
“సహజమైన సంప్రదాయ వాయిద్య పరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ కనిపిస్తుంది. యంత్రాలతో సంగీతం అంటే ఎప్పుడూ యాంత్రికంగానే వుంటుంది. యాదృచ్చికంగా వచ్చేదే సంగీతం. దానికో సమయం అంటూ వుండదు. అప్పుడే పుట్టిన పసిపాపలా ఉండేదే సంగీతమంటే. వినగానే కొత్తగా వుండాలి... వినే శ్రోతకి కొత్త అనుభూతిని పంచాలి”. అలా మరపురాని స్వరాల వరాలు కురుపించిన సంగీత పుంభావ సరస్వతి యం.యస్.విశ్వనాథన్ గారు.
ఎమ్.ఎస్.విశ్వనాథన్ గారి స్వరకల్పన మన తెలుగు వారిని విశేషంగా అలరించింది. తన బాణీలతో పలు తెలుగు చిత్రాలు విజయపథంలో దూసుకెళ్లాయి. స్వరకల్పనతోనే కాకుండా తన స్వర మాధుర్యంతోనూ విశ్వనాథన్ గారు అలరించారు.
విశ్వనాథన్ గారు, రామ్మూర్తి గారితో కలిసి చందన చర్చిత నీల కలేబర (తెనాలి రామకృష్ణ), ఎవరికి ఎవరు కాపలా, వినుము చెలీ తెలిపెదనే పరమ రహస్యం (ఇంటికి దీపం ఇల్లాలు), గాలికి కులమేది (కర్ణ), రేపంటి రూపం కంటి, తోడు నీడ ఎవరు లేని ఒంటరి (మంచి చెడు), ఆహా అందము చిందే హృదయము (ఆడ బ్రతుకు)… లాంటి ఎన్నో అద్భుతమైన స్వరాలను సమాకూర్చి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
1950 లో కర్ణాటక సంగీతపు పరిధిల నుంచి బయటకు రాలేకపోతున్న తమిళ సినీ సంగీతానికి కొత్త ఊపిరిలూదినవాడు యం.యస్.విశ్వనాథన్ గారు. చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో. అందులో యం.యస్.విశ్వనాథన్ గారు ఒక చిటారుకొమ్మ.

భాగస్వామ్యం తో కాకుండా విశ్వనాథన్ గారు ఒంటరిగా పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో శాశ్వతమెవరురా (ప్రాయశ్చిత్తం), తలచినదే జరిగినదా దైవం ఎందులకు (మనసే మందిరం), పిల్లలూ దేవుడూ చల్లనివారే (లేత మనసులు), నన్ను ఎవరో తాకిరి (సత్తెకాలపు సత్తెయ్య), నా జన్మభూమి ఎంతో అందమైన దేశము (సిపాయి చిన్నయ్య), మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు (ప్రేమలు పెళ్లిళ్లు), తాళికట్టు శుభవేళ, అరె ఏమిటో ఈ లోకం (అంతులేని కథ)…
కుర్రాడనుకుని కునుకులు తీసే (చిలకమ్మ చెప్పింది), సన్న జాజులోయ్ కన్నె మోజులోయ్ (సింహబలుడు), ఏ తీగ పూవునో ఏ కొమ్మ (మరోచరిత్ర), అటు ఇటు కాని హృదయం తోటి (ఇది కథ కాదు), మౌనమే నీ భాష ఓ మూగ మనసా (గుప్పెడు మనసు), కుర్రాల్లోయ్ కుర్రాళ్ళు (అందమైన అనుభవం), కన్నెపిల్లవని వన్నెలున్నవని (ఆకలి రాజ్యం) ఇలా ఎన్నెన్నో చిత్రాలకు వినసొంపైన స్వరాలు సమాకూర్చి మరపురాని స్వరాల వరాలు కురుపించిన మధుర స్వర సంగీత దర్శకులు యం.యస్.విశ్వనాథన్ గారు.
