
తెలుగు సినిమా టాకీ యుగం తొలి నాళ్ళలో సినిమాలలో నటించాలంటే పాట తప్పనిసరిగా వచ్చి ఉండాలనే నిబంధన ఉండేది. అందువలన తొలి రోజులలో నేపథ్య గాయకుల అవసరం ఉండేది కాదు. రంగస్థలంపై పేరెన్నిక కలిగిన నటీనటులే తొలితరం సినీ తారలు కావడంతో ఎవ్వరి పాటలు, ఎవ్వరి పద్యాలు వాళ్లే పాడుకునేవారు. కార్యక్రమంలో చిత్రపరిశ్రమలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా నేపథ్య గానం కూడా ఒక శాఖగా అవతరించింది. అలా అవతరించి తారలకు నేపథ్య గాయనీ, గాయకులు తమ గొంతును అరువిచ్చే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియకు ఆ ద్యుడు యం.యస్ రామారావు (మోపర్తి సీతా రామారావు). తొలి నేపథ్య గాయకుడిగా ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైంది. ఇరవై ఏళ్ల పాటు చిత్ర రంగంలో గాయకుడిగా కొనసాగి ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. తన జీవితంలో తొలి భాగాన్ని సినిమా పాటలకు, మలి భాగాన్ని ఆధ్యాత్మిక గీతాలకు అంకితం చేశారు రామారావు.
చిత్రశ్రమకు ఎప్పటికప్పుడు కొత్త ముఖాలను, కొత్త గొంతులను పరిచయం చేస్తుండే వాహినీ వారు “దేవత” చిత్రంలో కాబోలు యం.యస్ రామారావు చేత ఒక నేపథ్య గీతం పాడించారు. యం సీతారామారావు ఆనాడు ప్రసిద్ధి. ఆ తరువాత సి.హెచ్ నారాయణరావు ధరించే నాయక పాత్రల పాటలకు తన గొంతు అరువిస్తూ యం.యస్ రామారావు పేరు పడ్డాడు. “తాసిల్దార్” చిత్రంలో ఈ నారాయణరావు పాటలకు గొంతును అరువియ్యడమే ఆ చిత్రంలో కాకుండా ఆ చిత్రంలో నేపథ్య గీతంగా పాడిన (నండూరు సుబ్బారావు) ఎంకి పాట “ఈ రేయి నన్నొలనేరవా రాజా యెన్నెలల సొగసంతా” సర్వజతీయమైన ఆదరణ ఆదరణ లభించింది. దాంతో పాటు ఆ పాట తరువాత గ్రామ్ ఫోన్ రికార్డులలో కూడా వచ్చింది.
ఈ పాట విన్న కొందరు సంగీత ప్రియులు రామారావు గొంతులో ఎంకి పాటలకు రంగురంగుల వన్నెలు విరుస్తాయి అనే భావాల్లో అన్నారు. అంత పొగడ్త పొందిన తరువాత ఆ పాటలోని రామారావు గారిని గురించి ఏ విమర్శ చేయడానికి పూనుకున్నా సరసంగా కనపడకపోవచ్చు. కానీ శృతిలో స్థిరత్వము, స్థాయిలో అసాంకర్యము పాటించినంతవరకు అతని పాటలను ఎవ్వరూ వేలెత్తి విమర్శించలేరు. రామారావు గానం పురుష సహజమైన గంభీరనాదం, కొంత నాసా మాధుర్యాన్ని పూత పూసుకుని శ్రవణ ప్రేయంగా వినపడుతుంటుంది. అతడు తన నాద సౌష్ఠవాన్ని, అతి కోమలత్వం నుంచి బహువిధ గంభీరతుల వరకు మార్చి మార్చి పలికించగల దిట్ట. తొలిచిత్రంలో పాటలు అతడికి గాయక ప్రపంచంలో ఒక స్థానాన్ని మాత్రమే ఇచ్చాయి. విమర్శకుల దృష్టిలో కూడా మంచి పేరు సంపాదించనారంభించింది.
