
చలనచిత్ర నిర్మాణం అత్యధిక వ్యయంతో కూడినది అని అందరికీ తెలుసు. ఈ రంగంలో దర్శకులుగా రాణించాలంటే ప్రతిభ కలిగి ఉండడంతో పాటు అవకాశాలను సృష్టించుకోగలగాలి. ఈ కృషిలో సృజనాత్మకత పాటు సమాచార నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అనేక వ్యాపారాలు చేసుకుంటూనే సినిమా నిర్మాణంపై ఆసక్తి కలిగిన బందరువాసి పినపాల వెంకటదాసు. ఆంధ్ర ప్రాంతంలో రెండవ పర్మినెంట్ థియేటర్ కట్టింది ఈయనే. 1925లో బందరులో “మినర్వా టాకీస్” ను నిర్మించారు. కొల్లాపూర్, బొంబాయి, కలకత్తా వెళ్లకుండా పూర్తి నిర్మాణాన్ని మద్రాసులో నిర్వహించిన రూపకర్త పి.వి.దాసు. ఆ సినిమా అక్టోబరు 1934 లో విడుదలైన “సీతా కళ్యాణం”. దీనికోసం మద్రాసులో వేల్ పిక్చర్స్ స్థాపించారు.
తెలుగులో నిర్మితమైన తొలి రీమేక్ చిత్రం “సీతా కళ్యాణం”. మొట్టమొదటి అవుట్ డోర్ చిత్రం “సీతా కళ్యాణం” తో చిత్రపు నరసింహారావును తొలిసారిగా దర్శకుడిని చేసింది, “సీతా కళ్యాణం”. వీటికి మూల కారణం పి.వి.దాసు. కె.రామ్ నాథ్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది పి.వి.దాసునే. కె.రామ్ నాథ్ తో బాటు కళా దర్శకులు, ఏ.కె.శేఖర్ ని తెలుగు సినిమాకు పరిచయం చేసింది పి.వి.దాసునే. మంచి సంగీత దర్శకుడుగా పేరు తెచ్చుకున్న గాలి పెంచల నరసింహారావును తన తొలి చిత్రం “సీతా కళ్యాణం” ద్వారా పరిచయం చేసింది పి.వి.దాసునే. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక అధ్యాయం సృష్టించుకున్న అద్భుతమైన సంగీతం దర్శకులు ఎస్. రాజేశ్వరరావును బాల నటుడిగా వెండితెరకు పరిచయం చేసేది కూడా పి.వి.దాసునే.
ఆయన నిర్మించిన రెండో చిత్రం “శ్రీకృష్ణ లీలలు” (1935) లోనే కరపత్రాల ద్వారా ప్రచారం చేసిన సినీ నిర్మాత వ్యూహకర్త, వ్యాపారవేత్త పి.వి.దాసు. రెండు చిత్రాల నిర్మాణ అనుభవంతో మూడో చిత్రానికి దర్శకత్వం వహించి ఆ చిత్రాన్ని విజయవంతం చేసిన ఘనులు పి.వి.దాసు. ఆ సినిమా 1936 లో వచ్చిన శశిరేఖా పరిణయం లేదా మాయాబజార్. దురదృష్టం ఏమిటంటే ఆ సినిమా మొదటి కాపీ రాకముందే ఆయన కన్నుమూశారు. ఆయన స్వల్ప సినీ రంగానికి అకాల మరణమే కారణమైంది. ఆయన దర్శకత్వం వహించిన “శశిరేఖ పరిణయం” అనే ఒకే ఒక్క సినిమాలో వెళ్లాల సుబ్బమ్మ అనే సంగీత ఉపాధ్యాయురాలిని శశిరేఖ పాత్రలో శాంత కుమారిగా పరిచయం చేసింది కూడా పి.విదాసునే. గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవచార్య లాంటి వారిని తెలుగు సినిమా నిర్మాణానికి దగ్గరుండి పరిశీలించే అవకాశాన్ని కూడా పి.వి.దాసు కల్పించారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : పినపాల వెంకటదాసు
ఇతర పేర్లు : పి.వి.దాసు
జననం : 1890
స్వస్థలం : బందరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాసం : మద్రాసు, తమిళనాడు
వృత్తి : నిర్మాత, దర్శకులు, వ్యాపారవేత్త
మరణ కారణం : అనారోగ్య సమస్య తీవ్రతరం.
