
అది 1934 వ సంవత్సరం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో “శ్రీకృష్ణ లీలలు” అనే నాటక ప్రదర్శన జరుగుతుంది. కంసుడి పాత్ర పోషించిన వేమూరు గగ్గయ్య తన గంభీర కంఠంతో సింహగర్జన చేస్తున్నారు. ఆ వేమూరి గగ్గయ్యకు ధీటుగా పద్యాలు పాడుతూ శ్రీకృష్ణుడి పాత్రలో ఉన్న నటుడిని చూసిన ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. వేమూరు గగ్గయ్యను ఎదిరించిన నటుడు ఇతడేనా అనుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు పాత్రధారి తాను కళ్యాణి రాగంలో పాడుతున్న పాటలకు ప్రేక్షకులు “వన్స్ మోర్ ల మీద వన్స్ మోర్” లు కొట్టారు. ఆ ఒక్కరోజు ప్రదర్శనతో తనివి తీరని ఆ ప్రేక్షకులు, ఆ నాటకాన్ని ఐదు రోజులు మళ్లీ మళ్లీ అడిగి మరీ వేయించుకున్నారు. ఆఖరి రోజైన అయిదవ నాడు “శ్రీకృష్ణ” పాత్రధారిని అంబారిపై (ఏనుగు పై) ఊరేగించి సన్మానం చేశారు. ఆ కళ్యాణి రాగంలో పాటలు పాడి ప్రత్యేకమైన నటుడిగాను, ప్రత్యేకమైన గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయనకు “మాస్టర్ కళ్యాణి” అని బిరుదు ఇచ్చారు. ఆ రోజు నుండి ఆయన అస్సలు పేరు ఏమిటో ఎవ్వరికీ తెలియకుండా, ఆయన మరణించేదాకా ఆయనను మాస్టర్ కళ్యాణి అని చాలామంది పిలువడం మొదలుపెట్టారు.
కళ్యాణి అంటే స్త్రీ పేరు కనుక చాలా మంది మాస్టర్ కళ్యాణి అంటే నటీమణి పేరు అనుకుంటారు. కానీ అలనాటి నాటకాలతో అనుబంధం ఉన్న వారందరికీ కూడా “మాస్టర్ కళ్యాణి” అంటే ఆ రోజులలో రంగస్థలం మీద సూపర్ స్టార్. మొట్టమొదటిసారి ఒక తెలుగువాడు పి.వి దాసు పూర్తిగా మద్రాసులోనే చిత్రీకరణ జరిపిన “సీతా కళ్యాణం” సినిమా 1934 లో విడుదలయ్యింది. వెండితెర మీద రామాయణంతో వచ్చిన రెండో టాకీ చిత్రం “సీతా కళ్యాణం”. మొట్టమొదటిగా రాముడి కథతో వచ్చిన టాకీ చిత్రం “పాదుక పట్టాభిషేకం” లో రాముడిగా యడవల్లి సూర్యనారాయణ అయితే, రెండో రామాయణం కథ “సీతా కళ్యాణం” లో రాముని పాత్రధారి మాస్టర్ కళ్యాణి. తెలుగు టాకీలలో రెండవ రాముడు “మాస్టర్ కళ్యాణి”. మొట్టమొదటి “సీతా కళ్యాణం” లోని రాముడు కూడా మాస్టర్ కళ్యాణి అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా సీతా కళ్యాణానికి తెలుగు సినిమా చరిత్రలో ఎంతైతే పేరున్నదో, అందులోని రాముని పాత్రధారి మాస్టర్ కళ్యాణికి కూడా అంతే ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి.
1974 ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రావులపల్లి అనే ఊరిలో పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మ పేరుపై ఒక సత్రం ఉండేది. ఆ ఊరు మీదిగా నడుచుకుంటూ వెళ్లే బాటసారులు ఆ సత్రంలో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేవారు. అలాగే నిలువ నీడలేని బిచ్చగాళ్లు కూడా అందులో తలదాచుకుంటూ ఉండేవారు. ఆ సత్రంలో భార్యాబిడ్డలతో పూట గడవని దిక్కుమాలిన స్థితిలో అనారోగ్యంతో అత్యంత దయనీయ స్థితిలో బ్రతుకుతున్న మాస్టర్ కళ్యాణి తన దుర్భరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ వాళ్ళు ఇచ్చే నెలకు 40 రూపాయల సహాయంతో తన జీవితాన్ని గడుపుతూ 1974లో మరణించారు. విషాదాంతమైన కళాకారుడి జీవిత గాథ. వందేళ్ళ క్రిందట రంగస్థలం నటీనటులలో చాలామంది పూర్తి కాలం నటన నమ్ముకున్న వారే. అంటే నటననే ప్రవృత్తిగా చేసుకున్న వాళ్ళు. అలా నటన ప్రవృత్తిగా చేసుకుంటున్న కళాకారులలో నటనలోనూ, జీవితంలోనూ ఉన్నంతగా, గౌరవప్రదంగా నిలిచిన వ్యక్తి మాస్టర్ కళ్యాణి.
