CINEMATelugu Cinema

శకపురుషుడు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చలనచిత్రాలు, వాటి వివరాలు…

తెలుగు సినిమాకు మాటలు పుట్టిన 1932 నుండి శకపురుషుడు నిష్క్రమించిన 1996 వరకు గల 64 సంవత్సరాల వెండితెర చరిత్రలో 47 సంవత్సరాల తన సినీ జీవితాన్ని అనేక మైలురాళ్లతో స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న తెలుగుజాతి ముద్దుబిడ్డ నందమూరి తారకరామారావు. సామాన్యుడిగా మొదలైన ప్రస్థానం అసామాన్యునిగా ఎదిగి నిలిచిన  జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. 1947 లో డిగ్రీ పట్టా పుచ్చుకుని మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష వ్రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచి, మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగంలో చేరి సినిమాలలో చేరాలనే ఆశయంతో ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు ఎన్టీఆర్. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపికైనా సినిమా నిర్మాణం ఆలస్యమవడంతో “మనదేశం” సినిమాతో 1949 లో మొదటిసారి కెమెరా ముందు ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించంతో ప్రారంభమైన తన వెండితెర ఆరంగ్రేటం ఎన్నో రికార్డులకు, రివార్డులకు, మైలురాళ్లకు నాంది పలికింది. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న అనితరసాధ్యులు ఎన్టీఆర్.

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన నందమూరి తారకరామారావు తన 47 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రికాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలతో దేశంలోనే వంద చిత్రాలు పూర్తిచేసిన తొలి భారతీయుడు ఎన్టీఆర్. ఆ తరువాత 8 సంవత్సరాలలో 200 సినిమాలు పూర్తిచేసి రాష్ట్రంలో రెండు వందల సినిమాలు పూర్తిచేసిన తొలినటుడుగా ప్రసిద్ధికెక్కారు. తొలి మూడు వందల సినిమాల ఘనత కూడా వీరిదే కావడం విశేషం. తన తొలిచిత్రం “మనదేశం” తో మొదలుకొని “మేజర్ చంద్రకాంత్” వరకు 300 పైచిలుకు చిత్రాలలో నటించిన రామారావు 140 వందరోజుల చిత్రాలు, 30 రజతోత్సవ చిత్రాలలో భాగస్వామి కావడం అరుదైన విషయం.

ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు, ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు, ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు, ఆయనే భీముడు, ఆయనే బృహన్నల అన్నీ ఆయనే. తెరపై కనిపించేది ఎన్టీఆర్ కాదు, ఆయన పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం, సుయోధనుడి వాచకం రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం కేవలం ఎన్టీఆర్ మాత్రమే సాధ్యపడింది. అపూర్వాభినయంతో “లవకుశ” చిత్రం ద్వారా తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడుగా ఆయన నిలిచిపోయారు. దానికంటే ముందు “మాయాబజార్” సినిమాతో శ్రీకృష్ణుడిగా నీరాజనాలు అందుకున్నారు.

ఎన్టీఆర్ తెరపై గొప్పనటుడే కాదు,  తెరవెనుక మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వం చేసిన దార్శనికుడు కూడా. దర్శకుడిగా తొలిచిత్రంతోనే విజయఢంకా మ్రోగించి ఎంతోమంది కథానాయకులకు ఆదర్శంగా నిలిచారు. “సీతారామ కళ్యాణం” సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేసి, ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర అయిన రావణాసురుని పాత్రను పోషించి దర్శకునిగా తన ప్రతిభ ఏమిటో తొలి సినిమాతోనే ఆయన చాటిచెప్పారు. సంక్రాంతి కానుకగా 06 జనవరి 1961 నాడు దర్శకుడిగా తొలి విజయం నమోదు చేశారు. అయితే సొంత బేనర్ ఎన్.ఏ.టీ. పై తీసిన ఆ సినిమా పేర్లలో దర్శకుడి పేరు వేయకుండా సినిమాను విడుదల చేయడం ఎన్టీఆర్ కే చెల్లింది. 1977లో విడుదలైన “దానవీరశూర కర్ణ” చిత్రంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ ఇలా మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసి, మరో చరిత్ర సృష్టించారు.

పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో అవతార పురుషునిగా నిలిచిన ఎన్టీఆర్ తాను నటించిన జానపద, చారిత్రక చిత్రాల ద్వారా కూడా అమితంగా ఆకట్టుకున్నారు. టైటిల్ రోల్‌ను పోషిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన “శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర” సినిమా సహజంగానే ఒక చరిత్ర సృష్టించింది. 1981లోనే పూర్తయిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడి, ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత కొంతకాలానికి 1984లో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన సుమారు 17 చిత్రాలకు దర్శకత్వం వహించగా (16 తెలుగు చిత్రాలు, 01 తమిళ చిత్రం) అత్యధిక సినిమాలు విజయవంతం అయ్యాయి. నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన చిత్రాల వివరాలు ఒక సారి పరిశీలిద్దాం…

1.. సీతారామ కళ్యాణం (1961 సినిమా)..

నందమూరి తారకరామారావు మొట్టమొదటిసారిగా మెగాఫోన్ చేతబట్టి దర్శకత్వం వహించి, తెరకెక్కించిన మొదటి చిత్రం “సీతారామ కళ్యాణం”. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేషనల్ ఆర్ట్ థియేటర్ అధినేత నందమూరి త్రివిక్రమరావు నిర్మించారు. ఈ సినిమాలో రామారావు పోషించిన “రావణ” పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. భూకైలాస్ చిత్రం తరువాత సీతారామ కళ్యాణం చిత్రంలో రామారావు రావణ పాత్ర ధరించారు. హరినాథ్ శ్రీరాముడి పాత్ర ధరించగా, గీతాంజలి సీత పాత్రలో అలరించగా, నారద పాత్రను కాంతారావు ధరించారు. తన అభిమాన పాత్ర “రావణ” అని ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ చెప్పుకునేవారు. తెలుగు చిత్రగీతాల్లో “అజరామర” పాటగా చెప్పదగిన “శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి” పాట ఈ చిత్రంలోనిదే. 06 జనవరి 1961 నాడు సంక్రాంతి కానుక గా విడుదలైన పౌరాణిక చిత్రం సీతారామ కళ్యాణం చిత్రంతో దర్శకుడిగా తొలిచిత్రంతోనే అద్భుతమైన విజయం సాధించారు.

2.. గులేబకావళి కథ (1962)…

నేషనల్ ఆర్ట్ థియేటర్స్ బ్యానర్‌పై ఎన్. త్రివిక్రమరావు నిర్మాణంలో నందమూరి తారకరామారావు దర్శకత్వంలో తెరకెక్కించిన రెండవ చిత్రం గులేబకావళి కథ. “అరేబియన్ నైట్స్” నుండి తీసుకున్న కథ ఆధారంగా రూపొందించబడిన జానపద చిత్రం ఇది. సీతా రామ కళ్యాణం (1961) రామారావు దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. రాజు యొక్క అంధత్వాన్ని నయం చేయడానికి గులేబకావళి పువ్వు కోసం వెతకడానికి వెళ్లే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించారు. కథానాయకుడు విజయ్ పాత్రలో ఎన్టీ రామారావు, యుక్తిమతిగా జమున, బకావళిగా నాగరత్న, చంద్రసేనగా ముక్కామల, వక్రకేతునిగా రాజనాల కాళేశ్వరరావు, గుణవతిగా ఋష్యేంద్రమణి, రూపవతిగా ఛాయాదేవి నటించారు. 05 జనవరి 1962న విడుదలైన గులేబకావళి కథ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఈ చిత్రకథతో మూకీ చిత్రంగా (1924)లో ఒకసారి, హిందీలో రెండు సార్లు (1932, 1963), తమిళంలో రెండు సార్లు (1935, 1955), పంజాబీలో ఒకసారి (1939), తెలుగులో రెండు సార్లు (1938, 1962) లో నిర్మించారు.