తెలుగు, మలయాళ భాషల్లో 70 – 70 సినిమాలు చేస్తే, కేవలం ఒక్క తమిళంలో 500 పైచిలుకు చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథన్ గారు, రామ్మూర్తి గారితో భాగస్వామ్యంతో కలిపి సుమారు 1200 పై చిలుకు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1976 నుండి ఇళయరాజా, 1992 నుంచి ఏ.ఆర్. రహమాన్ రాకముందు తమిళ చలన చిత్ర రంగానికి మకుటం లేని మహారాజు.
సినీ సంగీత సామ్రాజ్యపు చక్రవర్తి, తెరై ఇసై చక్రవర్తి, స్వర సార్వభౌమ, మెల్లిసై మన్నారుకల్ వంటి బిరుదులు అందుకున్న మహనీయులు. “ఏ తీగె పువ్వునో… ఏ కొమ్మ తేటినో…కలిపింది ఏ వింత అనుబంధమౌనో”.. మళయాళ కుటుంబంలో పుట్టి, తమిళ చిత్రసీమలో మెట్టి, తెలుగు ప్రజలను తన సంగీతం తో విశేషంగా ఆకట్టుకున్నారు విశ్వనాథన్ గారు. అవును “ఏ నాటిదో ఈ సంగీత బంధం” తలచిన ప్రతీసారి పులకింప చేస్తూనే ఉంటుంది.
జీవిత విశేషాలు…
జన్మ నామం : మాన్యాంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్
ఇతర పేర్లు : ఎం.యస్.విశ్వనాథన్
జననం : 24 జూన్ 1928
స్వస్థలం : పాలక్కాడ్, మద్రాసు రాష్ట్రము, భారతదేశం
నివాసం : మద్రాసు
తండ్రి : సుబ్రమణియన్
తల్లి : నారాయణి
వృత్తి : సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు
భార్య : జానకి
మరణ కారణం : మూత్రపిండాల కాన్సర్
మరణం : 14 జూలై 2015, చెన్నై, భారతదేశం
జననం…
మాన్యాంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్ (ఎమ్మెస్ విశ్వనాథన్) గారు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఎలప్పళి అనే ఊరిలో 24 జూన్ 1928 నాడు సుబ్రమణియణ్, నారాయణి కుట్టి దంపతులకు జన్మించారు. విశ్వనాథన్ గారి నాన్న గారికి సంగీతం మీద ఆసక్తి ఉండేది. విశ్వనాథ్ గారికి రెండు మూడేళ్ల వయసున్నప్పుడు తనను తన పొట్ట మీద కూర్చోబెట్టుకుని పాటలు పాడేవారు. దురదృష్టావశాత్తు నాలుగేళ్ల వయస్సు లోనే తన తండ్రి గారు చనిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పసిపిల్లగా ఉన్న తన చెల్లి కూడా చనిపోయింది. దాంతో చుట్టుపక్కల వారంతా వీడు దురదృష్టవంతుడు, వీడు పుట్టాక ఇవన్నీ జరిగాయని చుట్టుపక్కల వాళ్ళు విశ్వనాథన్ గారిని తిడుతుండేవారు.
భర్త చనిపోయేసరికి అయిదుగురు పిల్లలను పెంచడం కష్టమైపోయింది. తన తల్లి విశ్వనాథ్ గారిని చెరువు వద్దకు తీసుకెళ్లి ముందుగా చిన్న పిల్లాడిని తోసేసి, ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలని తలచింది. ఈ దృశ్యాన్ని గమనించిన విశ్వనాథన్ గారు తన తల్లితో చెరువులో ముందు నువ్వు దూకమ్మా అని అన్నాడట. ఎందుకని తల్లి అడిగితే, ముందు నన్ను తోసేసి, ఆ తర్వాత నీవు మనసు మార్చుకుంటే నేను మునిగిపోతే ఆ తర్వాత నువ్వు ఏడుస్తావు కదా అన్నాడట. ఆ చిన్న పిల్లాడి మాటలకు చలించిన తల్లి తనను అక్కున చేర్చుకొని హత్తుకొని బోరు బోరున విలపించింది.
