
మనిషికి వినోదం పంచుతూ, మానసికోల్లాసం కలిగించే మాధ్యమాలలో చలనచిత్ర రంగం ముందు వరుసలో ఉంటుంది. అలాంటి చలనచిత్ర రంగంలో కష్టపడి పైకొచ్చి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, ఆ రంగంలో రాణిస్తూ తమదైన ముద్రవేసి, ప్రేక్షకుల అభిమానంతో సినిమాపేరును తమ ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో వున్నారు. వారిలో షావుకారు జానకి, సాక్షి రంగారావు, శుభలేఖ సుధాకర్, మహర్షి రాఘవ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జెడి చక్రవర్తి, అల్లరి నరేష్, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, దిల్ రాజు, బొమ్మరిల్లు భాస్కర్ ఇలా అనేకమంది నటీనటులు ఆ వరుసలో ఉన్నారు.
ఆ కోవకే చెందినవారు ఆహుతి ప్రసాద్. కృష్ణా జిల్లా ముదినేపల్లి దగ్గరలో గల కోడూరులో జన్మించిన అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ అలియాస్ ఆహుతి ప్రసాద్ నటనపరంగా తనదైన ముద్రవేశారు. సిల్కు చొక్కా, ప్యాంటూ, మెడలో పులిగోరు, ఓ చేతిలో పేక ముక్కలు, మరో చేతిలో స్టీలు గ్లాసూ, అందులో కిక్కిచ్చే సరుకు. ఒళ్లంతా మైకం, మాటల్లో గోదారి ఎటకారం ఇవి చెప్పగానే గుర్తొచ్చే నటుడు “ఆహుతి ప్రసాద్”.
సినిమాలలో నటించాలనే కోరికతో మధు నటన పాఠశాలలో నటన నేర్చుకుని వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన “విక్రమ్” చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఆ తరువాత కొన్ని సినిమాలలో, ఒక సీరియల్ లో నటించాక కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆహుతి” (1987) చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించడంతో బాటు ఆహుతి సినిమా కూడా ఘన విజయం సాధించడంతో అప్పటినుండి “ఆహుతి ప్రసాద్” గా పేరొందారు. ఆ తరువాత అనేక సినిమాలలో రాజకీయ నాయకుని పాత్రలు, పోలీసు పాత్రలు పోషించారు.
నిర్మాతగా మారి 1990 వ సంవత్సరంలో పోలీసు భార్య పునర్నిర్మాణం చేసి విజయం సాధించారు. ఆ విధంగా కన్నడంలో నిర్మాతగా తీసిన మరో రెండు సినిమాలు పరాజయం పాలవ్వడంతో తాను అప్పుల పాలయ్యారు. ఆ తరువాత తెలుగులోనూ అవకాశాలు రాక దాదాపు నాలుగు సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తాను కృష్ణవంశీ “నిన్నే పెళ్ళాడుతా” (1996) సినిమాలో చేసిన కథానాయిక తండ్రి పాత్రతో తిరిగి తనకు సినిమా అవకాశాలు పెరిగాయి.
వెటకారం, వినోదం, పెద్దరికం, భోళాతనం, మంచితనం, ముంచే గుణం ఇలా పాత్ర ఏదైనా సరే దానిలో ఇట్టే ఇమిడిపోయి రక్తికట్టించే నటులు ఆహుతి ప్రసాద్. “ఓల్ ఫ్యామిలీ సబ్బులకూ, షవరాలకూ పోజులిత్తూ, కోట్లు సంపాదించేత్తున్నారు. సుడిమీద వట్ర సుడి అంటే అదే మరి” అంటూ రామలింగేశ్వరరావు “చందమామ” చిత్రంలో వెటకారంగా పరిహాసమాడినా… “నేను సెట్టుని నమ్ముతా, కాయని కాదు. సెట్టు నెంబర్ వన్‌గా ఉంటే ఆటోమెటిగ్గా కాయ కూడా నెంబర్ వన్‌గా ఉంటుంది. ఇదానం, దేనికైనా ఇదానం కరెక్టుగా ఉండాల” అంటూ “కొత్త బంగారు లోకం” చిత్రంలో పరువు కోసం ప్రాకులాడే పెద్దమనిషిగా పెద్దరికం ఒలకబోసినా… “సిద్దూ ఫ్రమ్ సికాకుళం” సినిమాలో ఎడమ చేతి వాచీని కాస్త పైకెత్తి సమయం కూడా చూసుకోలేని బద్దకత్వం ప్రదర్శించినా అది ఆహుతి ప్రసాద్ కే చెల్లింది. ఆఖరికి ముష్టివాడిని కూర్చోబెట్టి పంచభక్ష పరమాన్నాలు వడ్డించి “బెండు అప్పారావు” చిత్రంలో రాజు గారిలా అతిశయం చూపించడం కూడా ఆహుతి ప్రసాద్ కే చెల్లింది. లంచగొండి పోలీసు, మంచి పోలీసు అధికారి, భయస్తుడు, బిడియస్తుడు ఇలా పోలీసు పాత్రల్లో ఎన్ని వైవిధ్యాలుంటే అన్ని పాత్రలను ఆయన చేసేశారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్
