
సికింద్రాబాదు జేమ్స్ స్ట్రీట్ దగ్గర, వందమంది యువకవుల సమ్మేళనం అది. వరస క్రమంలో అతను 98వ వాడు. అతని వంతు వచ్చింది.
“కలం తప్ప దమ్మిడీ బలం లేని వాడు..
హలం తప్ప అంగుళం పొలం లేని వాడు..
గడ్డం మాసినవాడు గుడ్డలు మాసిన వాడు..
తలమాసినవాడుగా సమాజం వెలివేసిన వాడు”
అంటూ ఉద్వేగంగా చదివేశాడు. కవిత పూర్తవగానే చప్పట్లు మార్మోగిపోయాయి. శాలువాలూ, ఫొటోలూ.. పొగడ్తలూ వెరసి ‘కవిత్వం ఇంత కిక్కు ఇస్తుందా?’ అనిపించింది ఆ సమయానికి. అంతే ఆ కవిత్వం ఇచ్చిన కిక్కుతోనే రచయిత అయ్యాడు. ఆ రచన ఇచ్చిన ఆనందంలోనే సినీ నటుడయ్యాడు, దర్శకుడు అయ్యాడు. ఆయనెవరో కాదు కంచుకవచం సినిమా ద్వారా రచన ప్రారంభించి, 50 పైగా సినిమాలకు రచనలు చేసి, 750 పైగా సినిమాలలో తన అద్భుతమైన నటనను ప్రదర్శింపజేసిన తనికెళ్ళ భరణి.
సినీ నాటక రచయితగా, వెండితెర నటుడిగా, రంగస్థలం కళాకారుడిగా, సాహితీవేత్తగా, దర్శకుడిగా, కవిగా తనికెళ్ళ భరణి బహుముఖ ప్రజ్ఞాశాలి. తారపథంలో వెలిగే భరణి నక్షత్రం గుణగణాలతో పోలిస్తే ఖచ్చితంగా అవి తనికెళ్ళ భరణికి సరిపోతాయని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడు విద్యావేత్త, కళారంగమున అభివృద్ధి కలిగిన వాడు, భోగభాగ్యాలు అనుభవించగలవాడు, సర్వశుభ లక్షణములు కలిగినవాడని ఆ నక్షత్ర ఫల విశేషాలు గురించి జ్యోతిష్యశాస్త్రం చెబుతుంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు భరణి అనే నామకరణం చేశారు.
“కంచుకవచం” సినిమాకు రచన ద్వారా సినిమాలోకి అడుగుపెట్టి, యాభై సినిమాలకు పైగా మాటలు వ్రాసి, 750 పైచిలుకు సినిమాలలో నటుడిగా విలక్షణ పాత్రలను చేసి రక్తం కట్టించారు భరణి. రచయితగా “లేడీస్ టైలర్”, “శివ”, “అంకుశం”, “చెట్టు కింద ప్లీడర్”, “ఆలాపన”, “వారసుడొచ్చాడు” మొదలైన చిత్రాలతో భేష్ అనిపించుకున్న భరణి నటుడిగా “మాతృదేవోభవ”, “శారదాంబ”, “శివ”, “సముద్రం”, “నువ్వు నేను”, “అతడు”, “చిత్రం”, “గ్రహణం”, “యమలీల”, “ఆమె”, “మల్లీశ్వరి” లాంటి చిత్రాల ద్వారా శభాష్ అనిపించుకున్నారు.
చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారి వేగం పుంజుకొని పెను తుఫానుగా మారినట్లు గుక్కతిప్పుకోలేని పాత్రలు, సినిమాల మీద సినిమాలు, హిట్ల మీద హిట్లు, 750 పైచిలుకు సినిమాలు, కామెడీని విలనీతో కలబోసి నషాళానికి అంటే కషాయాన్ని కాచాలంటే భరణిని మించిన వాళ్ళు లేరన్న స్థాయికి ఎదిగారాయన. ఆ రోజుల్లో భరణికి వ్రాసిన ఓ నాటికను చూసిన దామరాజు హనుమంతరావు ఆనందించి తాను తీయబోయే సినిమాకి స్క్రిప్టు వ్రాయమని మద్రాసుకు ఆహ్వానించారు.