బాల్యం…
విశ్వనాథన్ గారి కుటుంబ పరిస్థితిని కళ్లారా చూసిన విశ్వనాథన్ గారి తాత గారు వీళ్ళని “దక్షిణ కణ్ణనూరు” తీసుకెళ్లారు. తన తాతగారు జైలరు. అంత మందికి తిండి పెడుతూ వాళ్ళని ప్రయివేటుగా బడికిపంపే స్థోమత లేక ఐదేళ్ల విశ్వనాథన్ గారిని వీధి బడికి పంపించేవారు. ఆ చదువు కూడా సరిగ్గా సాగలేదు. విశ్వనాథన్ గారికి పాటలు అంటే పిచ్చి అభిమానం. అప్పుడప్పుడే తమిళ సినిమా టాకీలు ప్రారంభమైనాయి. ఆ సినిమాల్లో పాటలు వినడానికి సినిమా హాల్లో తినుబండరాలు అమ్ముతూ ఆ సినిమా చూస్తూ పాటలు వింటుండేవారు. విశ్వనాథన్ గారు ఆ ఊర్లో “నీలకంఠ భాగవతార్” అనే సంగీత శిక్షణ విద్వాసుడి వద్ద సహాయకునిగా చేరారు.
విశ్వనాథన్ గారు ఒకరోజు తాను సంగీతం వాయిస్తుండగా చాటుగా విన్న విశ్వనాథన్ గారిని మెచ్చుకొని ఫీజు లేకుండానే తనకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అలా మూడు సంవత్సరాలు సంగీత శిక్షణలో రాటుదేలిన తనకు కణ్ణనూరు లో ఒక హాల్లో సంగీత కచేరి పెట్టగా విశ్వనాథన్ గారు మూడు, నాలుగు గంటలు నిర్విరామంగా పాడారు. 1938 సంవత్సరంలో విశ్వనాథ్ తాతగారు (జైలరు) జైలులోని ఖైదీలతో నాటకం వేయిస్తూ ఖైదీలకు నాటకాలు నేర్పమని విశ్వనాథన్ గారికి సూచించారు. వాళ్లకు నాటకాలు నేర్పిస్తూనే తాను కూడా తొలిసారి “లోహితుడి” పాత్రలో మెరిశారు.
సినీ నేపథ్యం…
కోయంబత్తూర్ సమీపంలో ఉండే విశ్వనాథన్ గారి మేనమామ ఎల్.ఆర్.జి. నాయుడు గారి మిత్రులు, తిరుపూర్ లో గల రైస్ మిల్లు ఓనరు “ముత్తుస్వామి చెట్టియార్” వాళ్ళ అబ్బాయి సినిమా తీస్తున్నారు. ఆ చిత్రం పేరు “కన్నగి”. ఈ చిత్రంలో విశ్వనాథన్ గారిని నటింపజేయడానికి ఒప్పుకున్నారు. తాను కథానాయిక ప్రక్కన చిన్నగా ఉండేసరికి బాలమురుగన్ అనే చిన్న పాత్ర వేస్తూ ఆఫీసు బాయ్ గా కుదిరారు. కన్నగి చిత్రానికి సంగీత దర్శకులు ఎస్వీ వెంకట్ రామన్. కన్నగి చిత్రం విజయవంతమయ్యేసరికి జూపిటర్ వాళ్ళు కోయంబత్తూర్ లో ఒక సెంటరు లో స్టూడియోను అద్దెకు తీసుకొని మద్రాసు నుంచి చిత్ర నిర్మాణాన్ని కోయంబత్తూర్ కు మార్చారు.