జీవిత విశేషాలు…
జన్మ నామం : నముడూరి వెంకట్రావు
ఇతర పేర్లు : మాస్టర్ కళ్యాణి
జననం : 1914
స్వస్థలం : అమలాపురం తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
వృత్తి : రంగస్థలం నటులు
తండ్రి : పేరయ్య దీక్షితులు
తల్లి : సుబ్బమ్మ
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 1974, కాట్రావులపల్లి, తూర్పుగోదావరి..
నేపథ్యం…
మాస్టర్ కళ్యాణిగా ప్రసిద్ధిగాంచిన ఈ రంగస్థలం నటుని పేరు నముడూరు వెంకట్రావు. ఆయన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 1914 వ సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి పేరయ్య దీక్షితులు, తల్లి సుబ్బమ్మ. వీరిది సాధారణ కుటుంబం. వీరు పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉండడంతో వెంకట్రావు తల్లిదండ్రులు ఆయన చదువుపై పెద్దగా దృష్టి కేంద్రీకరించేవారు కాదు. వెంకట్రావు మాత్రం బడికి వెళ్లేవారు. ఆయనకు చిన్నప్పటినుంచి పాటలు పాడేవారు. అలా పాడడం తనకు అలవోకగా అలవాటయ్యింది. ఆయన గొంతులోని రాగాలు, భావాలు, ఆ రాగాలలో అవి ఇమిడిపోయే సౌలభ్యం తనకు మొదటినుంచి వచ్చింది.
హార్మోనియం వాయించడంలో దిట్ట అయిన కురుమద్దాలి రామచంద్రరావు శ్రీకృష్ణ హ్యాపీ క్లబ్ అనే నాటక సంస్థను ప్రారంభించి నాటకాల ప్రదర్శన చేసేవారు. ఆయన పద్య నాటకాలకు దర్శకత్వం చేస్తుండేవారు. బడిలో చదువుకుంటున్న నముడూరు వెంకట్రావుకు, కురుమద్దాలి రామచంద్రరావు పరిచయమయ్యారు. రామదాసు అనే నాటకాన్ని తయారుచేస్తున్న రామచంద్రరావు ఆ కుర్రాడి పాటలలోని గాత్ర మాధుర్యం గమనించి కురుమద్దాలి రామచంద్రరావు రామదాసు నాటకంలో రఘురాముడి పాత్రను నడుమూరు వెంకటరావుతో వేయించారు. ఆయన తన అద్భుతమైన నటనతో ఆ పాత్రలో జీవించారు. ఆ రఘురాముడి పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అక్కడి నుండి కురుమద్దాలి రామచంద్రరావు తానే స్వయంగా ఆ కుర్రాడికి పాటలు నేర్పించారు.
మాస్టర్ కళ్యాణి గా…
ప్రతీరోజు బడి పూర్తయ్యాక కురుమద్దాలి రామచంద్రరావు ఇంటికెళ్లి అక్కడ ఉన్న గ్రామ ఫోన్ లో బాలగంధర్వ, అబ్దుల్ కరీం ఖాన్, ఓంకారనాథ్ వంటి గాయకుల పాటలన్నీ వింటూ వాటిని కంఠస్థం చేసేవారు. నముడూరు వెంకట్రావు తన బాల్యంలో పెద్ద పెద్ద నటీనటులతో పోటీపడి వాళ్లను అధిగమించేటటువంటి గాన సామర్థ్యాన్ని సంపాదించారు. అలా నాటకాలు వేస్తూ ఉండగా కాకినాడలో ఒకనాడు ఆయన వేస్తున్న “శ్రీకృష్ణ లీలలు” నాటకం మెచ్చి ఆయనకు “మాస్టర్ కళ్యాణి” అనే బిరుదును ఇచ్చారు. అప్పటినుంచి ఆయన నమూడూరు వెంకట్రావుకు బదులుగా మాస్టర్ కళ్యాణిగా పిలువబడ్డారు.