3… శ్రీకృష్ణ పాండవీయం (1966)..

నందమూరి తారకరామారావు తెరకెక్కించిన మూడవ చిత్రం “శ్రీ కృష్ణ పాండవీయం”. కథను ఎన్టీఆర్ సమకూర్చగా రామకృష్ణ & ఎన్.ఎ.టి. కంబైన్స్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు మరియు దుర్యోధనుడు పాత్రలను ఎన్టీఆర్ పోషించారు. ఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు.

ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలలో ఇమిడి పోయారు. కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది. గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు. జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారాయణ పాత్రలలో జీవించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు.

సంక్రాంతి కానుకగా 13 జనవరి 1966 నాడు ఈ చిత్రం విడుదలయ్యింది. “పరిత్రాణీయా సాధునాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే” అని భగవద్గీతలో పలికిన శ్రీకృష్ణుడు ధర్మపథంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి, వారి అభ్యుదయానికి దోహద పడిన చిత్రకథ ఇది. భారత కథలో భాగవత కథ “రుక్మిణీ కల్యాణాన్ని” ఈ సినిమాలో జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. మయసభ సెట్టింగ్ చాలా బాగుంటుంది. పౌరాణిక పాత్ర పోషణలోనే కాదు దర్శకత్వంలో కూడా తన పట్టును నిరూపించుకున్నారు ఎన్.టి. రామారావు. పండిత పామరుల మెప్పును పొంది, సంస్ధకు కీర్తిని, కనకాన్ని సంపాదించిన చిత్రం.

4… వరకట్నం (1969)…

ఎన్టీఆర్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించిన సాంఘిక చిత్రం వరకట్నం (1969). ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణ కుమారి నాయకా, నాయికలుగా నటించిన చిత్రం ఇది. “వరకట్నం” దురాచారం  ప్రధానాంశంగా సాగిన ఈ చిత్రంలో  పల్లెటూరి మొండిపట్టుదలలు, అక్కడ మనుషుల మధ్య అనుబంధాలు, పట్టింపులు చిత్రితమయ్యాయి. రామారావు ఆహార్యం, పంచకట్టు అప్పటికి అధునాతనం. విలన్ గా నటించిన రాజనాల పై చక్కటి పాట “సైసై జోడెడ్ల బండి” పాట చిత్రీకరించడం విశేషం. ఈ సినిమాలో కళ ద్వారా కృష్ణాజిల్లా పరిసరప్రాంతాల సంప్రదాయాలు, ఇంటి అలంకరణ తదితర విషయాలు చూపబడ్డాయి. 16వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా 1968వ సంవత్సరంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారం అందుకుంది. 10 జనవరి 1969 నాడు విడుదలైన “వరకట్నం” చిత్రం కూడా విజయవంతమైన చిత్రంగా నిలిచిపోయింది.

5… తల్లా పెళ్ళామా… 1970

ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అయిదవ సినిమా “తల్లా? పెళ్ళామా?”. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు సమర్పిస్తూ, దర్శకత్వం వహిస్తూ నటించగా, ప్రధాన పాత్రల్లో ఆయనతో పాటుగా, చంద్రకళ, శాంతకుమారి, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు నటించిన నటించారు. కృష్ణుడిగా మాస్టర్ హరికృష్ణ (నందమూరి హరికృష్ణ) నటించారు. ఈ చిత్రానికి సంగీతం టీవీ రాజు స్వరపరిచారు. యన్.ఏ.టి మరియు రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లపై నందమూరి త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం హిందీలో “బిదాయి” (1974) గా మరియు తమిళంలో పిరియా విదై (1975) గా పునర్నిర్మించబడింది. అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిన “తెలుగు జాతి మనది” అనే పాటను సి. నారాయణ రెడ్డి వ్రాయగా, ఘంటసాల ఆలపించారు. 08 జనవరి 1970 నాడు విడుదలయిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