కంచుకవచం సినిమాకి మాటలు వ్రాసిన భరణికి ఆశించిన తృప్తి కలగలేదు. సినిమా వాతావరణం పూర్తిగా తెలియక కొత్తగా అనిపించింది. తాను వ్రాసిన వాటిని అక్కడ వాళ్ళు ఇష్టానుసారం మార్చేయడాన్ని సహించలేక తన ఊరికి పోదాం అనిపించి రెండు, మూడు సార్లు మద్రాసు సెంటర్ లో హైదరాబాదుకు రైలెక్కి సికింద్రాబాదు ప్లాట్ ఫారం పై దిగిపోయారు భరణి. కానీ ముచ్చటగా మూడోసారి మాత్రం అటూ ఇటూ తేలిపోవాలని మద్రాసుకు చేరుకున్న భరణికి ఆయన పాలిట ప్రాతఃస్మరణీయులుగా నిలిచిపోయిన రాళ్లపల్లి దంపతులు అండగా నిలిచారు. భరణిని కన్న కొడుకులా ఆదరించారు.
జీవిత విశేషాలు…
జన్మ నామం : తనికెళ్ల భరణి
ఇతర పేర్లు : మురళీ మోహన్
జననం : 14 జూలై 1954
స్వస్థలం : జగన్నాథపురం , పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
వృత్తి : సినీ నటుడు, రచయిత, దర్శకుడు, విలేఖరి
తండ్రి : టి. వి. యస్. యస్. రామలింగేశ్వర రావు
తల్లి : లక్ష్మీ నరసమ్మ
జీవిత భాగస్వామి : భవాని
పిల్లలు : మహాతేజ (కొడుకు), సౌందర్యలహరి (కుమార్తె)
నేపథ్యం…
తనికెళ్ల భరణి 14 జూలై 1956 నాడు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని జగన్నాధపురం. ఆయన తండ్రి టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. ఆయన తెలుగు , ఇంగ్లీషు, హిందీ, తమిళం భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. తనికెళ్ల భరణి పూర్వీకులలో తెలుగు సాహిత్యానికి చెందిన కవులు మరియు సాహితీవేత్తలు ఉన్నారు. దివాకర్ల వేంకటావధాని మరియు విశ్వనాథ సత్యనారాయణ అతని తాతలు. తెలుగు కవి ద్వయం తిరుపతి వేంకట కవులులో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి అతని ముత్తాత. టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ దంపతులకు ఏడుగురు కొడుకులు. ఏడుగురులో ఒకరు తనికెళ్ల భరణి. 18 జూలై 1956 దశమి భరణి నక్షత్రంలో జన్మించడం వలన ఆయనకు భరణి అనే పేరు పెట్టారు.
భరణి బీ.కామ్ పాసయ్యారు. కానీ తనకు అకౌంటెన్సీ అంటే పరమ చిరాకు. లెక్కలు అంటే విపరీతమైన భయం. సికింద్రాబాదు తార్నాక రైల్వే జూనియర్ కళాశాలలోనూ, ప్రక్కనే ఉన్న సంఘీ డిగ్రీ కళాశాలలోనూ చదువు పూర్తి అయ్యింది. భరణికి తెలుగులో తప్ప అన్నింటిలో అత్తెసరు మార్కులే వస్తుండేవి. చదివీ చదవనట్టు చదివి థర్డ్ క్లాసులోనే డిగ్రీని నెట్టుకొచ్చాడు. తరగతిలో మొదటి ర్యాంకు పొందటం, బ్రిలియంట్ స్టూడెంట్ లాంటి ప్రశంసలు మీద తనకు ఎలాంటి ఆశలు లేకపోవడం వలన సరదాగా స్నేహితులతో కబుర్లు చెబుతూ చివరి బెంచీలోనే స్థిరపడిపోయారు. ఇంట్లో అమ్మానాన్న కొడితే అమ్మమ్మను, నానమ్మను ఆశ్రయించినట్టుగా లెక్కలు, సామాన్య శాస్త్రం (సైన్స్) లాంటివి తనను భయపెట్టడంతో ఆయన తెలుగుకు దగ్గరయ్యారు. అది అతనిలోని అభద్రతను తొలగించింది. ఆత్మన్యూనతను పోగొట్టింది. తనను కవిత్వంతో స్నేహం చేయించింది. నటన నేర్పించింది, నాటకాలు కూడా వ్రాయించింది.
