
సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా. జీవితంలోని కష్టాలను, మనసులోని బాధలను మరచిపోయేలా చేసేది కూడా సినిమానే. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈరోజులలోనే సినిమా నిర్మాణం ఇంత అష్టకష్టంగా ఉంటే, సినిమా ప్రారంభం అయిన తొలినాళ్ళలో సినిమా నిర్మాణం ఇంకెంత కష్టంగా ఉండేదో తెలుసుకుంటే తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. 1904లో మొట్టమొదటిసారి భారతదేశంలో “సినిమా చూపడం” జరిగింది. విదేశాలనుండి తెచ్చిన “The Life of Christ” (క్రీస్తు జీవితం) అనే చిత్రాన్ని ఒక చేతితో త్రిప్పే ప్రొజెక్టర్‌పై చూపించారు.
సరైన వేగంతో (ఎక్కువా, తక్కువా కాకుండా) రీలును త్రిప్పడం అనేది ప్రొజెక్టరు ఆపురేటరు నైపుణ్యంపై ఆధారపడింది. ఒకనాటి సాయంత్రం 1910 లో “లైఫ్ ఆఫ్ క్రీస్ట్” సినిమాను చూసిన ఫాల్కే భారతీయ తొలి మూకీ సినిమా “రాజా హరిచంద్ర” ను తెరకెక్కించి 03 మే 1913న విడుదల చేశారు. ఇది భారతీయ తొలి మూగ సినిమా. రాజా హరిశ్చంద్ర (1913) మొదలుకొని సేతు బంధన్ (1932) వరకు మూగ సినిమాలు తీస్తూనే వున్నారు.
ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మౌనాన్ని బద్దలుకొట్టి మన దేశంలో తొలి శబ్దచిత్రాన్ని నిర్మించిన వ్యక్తి అర్దేశిర్ ఇరానీ. ఆయన నిర్మించిన తొలి శబ్ద చిత్రం “ఆలం ఆరా” (1931). అప్పటి వరకు సినిమా అంటే కేవలం మాటలురాని బొమ్మలు కదలడమే. ఒక్కసారి భారతీయ సినిమా రంగంలో పెనుమార్పులు సంభవించాయి. “ఆలం ఆరా” (1931) చిత్రాన్ని ముంబాయి లోని మెజిస్టిక్ సినిమా థియేటర్ (చిత్ర ప్రదర్శన శాల) లో మార్చి 14 1931లో ప్రదర్శించారు. ఈ మొదటి భారతీయ టాకీ చిత్రం ఎంతగా విజయవంతం అయ్యిందంటే సినిమాకు వచ్చిన ప్రేక్షకులను అదుపులో పెట్టడానికి పోలీసుల సహాయము తీసుకోవలసి వచ్చింది.
అలా మొదలైన శబ్ద చిత్రాల నిర్మాణం దాదాపు అన్ని ప్రధాన భాషలకు విస్తరించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, బెంగాలీ, మరాఠి భాషలలో సినిమా నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉంది. అంటే ఏడాది కాలంలో దాదాపుగా అన్ని భాషలలో కలిపి 1000 కి పైగా శబ్దచిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం భారతదేశం లోనే కాక దక్షిణాసియా, రష్యా, అరబ్బు, ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
భారతీయ శబ్దచిత్రాల పితామహుడిగా చరిత్రకెక్కిన “ఖాన్ బహదూర్ అర్దేషీర్ ఇరానీ” అప్పటి బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఉన్న బొంబాయి ప్రెసిడెన్సీ లోని పూణేకు చెందినవారు. ఆయన ప్రారంభ కాలంలో నిశ్శబ్ద మరియు ధ్వని యుగాలలో రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, చలనచిత్ర పంపిణీదారు, చలనచిత్ర ప్రదర్శనకారుడు మరియు సినిమాటోగ్రాఫర్. ఆయన నిర్మించిన భారతదేశపు మొదటి శబ్ద చిత్రం “ఆలం ఆరా” కి దర్శకులు. తొలి శబ్ద చిత్రాన్ని నిర్మించడమే కాకుండా అతను భారతదేశపు మొదటి కలర్ ఫిల్మ్ “కిసాన్ కన్య” కు నిర్మాత. భారతీయ తొలి రంగుల చిత్రాన్ని ఆయనే నిర్మించారు.