మరణం : 1936, చెన్నై, భారతదేశం
నేపథ్యం…
పినపాల వెంకటదాసు 1890 లో జన్మించారు. వారు బందరులోని చెమ్మన్నపేటలో ఉండేవారు.ఆయన హై స్కూలు వరకు చదువుకున్నారు. స్కూలు ఫైనల్ తరువాత చదువు ఆపేశారు. పి.వి.దాసు కుటుంబీకులు అంత సంపన్నులేమీ కాదు. అందువలన చదువు ఆపేసి నెల్లూరులో కిరోసిన్ ట్యాంకర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళ బావ దగ్గరికి వెళ్లి గుమస్తాగా చేరారు. గుమస్తాగా ఉంటూనే వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. సరుకులు ఎలా అమ్ముతారు? ఎలా కొంటారు? లెక్కలు ఎలా వ్రాస్తారు వినియోగదారులతో ఎలా ఉండాలి? లాభాలు ఎలా వస్తాయి? ఇలాంటి విషయాలను కూలంకషంగా తెలుసుకునేవారు.
బావ చేసే వ్యాపారాలను అధ్యయనం చేసిన పి.వి.దాసు తిరిగి మచిలీపట్నం వచ్చి “బర్మా సెల్ ఏజెన్సీ” ని కొనుగోలు చేసి వ్యాపారం మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉన్న ఆ ఏజెన్సీ ద్వారా 1915 వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు పెట్రోల్ సరఫరా చేస్తుండేవారు. ఆ తరువాత ఒక ఐస్ ఫ్యాక్టరీ, ఒక సోడా కంపెనీ స్థాపించి వాటితో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. వీటి ద్వారా వచ్చిన లాభాలతో ఎస్.ఎన్.గొల్లపల్లి దగ్గర వందల ఎకరాల భూమిని కొని వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అందుకు పీ.వీ.దాసులో జీవితంలో ముందుకు వెళ్లాలనే పట్టుదల, స్వయంకృషి కారణం. కాలక్రమేణా తన మనస్సు కళల వైపు, నాటకాల వైపు మళ్ళింది.
మినర్వా టాకీస్ నిర్మాణం…
1920 దశకం వచ్చేటప్పటికి మచిలీపట్నంలో నాటకాలు ఎక్కువగా వేసేవారు. ముట్నూరు కృష్ణారావు స్థాపించిన కృష్ణా పత్రిక దర్బారులో పింగళి లాంటి రచయితలు, కవులు, నాటక రచయితలు సాయంత్రం కలుసుకుంటూ ఉండేవారు. అక్కడకు వెళ్లిన పినపాల వెంకట దాసు వారితో చర్చించి నాటక ప్రదర్శనలు ప్రారంభించారు. అలా కొంత కాలం జరిగిన తరువాత మూకీ సినిమాలు ప్రారంభమయ్యాయి. డేరాలు వేసి ఆ మూకీ సినిమాలను గ్రామాలలో ప్రదర్శించడం గమనించిన పి.వి.దాసు వాటి ప్రదర్శన కోసం పూర్తిస్థాయి థియేటర్ నిర్మిస్తే బాగుంటుందని భావించారు. కోట రామబ్రహ్మం, కూనపురెడ్డి రాఘవయ్య, శ్రవణం రామకృష్ణ, కోటమర్రి సుబ్బారావు, చిత్తూరు నరసింహం లాంటి వారి సహాయ సహకారాలతో 1925 వ సంవత్సరంలో బందరులో మినర్వా టాకీస్ అనే సినిమా ప్రదర్శనశాలను నిర్మించారు. దానికి నాలుగు సంవత్సరాల ముందు విజయవాడలో “మారుతీ టాకీస్” ను ప్రారంభమైంది. మినర్వ టాకీస్ లో మూకీ సినిమాలు నడిపించేవారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకుల సమావేశ మందిరంగా కూడా మినర్వా టాకీస్ ఉపయోగపడుతూ ఉండేది.
వేల్ పిక్చర్స్ స్థాపన…
కాలం గడుస్తున్నా కొద్దీ పి.వి.దాసు ఆలోచన సినిమా నిర్మాణం వైపు మళ్ళింది. “లోతు ఎంతో తెలుసుకో మునగడానికి ముందు” అనే సామెత మాదిరిగా నిర్మాణానికి సంబంధించిన లోటుపాట్లను పి.వి.దాసు అధ్యయనం చేస్తుండేవారు. సినిమా నిర్మాణం చేపట్టడానికి ఆయన మద్రాసుకు వెళ్లారు. అక్కడ తెలుగు సినిమా నిర్మాణం ఒక్కటి కూడా జరగడం లేదని తెలుసుకున్నారు. ఒకవైపు కలకత్తా వెళ్లడం, ఇంకో వైపు బొంబాయి, కొల్హాపూర్ వెళ్లి సినిమా నిర్మాణం జరుపడం. ఇలా ఎందుకు జరిగిందో పి.వి.దాసుకు తెలిసిపోయింది. ఎందుకంటే సినిమా నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టిన వారు అందరూ కూడా ఉత్తర భారతదేశంకు చెందినవారు. టాకీలు మొదలైన మూడు సంవత్సరాల వరకు తెలుగు వారు నిర్మాతగా తీసిన చిత్రాలు రాలేదు. అక్కడ స్టూడియో నిర్మాణం జరిగివుంది గనుక కొల్హాపూర్, కలకత్తా, బొంబాయిలలో చిత్ర నిర్మాణం జరిపేవారు.