గోపీచంద్ “లక్ష్మమ్మ” చిత్రంలో నారాయణరావు పాటలు పాడడంతోనే. “ఊయల ఊపనాసఖీ” అని కృష్ణవేణి తో పాడిన యుగళగీతం, “ఇటో అటో ఎటు పోవుటో” అని జీవిత మార్గము చీలు రెండు మార్గంలో విడిచిపోయే సంధి సంఘటనలో పాడిన గేయం చాలా హృదయ విదారకంగా ఉంటుంది. సంగీత రచన ఘంటసాలది. గాత్రగాంభీర్యం, కోమలత, రసావేశానికి అనుగుణంగా ఇంతగా మార్చి ఉపయోగించేవారు లేడేమో అనిపిస్తుంది. ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి మొదటి రాత్రి చిత్రంలో “జీవితము దోషపూతము” అనే గేయం అక్షరాల దేవదాస్ హిందీ చిత్రంలో సైగల్ పాడిన “దుఃఖ్ కే” అనే గేయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కృష్ణవేణి హీరోయిన్ నారాయణరావు హీరోగా వచ్చిన గోపీచంద్ మరొక చిత్రం “పేరంటాలు” లో తానొక్కడు పాడిన “ఇక లేవ ఇక లేవ నా రాణి”, కృష్ణవేణి చేతిలో పాడిన యుగళగీతం మనమిద్దరమే అనే దానిలో రామారావు గానము కృష్ణవేణి గానం కూడా సుస్పష్టం..
జీవిత విశేషాలు…
జన్మ నామం : మోపర్తి సీతారామారావు
ఇతర పేర్లు : ఎమ్మెస్ రామారావు
జననం : 03 జూలై 1921
స్వస్థలం : మోపర్రు, అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
వృత్తి : నేపథ్య గాయకుడు
తండ్రి : మోపర్తి రంగయ్య
తల్లి : మంగమ్మ
జీవిత భాగస్వామి : లక్ష్మీ సామ్రాజ్యం
పిల్లలు : వెంకట సరోజిని (కుమార్తె), బాబూరావు, నాగేశ్వరరావు (కుమారులు)
మరణం : 20 ఏప్రిల్ 1992, హైదరాబాదు..
నేపథ్యం..
మోపర్తి సీతారామారావు 03 జులై 1921 నాడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు కూడా ఉంది. అందువలన సుందర దాసు అని కూడా పిలుస్తుంటారు. ఈయన తండ్రి మోపర్తి రంగయ్య, తల్లి మోపర్తి మంగమ్మ. సీతారామారావు తల్లిదండ్రులు రామభక్తులు కావడం వలన అనునిత్యం ఇంట్లో భజనలు, సంకీర్తనలు, అర్చనలు జరుగుతూండేవి. దాంతో సహజంగానే చిన్నతనం నుంచే రామారావుకి సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆయన గుంటూరు లోని హిందూ కళాశాలలో చదువుకునే రోజులలో (1941) అంతర కళాశాల లలిత సంగీత పోటీలు జరిగాయి. ఆ పోటీలలో పాల్గొన్న రామారావుకి ప్రథమ బహుమతి లభించింది.
ఆ అంతర కళాశాల పోటీలకు జడ్జిగా వ్యవహరించిన “అడవి బాపిరాజు” వ్యక్తిగతంగా సీతారామారావుని అభినందించి తనను సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఆ రోజులలో బహుళ ప్రచారంలో ఉన్న నేపథ్య గాయకుడు కుందన్ లాల్ సైగల్ పాటలను పాడేవారు రామారావు. ఆయన కంఠస్వరం కూడా కుందన్ లాల్ సైగల్ స్వరాన్ని పోలి ఉంటుందని మిత్రులందరూ తనను ప్రోత్సహించేవారు. అందుకే సీతారామారావు మొదటి హిందీ గాయకుడు కావాలని కోరుతూ కళాశాల చదువుకుంటున్న రోజులలో బొంబాయికి వెళ్లి దర్శక, నిర్మాత శాంతారాం ని కలిశారు. ఆ సందర్భంలో రామారావు పాడిన పాట బాగుంది. కానీ హిందీ బాగా నేర్చుకోవాలని ఆయన చెప్పడంతో చేసేదిలేక నిరాశతో వెనక్కి వచ్చేశారు.