1917లో చలనచిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ఇరానీ1920లో విడుదలైన తన మొదటి నిశ్శబ్ద చలనచిత్రం “నల దమయంతి” ని నిర్మించారు. ఆలం ఆరా (1932) ని నిర్మించడానికి ముందే మొదటి భారతీయ ఆంగ్ల చలనచిత్రం నూర్ జహాన్ (1931) ను కూడా నిర్మించి భారతదేశంలో తొలి ఆంగ్ల చిత్ర నిర్మాతగా చరిత్రకెక్కారు. హిందీ , తెలుగు , ఇంగ్లీష్ , జర్మన్ , ఇండోనేషియా , పర్షియన్ , ఉర్దూ మరియు తమిళ భాషలలో సినిమాలు తీయడంలో ప్రసిద్ధి చెందిన ఇరానీ నిశ్శబ్ద సినిమాకి తన గాత్రం అందించడం, నలుపు-తెలుపు చిత్రాలకు రంగులు అద్దడంలో మిక్కిలి సహకారాన్ని అందించేవారు. భారతదేశంలో చిత్రనిర్మాణానికి ఆయన ధైర్యమైన దృక్పథాన్ని అందించారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : ఖాన్ బహదూర్ అర్దేశీర్ ఇరానీ
ఇతర పేర్లు : అర్దేశీర్ ఇరానీ
జననం : 05 డిసెంబరు 1886
స్వస్థలం : పూణే , బొంబాయి ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
వృత్తి : చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, సాగర్ మూవీటోన్‌ని స్థాపించారు (1929)
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 14 అక్టోబర్ 1969, బొంబాయి , మహారాష్ట్ర , భారతదేశం
నేపథ్యం…
ఖాన్ బహదూర్ అర్దేశీర్ ఇరానీ 05 డిసెంబరు 1886 నాడు బ్రిటిష్ ఇండియా లోని బొంబాయి ప్రెసిడెన్సీ పరిధిలో గల పూణేలో జన్మించారు. వారిది ఒక పార్సీ కుటుంబం. వారి తల్లిదండ్రులు మతపరమైన హింస నుండి తప్పించుకోవడానికి 19వ శతాబ్దం చివరిలో ఇరాన్ నుండి భారతదేశానికి వలస వచ్చారు. అర్దేశిర్ ఇరానీ బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక ముందుగా పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేశారు. దాంతో వచ్చే జీతం డబ్బులు సరిపోని అర్దేశిర్ ఇరానీ కిరోసిన్ ఇన్‌స్పెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత ఇరానీ తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, అతను ఫోనోగ్రాఫిక్ పరికరాలు మరియు సంగీత వాయిద్యాల వ్యాపారాన్ని చేపట్టారు. అదే క్రమంలో ఇరానీ కదిలే చలనచిత్రాలను నిర్మించాలని, కదిలే చిత్రాల సామర్థ్యాన్ని అన్వేషించాలని కలలు కనేవారు. అదే సమయంలో అప్పట్లోనే సుమారు రూ.లక్ష లాటరీ గెలవడంతో అతని కల సాకారమైంది. తాను ఉహించినట్టుగానే సినిమాలోకి వెళ్ళడానికి మార్గం సుగమమైంది. చిత్ర పరిశ్రమలోకి తన మొదటి అడుగు వేయడానికి ఇది అతనికి వీలు కల్పించింది.