ఇతర పేర్లు : ఆహుతి ప్రసాద్
జననం : 02 జనవరి 1958
స్వస్థలం : కోడూరు (ముదినేపల్లి), కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : నటుడు, నిర్మాత, బిల్డర్
తండ్రి : రంగారావు
తల్లి : హైమవతి
జీవిత భాగస్వామి : విజయనిర్మల
పిల్లలు : భరణి ప్రసాద్, కార్తీక్ ప్రసాద్
మరణ కారణం : క్యాన్సరు వ్యాధి
మరణం : 04 జనవరి 2015, హైదరాబాదు
నేపథ్యం…
ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఊరిలో ఉన్న జనార్ధన స్వామి ఆలయం వీరి పూర్వీకులు కట్టించారు. అందుచేత ఆ స్వామి పేరును ఆహుతి ప్రసాద్ కు పెట్టుకున్నారు. ఊరిలో వారికి చాలా భూములు ఉండేవి. ఆయన ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో గల ముదినేపల్లి దగ్గర గల కోడూరులో 02 జనవరి 1958 నాడు జన్మించారు. ఆయన చిన్నగా ఉన్నప్పుడే అమ్మానాన్నలు కర్ణాటకలోని సింధనూరుకు వలస వెళ్లారు. నాన్న రంగారావు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఒకవైపు బోధన చేస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అమ్మానాన్నలకు నలుగురు సంతానం. ముగ్గురు అక్కలు. ఒకే ఒక్క మగ సంతానం జనార్థన ప్రసాద్ కావడంతో తనను అల్లారుముద్దుగా పెంచారు. అమ్మానాన్నలు కర్ణాటకలో స్థిరపడినా ఆహుతి ప్రసాద్ మాత్రం తమ బంధువులు రాయలసీమలో ఉండటం వలన విద్యాభ్యాసం అంతా కూడా రాయలసీమ, తెలంగాణలలో సాగించారు. కర్ణాటకలో ఉన్నప్పుడు అక్కడ ఉర్దూ కలగలిసిన భాష మాట్లాడే వాళ్ళు నిజానికి అది ఒకప్పుడు “హైదరాబాదు కర్ణాటక” గా ప్రసిద్ధికెక్కిన “రాయచూరు, గుల్బర్గా, బీదర్” జిల్లాలలో ఉర్దూ మాట్లాడుతూ ఉండడంతో ఆహుతి ప్రసాద్ కూడా హిందీ, ఉర్దూ బాగా నేర్చుకున్నారు. అంతే కాకుండా తన విద్యాభ్యాసం నాగార్జునసాగర్, డోన్ (ద్రోణాచలం), మిర్యాలగూడ, కోదాడలలో కూడా జరగడంతో తనకు హిందీ బాగా వచ్చింది.
వివాహం…
“మద్రాసు నటన శిక్షణ సంస్థలో (మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) శిక్షణ పొందిన చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్రప్రసాద్, నారాయణరావు అందరు అగ్రతారలైపోతున్నారు. నేను కూడా మద్రాసు వెళ్లాలి నటనలో శిక్షణ పొందాలి, సినిమాలో నటించాలి” అని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటినుంచి ఆహుతి ప్రసాద్ మదిలో ఆలోచనలు. ఆవిధంగా ఆయన సినిమాలంటే చిన్నప్పటినుంచి పిచ్చితో పాఠశాలలో, కళాశాలలో నాటకాలు వేస్తుండేవారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆహుతి ప్రసాద్ కు చిత్రపరిశ్రమతో అస్సలు సంబంధాలు లేవు. అమ్మానాన్నలకు ఒక్కడే కొడుకు. అందుకే తాను సినిమా నటుడిని అవుతానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో తాను సెలవులు అయిపోయినా కూడా కళాశాలకు వెళ్లనని మొండికేశారు. అలా నాలుగేళ్లు గడిచాక తనకు పెళ్లిచేస్తే గానీ మాట వినేలాలేడని తాతయ్య పట్టుబట్టి విజయనిర్మలను ఇచ్చి మరీ పెళ్లి చేసేసారు. అప్పటికి తన వయస్సు ఇరవై రెండు యేండ్లు. పెళ్లయ్యాక తనలో స్వతంత్ర భావాలు ఎక్కువయ్యాయి. నటన శిక్షణశాలలో (ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) చేరడానికి ఇంట్లో వాళ్ళ అనుమతి అడిగి హైదరాబాదు వెళ్లిన శిక్షణ తీసుకుంటాను అని చెప్పేసి హైదరాబాదు పయనమయ్యారు.