పెట్రోలు బంకులో ఉద్యోగం చేస్తూ…
నాటకాలు వ్రాయడం మొదలుపెట్టిన భరణి తన కళాశాలలో “అతిథులు వస్తున్నారు”, “ఏక్ దిన్ కా సుల్తాన్” లాంటి నాటకాలలో నటించిన అనుభవంతో, తనదైన ముద్రను వేయాలని, తన ప్రతిభ రుజువు చేసుకోవాలని “అద్దెకొంప” అనే నాటికను వ్రాసి నాటక పోటీలో బహుమతి సాధించారు. దాంతో భరణి పేరు కళాశాల స్థాయిలో మారు మ్రోగిపోయింది. తన అన్నయ్య సూరిబాబు ప్రోత్సాహంతో సాహితీ క్షేత్రంలో సాధన ఆరంభించారు. ఛాయాచిత్రం (ఫోటో) కవితల పోటీలో భరణి వ్రాసిన కవిత్వం నగ్నముని లాంటి కవుల ప్రశంసలు అందుకుంది. అలాగే వార పత్రిక నిర్వహించిన కథల పోటీలలో భరణి కథలకు బహుమతులు వచ్చాయి. నీ కవిత్వం బాగుంది. నీ కథలు బాగున్నాయి. నీవు సాహిత్యం రంగంలో బాగా రాణిస్తావని అందరూ పొగుడుతుండేవారు. అలాంటి దశలో థర్డ్ క్లాస్ డిగ్రీ చేతికి అందింది. సహజంగానే ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షలు వ్రాయాలి.
కానీ భరణికి కవిత్వం వ్రాయడం వచ్చు, కథలు వ్రాయడం వచ్చు. నాటకాలైతే చెప్పనక్కర్లేదు. పోటీ పరీక్షలు వ్రాయడం ఎలాగో భరణికి తెలియదు. దానికి తోడు ఇంటర్వ్యూలు, ఇంగ్లీషులో మాట్లాడటాలు లాంటివి తలుచుకుంటేనే భరణికి భయం. తన విద్యార్హతలకి బ్యాంకుల లోనూ, ప్రభుత్వ కార్యాలయంలలోనూ ఉద్యోగం రాదని కచ్చితంగా నిర్ణయించుకున్న భరణికి తండ్రి మీద ఆధారపడటం తగదనిపించింది. డబ్బు సంపాదించాలన్న తపన తనలో విపరీతంగా పెరిగింది. అందువలన కొనాళ్ళ పాటు ఒక మందుల దుకాణంలో ఆయన పనిచేశారు. ఆ తరువాత సికింద్రాబాదు ఆర్.పి రోడ్డు (రాష్ట్రపతి రహదారి) లో పెట్రోల్ బంక్ లో స్టాక్ వివరాలు వ్రాసుకునే కొలువులో చేరారు. ఏదీ శాశ్వతం కాదని, తన గమ్యము ఇంకేదో ఉందని మనసు చెప్పినట్టుంది. అందువలన చిన్నాచితక ఉద్యోగాల్లో ఆయన ఇమడలేకపోయారు. దాంతో అప్పుడప్పుడు ఆయన ఖాళీగానే ఉండవలసి వచ్చేది.
రాళ్లపల్లి తో పరిచయం..
తనికెళ్ళ భరణి కి దినసరి అలవాట్లు చాలానే ఉన్నాయి. సిగరెట్లకి, సినిమాలకి, డ్రామాలకి, స్నేహాలకి డబ్బు కావాలి. ఇంట్లో అడగి తీసుకోవడానికి మనసు అంగీకరించదు. పోనీ బ్యాంకు నుంచి తీసుకోవడానికి ఖాతా కూడా లేదు. కానీ ఆ రోజులలోనే భరణి జేబులో ఏటీఎం కార్డు ఉండేది. దాని పేరు ప్రతిభ (టాలెంట్). కవిత, కథ, దృశ్యమాథ్యమం ఏదైనా అడిగిన వెంటనే అప్పటికప్పుడు తక్షణమే వ్రాసేయగల సామర్థ్యం తనది. ఆ సామర్ధ్యాన్ని జేబులో పెట్టుకుని రేడియో స్టేషన్లకు వెళ్లేవారు భరణి. ప్రయాగ వేదవతి లాంటి వారు పురమాయిస్తే చెట్టు కింద కూర్చొని కాగితాల నిండా అక్షరాలను నింపేసేవారు. నాటక రచయితగా పేరు తెచ్చుకొని పదో, పదిహేనో సంపాదించేవారు. వచ్చిన డబ్బులు జేబులో వేసుకొని తల పైకెత్తి హైదరాబాద్ రోడ్లమీద పడేవారు. సరాసరి గురువు తల్లావఝ్జుల సుందరం లాంటి వారి సమక్షంలో తేలేవారు.