ఆరంభంలో మూగ సినిమాలు…
బొంబాయి నగరమంతా క్రిస్ మస్ సంబరాలు జరుపుకుంటుంటే దాదాసాహెబ్ ఫాల్కే తన కుటుంబంతో సహా 25 డిసెంబరు 1910 సాయంత్రం “అమెరికా-ఇండియా సినిమా”లో “లైఫ్ ఆఫ్ క్రీస్ట్” సినిమాను చూశారు. అప్పటినుండి తనకు అశాంతి, నిర్వేదం మటుమాయమయ్యాయి. తెరమీద జీసస్ క్రీస్తు ప్రతిబింబాలు కదలడం తనకి అనేక రాత్రులు నిద్రలేకుండా చేశాయి. రాముడు, కృష్ణుడు రూప నిర్మాణాలు అతని మస్తిష్కంలో ఊపిరి పోసుకున్నాయి. అసంఖ్యాక బైస్కోపులను చూసిన ఆయన ఉన్న కొద్దిపాటి డబ్బును మూటగట్టుకుని చిత్రీకరణకు సంబంధించి పరికరాల జాబితాలు, పోగుచేసి అనేక కష్టాలకు ఓర్చి తీసిన భారతీయ తొలి మూకీ సినిమా “రాజా హరిచంద్ర” ను 3 మే 1913న విడుదల చేశారు. ఇది భారతీయ తొలి సినిమా, భారతీయ తొలి మూగ సినిమా. ఆడవారు సినిమాలలో నటించేందుకు అంగీకరించని ఆ రోజులలోనే మగవారి చేతనే ఆడవేషం వేయించి ఒప్పించగలిగారు. ఫాల్కే హిందుస్థాన్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించిన తాను వరుసగా పురాణ గాథలను సినిమాలుగా మలిచారు. “శ్రీకృష్ణ జన్మ”, “కాళీ మర్దన”, “లంకా దహన”, “భస్మాసుర మోహిని”, “సావిత్రి సత్యవాన్”, “సంత్ నామ్ దేవ్” వంటి మూగ సినిమాలను విజయవంతంగా నిర్మించారు.
వీర్ అభిమన్యు మూకీ చిత్రం…
ప్రతిరోజు సాయంత్రం లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసే అలవాటు ఉన్న అర్దేశిర్ ఇరానీ 1909 వ సంవత్సరంలో ఉన్నట్టుండి ఒకరోజు లాటరీ గెలిచాడు. వచ్చిన డబ్బులతో బొంబాయిలో 1910 వ సంవత్సరంలో చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి పంపిణీదారుగా వ్యవహారిస్తూ, భాగస్వాములతో కలిసి చిత్రాలను ప్రదర్శించే వ్యాపారం మొదలుపెట్టారు. ఇలా ఇతర దేశాలలో చిత్రీకరించే మూకీ సినిమాలను ముంబాయిలో ప్రదర్శన చేస్తూ సుమారు 10 సంవత్సరాలు అలాగే కొనసాగారు. 1914 – 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1917లో చలనచిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ఇరానీ, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో హాలీవుడ్ చిత్రాలలో కొనసాగిన అబ్దుల్ అలీ, యూసుఫ్ అలీ లతో కలిసి 1920 మధ్యలో ఇంపీరియల్ స్టూడియోస్‌ను స్థాపించి తన మొదటి నిశ్శబ్ద చలనచిత్రం “నల దమయంతి” ని నిర్మించారు.
దాదాసాహెబ్ ఫాల్కే యొక్క హిందుస్థాన్ ఫిల్మ్స్ మాజీ మేనేజర్ “మోహనలాల్ జి దవే” 1922 లో ఇరానీ స్థాపించిన స్టార్ ఫిల్మ్స్ సంస్థలో భాగస్వామిగా చేరారు. ఈయన న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఇదే సంవత్సరం స్టార్ ఫిల్మ్స్ పతాకంపై మణిలాల్ జోషి దర్శకత్వంలో “వీర్ అభిమన్యు” (1922) అనే నిశ్శబ్ద చిత్రాన్ని (మూకీ సినిమా)ను అర్దేశిర్ ఇరానీ నిర్మించారు. సుభద్ర పాత్రలో కథానాయికగా ఫాతిమా బేగం నటించగా, సహానటులు ఉత్తర పాత్రలో సుల్తానా, శ్రీకృష్ణుడిగా మదన్ రాయ్ వకీల్, అభిమన్యుడి పాత్రలో మణిలాల్ జోషి నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే “మోహనలాల్ జి దవే” అందించగా, విష్ణు బి జోషి ఛాయాగ్రహణం అందించారు. 1981.2 మీటర్లు పొడవు, 6 రీళ్లు పొడవున్న ఈ పౌరాణిక చిత్రం 03 మార్చి 1922 నాడు మాజెస్టిక్ చిత్ర ప్రదర్శనశాల, బొంబాయిలో విడుదలయ్యింది.