చిత్రరంగ ప్రవేశం…
ఆహుతి ప్రసాద్ నాగార్జునసాగర్ లో 9వ తరగతి చదువుతున్నప్పుడే “అన్నా చెల్లెలు” అనే నాటికలో నటించారు. అందులోని తన నటనకు ఉత్తమ నటుడిగా బహుమతి వచ్చింది. ఆ సంఘటన సినిమాలలో నటించాలనే తన ఆశకు జీవం పోసి, సినిమాలలోకి వెళ్ళడానికి, సినిమా జీవితానికి తొలి మలుపు అయ్యింది. జీవితంలో తప్పకుండా నటుడవ్వాలనే బలంగా ఆనాడే నిర్ణయించుకున్నారు. కోదాడలో కళాశాల చదువు చదువుతుండగా ఒకరోజు వార్తపత్రికలో వచ్చిన “మధు ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్” ప్రకటన గురించి చూసి దానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో శిక్షణ తీసుకోవాలంటే శిక్షణ రుసుము పదిహేను వేల రూపాయలు.
1983 వ సంవత్సరం పదిహేను వేల రూపాయలు అంటే చాలా పెద్దమొత్తం. అయినా సరే ఆయన వాళ్ళ ఇంట్లో గొడవ చేసి ఎట్టకేలకు పదిహేను వేల రూపాయలు తీసుకొని “మధు నటన శిక్షణా సంస్థ” ప్రారంభమైన 26 జనవరి 1983 మొదట జట్టు (బ్యాచ్) లో చేరారు. విక్టరీ మధుసూదన రావు స్థాపించిన ఈ సంస్థను నందమూరి తారకరామారావు చేత ప్రారంభోత్సవం చేయించారు. నటులు “అచ్యుత్”, “శివాజీ రాజా”, “రామ్ జగన్”, “ఆహుతి ప్రసాద్” అంతా ఫస్ట్ బ్యాచ్. శిక్షణా సంస్థలో ఇచ్చే శిక్షణ ఆహుతి ప్రసాద్ కు తన మీద తనకు నమ్మకాన్ని పెంచింది. శిక్షణలో భాగంగా అందులో విద్యార్థులు ఎంతగా మెరుగుపడ్డారు అనే దానిని పరీక్షించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఉండేవి. ఆ శిక్షణలో ఆహుతి ప్రసాద్ ఎప్పుడూ కూడా మొదటిస్థానంలో వుండేవారు. అప్పుడు లభించే ప్రశంసలు నటనలో వారు సరైన దారిలోనే వెళ్తున్నామనే భరోసా ఇచ్చేవిధంగా ఉండేవి.
నటుడిగా తొలి సినిమా నాగార్జున “విక్రమ్”..
“మధు నటన శిక్షణా సంస్థ” లో దేవదాసు కనకాల నటనలో శిక్షణ ఇచ్చేవారు. అప్పటికే ఆహుతి ప్రసాద్ కు పెళ్ళైపోయింది. అందువలన ఆయన మకాం హైదరాబాదుకు మార్చారు. భార్యతో సహా హైదరాబాదుకు వచ్చేశారు. శిక్షణకాలం పూర్తయిన తరువాత తనకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పటికి ఇంకా తెలుగు చిత్రశ్రమ హైదరాబాదుకు రాలేదు. మద్రాసులోనే ఉండిపోయింది. తనతో పాటు శిక్షణ తీసుకున్న సహచర నటీనటులంతా మద్రాసుకు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసేవారు. ఆహుతి ప్రసాద్ కు భార్య, కుటుంబం, సంసారం ఉండడంతో తాను వెళ్లడానికి కుదరలేదు.