6… కన్నన్ కరుణై (1971)…

యన్.టి.రామారావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఏకైక తమిళ చిత్రం “కన్నన్ కరుణై”. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన “శ్రీకృష్ణ పాండవీయం” (1966) లో శ్రీకృష్ణునిగా, దుర్యోధనునిగా ద్విపాత్రాభినయ పాత్రలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఇదే చిత్రాన్ని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే తమిళంలోనూ నిర్మించారు. తొలుత తమిళ చిత్రానికి “రాజసూయం” అనే పేరును అనుకున్నారు. తరువాత “కన్నన్ కరుణై” పేరుతో తమిళ “శ్రీకృష్ణ పాండవీయం” చిత్రం రూపొందింది. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన యన్టీఆర్, తమిళంలో కేవలం శ్రీకృష్ణ పాత్రకే పరిమితమై దుర్యోధన పాత్రలో మనోహర్ ను నటింపచేశారు. తమిళ వారికి కూడా సుపరిచితమైన చిత్తూరు నాగయ్య, కే.ఆర్.విజయ, ఎస్.వరలక్ష్మి, నాగరత్న, గీతాంజలి, ఉదయ్ కుమార్, రాజనాలను వారిపాత్రల్లోనే నటింప చేశారు. మిగిలిన ఇతర పాత్రలలో తమిళనటులు టి.ఆర్. మహాలింగమ్, రామదాస్, ఓఏకే దేవర్ నటించారు. ఈ చిత్రానికి సంభాషణలు ఎ.కె.వేలన్ వ్రాశారు. 16 జూన్ 1971 నాడు విడుదలైన ఈ చిత్రం తమిళనాట కూడా విశేషాదరణ చూరగొంది.

7… తాతమ్మకల (1974)…

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఏడవ చిత్రం “తాతమ్మకల”. ఈ చిత్రం ఆనాటి పల్లెటూరి అమాయకత్వానికి పట్టణం పోకడలకి మధ్య గల తేడాను చూపిన చిత్రం ఇది. 14 ఏళ్ల వయస్సులో నందమూరి బాలకృష్ణ ముఖానికి రంగు వేసుకున్నారు. ఆయనకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను వ్రాసుకున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సోదరుడు హరికృష్ణ కూడా నటించారు. ఎన్టీఆర్ తాతగా, బానుమతి ఆయన భార్య తాతమ్మగా నటించారు. అప్పట్లో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో కొన్ని సంభాషణలు కూడా ఉంటాయి. భూసంస్కరణపై ప్రభుత్వ విధానాలను ఈ సినిమాలో ఎత్తిచూపారు. దీంతో ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం 30 ఆగస్టు 1974 నాడు విడుదలైంది.

“ఇద్దరు ముద్దు, ఆ పై వద్దు” అంటూ సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారానికి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. దీంతో ఈ సినిమా ప్రదర్శన నిలిపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సినిమా విడుదలై 50 రోజులైంది. దాంతో ఆ చిత్ర ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అందులో ఆయన “కుటుంబ నియంత్రణకు, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఈ సినిమా తీయలేదు. అంతా కష్టపడి పనిచేస్తే అలాంటి సంస్కరణలతో పనిలేదని చెప్పే ప్రయత్నం చేశాను” అని తెలిపారు. ఆ సినిమాను పరిశీలించిన కేంద్రం ప్రభుత్వం ఆ సినిమాను మళ్లీ విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని స్వల్ప మార్పులతో విడుదల చేశారు. మొదటి సారి ఈ చిత్రాన్ని తెలుపు నలుపు రంగులలో విడుదల చేయగా, రెండోసారి మాత్రం రంగులలో ఈ చిత్రం విడుదలచేశారు. అలా 08 జనవరి 1975 నాడు ఈ చిత్రం రెండోసారి విడులైంది. అలా బాలయ్య నటించిన మొదటి చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలిసారి రెండు సార్లు విడుదలైంది.