మెజెస్టిక్ ఫిల్మ్స్‌ని స్థాపించి…
1922లో ఇరానీ స్థాపించిన స్టార్ ఫిల్మ్స్ సంస్థ “మోహనలాల్ జి దవే” తో ఉన్న భాగస్వామ్యం కారణంగా వారి మొదటి నిశ్శబ్ద చలన చిత్రం, వీర్ అభిమన్యు (1922) లో తరువాత సుమారు పదిహేడు చిత్రాలను నిర్మించింది. ఆ తరువాత ఇరానీ తన భాగస్వామి మోహనలాల్ జి దవే తో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తరువాత 1924లో ఇరానీ మెజెస్టిక్ ఫిల్మ్స్‌ని స్థాపించారు. దీనిలోకి అత్యంత ప్రతిభావంతులైన ఇద్దరు యువకులు బిపి మిశ్రా మరియు నావల్ గాంధీ లను చేర్చుకున్నారు. నావల్ గాంధీ దర్శకత్వం వహించగా ఇరానీ సహా దర్శకత్వం వహించిగా సమకాలీన నేపధ్యంలో నైతిక సామాజికంగా ఉండే “పాప్ నో ఫెజ్” (1924) అనే సినిమాను తెరకెక్కించారు.
సరోజిని (తార) అనే యువతి, జైరామ్ (మిశ్రా) ప్రభావంతో తన ముసలి భర్తను మోసగించి, పక్కింటి పొరుగువాడైన ఠాకూర్‌దాస్ (అసూజి)ని నాశనం చేస్తుంది. నైతికత ఉన్నప్పటికీ, రేస్ కోర్సు, పత్తి మార్కెట్ మరియు బార్‌ల ద్వారా ప్రాతినిధ్యం వహించే నైతిక గందరగోళం మరియు ఆధునికత యొక్క వర్ణన ఆసక్తితో ఈ చిత్ర కథ ఉద్భవించింది. సరోజిని మరియు ఠాకూర్‌దాస్ జైలుకు వెళ్లే సమయంలో కారు ఛేజ్ చేసిన పోలీసుల నుండి జైరామ్ తృటిలో తప్పించుకోవడం ఈ సినిమాలోని ముఖ్యాంశాలు. మెజెస్టిక్ ఫిల్మ్స్ పతాకంపై ఇరానీ నిర్మించిన చిత్రాలకు “మిశ్రా లేదా గాంధీ” దర్శకత్వం వహించేవారు. అనేక సినిమాలు విజయం సాధించినప్పటికీ, పదిహేను మూకీ చిత్రాల నిర్మాణం తరువాత మెజెస్టిక్ ఫిల్మ్స్ మూసివేయబడింది.
భారతీయ తొలి శబ్ద (టాకీ) చిత్రం “ఆలం ఆరా”…
మాజెస్టిక్ ఫిల్మ్స్ సంస్థను మూసివేసిన తరువాత అర్దేశిర్ ఇరానీ తన నలభై సంవత్సరాల వయస్సులో 1925లో “ఇంపీరియల్ ఫిల్మ్స్” ని స్థాపించారు. ఈ బ్యానరుపై ఇరానీ సుమారు అరవై రెండు సినిమాలు తీశారు. అందులో భాగంగానే అర్దేశిర్ ఇరానీ భారతీయ సినిమాకు మాటలను అద్దిన “ఆలం అరా” (1931) “ఇంపీరియల్ ఫిల్మ్స్ బ్యానరు” పైనే చిత్రీకరించారు. “ఆలం అరా” అనేది భారతీయ హిందుస్థానీ భాషా చారిత్రాత్మక కాల్పనిక చిత్రం. దీనికి అర్దేశిర్ ఇరానీ దర్శకత్వం వహించి మరీ నిర్మించారు. 1929 వ సంవత్సరంలో బొంబాయిలో అమెరికన్ టాకీ సినిమా (శబ్ద చిత్రం లేదా మాటలతో కూడిన చలనచిత్రం) “షో బోట్” చూశారు. ఆ సినిమా చూడడంతోనే తాను కూడా భారతదేశంలో ఇలాంటి మాటలతో కూడిన ఒక సినిమా తీయాలని సంకల్పించుకున్నారు.