సాంకేతిక నిపుణులు, దర్శకులు కూడా ఉత్తర భారతదేశానికి చెందినవారు. అందువలన కేవలం తెలుగు భాషలో సినిమాలు తీస్తున్నందులకు తెలుగు భాషా రంగస్థలం నటీనటులను తీసుకెళ్లి, తెలుగువారి పర్యవేక్షణలో సి.పుల్లయ్య లాంటి వారిని పెట్టుకొని సినిమా నిర్మాణం జరిపేవారు. వాటిని తిరిగి ఆంధ్రదేశంలోనే విడుదల చేసేవారు. ఆ విధంగా ఉత్తర భారతీయులు తెలుగు సినిమా పరిశ్రమను మూడు నాలుగు సంవత్సరాలు తమ గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఇట్టి విషయాన్ని గమనించిన పి.వి.దాసు మనం కూడా తెలుగు సినిమాలు మద్రాసులో ఎందుకు నిర్మించకూడదని అనుకుని టి.రాజన్, సి.డి.సామి, సి.పి.సారథి, జయంతీలాల్ థాకరేలతో, చల్లపల్లి రాజా వారి భాగస్వామ్యాలతో “వేల్ పిక్చర్స్ లిమిటెడ్” అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కుమారస్వామి చేతిలో ఉన్న శూలాన్ని వేల్ అని పిలుస్తారు. అలా “వేల్ పిక్చర్స్ లిమిటెడ్” అని స్థాపించి పినపాల వెంకట దాసు ఒక భాగస్వామి, తమిళులంతా ఒక భాగస్వామిగా ఉన్నారు. “వేల్ పిక్చర్స్” నిర్మించే తెలుగు నిర్మాణానికి పీ.వీ.దాసు, తమిళంలో నిర్మించే చిత్రాలకు టి.రాజన్ బాధ్యతలు నిర్వహించాలనే ఒక ఒప్పందానికి వచ్చారు.
స్టూడియో నిర్మాణం…
మద్రాసులోని “ఎల్డామ్స్” రోడ్డులో “డన్ మోర్స్ హౌస్” అనే పేరుతో పిఠాపురం రాజా బంగళా ఉండేది. అత్యంత విశాలమైన ఆ బంగళాలో చిత్రీకరణ జరపాలని నిర్ణయించి దానిని అద్దెకు తీసుకొని “వేల్ పిక్చర్ స్టూడియో” అని పేరు పెట్టారు. అప్పట్లో తమిళంలో “సీతా కళ్యాణం” అనే సినిమా బాగా ఆడుతుంది. దాని నిర్మాణం పూణేలో జరిగింది. “ప్రభాత్ ఫిలిం కంపెనీ” (ప్రముఖ నిర్మాత, దర్శకుడు శాంతారావు గారిది ఆ కంపెనీ) తరుపున బాపూరావు పెండేర్కర్ దర్శకత్వంలో “సీతా కళ్యాణం” అనే తమిళ సినిమాను తీశారు. దీనికి ఛాయాగ్రహణం వి.అవధూత్ సమకూర్చారు. ఆయన దగ్గర కె.రామ్ నాథ్ సహాయకుడిగా పనిచేశారు. వారితోబాటుగా ఏ.కె.శేఖర్ కళా దర్శకుడిగా, మురగదాస్ రచయితగా పనిచేశారు. ఆ ముగ్గురినీ తెలుగు సినిమా “సీత కళ్యాణం” నిర్మాణానికి మద్రాసుకు ఆహ్వానించారు పి.వి.దాసు. దాదాసాహెబ్ ఫాల్కే గారి సూచన మేరకు చిత్రపు నరసింహారావును దర్శకులుగా తీసుకున్నారు పి.వి.దాసు. ఈయన “భక్త ప్రహ్లాద” టాకీ సినిమాకు హెచ్.ఎం.రెడ్డి గారి వద్ద సహాయకుడిగా పని చేశారు.
