే”, “ఆజ్ కా సునేరా దిన్ హై”, “ఆటలాడ రా రా కన్నయ్యా” వంటి పాటలూ మదిని పులకింపజేస్తూనే ఉంటాయి. బరువైన సమాసాలతో కూడిన శ్లోకాలను నందమూరి గారు ఒకే టేక్‌లో ఓకే చేశారట.

విచారకరమేమిటంటే, ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో గాయనీ, గాయకుల పేర్లు కనిపించవు. ఆ తప్పిదం ఎలా జరిగిందో అర్థం కాక నందమూరి సోదరులు తరువాత వారికి క్షమాపణ చెప్పారట.

విడుదల…

“పాండురంగ మహత్మ్యం” సినిమా ఎన్టీఆర్ గారు నటించిన 61 సినిమా. ఈ చిత్రంనిడివి 15,747 అడుగులు. అంటే సినిమా 2 గంటల 55 నిమిషాల సమయం ఉంటుంది అప్పట్లో ఈ చిత్ర నిర్మాణానికి రూ.4 లక్షలు రూపాయలు బడ్జెట్ ఖర్చు చేశారు. ఈ సినిమాను 28 నవంబరు 1957 లో విడుదల చేశారు. అద్భుతమైన విజయం సాధించిన “పాండురంగ మహాత్మ్యం” సినిమా అప్పట్లో తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని సంచలనం సృష్టించింది. అలాగే విజయవాడ, గుంటూరులో 24 వారాలపాటు ప్రదర్శితమై సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదే కథతో (కొన్ని మార్పులు) ఎన్టీఆర్ గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ గారు ద్విపాత్రాభినయం (పాండురంగడు మరియు కృష్ణుడు) చేసిన సినిమా “పాండురంగడు”. ఎన్టీఆర్ సినిమాకు దర్శకుడు కమాలాకర కామేశ్వర రావు గారు అయితే, తన శిష్యుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు బాలకృష్ణ కథనాయకుడుగా వచ్చిన “పాండురంగడు ” (2008) కు దర్శకత్వం వహించారు. కానీ “పాండురంగ మహత్మ్యం” తో పోల్చడానికి వీలు పడనంతగా ఈ చిత్రం పరాజయం పాలైంది.

ప్రత్యేకతలు… 

★ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు గారికి ఇది 61వ సినిమా…

★ నందమూరి తారక రామారావు గారు బరువైన సమాసాలతో కూడిన శ్లోకాలను ఒకే టేక్‌లో ఓకే చేశారు…

★ ఈ సినిమాలో బాల కృష్ణుడిగా విజయనిర్మల గారు నటించారు. ఆమెకు ఇది తొలి తెలుగు చిత్రం..

★ ఈ సినిమాలో వేశ్య పాత్రను బి.సరోజా దేవి పోషించారు. కన్నడ చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఆమెకు ఇది మొదటి తెలుగు సినిమా..

★ అప్పట్లో పాండురంగ మహత్యం చిత్ర నిర్మాణానికి రూ.4 లక్షలు వ్యయమైంది. 2 గంటల 55 నిమిషాల నిడివి ఉంటుంది..

★ “పాండురంగ మహాత్మ్యం” సినిమా అప్పట్లో తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది.

విజయవాడ, గుంటూరు లలో సుమారు 24 వారాలు ప్రదర్శితమైంది..

★ నందమూరి తారక రామారావు గారు ఈ సినిమాలో తన పుండరీక పాత్రకు గానూ “ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు” (తెలుగు) (వరుసగా నాల్గవది) గెలుచుకున్నారు..

Show More
Back to top button