అప్పుడు వాళ్లతో పాటు విశ్వనాథన్ గారు కూడా కోయంబత్తూరు కు వచ్చారు. అప్పుడు వారు తీసే సినిమా “కుబేర కుచేలా” టీ.ఎస్.బాలయ్య గారి నాటకాల కంపెనీలో ఎమ్మెస్ విశ్వనాథన్ గారిని చేర్చుకున్నారు. విశ్వనాథన్ గారు హార్మోనియం మీద మూడు సంవత్సరాలు పనిచేశారు. మళ్లీ తిరిగి జూపిటర్ సంస్థలో పనిచేస్తున్న సంగీత దర్శకులు సుబ్బయ్య నాయుడు వద్ద చేరారు. జూపిటర్ నిర్మాణ సంస్థను తిరిగి 1947 ప్రాంతంలో కోయంబత్తూర్ నుండి మద్రాసు కు మార్చారు. వారితోపాటు ఎమ్మెస్ విశ్వనాథన్ గారు కూడా జూపిటర్ సోము వాళ్ళతో కలిసి తన 19 ఏళ్ల వయసులో మద్రాస్ కు చేరుకున్నారు.
జుపిటర్ నిర్మాణంలో “అభిమన్యు” సినిమా తీస్తున్నారు. ఆ చిత్రంలో వచ్చే “పుదు వసంతమే” పాటకు ఎమ్మెస్ విశ్వనాథన్ గారు ట్యూన్ ఇచ్చారు. కానీ ఆ ఘనత సుబ్బయ్య నాయుడు కు దక్కింది. సి.ఆర్ సుబ్బరామన్ గారు కూడా సుబ్బయ్య నాయుడు వద్ద పనిచేస్తుండడంతో ఎమ్మెస్ విశ్వనాథన్ గారికి సుబ్బయ్య నాయుడుతో పరిచయం ఏర్పడింది. జూపిటర్ వాళ్ళ తర్వాతి సినిమా “వేలై” కి కూడా సంగీత దర్శకత్వం ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు గారే. సి.ఆర్.సుబ్బరామన్ గారు సంగీత దర్శకులయితే, వారికి సహాయకులుగా సి.ఆర్ సుబ్బరామన్ గార్లు ఉన్నారు. వేలేఖరి సినిమా అద్భుత విజయం సాధించింది.
సి.ఆర్.సుబ్బరామన్ గారు స్వతంత్ర దర్శకుడిగా ఎదిగారు. సి.ఆర్.సుబ్బరామన్ గారు చనిపోయే వరకు (1952) వరకు కూడా తనతోనే ఉన్నారు ఎమ్మెస్ విశ్వనాథన్ గారు. ఆ క్రమంలో వయోలిన్ విద్వాంసులు టీ.కే.రామ్మూర్తి గారితో పరిచయం ఏర్పడింది. అది గాఢమైన అనుబంధంగా మారింది. వాళ్ళిద్దరి మధ్య వయసులో వ్యత్యాసం సుమారు ఆరేళ్లు ఉన్నా కూడా విశ్వనాథన్ – రామ్మూర్తి గార్లు ఆత్మీయ మిత్రులయ్యారు. ఎమ్మెస్ విశ్వనాథన్ గారు హార్మోనియం వాయిస్తే, టీ.కే.రామ్మూర్తి గారు వయోలిన్ వాయించేవారు. వీరిద్దరూ సి.ఆర్.సుబ్బరామన్ గారికి ప్రియ శిష్యులు.