తొలి పాట…
హిందీ చిత్ర పరిశ్రమలో గాయకుడిగా స్థిరపడదామన్న ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకుడిగా స్థిర పడాలని ఆశతో ఆనాడు మద్రాసుకు పయనమయ్యారు. సముద్రాల రాఘవాచార్య తో రామారావుకు ఉన్న పరిచయం కారణంగా రాఘవాచార్యను కలిసి తన మనసులో మాట చెప్పుకున్నారు రామారావు. సరిగ్గా అదే సమయానికి రాఘవాచార్య ఒక ప్రైవేట్ ఆల్బమ్ రూపొందిస్తుండడంతో తాను వ్రాసిన రెండు పాటలకు (“కూలీలం”, “వల్లదంటే కోపమా”) రామారావుతో పాడించారు సముద్రాల.
ఆ ఆల్బమ్ కు సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకులు. ఆ తరువాత సముద్రాల రాఘవాచార్య సిఫారసు తోనే “దేవత” చిత్రంలో “ఈ వసంతం నిత్యము కాదు పూవు దొన్నెలో తీయ తేనియ లేదు” అనే పాటను రామారావు పాడారు. ఈ పాటను సముద్రాల రాఘవాచార్య వ్రాశారు. ఆ పాటకు బాణీలను చిత్తూరు వి.నాగయ్య సమకూర్చారు. అయితే ఈ పాట రికార్డుగా రావడం గానీ, టైటిల్స్ లో రామారావు పేరు వేయడం కాని జరగలేదు అని సినీ సంగీత విశ్లేషకులు వీ.ఎ.కే.రంగారావు చెప్పారు.
సీతారామారావు పేరు గాయకుడిగా తెరపై కనిపించిన సినిమా దర్శక, నిర్మాత వై.వి.రావు తెరకెక్కించిన “తహసిల్దార్” చిత్రంలో “ఈ రేయి నన్నొలనేరవా రాజా యెన్నెలల సొగసంతా” అనే యెంకి పాటలో తాను పడవ నడిపే వ్యక్తిగా నటిస్తూ పాడారు. రామారావు ఈ పాట పాడే ముందు దర్శక నిర్మాత వై.వి.రావు ఆదేశంపై ఏలూరులో ఉంటున్న రచయిత నండూరి సుబ్బారావు దగ్గరికి వెళ్లి ఆయన ఎంకి పాటలు ఎలా పాడతారో తెలుసుకున్నారు. ఆ తరువాత సినిమా పరంగా కొంత సంస్కరించి పాడారు. ఆ పాట రామారావుకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
పేరు తెచ్చిన పాటలు…
నటులు, నిర్మాత, దర్శకులు కోవెలమూడి సూర్యప్రకాశరావు గాయకులు సీతారామారావును ప్రోత్సహించిన వారిలో ముందున్నారు. ఆయన నిర్మించిన “ద్రోహి” (1948) చిత్రంలో జి.వరలక్ష్మితో కలిసి పాడిన “మా ప్రేమయే కదా సదా విలాసి” పాట రామారావుకి మంచి పేరు తెచ్చింది. అలాగే ఆచార్య ఆత్రేయ వ్రాసిన తొలి పాట “దీక్ష” (1951) సినిమాలో “పోరా బాబు పో పోయి చూడు ఈ లోకం పోకడ పో” కూడా యం.యస్. రామారావు పాడారు. ఈ సినిమాకు పెండ్యాల సంగీత దర్శకులు. ఇదే పాటను తమిళంలో కూడా పాడిన యం.యస్. రామారావు తమిళనాట కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మొదటి రాత్రి (1950) సినిమాలో కూడా ఎమ్మెస్ రామారావుతో పాడించారు కోవెలమూడి సూర్యప్రకాశరావు. అలాగే వై.వి.రావు దర్శకత్వంలో రూపొందించిన “మానవతి” (1952) చిత్రంలో బాల సరస్వతి తో కలిసి పాడిన “ఓ మలయ పవనమా నిలు నిలు నిలుమా”, గృహప్రవేశం (1948) లో పాడిన నేపథ్య గీతం “హాలహలమెగయునో మధురామృతమె కురియునో” పాట ఆయనకు మరింత పేరును తీసుకువచ్చాయి.