8… దానవీర శూర కర్ణ (1977)…

ఎన్టీఆర్ దర్శకత్వం చేసిన ఎనిమిదవ చిత్రం దానవీర శూర కర్ణ. ఇది ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రం. నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం ఇది. కేవలం 10 లక్షల రూపాయలతో నిర్మాణమైన ఈ సినిమా 14 జనవరి 1977 నాడు విడుదలై అప్పట్లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని 1994లో రెండవసారి విడుదల చేసినప్పుడు కూడా మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది. ఆనాటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో తీరికలేకుండా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో చలపతిరావు ఐదు పాత్రల్లో కనిపిస్తారు. అందులో మూడు పాత్రలు జరాసంద, అతిరధ, ఇంద్ర మిగతా రెండు అతిథి పాత్రలు. ఈ సినిమా నిడివి మొత్తం 4 గంటల 17 నిముషాలు. ఈ సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటారు. (రాజ్ కపూర్ హిందీ సినిమా “మేరా నామ్ జోకర్” మొదట 4 గంటల 24 నిముషాల నిడివి ఉంది. కానీ ఆ తరువాత అందులో 40 నిముషాలు తగ్గించారు. కనుక “దాన వీర శూర కర్ణ” సినిమా బహుశా భారతీయ పొడవైన చిత్రాలలో ఒకటి. 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన దానవీర శూర కర్ణ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అవ్వడం విశేషం.

9… చాణక్య చంద్రగుప్త (1977)…

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొమ్మిదవ చిత్రం “చాణక్య చంద్రగుప్త”. ఇది తెలుగు భాషా చారిత్రాత్మక నాటక చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు చాణక్యుడిగా నటించగా నందమూరి తారక రామారావు చంద్రగుప్తునిగా నటించాడు. ఈ చిత్రాన్ని రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు , ఎన్‌టి రామారావు లతో బాటు శివాజీ గణేశన్ , జయప్రద , మంజుల , కైకాల సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. “దాన వీర శూర కర్ణ” సినిమాలో శ్రీకృష్ణుని పాత్రను పోషించడానికి రామారావు అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించారు. కానీ ఈ ప్రతిపాదనను నాగేశ్వరరావు తిరస్కరించాడు. పైగా రామారావును ఆ పాత్రను స్వయంగా స్వీకరించమని ప్రేరేపించాడు. దాంతో ఆ సినిమా అనంతరం నాగేశ్వరరావు “చాణక్య చంద్రగుప్త” లో చాణక్య పాత్ర పోషించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. వాస్తవానికి, రామారావు చాణక్యుడిగా నటించాలని, అలాగే అతని కుమారుడు బాలకృష్ణను చంద్రగుప్తుడిగా పెట్టాలని అనుకున్నారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు సూచనతో చంద్రగుప్తుడి పాత్రలో రామారావు నటిస్తే మరియు చాణక్యుడిగా నాగేశ్వరరావు  నటించారు.

10… అక్బర్ సలీమ్ అనార్కలి (1978)…

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన పదవ చిత్రం “అక్బర్ సలీమ్ అనార్కలి”.  ఇది మొఘల్ యువరాజు సలీం (తరువాత జహంగీర్ అని పిలువబడింది) మరియు ఆస్థాన నర్తకి అనార్కలి మధ్య శృంగార పురాణం ఆధారంగా రూపొందించబడింది. ఎన్.టి.ఆర్ అక్బర్ గా, జోధాగా జమున నటించగా, బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలిగా నటించారు. హిందీ “మొగల్ ఎ అజమ్” ఈ సినిమాకి కొంత ఆధారం. ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది. ఈ చిత్రానికి సి. నారాయణ రెడ్డి పాటలు, సంభాషణలు వ్రాయగా సి.రామచంద్ర (హిందీ అనార్కలి సంగీత దర్శకులు) సంగీతంఅందించారు. మహమ్మద్ రఫీ నేపథ్యగానంతో (తారలెంతగా మెరిసేనో, సిపాయీ ఓ సిపాయీ, తానే మేలిముసుగు తీసి మొదలైనవి) అలరించారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్టీఆర్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం 09 మే 1979 నాడు విడుదలై పరాజయం పాలైంది.