ఎస్.ఎమ్.రాజా అనే సహాయంతో ఎం.జీ.ఆర్ గారు నటించిన “జినోవా” చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు. అందులో ఒకరు ఎమ్మెస్ విశ్వనాథన్ గారు. ఒకానొక రోజు ఆకస్మికంగా సి.ఆర్.సుబ్బరామన్ గారు 1952 లో మరణించడంతో అసంపూర్ణంగా ఆగిపోయిన చిత్రాలు దేవదాసు, అమ్మలక్కలు చిత్రాలకు ఎం.ఎస్.వి, రామ్మూర్తి గార్లు పూర్తిచేయగా, చండీరాణి చిత్రానికి భానుమతి గారి పర్యవేక్షణలో ఎమ్మెస్ విశ్వనాథన్ గారు పూర్తి చేశారు. దేవదాసు సినిమాలో సూపర్ హిట్ అయిన పాట “జగమే మాయ” అనే పాటను ఎమ్మెస్ విశ్వనాథన్, రామ్మూర్తి గార్లు పూర్తి చేశారు. శివాజీ గణేషన్

తమిళ సినిమా “పణం” కు రామ్మూర్తి, విశ్వనాథన్ గార్లు ఉమ్మడిగా సంగీత దర్శకత్వం వహించారు. తమిళ సినిమా “పణం” దగ్గరి నుండి మొదలైన వారి ప్రస్థానం 1965 జూలైలో విడుదలైన “హైరథిల్ వురువం” వరకు కొనసాగింది. విశ్వనాథన్-రామ్మూర్తి జంటలు తమిళ, తెలుగు, మలయాళం చిత్ర రంగంలో సంగీత వీరవిహారం చేశారు. ఈ పదమూడు సంవత్సరాలలో వారు 400 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం చేశారని అంచనా. 1955లో వచ్చిన తెలుగు సినిమా “సంతోషం” (తమిళంలో సూపర్ హిట్ అయిన వేలైకారి తెలుగులో సంతోషంగా పునర్నిర్మించారు) సినిమాకి స్క్రీన్ ప్లే రాసింది అన్నాదురై గారు. సంతోషంలో హీరో ఎన్టీఆర్ “తీయని ఈనాటి రేయి” పాట ట్యూన్ ను, యధావిదిగా హిందీలో రీమేక్ చేసిన “నయా ఆద్మీ” లో వాడుకున్నారు.
ఈ చిత్రాన్ని 1963లో కన్నడలో “మళ్లీ ముడివే” అని తీసినప్పుడు జీ.కే.వెంకటేష్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ జీ.కే.వెంకటేష్ ఎంఎస్ విశ్వనాథ్ – రామ్మూర్తి గార్ల దగ్గర సంగీత సహాయకులుగా ఉండేవారు. తమిళంలో వచ్చిన “వేలైకారి” కి సి.ఆర్.సుబ్బారామన్ గారు సంగీతం అందిస్తే, తెలుగులో వచ్చిన “సంతోషం” కి సుబ్బరామన్ శిష్యులు విశ్వనాథ్ – రామ్మూర్తి లు సంగీతం సమకూరిస్తే, కన్నడంలో వచ్చిన “మళ్లీ ముడివే” కి విశ్వనాథన్ శిష్యులు జీ.కే.వెంకటేష్ లు దర్శకత్వం వహించారు.
1964 లో విడుదలైన “పుదియా పారువై” చిత్రానికి విశ్వనాథన్ – రామ్మూర్తి లు 100 మంది సంగీత కళాకారులతో “ఎంగే నెమ్మది” అనే పాటను స్వరపరిచారు. ఇలా విశ్వనాథన్ రామ్మూర్తిల జంట అప్రతిహతంగా కొనసాగుతుండగా, చిన్నచిన్న అపార్ధాలు రావడంతో 1965 లో వచ్చిన ఐరన్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పనిచేయలేదు. ఎంజీఆర్, జయలలితల కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం “హైరథిల్ వరుణ్ 1966 నుండి 1985 వరకు ఎమ్మెస్ విశ్వనాథన్ గారు సంవత్సరానికి 20 నుంచి 30 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
ఇళయరాజా శకం ఆరంభమైన తరువాత కూడా 1980లో ఒక సంవత్సరంలో 25 సినిమాలకు సంగీతం అందించారు. సగటున నెలకు రెండు చిత్రాలకు ట్యూన్ లు అందించారు. 1987లో తమిళంలో 12 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1990 నుంచి వేగం తగ్గి సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. 2000 వ సంవత్సరం నుంచి పూర్తిగా ప్రైవేట్ ఆల్బమ్ లకు పరిమితమయ్యారు. సంగీత దర్శకులుగా తన చివరి చిత్రం “టిల్లు మల్లు” (2013) లో యువన్ శంకర్ రాజా తో కలిసి సంగీతం అందించారు.