“సీతాకళ్యాణం” తారాగణం..
ఈ సినిమాకు తారాగణం విశ్వామిత్రుడిగా మాదవపెద్ది వెంకటరామయ్య, శ్రీరాముడిగా మాస్టర్ కళ్యాణి (అసలు పేరు నడుమూరు వెంకట్రావు), గౌతమ మహర్షిగా మాస్టర్ సూరిబాబు, సీతగా బెజవాడ రాజారత్నం, అహల్యగా మిస్ కమల కుమారి, సుమిత్రగా మిస్ కోకిలామణి, కౌసల్యగా మిస్ శ్రీహరి, కైకేయిగా మిస్ రామ తిలకం ఇలా నటీనటులను ఎంపిక చేసుకున్నారు. వీరందరికీ రంగస్థలంలో నటించిన అనుభవం ఉంది. పిఠాపురం రాజా వారి బంగళా అయిన “వేల్ పిక్చర్ స్టూడియో” లో నిర్మాణం జరిపారు. అవుట్ డోర్ చిత్రీకరణలో భాగంగా విజయవాడ దగ్గరలో గల కొండపల్లి అడవులకు సమీపంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి సహాయం చేసిన చల్లపల్లి రాజావారి కోటలో ఉన్న ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఉపయోగించి కొన్ని సన్నివేశాలు తీశారు. ఈ సినిమాలో రాక్షసుల పాత్ర కోసం గుంటూరు, గుడివాడ, బందరు ప్రాంతాల నుండి నిజమైన రౌడీలను తీసుకువచ్చారు. ఈ సినిమాకు సంగీతానికి గాలి పెంచల నరసింహారావును తీసుకున్నారు. ఆయనకు ఇదే మొట్టమొదటి సినిమా.
పత్రికా ప్రకటన వ్రాసిన సముద్రాల…
సమదర్శి, ప్రజామిత్ర పత్రికలో పనిచేసిన గూడవల్లి రామబ్రహ్మం ను అంతరంగిక సలహాదారులుగా చేర్చుకున్నారు. గూడవల్లి దగ్గర పనిచేసిన సముద్రాల రాఘవాచార్యను ప్రకటనలు నిమిత్తం చేర్చుకున్నారు పినపాల వెంకటదాసు. సముద్రాల రాఘవాచార్య “సీతా కళ్యాణం” చిత్రానికి ప్రచార ప్రకటనలకు వాక్యాలు వ్రాశారు. ఒక ప్రకటనలో “త్వరలో వచ్చుచున్నది వేల్ పిక్చర్స్ లిమిటెడ్ వారిచే తయారు చేయబడిన తెలుగు టాకీ నిరుపమాన పౌరాణిక చిత్రం. ఇప్పటివరకు వచ్చిన తెలుగు చిత్రాలలో ఇది శ్రేష్టతమనుట నిస్సందేహం. ప్రసిద్ధ నటలోక నాట్య బృందం, అద్భుత సన్నివేశములు అపూర్వ వస్త్రాలంకరణములు. మీ రాష్ట్రములో తయారుచేయబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే అని మరువబోకుడు” అని సినిమా విడుదలకు ముందు ప్రకటన ఇచ్చారు.
అలాగే ఇంకో ప్రకటనగా సినిమా విడుదలకు రెండు రోజులు ముందు “మద్రాసు వేల్ పిక్చర్స్ వారి అద్భుతంగా ప్రథమమున తయారు చేయబడిన గొప్ప తెలుగు టాకీ అగు సీతాకళ్యాణ మహోత్సవము అను నేత్రోత్సవమైన కథను కరుణానందమైన గానమును 06 – 10 – 1934 తేదీ శనివారం మొదలు శ్రీ దుర్గా కళామందిరమునందు మీకు లభించును”. ఇది బెజవాడలో విడుదలైన ప్రకటన.
అద్భుతమైన విజయం “సీతా కళ్యాణం”..
పినపాల వెంకటదాసు నిర్మించిన సినిమా “సీతా కళ్యాణం” బెజవాడలో ఉన్న రెండు సినిమా ప్రదర్శనశాలలలో దుర్గా కళామందిర్, మారుతి సినిమా టాకీస్ లలో విడుదలైంది. “సీతా కళ్యాణం” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో తెలుగు నిర్మాతలు మద్రాసులోనే సినిమా నిర్మాణం చేపట్టడం మొదలుపెట్టారు. ఆ మరుసటి సంవత్సరం 1935 లో ఏకంగా తొమ్మిది తెలుగు సినిమాలు నిర్మాణం అయ్యాయి. అలా పినపాల వెంకటదాసు కేవలం ఒక్క సంవత్సరంలో మద్రాసులోనే సినిమా నిర్మించి, విజయం సాధించి ఉత్తరాది నిర్మాతలకు ధీటుగా సమాధానం ఇచ్చారు.