అదే సంకల్పం ఆ తరువాత ఇరానీ దర్శక, నిర్మాణంలో “ఆలం అరా” రూపొందించడానికి సిద్దపడ్డారు. శబ్ద చిత్ర నిర్మాణంలో ఈ రకమైన చలనచిత్రాన్ని రూపొందించడంలో అనుభవం లేనప్పటికీ, ఎలాగైనా దానిని రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఎటువంటి పూర్వ ధ్వని చిత్రాలను అనుసరించకూడదని కూడా నిర్ణయించుకున్నారు. దానికి “ఆలం ఆరా” అని పేరు పెట్టుకున్నారు. ఈ చిత్ర కథ బాంబే ఆధారిత కథ నుండి తీసుకోబడింది. అదే పేరుతో నాటకకారుడు జోసెఫ్ డేవిడ్ వ్రాసిన పార్సీ నాటకానికి స్క్రీన్ ప్లే అర్దేశిర్ ఇరానీ వ్రాశారు. హిందీ మరియు ఉర్దూ మిళితమైన హిందుస్తానీలో సంభాషణలు వ్రాయబడ్డాయి.
40,000 రూపాయలతో నిర్మాణం…
ఈ “ఆలం ఆరా” (1931) సినిమా ఇది పిల్లలు లేని రాజు మరియు అతని ఇద్దరు భార్యలు నవబహార్ మరియు దిల్బహార్ చుట్టూ తిరుగుతుంది. ముహమ్మద్ వజీర్ ఖాన్, మాస్టర్ విఠల్, పృథ్వీరాజ్ కపూర్, జుబేదా మొదలగు నటీనటులు ఇందులో నటించారు. దీనికి ఫిరోజ్‌షా మిస్త్రీ, బి. ఇరానీలు సంగీతం అందించారు. ఆది ఎం. ఇరానీ ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమా బెల్ మరియు హోవెల్ నుండి కొనుగోలు చేసిన పరికరాలను ఉపయోగించి బొంబాయిలోని జ్యోతి స్టూడియోస్‌లో నాలుగు నెలల్లోనే ఈ సినిమాను పూర్తిచేశారు.
చిత్రీకరణ జరుపుకున్న జ్యోతి స్టూడియోస్ రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్నందున రైళ్ల నుండి శబ్దం రాకుండా ఉండేందుకు ఈ సినిమాను రాత్రి సమయంలో ఎక్కువగా చిత్రీకరించారు. చిత్రీకరణ తరువాత ఈ సినిమా దర్శక, నిర్మాత అర్దేషిర్ ఇరానీ సింగిల్-సిస్టమ్ రికార్డింగ్‌ని ఉపయోగించి సౌండ్ రికార్డింగ్‌ను పూర్తి చేశారు. ఫిరోజ్‌షా మిస్త్రీ మరియు బి. ఇరానీ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేశారు. ఆ రోజుల్లోనే సుమారు 40,000 రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. 14 మార్చి 1931 నాడు ఈ సినిమాను విడుదల చేశారు. శబ్ద చిత్రంగా విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాతో అర్దేశిర్ ఇరానీ ఆనాటి నుండి భారతీయ టాకీ చిత్రాలకు పితామహులుగా పరిగణించబడ్డారు.
హ్యాట్రిక్ ఘనత…
అర్దేశిర్ ఇరానీ తొలి శబ్దచిత్రం (టాకీ సినిమా) ఆలం ఆరా (1931) నిర్మాణానికి దోహదపడ్డ తారాగణం, సిబ్బందితోనే తరువాత అనేక టాకీ చిత్రాలు రూపొందించబడ్డాయి. అదే క్రమంలో అర్దేశిర్ ఇరానీ తన మొదటి భారతీయ ఆంగ్ల చలనచిత్రం నూర్ జహాన్ (1931) ను కూడా తెరకెక్కించి మొట్టమొదటి భారతీయ ఆంగ్ల చిత్రం తెరకెక్కించిన ఘనతను ఇరానీ దక్కించుకున్నారు. అదేవిధంగా తన ఇంపీరియల్ పిక్చర్స్ బ్యానరులోనే భారతదేశపు మొట్టమొదటి రంగుల సినిమా కిసాన్ కన్య (1937) ని రూపొందించించారు. ఇది భారతదేశంలో స్వదేశీయంగా రూపొందించబడిన మొట్టమొదటి కలర్ ఫిల్మ్ అయినందున ఇది భారతీయ ప్రజలచే ఎక్కువగా గుర్తుంచుకోబడుతుంది. ఆ విధంగా మొట్టమొదటి శబ్ద చిత్రం, మొట్టమొదటి భారతీయ ఆంగ్ల చిత్రం, మొట్టమొదటి రంగుల చిత్రం ఇలా తాను హ్యాట్రిక్ ఖ్యాతిని సంపాదించారు. అర్దేశిర్ ఇరానీ నిశ్శబ్ద సినిమాకి గాత్రం అందివ్వడం, నలుపు – తెలుపు చిత్రాలకు రంగులు అద్దడంలో తన సహకారం మరువలేనిది. ఇరానీ భారతదేశంలో చిత్రనిర్మాణానికి కొత్త ధైర్యమైన దృక్పథాన్ని అందించారు. తన చిత్రాలలో కథలకు కోసం తాను విభిన్న మార్గాలను ఎన్నుకున్నారు. ఇరానీ తన జీవిత కాలంలో తీసిన నూట యాభై ఎనిమిది చిత్రాలు కూడా ఒకదానికి సంబంధించిన ఇతివృత్తంతో సినిమాలు నిర్మించబడ్డాయి.