11…  శ్రీరామ పట్టాభిషేకం (1978)… 

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన పదకొండవ చిత్రం “శ్రీరామ పట్టాభిషేకం”. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఎన్టీఆర్ స్వయంగా నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం 07 సెప్టెంబరు 1978 నాడు విడుదలై ఘన విజయం సాధించింది. చిత్ర దర్శకుడైన నందమూరి తారక రామారావు స్వయంగా రామునిగాను, రావణునిగాను ద్విపాత్రాభినయం చేశారు. ఇలా నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీయార్ కు ప్రేక్షకుల నుండి ఘనమైన  ఆదరణ లభించడం ఈ చిత్రం విశిష్టత. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో రామారావు, జమున , సంగీత తదితరులు నటించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ఆంధ్రపత్రికకు చెందిన వెంకట్రావు 11 సెప్టెంబరు 1978 నాటి తన సమీక్షలో రావణుడి పాత్ర చిత్రణను ప్రశంసించారు. రావణుడు రాముడి సహాయమని తెలిసినా లక్ష్మణుడికి సైనిక వ్యూహాలు నేర్పడం వంటి సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని వ్రాశారు.

12… శ్రీమద్విరాట పర్వము (1979)…

“శ్రీమద్విరాట పర్వము” సినిమాలో శ్రీకృష్ణుడు, ధుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడుగా అయిదు పాత్రలలో కనిపించిన నందమూరి తారక రామారావును చూసి ప్రేక్షకులు ఆనందించారు. ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో, సొంత నిర్మాణ సంస్థ “రామకృష్ణా సినీ స్టూడియోస్” బ్యానరులో నిర్మించిన “శ్రీమద్విరాట పర్వము” 1979 లో రూపు దిద్దుకున్న కళాఖండం. ఈచిత్రంలో నందమూరి తారక రామారావు, వాణీశ్రీ ,నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు. దాన వీర శూర కర్ణ (1977) అత్యద్భుత విజయం తరువాత ఎన్టీఆర్ అయిదు కీలక పాత్రలు పోషించిన సినిమా ఇది. పురాణ మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా రూపొందించబడిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని 28 మే 1979 నాడు విడుదల చేశారు.

13… శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (1979)…

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం సినిమా ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం ఎన్టీఆర్. ఆయన దర్శకత్వం వహించిన పదమూడవ సినిమా ఇది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అవతారం ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించగా, లక్ష్మీదేవిగా జయసుధ, పద్మావతిగా జయప్రద, నారదుడిగా బాలకృష్ణ నటించారు. ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.

14… చండశాసనుడు (1983)…

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన “చండ శాసనుడు” సినిమా ఎన్టీయార్ సినీ ఎంటర్‌ప్రైజెస్ నిర్మాణ సంస్థ పతాకంపై ఎన్టీఆర్ నిర్మించి, దర్శకత్వం వహించిన పద్నాలుగవ సినిమా “చండ శాసనుడు”. రామారావు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించిన యాక్షన్ సినిమా ఇది. దీనికి పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, శారద, సత్యనారాయణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయ్యింది. తమిళంలో “సరితిర నాయగన్” గా ఈ చిత్రాన్ని పునర్నిర్మించారు.

15… శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)..

ఆంధ్ర దేశంలో ప్రాచుర్యంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. తానే స్వయంగా నటించారు, దర్శకత్వం కూడా వహించారు. ఇందులో ఎన్టీఆర్ గౌతమ బుద్ధుడు, యోగి వేమన, రామానుజనులు, ఆదిశంకర, వీరబ్రహ్మం పాత్రలలో అలరించారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన కొద్దికాలానికే ఈ సినిమా భారీ అంచనాలతోను, కొన్ని వివాదాలతోను, రాజకీయ దుమారంతోను విడుదలైంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ 1980లో ప్రారంభమవ్వగా 1981 నాటికి పూర్తిచేశారు. అయితే ఈ సినిమా విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్‌ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి ఎన్టీఆర్‌ విజయం సాధించారు. ఈ చిత్రం 29 నవంబరు 1984 నాడు విడుదలై ఘనవిజయం సాధించింది.