పినపాల వెంకటదాసు చేపట్టిన సినిమా సంస్థ, స్టూడియో రూపకల్పన, సినీ నిర్మాణం ఇలా ఏ ప్రణాళిక చేపట్టినా కూడా తన బాధ్యత ఇంతే అని సరిపెట్టుకోకుండా ప్రతీ దశలోనూ, ప్రతీ రంగాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని దానిని అధ్యయనం చేస్తూ ఉండేవారు. సీతాకళ్యాణం నిర్మాణంలో ఉండగానే పినపాల వెంకటదాసు అన్ని విభాగాలలో పట్టు సంపాదించగలిగారు. సీతా కళ్యాణం చిత్రం నిర్మాణంలో ఉండగానే తమిళ భాగస్వాములు “మార్కండేయన్” తమిళ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. ఆ సినిమాను జనవరి 1935 లో విడుదల చేశారు. భాగస్వాములతో చక్కటి అవగాహన కలిగివున్న పి.వి.దాసు తెలుగు సినిమాను, టి.రాజేంద్రన్ తమిళ సినిమాను సమాంతరంగా నిర్మించారని చెప్పుకోవచ్చు.
“శ్రీకృష్ణ లీలలు” లో వందేమాతర గీతం…
ఈ రెండు చిత్రాల తరువాత తమిళంలో “పట్టణత్తిల్” అనే తమిళ సినిమాను టి.రాజన్ ప్రారంభించారు. ఇటువైపు తెలుగులో పి.వి.దాసు “శ్రీకృష్ణ లీలలు” (1935) అనే తెలుగు సినిమాను ప్రారంభించారు. సీతారామ కళ్యాణం కు పనిచేసిన సాంకేతిక నిపుణులే “శ్రీకృష్ణ లీలలు” సినిమాకి కూడా కొనసాగారు. కంసుడి పాత్రకు వేమూరు గగ్గయ్యను తీసుకున్నారు. చిన్ని కృష్ణుడు పాత్రకు సాలూరు రాజేశ్వరరావును ఎంచుకున్నారు. క్రూరమైన కంసుడి పాత్రలో అద్భుతమైన గేయాలతో అలరించిన గగ్గయ్యకు పోటీగా బాలకృష్ణుడి పాత్రలో సాలూరు రాజేశ్వరరావు పోటీగా పద్యాలను పాడి ఆకట్టుకున్నారు.
భారతీయ ప్రార్థన గీతం అయిన వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ “ఆనందమఠం” అనే నవలలో వ్రాశారు. ఈ గీతాన్ని కొద్ది మార్పులతో పి.వి.దాసు “శ్రీకృష్ణ లీలలు” అనే సినిమాలో చూపించారు. ఇంద్రుడు మొదలైన దేవతలు దుర్గాదేవిని స్తుతిస్తూ పాడే పాటగా వందేమాతరంలోని కొంత భాగాన్ని ఉపయోగించారు. వందేమాతరం అని ప్రారంభం అవుతూ “తుమి విద్య తుమి ధర్మ తుమి హుది తుమి మర్మ తుమిహి ప్రాణ శరీరే బహుతే, మాంశక్తి హృదయే తుమిమాం భక్తితో మారే ప్రతిమా గళ మందిరే మందిరే తో ప్రారంభమై చివరి చరణాల్లో సుజలాం సుఫలాం మలయజ శీతలామ్ సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్ ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం అని “వందేమాతరం” పాటలో ఉన్న పంక్తులు యధాతథంగా ఉపయోగించారు.