ఆ తర్వాత విశ్వనాథన్ గారు సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం – 3, తెలుగులో 70) పైగా స్వర సారథ్యం వహించారు. ఆ తరువాత విశ్వనాథన్ – రామ్మూర్తి సంగీత ద్వయం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో జైత్రయాత్ర చేసింది. ఆ నాటి ప్రముఖ గాయనీ గాయకులతో మొట్టమొదటిసారి లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చిన ఘనత కూడా విశ్వనాథన్- రామ్మూర్తి ద్వయానిదే! ఆ ట్రెండ్ ను ఉత్తర దక్షిణ సంగీత దర్శకులెందరో అనుసరించడం విశేషం.

యన్టీఆర్ “సంతోషం”, “తెనాలి రామకృష్ణ”, “ఇంటికి దీపం ఇల్లాలే”, “మంచి-చెడు”, “ఆడబ్రతుకు”, “కర్ణ” వంటి చిత్రాలకు విశ్వనాథన్ – రామ్మూర్తి గార్లు సమకూర్చిన సంగీతం తెలుగువారిని విశేషంగా అలరించింది. నూరు చిత్రాలకు కలసి సంగీతం సమకూర్చిన తరువాత కొన్ని అనివార్య కారణాల వలన విశ్వనాథన్, రామ్మూర్తి గార్లు విడిపోయారు. ఎం.యస్.విశ్వనాథన్ గారు ఒక్కరే అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. వాటిలో “లేతమనసులు”, “మనసే మందిరం”, “భలే కోడలు”, “సత్తెకాలపు సత్తెయ్య”, “సిపాయి చిన్నయ్య”, “అంతులేని కథ”, “చిలకమ్మ చెప్పింది”, “మరో చరిత్ర”, “సింహబలుడు”, “అందమైన అనుభవం”, “ఇదికథ కాదు”, “గుప్పెడు మనసు” వంటివి చోటు చేసుకున్నాయి.
నందమూరి తారకరామారావు గారి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం “సమ్రాట్ అశోక” కు కూడా ఎమ్మెస్వీ గారే స్వరకల్పన చేయడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలకు సంగీతం సమకూర్చి అలరించిన విశ్వనాథన్ గారు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు. తన దరికి చేరిన వారికి ఆశ్రయం కల్పిస్తూ వచ్చారు. విశ్వనాథన్ బాణీలతోనే ఎల్.ఆర్.ఈశ్వరి గారు ఎంతో పేరు సంపాదించారు. పలువురు గీత రచయితలకు కూడా విశ్వనాథన్ గారి బాణీలే వారి ఉనికిని చాటాయి. మిత్రుడు రామ్మూర్తితో కలసి వందకు పైగా చిత్రాలకు స్వరకల్పన చేసిన విశ్వనాథన్ గారు, తాను ఒంటరిగానే ఏడు వందల పై చిలుకు సినిమాలకు బాణీలు అందించారు.
విశ్వనాథన్ – బాలచందర్ గార్ల అనుబంధం…
ఎమ్మెస్ విశ్వనాథన్, బాలచందర్ గార్లది ఒక ప్రత్యేకమైన అనుబంధం. వారి కలయికలో బాలచందర్ గారి రెండవ సినిమా “సర్వర్ సుందరం” మొదలై, తెలుగులో వచ్చిన గుప్పెడు మనసు, అందమైన అనుభవం, ఆకలి రాజ్యం, ఇది కథ కాదు, అంతులేని కథ, మరో చరిత్ర లాంటి అనేక విజయవంతమైన చిత్రలతో సుమారు రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. ఎన్టీఆర్ చివరి చిత్రం “సామ్రాట్ అశోక” కు కూడా సంగీతం యం.యస్ విశ్వనాథన్ గారే. తెలుగులో విశ్వనాథన్ గారికి చివరి చిత్రం పి చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకత్వ పర్యవేక్షణలో కృష్ణంరాజు, జయసుధ గార్లు నటించిన “అన్న వదిన”.