అబ్జర్వ్ థియేటర్, అధివాస్తవిక సాహిత్యం (సర్రిలిస్టిక్ పోయెట్రీ), నాటక రచన, నటన, ప్రయోగాలు, ప్రదర్శనలు, పరిషత్తులు, రిహార్సల్ లు, బహుమతులు అదే తన ప్రపంచం. మొడరన్ థియేటర్ లో “కృషిచేసి”, “కొక్కోరోకో”, “గోగ్రహణం”, “గార్దభాండం”, “చల్ చల్ గుర్రం” లాంటి నాటికలు వ్రాసి నిష్ణాతులు అనిపించుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు పిజి డిప్లమా చేశారు. ఆ రోజులలో తన అభిరుచికి తగ్గట్టుగానే “అమృతవాణి” లో కార్యక్రమాల రూపకర్తగా భరణికి ఉద్యోగం లభించింది. నాటక రచయితగా భరణి ఉచ్ఛదశకు చేరుకున్నారు. అప్పటికే నాటక రంగంలో పేరు తెచ్చుకొని సినిమా రంగంలో రాణిస్తున్న రాళ్లపల్లికి భరణి చేరువయ్యారు. “నాలుగో కోతి” అనే నాటకాన్ని వ్రాసిన భరణి ఆ నాటకాన్ని రాళ్లపల్లితో కలిసి ప్రదర్శించారు.
మలుపుతిప్పిన వంశీ “లేడీస్ టైలర్”…
తనికెళ్ళ భరణిని వెంటబెట్టుకుని స్టూడియోలకు చిత్ర నిర్మాణ కార్యాలయాలకు (ప్రొడక్షన్ ఆఫీసులకు) తీసుకెళ్లేవారు రాళ్లపల్లి. ఆయన భరణిని ప్రముఖులకు పరిచయం చేశారు. ఒకసారి ప్రసాద్ లాబ్స్ లో ఎడిటింగ్ జరుగుతుండగా భరణిని దర్శకులు వంశీ దగ్గరికి తీసుకెళ్లారు రాళ్లపల్లి. “గోపెమ్మ చేతిలో గోరుముద్ద” పాట చిత్రీకరణ పనులు చూస్తున్నారు వంశీ. ఆ సమయంలో భరణిని చూసి కామెడీ వ్రాస్తావా అని వంశీ అడిగారు. ఆయన భరణికి ఒక సన్నివేశం, సందర్భం చెప్పి ఒక వారం రోజులు సమయం తీసుకుని ఏడు పేపర్లు సంభాషణలు వ్రాసుకుని రమ్మన్నారు.
సరేనని ఇంటికెళ్లి సాయంత్రానికల్లా ఏడు సన్నివేశాలకు వ్రాసుకొని తీసుకెళ్ళారు భరణి. ఒక్కొక్క సన్నివేశం చెబుతుంటే వంశీ పగలబడి నవ్వారు. సన్నివేశాలు చెప్పడం పూర్తయ్యాక మీరే నా తరువాత సినిమాకు రచయిత అన్నారు వంశీ. అప్పటికే “ప్రేమించి పెళ్లాడు” చిత్రీకరణ పూర్తయిపోయింది. కానీ దానికి భరణితో ఏమైనా వ్రాయింయించాలని పట్టుబట్టి టైటిల్స్ ముందు ఒక కామెడీ ట్రాక్ వ్రాయించుకున్నారు. ఆ సినిమాకు రామోజీరావు రెండు వేల రూపాయలు పారితోషికం పంపించారు. విషాదం ఏంటంటే ఆ డబ్బులు రాళ్లపల్లి గారి సహాయకులు కొట్టేశారు.