ఆంధ్ర పత్రికలో ప్రకటన…
నవంబర్ 1935 వ సంవత్సరం మొదటి వారంలో “శ్రీకృష్ణ లీలలు” సినిమా ముందుగా మద్రాసులో విడుదలైంది. 14 నవంబర్ 1935 నాడు ఆంధ్ర పత్రికలో చాలా వివరమైన సమీక్ష వ్రాశారు. వేల్ పిక్చర్స్ వారి పక్షమున శ్రీ పి.వి.దాసు తయారు చేయించిన “శ్రీకృష్ణ లీలలు” అనే తెలుగు టాకీ నిన్నటి దినమున చెన్నపురి బ్రాడ్ వే టాకీస్ లో సినిమా పరిశ్రమదారులకు, పత్రికా ప్రతినిధులకు మొదలైన వారలకు ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. వేల్ పిక్చర్స్ వారు తలపెట్టిన తెలుగు చిత్రాలలో ఇది రెండవది. ఇంతకు పూర్వము సీతా కళ్యాణం తయారు చేయించి ఉండిరి. ముఖ్యంగా బాలకృష్ణుడి వేషం వేసిన మాస్టర్ రాజేశ్వరరావు అద్భుతంగా నటించారు” అని అన్ని పత్రికలలో వ్రాశారు. ఆంధ్ర పత్రికలో “పిట్ట కొంచెం కూత ఘనం” అన్నట్టుగా బాలుడయను సంగీతమున తక్కిన పాత్రధారులందరిలోనూ పైచేయి, ఇంపైన కంఠము, హాయి హాయి అనిపించు కమ్మని పాట, తనివి తీరా విని ఆనందింపవచ్చును. ఇతని పాట విని ఆంధ్రులు, తమిళులు, ఉత్తరదేశీయులందరునూ బాగుగా తలలూపుచూ తమ ఆనందాతిశయమును కరతాళ ధ్వనుల మూలమున ప్రకటించుచుండిరి.
హెలికాప్టర్ ద్వారా ప్రకటన…
మద్రాసులో విడుదలైన రెండో వారంలోనే ప్రకటన ఇలా ఉంది “వేల్ పిక్చర్స్ వారి “శ్రీకృష్ణ లీలలు” తెలుగు టాకీ ఈ మహత్తర పౌరాణిక చిత్రం మద్రాసు బ్రాడ్ వే టాకీస్ లో రెండో వారం ప్రదర్శింపబడుతున్నది. మొదటివారం ఈ చిత్రాన్ని తిలకించడానికి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య మొత్తం 26,585 అని ఈ సంఖ్యను పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాశారు. ఈ సినిమాను 30 నవంబర్ 1935 నాడు విడుదల చేయడానికి ఒక రోజు ముందు హెలికాప్టర్ ద్వారా కరపత్రాలను పంచారు. ముందు పత్రికల్లో ఇలా ప్రకటన ఇచ్చారు
“నిరీక్షింపుడు ఆకాశ విమానం వచ్చుచున్నది వచ్చుచున్నది. ఈనెల 29వ తేదీన పగలు ఈ దిగువ నగరమునకు ఈ దిగువ తెలిపిన సమయము నందు వచ్చుచున్నది. మద్రాసు ఉదయం 6 గంటలకు, గూడూరు 7 గంటలకు, నెల్లూరు 7 గంటల 20 నిమిషాలకు ఇలా అంతా ఒక పట్టిక మాదిరిగా వ్రాసి సామర్లకోట 11 గంటలకు, బందరు ఒంటి గంటకు, తెనాలి 01:20 నిమిషాలకు, చీరాల 01:50 నిమిషాలకు, చివరకు మద్రాసు సాయంత్రం నాలుగు గంటలకు లీలా మానుష విగ్రహుడకు “శ్రీకృష్ణుడు” ఆ విమానంపై వచ్చుచున్నాడు. మీకు ఒక నూతన సందేశము కరపత్రములుగా అందింపనున్నాడు. ఆ కరపత్రం శ్రద్ధగా చదువుకొనుడు. ఈ తరుణం పోగొట్టుకొనకుడు, ఎదురుచూడండి”
అని ముందుగా పేపర్లో ప్రకటన ఇచ్చి మరుసటి రోజు ఆ హెలికాప్టర్ ని ఆంధ్రదేశమంతటా త్రిప్పి హెలికాప్టర్ నుండి కరపత్రాలు పడేలా చేశారు. ఇంతటి అద్భుతమైన వ్యాపార వ్యూహం 1935లో మొనగాడు నిర్మాత పి.వి.దాసు చేయగలిగారు. ఆంధ్రలో విడుదలైన ఈ సినిమా గొప్పగా విజయం సాధించింది. ఈ విధంగా ఒకవైపు సినిమాలు తీస్తూనే కొత్త కొత్త వ్యాపార ప్రణాళికలు చేసి పెట్టేవారు పినపాల వెంకటదాసు.