తన ఇబ్బందులన్నీ దగ్గరుండి గమనించిన విక్టరీ మధుసూదన రావు నటన శిక్షణ సంస్థ నిర్వాహణ బాధ్యత ఆహుతి ప్రసాద్ అప్పగించారు. అందుకు జీతం కూడా ఇచ్చేవారు. సరిగ్గా ఇదే సమయానికి విక్టరీ మధుసూదన రావుకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చాయి. వాటిలో ఉషా కిరణ్ మూవీస్ వారి “మల్లె మొగ్గలు” ఒకటి కాగా, నాగార్జున తొలి చిత్రం అయిన “విక్రమ్” రెండవది. విక్టరీ మధుసూదన రావు గారు దర్శకత్వం వహిస్తున్న “మల్లె మొగ్గలు” సినిమాకు ఆయన వద్ద ఆహుతి ప్రసాద్ సహాయ దర్శకుడిగా చేశారు. మధుసూదన రావు అవకాశం ఇవ్వగా నటుడిగా నాగార్జున “విక్రమ్” సినిమాలో తొలిసారిగా నటించారు.
అడుసుమిల్లి ప్రసాద్ కాస్తా “ఆహుతి” ప్రసాద్ గా…
హైదరాబాదులో “మధు నటన శిక్షణా సంస్థ” లో శిక్షణ తీసుకుంటూనే చిత్రపరిశ్రమకు దూరంగా ఉండే కన్నా సహాయ దర్శకుడిగా చేయడం మంచిదని భావించి మధుసూదన రావు దగ్గర చేరి “విక్రమ్” సినిమాలో నటించారు ఆహుతి ప్రసాద్. ఆ సినిమాకు వచ్చిన పారితోషికాన్ని మధుసూదన రావు తన దగ్గరే ఉంచుకొని “శివాజీ గణేషన్” చేతుల మీదుగా ఆహుతి ప్రసాద్ కు అందించారు. శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్నప్పుడు అప్పుడప్పుడు అక్కడికి తాతినేని ప్రకాశరావు అక్కడికి వస్తుండేవారు. ఆ సమయంలో ప్రకాశరావు దూరదర్శన్ కోసం “మీరు ఆలోచించండి” అనే కార్యక్రమం చేస్తూ అందులో ఆహుతి ప్రసాద్ ను నటింపజేశారు. దానికి డబ్బింగ్ చెప్పడానికి “ప్రతాప్ ఆర్ట్ థియేటర్స్” కి వెళ్ళినప్పుడు అక్కడ చలనచిత్ర నిర్మాత కె. రాఘవ అబ్బాయి ప్రతాప్ మోహన్ పరిచయమయ్యారు.
ఆయన తీసిన “ఈ ప్రశ్నకు బదులేది? (1985) అనే సినిమాలో ఆహుతి ప్రసాద్ ను ప్రతినాయకుడి పాత్రలో నటింపజేశారు. ఆ సినిమా చూసిన ఆహుతి ప్రసాద్ నటనను మెచ్చిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తాను రెండో సినిమాగా తీసిన “ఆహుతి” సినిమాలో శంభుప్రసాద్ పాత్రకు తీసుకున్నారు. ప్రధాన ప్రతినాయక ఛాయలున్న ఆ “హోమ్ మినిస్టర్” శంభుప్రసాద్ పాత్ర ఆహుతి ప్రసాద్ కు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రభలో పనిచేసే ఆంజనేయ శాస్త్రి అనే పాత్రికేయుడు ఆహుతి ప్రసాద్ ను ఇంటర్వ్యూ చేసి తన గురించి పత్రికలో వ్రాశారు. ఆ సమయంలో ఇకనుంచి ఇతను శంభుప్రసాద్ కాదు (ఆహుతి సినిమాలో పాత్ర పేరు) “ఆహుతి ప్రసాద్” అని వ్రాశారు. అప్పటినుండి అందరూ తనను ఆహుతి ప్రసాద్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తరువాత చాలామంది పేరులో “ఆహుతి” ఏంటయ్యా మార్చుకొని చెప్పారు. కానీ తాను ఎంత ప్రయత్నం చేసినా ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది.
నిర్మాతగా విఫలం..