ఎన్టీఆర్‌ కడపజిల్లా సిద్ధవటం లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లినప్పుడు, తెరమీది బొమ్మలు ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయి అని వీరబ్రహ్మం తన కాలజ్ఞానంలో చెప్పిన విషయం ఎన్టీఆర్ ను ఆకర్షించింది. భగవంతుడు బహుశ ఇలాగే ఉండునేమో అన్నట్టు ఎన్టీఆర్ బ్రహ్మం గారి పాత్రలో అలా జీవించారు. వీరబ్రహ్మం జీవించివుండగా ధరించిన చెక్క చెప్పులు తనకు అతికినట్లు సరిపోవడం ఎన్టీఆర్‌ను ఆశ్చర్యపరిచింది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాలో తెరమీద బొమ్మలు రాష్ట్రాలేలతాయి అన్న దానికి ఉదాహరణగా తాను గౌరవించే ఎం.జి.రామచంద్రన్‌ను చూపించారు. అందులో ఎన్టీఆర్‌ కూడా సీఎం అవుతారన్న అర్థం ఉందన్న వాదనను కొందరు నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ చెవినవేశారు. దీంతో ఆ సినిమాకు ఏడాదిపాటు మద్రాసులో ఉన్న సెన్సార్‌ బోర్డువారు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. చివరికి ఆ సినిమా విడుదలయ్యేనాటికి ఎన్టీఆర్‌ నిజంగానే సీఎంగా ఉన్నారు.

16… బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)…

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఛారిటీ ట్రస్ట్ వారు నిర్మించిన చిత్రం “బ్రహ్మర్షి విశ్వామిత్ర”. ఇది విశ్వామిత్ర చరిత్ర ఆధారంగా తెరకెక్కిన భారతీయ తెలుగు భాషా హిందూ పౌరాణిక చిత్రం ఇది. నందమూరి తారకరామారావు స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ రాజకీయాల నుండి కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత నటన నుండి ఏడు సంవత్సరాల విరామం తరువాత ఎన్టీఆర్ తిరిగి నటిస్తున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ మరియు మీనాక్షి శేషాద్రి నటించారు. రవీంద్ర జైన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన పదహారవ సినిమా. ఆయన స్వంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.ఏ.టి. పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 1991 నాటి తెలుగు చలనచిత్రం. పురాణాల్లోని విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని సమకాలీన సాంఘిక, రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రంగా ఈ సినిమాను రామారావు తీర్చిదిద్దారు.

17…  సామ్రాట్ అశోక్ (1992)…

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన అఖరు సినిమా “సామ్రాట్ అశోక”. 1992 లో వచ్చిన చారిత్రక చిత్రం ఎన్‌టి రామారావు తన రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించి దర్శకత్వం వహించారు. మౌర్య చక్రవర్తి అశోకుడి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అశోకుడు, చాణక్యుడుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా ఎడిటింగ్ కూడా ఎన్టీఆర్ చేశారు. ఇందులో నందమూరి తారకరామారావు, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చారు. ఇందులో మలయసింహగా మోహన్ బాబు, బౌద్ధ పరి వ్రాజకుడిగా గుమ్మడి, రాయని రాచమల్లుగా సత్యనారాయణ, బిందుసారుడిగా రంగనాథ్, జయమల్లుగా రామకృష్ణ, ఉజ్జయిని మహామంత్రిగా ధూళిపాళ, ప్రేగడగా రతన్ బాబు, కార్త్రునిగా భానుమతి రామకృష్ణ, కర్మణిగా బి. సరోజా దేవి ఈ చిత్రంలో నటించారు.

Show More
Back to top button