సొంతంగా రేపల్లె లో “కృష్ణా టాకీస్” నిర్మాణం…
పినపాల వెంకటదాసు ఒకవైపు సినిమాలు తీస్తూనే మరోవైపు కొత్త కొత్త వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేస్తుండేవారు. ఆయన “సౌత్ ఇండియన్ సౌండ్ కార్పొరేషన్” అనే సంస్థను స్థాపించి సౌండ్ కు సంబంధించిన సాంకేతిక పరికరాలను దిగుమతి చేసుకునేవారు. వాటిని వివిధ సినిమా ప్రదర్శనశాల లకు సరఫరా చేస్తుండేవారు. ఆ క్రమంలో పి.వి.దాసు “సౌండ్ ఇంజనీరింగ్” అనే శాఖ గురించి అధ్యయనం చేసి అవసరమైనప్పుడు “సౌండ్ రికార్డింగ్” కూడా ఆయనే చేసేవారు. అదే సమయంలో పి.వి.దాసు సొంతంగా 1934లో రేపల్లెలో “శ్రీకృష్ణ టాకీస్” అనే సినిమా ప్రదర్శనశాలను నిర్మించారు. అప్పుడప్పుడే సినిమా నిర్మాణాలు పెరుగుతున్న క్రమంలో చల్లపల్లి రాజా వారి బంగళా నుండి డిండిలో గల విశాలమైన ప్రదేశానికి వేల్ పిక్చర్స్ స్టూడియోను మార్చారు. తెలుగులో రెండో సినిమా “శ్రీకృష్ణ లీలలు” విడుదలయిన కొంత కాలానికి తమిళంలో టి.రాజన్ తీసిన “పట్టణత్తిల్” కూడా విడుదలైంది.
“శశిరేఖా పరిణయం” నటిగా శాంతకుమారి…
“శ్రీకృష్ణ లీలలు” సినిమా విడుదలకు ముందే మూడో సినిమా సన్నాహాలు ప్రారంభించారు. ఈ సినిమాకు పినపాల వెంకటదాసు దర్శకత్వం వహించాలనుకున్నారు. దాంతో “శశిరేఖా పరిణయం” లేదా “మాయాబజార్” అనే కథను ఎంచుకున్నారు. “శ్రీకృష్ణ లీలలు” నిర్మాణంలో ఉండగానే ఆ చిత్ర ప్రచార ప్రకటనల్లో “వేల్ కంపెనీ వారిచే తయారు కాబోతున్న మూడవ తెలుగు టాకీ శశిరేఖా పరిణయం అను వత్సలాపహరణం త్వరలో రాబోతోంది నిరీక్షింపుడు” అని ధైర్యంగా ప్రకటించారు. ఒక సినిమా విడుదలవ్వడానికి సంవత్సరం ముందే పత్రికా ప్రకటన ఇవ్వడం ఆ రోజులలో పి.వి.దాసు అనుభవం, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
ఈ సినిమాకు నటిని ఎంపిక చేసే క్రమంలో తన మిత్రుడు ఇంట్లో ఏర్పాటు చేసిన కచ్చేరీలో పాడుతున్న పదహారేళ్ల అమ్మాయి శాస్త్రీయ సంగీత కచ్చేరీ చేస్తున్న అమ్మాయి గురించి వాకబు చేసి మద్రాసులో సంగీత పాఠశాలలో పనిచేస్తున్న అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లారు పినపాల వెంకటదాసు. నానమ్మ దగ్గర ఉంటున్న ఆ అమ్మాయి పేరు “వెల్లాల సుబ్బమ్మ”. ముందుగా వాళ్ళ నాన్నమ్మ ఒప్పుకోలేదు. కానీ నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించి వెల్లాల సుబ్బమ్మకి శశిరేఖా మేకప్ వేయించి మరీ ఒప్పించారు. అలా ఆ సినిమాకు ఎంపిక చేయబడ్డ వెల్లాల సుబ్బమ్మ పేరు పినపాల వెంకటదాసు శాంత కుమారిగా మార్చారు. ఆవిడే తరువాత రోజులలో అగ్ర దర్శకులు పి.పుల్లయ్యకు భార్య అయ్యింది.
మరణం…
శ్రీకృష్ణ పాత్రలో యడవల్లి నాగేశ్వరరావు, శశిరేఖ ప్రక్కన ఉండే అభిమాన్యుడి పాత్రకు ఎస్పీ లక్ష్మణస్వామి, బాల అభిమన్యుడుగా శ్రీకృష్ణ లీలలు సినిమాలో నటించిన బాలకృష్ణుడు సాలూరు రాజేశ్వరరావును ఎంపిక చేశారు. ఘటోత్కచుడిగా నెల్లూరుకు చెందిన వస్తాదు ఆర్.రామిరెడ్డి (రాజంరెడ్డి రామిరెడ్డి) ని, సుభద్ర పాత్రకు సీనియర్ శ్రీరంజనిని ఎంచుకున్నారు. ఇందులో ఒక పాట “వివాహ భోజనంబు వింతైన పాయసంబు ఘనమైన దప్పలంబు కడుమంచి అప్పలంబు చవ్వులూరు చేయువిందు సంతోషముగా తిందు సాకేలరండు ముందు లేకున్న మనసు ముందు భలే శబాసు లడ్డు పరిగెత్తవేమి అడ్డు జిలేబి లారా లెండు శీఘ్రంగా బయటకు రండు”. ఇందులో శాంత కుమారి నటన అద్భుతంగా ఉంది.