ఆహుతి ప్రసాద్ అంటే అఖానార్ధకమైన అర్థం వస్తుందని ఆ పేరును మార్చుకోమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ తనకు ఎందుకో వీలవ్వలేదు. పరిశ్రమలో అనేకమంది ప్రసాదులు ఉండటం వలన అప్పటికే తన పేరు ఆహుతి ప్రసాదుగా ప్రసిద్ధిచెందింది. “ఆహుతి” సినిమా తరువాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి. అందువలన 1988లో తన మకాం మద్రాసుకు మార్చేశారు. ఒకవైపు సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్న తనకు “పోలీస్ భార్య” సినిమాలో మంచి పాత్ర లభించింది. ఆ చిత్రం తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో తాను నిర్మాతగా మారి అదే సినిమాను మాలాశ్రీ కథానాయికగా కన్నడలో నిర్మించారు. అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో మరో రెండు చిత్రాలను నిర్మించారు. కానీ దురదృష్టావశాత్తు పరాజయంపాలై నష్టాలను మిగిల్చాయి. ఒక నటుడిగా మంచి పాత్రలతో తీరికలేకుండా ఉన్న సమయంలోనే నిర్మాత కావాలనే ఒకే ఒక్క నిర్ణయం తన సినీప్రస్థానంలో ఒక అగాథాన్ని మిగిల్చింది. ఒకవైపు ఆహుతి ప్రసాద్ సినిమాలో నటించడం మానేశారు. మరోవైపు నిర్మాతగా నష్టాలు. ఆ సమయంలో ఆయనకు చేయూతనిచ్చేవారు ఎవ్వరూ లేరు. తన సినిమా ప్రస్థానం దాదాపుగా ముగిసినంత పనయ్యింది.
కృష్ణవంశీ “నిన్నేపెళ్లాడుతా” తో మళ్ళీ అవకాశాలు…
“ఆహుతి” సినిమా విజయవంతం అయిన తరువాత ఆ విజయాన్ని ప్రసాద్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు. వ్యక్తిగతంగా ఒక పి.ఆర్.ఓ. ని పెట్టుకుని, చిత్రపరిశ్రమలో వ్యక్తులను ఎప్పటికప్పుడు కలుస్తూ, వారితో మాట్లాడుతూ, నిరంతరం వారి దృష్టిలో ఉండాలనే విషయాలు ఏవీ కూడా ఆహుతి ప్రసాద్ కు తెలియదు. ఆహుతి చిత్ర విజయంతో మంచి పేరు వచ్చింది కదా! వాళ్లే పిలిచి అవకాశాలు ఇస్తారనే భ్రమలో ఉండి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోవడంతో ఎప్పుడో ఒకటి ఆరా వేషాలు వస్తుండేవి. ఆ సమయంలో పాత్రలు కావాలని ఎవరిని అడగాలో తనకు తోచేది కాదు. ఆయన బెంగళూరులో ఉండగా ఒకరోజు అక్కడికి “అనగనగా ఒక రోజు” చిత్రబృందం కర్ణాటకకు వచ్చింది. అందులో “పోలీస్ అధికారి” పాత్రకు ఆహుతి ప్రసాద్ ను ఎంచుకున్నారు కృష్ణవంశీ. కొద్దిరోజులు చిత్రీకరణ అనంతరం ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు కృష్ణవంశీ చేతుల నుండి రాంగోపాల్ వర్మ చేతిలోకి వెళ్ళిపోయింది. దాంతో ఆహుతి ప్రసాద్ వేషం పోయింది.
గులాబీ సినిమా పూర్తయ్యాక “నిన్నే పెళ్ళాడుతా” మొదలుపెట్టిన కృష్ణవంశీ ఆ సినిమాలో కథానాయిక తండ్రి పాత్రకు ఆహుతి ప్రసాద్ ని ఎంపికచేసుకున్నారు. అప్పటివరకు మిత్రులు, సన్నిహితులు, బంధువులు మొదలగువారు అంతా ఆహుతి ప్రసాద్ ను ఎగతాళి చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా తనవెంట నడిచిన ఒకే ఒక్క వ్యక్తి ఆయన భార్య “విజయనిర్మల”. ఆమె సహకారంతో హైదరాబాదుకు వచ్చి ఒక మిత్రుడితో కలిసి “భవన నిర్మాణం” (బిల్డింగ్ కన్స్ట్రక్షన్) వైపు నెమ్మదిగా అడుగులు వేశారు. ఇలా ఒకవైపు వ్యాపార రంగంలో నిలదుక్కుకుంటూనే మరోవైపు సినిమాలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కృష్ణవంశీ “నిన్నే పెళ్ళాడుతా” లో కథానాయిక “టాబు” నాన్నగా మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన జీవితాన్ని చక్కటి మలుపులను తిప్పింది “నిన్నే పెళ్ళాడుతా” సినిమా.