సంగీత దర్శకుడిగా “పల్లెపడుచు”…
సీతారామారావు తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలలో కూడా పాడారు. వై.వి.రావు హిందీలో నిర్మించిన రామదాసు (1948), జగన్నాథ్ పండిట్ (1950) చిత్రాలలో పాడారు. వై.వి.రావు నిర్మించిన హిందీ చిత్రం “మంజరి” నాలుగు రీళ్లు చిత్రీకరించిన తరువాత సినిమా ఆగిపోయింది. ఆ సినిమాలో కూడా యం.యస్. రామారావు పాడిన పాటలు ఉన్నాయి. కన్నడంలో “నాగార్జున” చిత్రంలో పాడారు. తెలుగులో “పాండురంగ మహత్యం” (1957) లో ఒక పాత్రలో నటించడంతో పాటు “దారి కానని సంసారి” గీతాన్ని కూడా పాడారు యం.యస్ రామారావు. సీతారామ కళ్యాణం (1960) సినిమాలో లంకాపురాన్ని వర్ణించే “షష్టి ర్యోజన విస్తీర్ణం శతయోజన మున్నత” అనే పద్యం కూడా వీరే పాడారు.
అంతకుముందు అగ్నిపరీక్ష (1951) చిత్రంలో ఒక పాత్ర ధరించి “సత్యరూపము దేవుడేనమ్మ” అనే పాట పాడారు. ఆ చిత్రంలోని “బీదలము” పాట కూడా రామారావు వ్రాశారు. ఆ చిత్రానికి సహాయ దర్శకులుగా కూడా పని చేశారు. 1954 వ సంవత్సరంలో విడుదలైన “పల్లెపడుచు” చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమాల “ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు” అనే హాస్య గీతం కూడా రామారావు రాశారు. ఆ సినిమాలోని “నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో” అంటూ రామారావు పాడిన విరహగీతం బాగా పాపులర్ అయ్యింది. “నిరుపేదలు”, “నా ఇల్లు”, “సతీ అనసూయ”, “పిచ్చి పుల్లయ్య”, “రాజనందిని”, “జయసింహ”, “సతీ తులసి”, “పెంపుడు కొడుకు” తదితర చిత్రాలలో రామారావు పాడారు.
ప్రైవేటు గీతాలు…
అప్పట్లో ఒక హీరోకి ఒకే గాయకుడు పాడడం అనేది పద్ధతి సి.హెచ్. నారాయణరావు, యం.యస్.రామారావు తోనే మొదలైంది. అయితే కేవలం తనకు మాత్రమే పాటలను పాడాలని షరత్తుతో మిగిలిన హీరోలకి నారాయణరావు పాడనిచ్చేవారు కాదు. యం.యస్. రామారావు ఆ రోజులలో ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లతో సన్నిహితంగా మెలిగినప్పటికీ నారాయణరావు సింగర్ అనే ముద్ర ఉండటం వలన, వారిరువురూ తన సినిమాలకు పాడించుకోలేకపోయారు. హీరోగా నారాయణరావు వెనుకబడిన తరువాత మాత్రమే ఎన్.ఎ.టి. బ్యానర్ పై ఎన్టీఆర్ నిర్మించిన అన్ని చిత్రాలకు పాటలు పాడారు యం.యస్. రామారావు.