ఇందులో కె.రామ్ నాథ్ ట్రిక్ ఫోటోగ్రఫీ, 1957లో మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం వహించిన “మాయాబజార్” ట్రిక్ ఫోటోగ్రాఫిక్ కు ఏమాత్రం తీసిపోదు. పి.వి.దాసుకు నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల మీద అవగాహన ఉంది గనుక ఆయనకు దర్శకత్వం కొత్తగా ఏమీ అనిపించలేదు. దురదృష్టావశాత్తు పినపాల వెంకటదాసుకు చిన్న అనారోగ్య సమస్య ప్రారంభమైంది. ఆయన నిర్లక్ష్యం చేసేసరికి అది తీవ్రతరమై ఆయనను బలి తీసుకుంది. ఎంతో ఇష్టపడి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న “మాయాబజార్” మొదటి కాపీ రాకముందే 1936 లోనే పినపాల వెంకటదాసు కన్నుమూశారు. ఆయన కన్నుమూసే సమయానికి తన వయస్సు 45 సంవత్సరాలు.
వందేళ్ల చరిత్ర కలిగిన “మినర్వా టాకీస్”…
పినపాల వెంకటదాసు నిష్క్రమించిన సంవత్సరం తరువాత 19 డిసెంబరు 1936 నాడు శశిరేఖా పరిణయం విడుదలైంది. 1957 లో విడుదలైన కె.వి.రెడ్డి “మాయాబజార్” ఎంత అద్భుతమైన విజయం సాధించిందో పి.వి.దాసు దర్శకత్వం వహించి, నిర్మించిన మాయాబజార్ కూడా అంతే విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన తరువాత ప్రకటనలో దర్శకత్వం స్వర్గీయ పి.వి.దాసు అని, సూపర్ విజన్ టి.రాజన్ అని ప్రకటించారు. పి.వి.దాసు నిష్క్రమణతో “వేల్ పిక్చర్స్” లో ఒక అధ్యాయం ముగిసింది. పి.వి.దాసు మరణం తరువాత “వేల్ పిక్చర్స్” వారు ఒక్క తెలుగు సినిమా కూడా నిర్మించలేదు. వేల్ పిక్చర్స్ పి.వి.దాసు, మూడు సంవత్సరాలు మూడు సినిమాలు. అయినా కానీ ఎన్నెన్నో ప్రత్యేకతలు. అన్ని తెలివితేటలు, చొరవ, ధైర్యం ఉన్న పి.వి.దాసు అంత చిన్న వయస్సులోనే మరణించకుండా ఉండి ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకెన్నో అద్భుతాలు జరిగి ఉండేవి.
ఆ మూడు సంవత్సరాలలో పి.వి.దాసు దూసుకెళ్లిన విధానం అలాంటిది. ఆ రోజులలోనే పి.వి.దాసు “ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్” అనే సంస్థ ఏర్పాటు చేయడానికి కృషి కూడా చేశారు. కానీ ఆ అధ్యాయం అంతటితో ఆగిపోయింది. వేల్ పిక్చర్స్ మూడు తెలుగు సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో అలా నిలిచిపోయాయి. కానీ బందరులోని “మినర్వా టాకీస్” ప్రవేశ ద్వారంపై పి.వి.దాసు శిలావిగ్రహం మాత్రం అలాగే ఉంది. వచ్చే సంవత్సరానికి “మినర్వా టాకీస్” కు వందేళ్లు నిండిపోతాయి. ఆ టాకీస్ బందరు చరిత్రలో భాగమైపోయింది. “మినర్వా టాకీస్” పి.వి.దాసు 100 సంవత్సరాలకు ముందు చూపుకి ప్రత్యక్ష నిదర్శనం. 1925లో పి.వి.దాసు భాగస్వామిగా నిర్మించిన “మినర్వా టాకీస్” ఈ 99 ఏళ్లలో ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో రాజకీయ సమావేశాలు అందులో జరిగాయి. 2011 వరకు నడిచిన ఈ “మినర్వా టాకీస్” గత 13 ఏళ్లుగా మూతపడి ఉంది.