ఆ రోజు నుండి ఆయన అసలు పేరు ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఆయన మరణించే వరకు కూడా మాస్టర్ కళ్యాణి గానే కొనసాగారు. మాస్టర్ కళ్యాణి ధరించిన కొన్ని పాత్రల గురించి ప్రస్తావించవలసి వస్తే ఆ రోజులలో “శ్రీ కృష్ణ తులాభారం అనే నాటకాన్ని రెండు విధాలుగా ప్రదర్శించేవారు. మొదటిరకం “శ్రీకృష్ణ తులాభారం” లో మాస్టర్ కళ్యాణి శ్రీకృష్ణుడి పాత్ర ధరిస్తే, కపిలవాయి రామనాథ శాస్త్రి నారదుడి పాత్ర పోషించేవారు. రెండవ రకం “శ్రీకృష్ణ తులాభారం” నాటకంలో సత్యభామగా స్థానం నరసింహారావు, కపిలవాయి రామనాథ శాస్త్రి శ్రీకృష్ణుడిగా పాత్ర పోషిస్తే మాస్టర్ కళ్యాణి నారదుడిగా నటించేవారు.
శ్రీకృష్ణుడు, నారదుడు అన్నీ తానై…
కపిలవాయి రామనాథ శాస్త్రి, స్థానం నరసింహారావు, మాస్టర్ కళ్యాణి ముగ్గురు కలయికలో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం నాటకమునకు దాదాపుగా ఒక సంవత్సరం ముందే కాంట్రాక్టులు నిశ్చయం అయిపోతుండేవి. నాటక రంగంలో మాస్టర్ కళ్యాణి సూపర్ స్టార్ అయినా కూడా సందర్భానుసారం ఆయన చిన్న చిన్న పల్లెటూర్లలో తాటాకు పందిళ్ల క్రింద నాటకాలు వేస్తుండేవారు, అలాగే పెద్ద పెద్ద పట్టణాలలో వైభవంగా వెలుగొందే ఆడిటోరియంలలో కూడా నాటకాలు వేస్తుండేవారు. ప్రేక్షకులు ఆయనకు జేజేలు పలికేవారు. ఆయన “వన్స్ మోర్” కొట్టించుకోని ప్రేక్షక సమూహాలు లేవు.
శ్రీకృష్ణుడు అంటే మాస్టర్ కళ్యాణి, నారదుడు అంటే మాస్టర్ కళ్యాణిగా ప్రేక్షకుల మనసుల్లో ముద్రించబడ్డారు. ఆనాటి కాంట్రాక్టుల నాటకరంగంలో మాస్టర్ కళ్యాణి ఆధిపత్యం కొనసాగిస్తూ ఎదురులేని, తిరుగులేని రారాజుగా వెలుగొందారు. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి తన “నటరత్నాలు” పుస్తకంలో మాస్టర్ కళ్యాణి గురించి వ్రాస్తూ “ఆయన గొంతెత్తి రాగం ఆలపిస్తే ఆ రాగం యొక్క గానం ఎప్పుడు ఆపేసేవారో ఎవ్వరికీ తెలిసేది కాదు. అది అమర గానం. ఏ ఒడిదుడుకులు, అలుపు సొలుపు లేకుండా గలగల పారే గంగా స్రవంతిలా జలజలా సాగిపోయేది” అని వ్రాసుకున్నారు. అలా ప్రేక్షకులను అలరిస్తూనే, అభిమానులను సంతృప్తి పరుస్తూనే కళ్యాణి రాగం ఆలపించడంలో మహోన్నత స్థానం అందుకున్న గంధర్వ గాయకులు మాస్టర్ కళ్యాణి.
సినీ రంగం…
మాస్టర్ కళ్యాణి అద్భుతంగా నాటకాలు వేస్తున్న రోజులలోనే 1932 ప్రాంతంలో తెలుగు టాకీ సినిమాలు ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభమైన కొత్తలోనే ఆయన “సీతా కల్యాణం” సినిమాలో “శ్రీరాముడు” పాత్ర పోషించారు. ఆ తరువాత రుక్మిణీ కల్యాణము (1937) సినిమా. ఇందులో ఈలపాట రఘురామయ్య శ్రీకృష్ణుడుగా, శాంతకుమారి రుక్మిణిగా, మాస్టర్ కళ్యాణి నారదుడిగా పాత్రలు పోషించారు. ఆ సినిమాలో మాస్టర్ కళ్యాణి అద్భుతమైన పాటలు పాడారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆయనకు సినిమాలలో అవకాశాలు ఎక్కువగా రాలేదు. దాంతో మళ్లీ వెనక్కి వెళ్లి నాటకాలలో నారదుడిగా, శ్రీకృష్ణుడిగా కొనసాగారు. ఆయన నాటక రంగంలో ఉన్న ప్రశస్థికి కొన్ని కారణాలుగా చెప్పాల్సి వస్తే “ఆంధ్ర గంధర్వ” అనే బిరుదు పొందిన జొన్నవిత్తుల శేషగిరిరావు మాస్టర్ కళ్యాణికి “ఆంధ్ర బాల గంధర్వ” అనే బిరుదు ఇచ్చారు. ఏలూరులో నివాసం ఉండే మోతే నారాయణరావు అనే జమీందారు 1940 సంవత్సరంలో మాస్టర్ కళ్యాణి యొక్క నైపుణ్యాన్ని తిలకించి “ఆనాటి నటులలోకెల్లా ప్రముఖమైన నటులు అని అభినందించడమే కాకుండా ఆయనకు సన్మానం చేసి ఏనుగు మీద ఊరేగించారు.