ఆ తరువాత వంశీ “ఆలాపన” సినిమాకి మాటలు వ్రాశారు. అప్పట్లో వంశీ చెప్పిన “లేడీస్ టైలర్” మాటలు వ్రాశారు భరణి. ఆ సినిమాతో వంశీ, భరణిల కలయిక విజయవంతం అయ్యింది. ఇక వరుస పెట్టి “కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్”, “చెట్టు కింద ప్లీడర్”, “లింగ బాబు లవ్ స్టోరీ” ఇలా చాలా సినిమాలు చేశారు. లేడీస్ టైలర్ చిత్రీకరిస్తున్నప్పుడు భరణి నటీనటులకు సన్నివేశాలు వివరిస్తుండగా చూసి మీలో మంచి నటులు ఉన్నారండి అన్నారు వంశీ. నేను నాటకాలు వేసేవాడినండి అన్నారు భరణి. అవునా మరి నాకు ఎందుకు చెప్పలేదు అంటూ తన తరువాత సినిమా “కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” లో దొరబాబు పాత్ర ఇచ్చారు. ఆ చిత్రంతో “సీతతో అంత ఈజీ కాదు” అనే సంభాషణతో బాగా పాపులర్ అయిపోయారు భరణి..
రాం గోపాల్ వర్మ ” శివ”..
రాళ్లపల్లి ద్వారా దర్శకులు క్రాంతికుమార్ ని కలుసుకున్నారు భరణి. ఆయనతో గల సాన్నిహిత్యం, స్నేహం కారణంగా ఎన్నో వందల సాయంత్రాలు ఆయనను కలిసేవారు. ఆ సమయంలోనే “శారదాంబ” కథ పుట్టింది. ఆ సినిమాకు కథ, మాటలు వ్రాశారు భరణి. కథ, మాటలు వ్రాయడముతో బాటు అందులో నీచమైన “బేబీ రావు” అనే పాత్రను చేశారు. దాంతో పాటుగా “సీతారామయ్యగారి మనవరాలు”, “9 నెలలు” సినిమాలలో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు ఇచ్చారు క్రాంతికుమార్. రావుగారిల్లు సినిమా చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో శివ నాగేశ్వరరావు ద్వారా రాంగోపాల్ వర్మ పరిచయమయ్యారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో భరణికి ఒక సినిమా కథ చెప్పారు.
అనేక సినిమాలకు వ్రాసిన ప్రభావంతో భరణి హాస్యభరిత స్క్రిప్ట్ వ్రాసుకొచ్చారు. దాంతో షాక్ అవ్వడం వర్మ వంతయ్యింది. ఇదేంటి హాస్యం సినిమా చేశారు. మనది సీరియస్ సినిమా, ఒక్క హాస్య సన్నివేశం కూడా ఉండడానికి వీల్లేదు అన్నాడు. రాం గోపాల్ వర్మ అడిగినట్టుగానే సీరియస్ స్క్రిప్టు వ్రాశారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా పేరు “శివ”. అందులో నానాజీ పాత్రకి భరణి కంటే ముందు వేరే ఎవరినో అనుకున్నారు. కానీ అతను కాల్ షీట్లు సర్దలేకపోయాడు. దాంతో అప్పటికప్పుడు ఆ వేషం భరణితో వేయించారు. అదొక తెలంగాణ ప్రాంతపు యాదవ యువకుడి వేషం. ఇక్కడే పుట్టి పెరిగిన భరణికి ఇక్కడి సంస్కృతి బాగా తెలుసు. కావున ఆ పాత్రలో నటించి, జీవించేశారు.
నట ప్రస్థానానికి దోహదం చేసిన “ఆమె”…
భరణి మద్రాసులో ఉంటున్నప్పుడు రాఘవేంద్రరావు తో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమాలలో భరణి నటించకపోయినా రోజూ ఆయన ఇంటికి వెళ్తుండేవారు. ఇంతలో భరణి చేసిన “శివ” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దాంతో రావు గోపాలరావు గైర్హాజరుతో “జగదేకవీరుడు అతిలోకసుందరి” లో ఆ పాత్రను భరణితో వేయించారు. రావు గోపాల రావుకు ఒంట్లో బాగోకపోతే ఆ పాత్రను రెండు భాగాలు చేసి పోరాట సన్నివేశాల కోసం రామిరెడ్డిని, హాస్య సన్నివేశాల కోసం భరణిని తీసుకున్నారు. అప్పటినుండి రాఘవేంద్రరావు తీసిన ప్రతీ సినిమాలో భరణి పాత్ర ఉండేలా చూసుకున్నారు. రాఘవేంద్ర రావు ఒక్క సినిమాకి కూడా భరణి స్క్రిప్టు వ్రాయలేదు. చాలాసార్లు వ్రాయమని బయనా డబ్బులు కూడా ఇచ్చారు. కానీ ఆయనకు కుదరలేదు. రాఘవేంద్ర రావుకు భరణి సాహిత్యం అన్నా, ఆయన వ్రాసిన శివ స్తుతులు అన్నా కూడా మిక్కిలి ఇష్టం.
