
ఇక కథ విషయానికొస్తే శంకరశాస్త్రి ఉపాసకుడు. సత్యం పలుకగలిగిన సరస్వతి పలుకు ఉన్నవాడు. ఆయన పాడితే పాములు కూడా పడగ విప్పి వింటాయి. అటువంటి శంకరశాస్త్రి, భార్యా వియోగుడై ఒక్కగానొక్క కూతురిని పోషించుకుంటూ ఉన్న సమయంలో అనుకోని పరిస్థితిలో తులసిని చూస్తాడు. ఆమె కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. కన్న తల్లే ఆమెను అమ్మేయాలనుకుంటుందని తెలిసి ఆదుకుంటాడు. కానీ, దానివల్ల తానే నష్టపోతాడు. సంఘం అనుమానంగా చూస్తుంది. సమాజం నోరు నొక్కుకుంటుంది.
ఇది చూసిన తులసి తట్టుకోలేక ఆయనను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. తర్వాత కాలంలో తులసి తల్లి చనిపోగా వచ్చిన ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. కానీ, అప్పటికే ఆమెను ఒక మగవాడు కాటు వేయడంతో గర్భవతి అవుతుంది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యమే ఈ సినిమా కథాసారాంశం.
శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి నటన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇక పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించిన కె.వి.మహదేవన్లు తమవంతు కృషి చేశారు. ఈ చిత్రాన్ని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ముఖ్యంగా నాలుగు జాతీయ అవార్డులను ‘శంకరాభరణం’ సొంతం చేసుకుంది.
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ (స్వర్ణ కమలం.. రూ.2 లక్షల నగదు), ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్ (రజత కమలం.. రూ.50 వేలు), ఉత్తమ గాయకుడిగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (రజత కమలం.. రూ.50 వేలు), ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్ (రజత కమలం.. రూ.50 వేలు) అందుకున్నారు. ఏమైనప్పటికీ శంకరాభరణంలో ప్రతి ఫ్రేమూ, ప్రతి మాట, ప్రతి పాట ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలోనే చాలాసార్లు చూడడమే కాకుండా.. కొన్ని థియేటర్లలో బయటే చెప్పులు విడిచి మరీ.. శంకరాభరణం చూడటం విశేషం.