“చందమామ” సినిమా నుండి హాస్య పాత్రలకు..
చిన్నప్పుడే కర్ణాటకలో స్థిరపడ్డ ఆహుతి ప్రసాద్ అక్కడ నివాసముంటున్న గోదావరి జిల్లాల వారి నుండి “గోదావరి యాస” మాట్లాడుతూ సరదాగా గోదావరి యాసలో సరదాని పంచేవారు. “నిన్నే పెళ్ళాడుతా” సినిమా నుండి కృష్ణవంశీతో సన్నిహితంగా ఉంటూ ఆయన వద్ద అప్పుడప్పుడు గోదావరి జిల్లా యాసతో నవ్వించేవారు ఆహుతి ప్రసాద్. దర్శకురాలు బి.జయ తెరకెక్కించిన “చంటిగాడు” అనే సినిమాలో ప్రతినాయక పాత్రలో సంభాషణలు గోదావరి యాసలో చెప్పారు. ఆ సినిమాని టీవీలో చూసిన దర్శకులు కృష్ణవంశీ వెంటనే తన “చందమామ” సినిమాలో గోదావరి యాస మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్రను చేయమని అడిగారు. ఆ పాత్ర అద్భుతంగా పండడంతో ఆహుతి ప్రసాద్ కు తిరుగులేకుండా పోయింది.
చందమామ సినిమా తరువాత తమ సినిమాలో ఆహుతి ప్రసాద్ తప్పనిసరిగా ఉండేలా, తనతో పాత్ర కొత్తగా, వైవిధ్యంగా చేయించుకోవాలని చాలామంది నిర్మాతలు, దర్శకులు అనుకోవడం తన సినిమా జీవితానికి ఒక అదృష్టం అనే చెప్పాలి. “కొత్త బంగారులోకం”, “బెండు అప్పారావు”, “సిద్దు ఫ్రం శ్రీకాకుళం” ఇలా అనేక సినిమాలలో మంచి పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ప్రతినాయకుడిగా తన మీద పడిన “విలన్ బ్రాండ్” మొత్తం చెరిగిపోయి హాస్యం కూడా అద్భుతంగా చేయగలడనే విశ్వాసం దర్శక, నిర్మాతలకు ఏర్పడింది. చందమామ సినిమా తరువాత ఆహుతి ప్రసాద్ ను దృష్టిలో పెట్టుకొని తనకు కొన్ని పాత్రలను ఆయా దర్శకులు రూపకల్పన చేయడం నటుడిగా తన విజయంగా పరిగణించవచ్చు.
మరణం…
లంచగొండి పోలీసు, మంచి పోలీసు అధికారి, భయస్తుడు, బిడియస్తుడు ఇలా పోలీసు పాత్రల్లో ఉన్న అన్నిరకాల వైవిధ్య పాత్రలను ఆహుతి ప్రసాద్ పోషించారు. తన సినీ ప్రస్థానంలో 250 సినిమాలలో నటిస్తే అందులో 80 పోలీసు పాత్రలు పోషించడం విశేషం. ఆ పాత్రలపై ఆహుతి ప్రసాద్ వేసిన ముద్ర అలాంటిది. నిర్మాతగా మారి నాలుగేళ్ల కాలాన్ని మినహాయిస్తే తన జీవితం సాదాసీదాగా సాఫీగా సాగిపోయింది. ఆ నాలుగేళ్లు తనకు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా విజయాలు ఉంటేనే చుట్టూ చేరి పరాజయాలు ఎదురైతే ముఖం చాటేసే వారి గురించి తనకు బాగా తెలిసివచ్చింది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్న ఆహుతి ప్రసాద్ కు భరణి, కార్తీక్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. తమకు నచ్చిన రంగాలను ఎంచుకొని వారు విదేశాలలో స్థిరపడ్డారు. తెరపై నటుడు కావాలనే నా కోరికను తీర్చుకొని, స్వయంకృషి, పట్టుదలతో ఓ నటుడుగా తెలుగు ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న ఆహుతి ప్రసాద్ ఆ వైభవం ఎక్కువ కాలం కొనసాగకుండానే 57 ఏళ్ల వయస్సులో చర్మ క్యాన్సర్ బారిన పడి హైదరాబాదు లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ 04 జనవరి 2015 ఆదివారం నాడు కన్నుమూశారు.