ప్రతీ సంవత్సరం 31 డిసెంబరు నాడు “సరస వినోదిని” పేరుతో రాఘవేంద్రరావు గారి కార్యాలయంలో ఒక సాహిత్యం కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. దానికి భరణి హాజరవుతూ ఉండేవారు. ఇ.వి.వి మొదటి సినిమా “చెవిలో పువ్వు” లో సంభాషణలు భరణి వ్రాశారు. వ్రాయడమే కాదు అందులో భగవాన్ అనే “పరమ శాడిస్ట్” వేషం వేశారు. ఆ సినిమా విడుదల అయ్యాక ఒకసారి రైలులో ఎక్కడికో వెళ్తూ నెల్లూరు స్టేషన్ లో దిగినప్పుడు అక్కడ ఇడ్లీలు అమ్ముకునే ఒకతను భరణిని బండ బూతులు తిట్టాడు. అంత ప్రభావం చూపిన సినిమా అది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా “ఆమె”. ఈ చిత్రంలో “మరదలు మీద కన్నేసిన దుర్మార్గుడు అయిన బావ” పాత్రలో నటించారు భరణి. నటుడుగా ఆయన ప్రస్థానానికి ఏంతో దోహదం చేసింది ఆ వేషం. ఇవివి స్క్రిప్ట్ ని ఆపారంగా గౌరవిస్తారు. అది ఆయన గొప్పతనం. టైటిల్స్ పడిన దగ్గరి నుండి శుభం కార్డు పడేవరకు ప్రతీ సినిమాలో కూడా ఏదో ఒక కొత్తదనం కోసం ఈవివి తాపత్రయపడుతుంటారు.
“సముద్రం” సినిమా కు “నంది”…
తనికెళ్ళ భరణి పెన్ను మడిచి జేబులో పెట్టడానికి కారణమైన వ్యక్తి యస్.వి. కృష్ణారెడ్డి. యమలీల లో ఆయన ఇచ్చిన “తోటరాముడు” పాత్ర భరణిని నటుడిగా ఎంత బిజీ చేసిందంటే ఆ సినిమా విడుదల అయిన ఏడాదిలో ఆయన సుమారు 27 సినిమాలలో నటించారు. యమలీల సినిమాలో “చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ” లాంటి సంభాషణలు భరణినే వ్రాశారు అని చాలామంది అనుకున్నారు. కానీ నేను ఒక్క అక్షరం ముక్క కూడా వ్రాయలేదు. ఆ ఘనత అంతా రచయిత దివాకర్ బాబు కే చెందుతుంది. ఆ సినిమా తరువాత “మావిచిగురు”, “వినోదం”, “ఘటోత్కచుడు” ఇలా ఎన్నో సినిమాల్లో భరణికి మంచి పాత్రలు ఇచ్చారు కృష్ణారెడ్డి. ఇకపోతే “సముద్రం” సినిమాలో “చేపల కృష్ణ” పాత్ర నువ్వే వెయ్యాలని అంటూ భరణికి ఒకరోజు ఫోన్ చేశారు ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ. ఆయన రాం గోపాల్ వర్మ దగ్గర “శివ” సినిమా చేస్తున్నప్పుడే భరణికి పరిచయం. అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. “సముద్రం” సినిమాలో భరణి ధరించిన చేపల కృష్ణ పాత్రకు తొలిసారి నంది పురస్కారం అందుకున్నారు భరణి.