నలభై ఐదు సంవత్సరాలు నాటకాలలోనే..
కాలక్రమేణా ఆ రోజులలో కాంట్రాక్టు నాటకాలలో కొన్ని రకాల మార్పులు సంభవించాయి.నటీనటులను కాంట్రాక్టు పద్ధతిలో మాట్లాడుకునేవారు. ప్రముఖ పాత్రలకు మాత్రమే ఒకరిద్దరిని తీసుకొని, మిగతా పాత్రలను స్థానికులతోనే కానిచ్చేవారు. అలా జరుగుతుండడం వలన నటులకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. 1940 – 50 ప్రాంతాలు వచ్చేసరికి మాస్టర్ కళ్యాణికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అస్సలు విషయం ఏమిటంటే అప్పటివరకు ఆయన ఊరు ఏదో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడ నాటకం వేస్తే భార్య, బిడ్డలతో కలిసి అక్కడికి వేళ్లేవారు. ఏ ఊరిలో నాటకం వేస్తే అదే వాళ్ళ ఊరు అనుకుంటుండేవారు. నిజానికి స్థిరంగా ఏ ఊరిలో ఉంటారో తెలియదు.
అంతేకాకుండా కేవలం నాటకాన్ని నమ్ముకొని, తనకు వచ్చిన పారితోషికం మీద బ్రతుకుతూ స్థిరమైన ఉద్యోగం లేకుండా నలభై ఐదు సంవత్సరాలు నాటకాలలోనే కొనసాగారు. నాటకాలు వేసిన వాడిగా చివరకు మిగిల్చుకున్నది ఏమీ లేదు. ఇలా ఊరూరా తిరిగి నాటకాలు వేయడం అనేది నలభై అయిదు సంవత్సరాలుగా కొనసాగింది. మాస్టర్ కళ్యాణికి అరవై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి నాటకంలో అవకాశాలు తగ్గాయి. ఆయన ఎన్నో సంవత్సరాలు నాటకాలకే పరిమితమై తిరుగుతూ గడపడం వలన ఆయన ఆరోగ్యం చెడిపోయింది. చిట్టచివర రోజులలో కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలానికి చెందిన కాట్రావులపల్లి అనే ఊరిలో బత్సవాయి సుబ్బారావు, వెంగళరావు అనే రాజవంశీయులు మాస్టర్ కళ్యాణిని చేరదీసి యథాశక్తిని పోషిస్తూ వచ్చారు. కానీ వాళ్ళిద్దరు కూడా తొందరలోనే చనిపోయారు. దాంతో ఆయనను ఆదరించే దాతలు కరువయ్యి పానుగంటి లక్ష్మీ వెంకయమ్మ సత్రంలో ఆయన దుర్భరమైన జీవితం గడపాల్సి వచ్చింది.
మరణం…
మాస్టర్ కళ్యాణికి గర్వం అస్సలు ఉండేది కాదు. ఆయన నిరాడంబరుడు, ఉదారస్వభావం, త్యాగ గుణం గలవారు. అందువలన ఆయన సంపాదించుకున్నదంతా కూడా దానధర్మాలకు, కళా సేవలకు ఉపయోగించడం వలన తాను సంపాదన పరంగా అనాధగా మిగిలిపోయారు. పానుగంటి లక్ష్మీ వెంకయమ్మ సత్రంలోనే తన చిట్టచివరి రోజులలో సంగీత అకాడమీ వాళ్ళు ఇచ్చే నలభై రూపాయలతో జీవనం నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అంత దుర్భరమైన జీవితం గడిపిన మాస్టర్ కళ్యాణి తన అరవై సంవత్సరాల వయస్సులో అనగా 1974లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం ఆయన కుటుంబం ఏమైంది? వారు ఏవిధంగా జీవనం కొనసాగించారు? ఇలాంటి వివరాలు ఏమీ తెలియలేదు. నిజానికి కొంతమంది కళాకారుల జీవితాలు ఈవిధంగానే ఉంటాయి. వారు వెలుగొందినన్ని రోజులు ఆకాశంలో తారలలా ఉంటారు, చిట్టచివరి రోజులలో రాలిపోయిన తారలలాగా ఎవ్వరూ వారిని పట్టించుకోరు. అలా వారి జీవితాలు ముగిసిపోతూ ఉంటాయి. అలాంటి జీవితాలలో మాస్టర్ కళ్యాణి జీవితం ఒకటి.