సంగీతాన్నందించిన తెలుగు సినిమాలు..
చండీరాణి (1953)
(సి.ఆర్.సుబ్బురామన్ తో)
మా గోపి (1954)
సంతోషం (1955)
తెనాలి రామకృష్ణ (1956)
భక్త మార్కండేయ (1956)
ఇంటికి దీపం ఇల్లాలే (1961)
పెళ్లి తాంబూలం (1962)
కర్ణ (1963)
ఆడబ్రతుకు (1965)
ఆశాజీవులు
కన్నెపిల్ల (1966)
మనసే మందిరం (1966; remake of Nenjil Oru Alayam)
లేత మనసులు (1966)
సర్వర్ సుందరం (1966)
కాలచక్రం (1967)
భలే కోడళ్ళు (1968)
సత్తెకాలపు సత్తెయ్య (1969)
సిపాయి చిన్నయ్య (1969)
తిండిపోతు రాముడు (1971)
రిక్షా రాముడు’ (1972)
లోకం మారాలి (పామర్తితో) (1973)
మేమూ మనుషులమే (1973)
అనుభవించు రాజా అనుభవించు (1974)
ప్రేమలు – పెళ్ళిళ్ళు (1974)
శృంగార లీల (1976)
అంతులేని కథ (1976)
చిలకమ్మ చెప్పింది (1977)
లక్ష్మి నిర్దోషి (1977)
మొరటోడు (1977)
సింహబలుడు (1978)
నాలాగ ఎందరో (1978)
మరో చరిత్ర (1978)
అందమైన అనుభవం (1979)
ఇది కథ కాదు (1979)
గుప్పెడు మనసు (1979)
కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979)
మహాదేవి
చుట్టాలొస్తున్నారు జాగ్రత్త (1980)
అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
త్రిలోక సుందరి (1980)
ఆకలి రాజ్యం (1981)
ఊరికిచ్చిన మాట (1981)
రామ దండు (1981)
తొలికోడి కూసింది (1981)
47 రోజులు (1981)
పెళ్లీడు పిల్లలు (1982)
మీసం కోసం (1982)
ప్రేమ నక్షత్రం (1982)
ఓ ఆడది ఓ మగాడు (1982)
సీతాదేవి (1982)
కోకిలమ్మ (1983)
నిజం చెబితే నేరమా (1983)
భామా రుక్మిణి (1983)
మానసవీణ (1984)
సీతాలు (1984)
భాగ్యలక్ష్మి (1984)
సూపర్ బయ్ 3డి (1985)
స్వామి అయ్యప్ప దర్శనం (1986)
అగ్ని పుష్పం (1987)
సంకెళ్లు (1988)
లైలా (1989)
సామ్రాట్ అశోక్ (1992)
అన్నా వదిన (1993)
నిష్క్రమణం…
మెలోడీ కింగ్ గా పేరొందిన ఎమ్మెస్ విశ్వనాథన్ గారిని తమిళులు అభిమానంతో “మెల్లిసై మన్నార్” అని పిలుచుకుంటారు. విశ్వనాథన్ గారిని “తిరై ఇసై చక్రవర్తి” అని ఆ నాటి ముఖ్యమంత్రి జయలలిత సన్మానించి, అరవై బంగారు నాణేలు బహూకరించారు. జీవన మలిసంధ్యలో తనను అపురూపంగా చూసుకున్న భార్య భార్య జానకి గారు మరణించడంతో విశ్వనాథన్ గారు కృంగిపోయారు. 14 జులై 2017 లో (తన 80 సంవత్సరాల) వయస్సులో మరణించారు. చివరి క్షణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపబడ్డాయి. తన మిత్రుడు టి.కె.రామ్మూర్తి గారు 2013 లోనే మరణించడం విశేషం. ఇహ లోకం విడిచి పరలోకం చేరిన ఎమ్మెస్ విశ్వనాథన్ గారి బాణీలు మాత్రం మనలను మరో లోకాల్లో విహరింప చేస్తూనే ఉన్నాయి.