లలిత సంగీతాన్ని హెచ్.ఎం.వి సంస్థ ప్రోత్సహించిన రోజులలో యం.యస్ రామారావు ఎన్నో ప్రైవేట్ పాటలు పాడారు. ఆయనకు ముఖ్యంగా పేరు తెచ్చి పెట్టినవి ప్రైవేట్ గీతాలే. వాటిలలో “ఈ ప్రశాంత ఏకాంత సౌథంలో” అన్న తాజ్ మహల్ పాట ముఖ్యమైంది. ఈ పాటనే “నీరాజనం” చిత్రం కోసం నిర్మాత ఆర్.వి రమణమూర్తి తిరిగి పాడించారు. ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకులు. “ఓహో మహాత్మా నను బాపి పోతివా”, “పండిత జవహర్ లాల్ ఇదే మా జోహార్”, హంపి శిల్పాల మీద “ఈ శిథిలాలు పలుకు ఒక్కొక్క పలుకు” పాటను ఆ రోజులలో అందరూ పాడుకునేవారు. “తాజ్ మహాల్”, “నల్ల పిల్ల”, “ఓ చెలీ”, “హంపి హంపీ” గీతాలు యం.యస్ రామారావు రచనలే.
గాయకుడిగా వెనుకబాటుకు కారణం…
ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక కళాకారుడు హఠాత్తుగా తెరమరుగయ్యాడంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యంగా కారణం కనిపిస్తుంది. కానీ యం.యస్ రామారావు వెనుకబడటానికి ఆయన ప్రవర్తన కారణము కాదు. మరి కొన్ని వేరే ఉన్నాయి. ఆయన ఎల్లవేళలా పాడుతున్న హీరో నారాయణరావుకి అవకాశాలు సన్నగిల్లడం. ఎన్టీఆర్, ఏఎన్నార్ బిజీ కావడం. 1955 ప్రాంతాల్లో సినీ సంగీతం కొత్త మలుపులు తిరగడం, శాస్త్రీయ సంగీతంలో ధీటైన ఘంటసాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం. ఇత్యాది కారణాల వలన యం.యస్ రామారావు వెనుకబడ్డారు. అవకాశాలు సన్నగిల్లడంతో ఇక మద్రాసు లో ఉండటం కష్టమని అనిపించింది. 1963 వ సంవత్సరంలో వచ్చిన “చివరకు మిగిలేది” చిత్రంలో “చినికిన చినుకెల్ల మంచి ముత్యం కాదు” పాటను పాడేసి వట్టి చేతులతో భార్య పిల్లలతో రాజమండ్రి చేరుకున్నారు యం.యస్ రామారావు.
మరణం…
1963 లోనే భక్తి గీతాలకు శ్రీకారం చుట్టారు రామారావు. కొలంబియా సంస్థ రూపొందించిన “రమతే”, “రాధికాకృష్ణ” అష్టపదులను ఆయన పాడారు. తన్నీరు బుల్లయ్య అండదండలతో రాజమండ్రిలో భారతి గురుకులంలో ఉద్యోగంలో చేరారు యం.యస్ రామారావు. 12 యేండ్లు అక్కడే గడిపిన ఈ నేపథ్య గాయకులు ఆంజనేయుడి భక్తుడుగా మారి హనుమాన్ చాలీసాను తెలుగులో అనువదించారు. ఆ తరువాత వాల్మీకి రామాయణంలోని సుందరకాండము, బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింద కాండం లను గేయ రూపాన రచన చేశారు. యుద్ధ కాండం గేయ రచన జరుగుతుండగా 20 ఏప్రిల్ 1992 ఆయన గుండెపోటుతో కన్ను మూశారు. యం.యస్ రెండో కుమారుడు నాగేశ్వరరావు మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం కూతురు కుమారుడు, ఆయనకు మనవడు దర్శకులు పి.శ్రీనివాస్ తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని “సుందరకాండ” పారాయణం చేస్తున్నారు. అలాగే తాత పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవ ధార్మిక కార్యక్రమాల నిర్వహిస్తున్నారు.