అస్తమయం…
అర్దేశిర్ ఇరానీ 1933 వ సంవత్సరంలో మొదటి పర్షియన్ శబ్దచిత్రం “దోఖ్తర్-ఎ-లోర్” నిర్మించి, దర్శకత్వం వహించారు. దానికి స్క్రిప్టును “అబ్దోల్‌హోస్సేన్ సెపంతా” వ్రాశారు. ఆయన స్థానిక పార్సీ కమ్యూనిటీ సభ్యులతో కలిసి ఈ చిత్రంలో కూడా నటించారు. అర్దేశిర్ ఇరానీ యొక్క “ఇంపీరియల్ ఫిల్మ్స్” సంస్థ పృథ్వీరాజ్ కపూర్, మెహబూబ్ ఖాన్‌లతో సహా అనేక మంది కొత్త నటీనటులను భారతీయ సినిమాకి పరిచయం చేసింది. అతను కాళిదాస్‌ని తెలుగు మరియు తమిళంలో ద్విభాషా శబ్ద చిత్రంగా, అలం ఆరా చిత్రీకరించిన సెట్స్‌లోనే తెలుగులో ప్రధాన తారాగణంతో పాటలు, చిత్రీకరణ చేశారు. ఈ క్రమంలో తనకు తెలియకుండానే ఆయన సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ రోజుల్లో ఔట్ డోర్ లో చిత్రీకరణకు కాంతి పరివర్తనం చెందే (రిఫ్లెక్టర్ల) సాయంతో సూర్యకాంతిలో చిత్రీకరణ జరిపేవారు.
అయినప్పటికీ, బయటి నుండి వచ్చిన అవాంఛనీయ శబ్దాలు ఆయనను బాగా కలవరపెట్టేవి. దాంతో చేసేది లేక స్టూడియోలో భారీ లైట్ల క్రింద మొత్తం సన్నివేశాన్ని ఇరానీ చిత్రీకరించేవారు. అందువలన, ఆయన కృత్రిమ కాంతి క్రింద చిత్రీకరణ ట్రెండ్ ప్రారంభించారు. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన మరియు అద్భుతమైన సినీ ప్రస్థానంలో అర్దేశిర్ ఇరానీ సుమారు నూట యాభై ఎనిమిది చిత్రాలను నిర్మించారు. అర్దేశిర్ ఇరానీ చివరి చిత్రం “పూజారి” (1945). అర్దేశిర్ ఇరానీ ఏనాడూ కూడా దాదాసాహెబ్ ఫాల్కే లాగా ఒత్తిడిగా జీవించాలని అనుకోలేదు. ఎందుకంటే యుద్ధం సినిమా వ్యాపారానికి తగిన సమయం కాదని ఇరానీ ముందుగానే గ్రహించారు. అందువలన ఆ సమయంలో అతను తన సినిమా వ్యాపారాన్ని నిలిపివేసారు. ఎనభై రెండు సంవత్సరాలు జీవించిన అర్దేశిర్ ఇరానీ వృద్దాప్యం సమీపించి అనారోగ్యం కారణంగా ఆయన 14 అక్టోబరు 1969 నాడు మహారాష్ట్రలోని ముంబైలో అస్తమించారు.