ఒక్క రూపాయి ఇవ్వు చాలు…
శివ సినిమా చేసేటప్పుడే దర్శకులు తేజతో కూడా భరణికి పరిచయం ఏర్పడింది. ఆ సినిమాకి తేజకు సహాయ ఛాయాగ్రాహకులు అయిన ఉత్తేజ్ భరణికి ఫోన్ చేసి అన్నా తేజ మీకు ఒక కథ చెబుతామని అనుకుంటున్నారు. అందులో మీకు ఒక పాత్ర ఉంది మీరు డబ్బులు ఎక్కువ అడుగుతారేమోనని సంశయిస్తున్నాడు అన్నారు. దానికి బదులిస్తూ భరణి “సరే అతని నెంబర్ ఇవ్వు అని భరణి తేజకు ఫోన్ చేసి కథ చెప్పమన్నారు. తేజ చెప్పారు. అప్పుడు నీ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా నేను చేస్తున్నాను. సినిమా విడుదలై 100 రోజులు ఆడిన తరువాత నాకు నీవు ఒక్క రూపాయలు ఇవ్వు చాలు అన్నారు భరణి. అదే ఉషాకిరణ్ మూవీస్ వారి “చిత్రం”.
ఆ తరువాత తేజ తన అన్ని సినిమాలలో భరణికి చక్కటి పాత్రలు ఇచ్చారు తేజ. ఆయన తీసిన “నువ్వు నేను” సినిమాలో భరణి చేసిన పాత్రకు మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమా తరువాత వేరే సినిమా చిత్రీకరణకు విశాఖపట్నం కారులో వెళుతున్నప్పుడు ఊరంతా “నువ్వు నేను” సినిమా 100 రోజుల పోస్టర్లే పోస్టర్లు. ఆ పోస్టర్లలో భరణి ఒక్కరే ఉన్నారు. సాధారణంగా నాయిక, నాయకుల పోస్టర్లు వేస్తుంటారు. ఇట్టి విషయాన్ని వాకబు చేయడానికి వెంటనే దర్శకులు తేజకి ఫోన్ చేసి అడిగారు భరణి. దానికి సమాధానంగా “మీరే సార్ మాకు హీరో అన్నారు తేజ. ఆ క్షణంలో తన అభిమానానికి భరణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పోస్టర్ ని ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టుకున్నాను భరణి.
లఘు చిత్రాలతో..
“ఇంత సంపాదించితేనేమీ తనియరాదు” అని చిన్నయసూరి చెప్పినట్లు తనికెళ్ళ భరణి నటుడిగా మంచి సంపాదన, జీవితానికి స్థిరత్వం, కీర్తి ప్రతిష్టలు లాంటివి చేకూరినా కూడా భరణి తనలోని కవిని, రచయితని, తాత్వికున్ని, ఆధ్యాత్మికున్ని, నిర్మాతని, దర్శకుని ఇలా అందరినీ సంతృప్తిపరిచే బాధ్యతను స్వీకరించారు. ఆయన కవి అని బోర్డు పెట్టుకోవాలని ఆశను అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఆయన బోర్డు పెట్టుకోలేకపోయినా కూడా తనలోని ఆశను పరికిణీ కుట్టించారు.
“ఎందరో మహానుభావులు”, “ఆటగదరా శివ”, “శృంగార గంగావతారణం”, “కన్నప్ప కథ”, “శభాష్ రా శంకర”, “శివచిలకలు”, “నక్షత్ర దర్శనం” లాంటి కృతులతో సాహితీ క్షేత్రంలో నిత్య కృషీవలుడిగా కొనసాగుతున్నారు. తనలోని బావుకతను ప్రతిబింబించేందుకు లఘు చిత్రాలను మాధ్యమంగా ఎంచుకొన్నారు. “బ్లూ క్రాస్”, “సిరా”, “కీ”, “లాస్ట్ ఫార్మర్” లాంటి చిత్రాలతో ఖ్యాతికెక్కారు. బహుమతులు అందుకున్నారు. తన పాత్రలకు పరిపూర్ణమైన న్యాయం చేస్తున్న భరణికి పరమశివుడుతో అపరిమితమైన ఆత్మీయ బాంధవ్యము ఉంది. ఆ నీలకంఠుడిని తన గుండెగుడిలో ఆవాహన చేసుకుని తన అంతరంగ తాత్విక గంగాతరంగాలతో అనునిత్యం అభిషేకిస్తున్న తనికెళ్ల దశ భరణిలో ఓ అలౌకిక ఆనందం అభివ్యక్తమవుతుంది.