CINEMATelugu Cinema

తెలుగు చలనచిత్ర సీమలో హాస్య గీతాల్ని ఆలపించిన మలితరం గాయని.. స్వర్ణలత…

చలన చిత్రాలలో పాటలకు ఉండే ప్రత్యేకతే వేరు. చిత్ర విజయంలో అవి ఎంతో దోహదం చేస్తాయి. తెలుగు సినిమా మాటలు నేర్చిన తొలినాళ్ళలో నటీనటులు తమ పాటలను తామే పాడుకునేవారు. ఆ తరువాత కొంత కాలానికి వారి గాత్ర మాధుర్యం తగ్గిపోతుండడంతో వారి స్థానంలో నేపథ్య గాయకులతో పాటలు పాడించడం మొదలుపెట్టారు. అలా వచ్చిన నేపథ్య గాయనీ, గాయకులు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని చిత్రరంగంలో తమకంటూ ప్రత్యేక పేరును తెచ్చుకున్నవారు వున్నారు. అలా నేపథ్య గాయనీమణులలో హాస్య గీతాలను ఆలపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్య గీతాల నేపథ్య గాయని స్వర్ణలత. అలనాటి మేటి చిత్రాలలో కథానాయకులు, కథనాయికలతో బాటు హాస్యాన్ని జోడించడానికి రేలంగి – గిరిజ, రేలంగి – సూర్యకాంతం, పద్మనాభం – గీతాంజలి, రమాప్రభ – అల్లు రామలింగయ్య, రమాప్రభ – రాజబాబు ఇలా హాస్య జంట తప్పనిసరిగా ఉండేది. వారికి కూడా ఆయా చిత్రాలలో హాస్య గీతాలను ఇనుమడింపజేసేవారు. ఆయా హాస్య గీతాల రచనలకు రచయితలు, వాటిని ఆలపించడానికి ప్రత్యేక హాస్య గాయనీమణులు ఉండేవారు. స్వర్ణలత అదే కోవకు చెందుతారు.

హాస్య గీతాలు అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు స్వర్ణలత, స్వర్ణలత పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి హాస్య గీతాలు. ఎందుకంటే ఆమె ఆలపించిన గీతాలలో 99 శాతం హాస్య గీతాలే ఉండడం అందుకు గల కారణం. అప్పుచేసి పప్పుకూడు (1959) సినిమాలో “కాశీకి పోయాను రామాహరి, గంగతీర్థమ్ము తెచ్చాను రామాహరి”, శ్రీకృష్ణార్జునయుద్ధం (1963) సినిమాలో “అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామిని”, అత్తా ఒకింటి కోడలే (1958) సినిమాలో “మాయదారి కీచులాట మా మధ్య”, గురువును మించిన శిష్యుడు (1963) సినిమాలో “బలె బలె బలె బలె హిరణ్యకశపుడరా నిన్ను ఇరచుక”, దాగుడు మూతలు (1964) సినిమాలో “డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది”, చదువుకున్న అమ్మాయిలు (1963) సినిమాలో “ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం” ఇలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, సింహాల దాదాపు ఎనిమిది భాషలలో రెండు దశాబ్దాల పాటు వేల పాటలు పాడారు. హాస్య గీతాలే కాకుండా మాములు పాటలు కూడా పాడినప్పటికీ, అవి వ్రేళ్ళమీద లెక్కపెట్ట గలిగినన్ని మాత్రమే ఉండడం విశేషం.

ఆ రోజులలో రాయలసీమ నుండి వచ్చి సినిమా రంగంలో నేపథ్య గాయనిగా నిలదొక్కుకున్న గాయని  స్వర్ణలత. సమకాలీన గాయనీ, గాయనీమణులతో పోల్చి చూసుకుంటే ఆర్థికంగా. ఆమె నిలదొక్కుకున్నారు. గాయని స్వర్ణలత తన పేరులో ఉన్నట్టుగానే ఆమె ఒళ్లంతా స్వర్ణమయం. ఆమె దేహమంతా బంగారంతో నిండి ఉంటుంది. ఆమెకు ఏడువారాల నగలు, వడ్డాణం, నలభై బంగారు గాజులు ఉండేవి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ నగలు అలంకరించుకుని మరీ వెళ్లేవారు. చిన్నతనం నుండే సంగీతం పట్ల మక్కువ పెంచుకుని, సంగీతం నేర్చుకుని, రంగస్థలం ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా, ఆకాశవాణిలో గాయనిగా కూడా రెండు, మూడు సంవత్సరాలు పనిచేశారు.

ఆమె రంగస్థలం ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచార గీతాలు విరివిగా పాడిన ప్రత్యేకత కూడా ఆమె సొంతం. తొలి రోజులలో గాయనిగానే కాకుండా స్వర్ణలత సుమారు 15 చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించారు. తాను నేపథ్య గాయనిగా అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న 1972 వ సంవత్సరంలో క్రైస్తవ మతపరమైన విశ్వాసాలతో స్వచ్ఛందంగా సినిమా రంగం నుండి విరమించుకున్నారు. ఆ తరువాత పది సంవత్సరాలు క్రైస్తవ భక్తి గీతాలు, క్రైస్తవ కచేరీలు మాత్రమే చేస్తూ వచ్చారు. 10 మార్చి 1928 నాడు జన్మించిన స్వర్ణలత తన 69 వ పుట్టినరోజు 10 మార్చి 1997 నాడు ప్రయాణంలో ఉండగా దోపిడి దొంగల దాడికి గురై ఈ లోకం నుండి నిష్క్రమించడం చాలా విచారకర సంఘటన.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  బాలవెల్లి మహాలక్ష్మి

ఇతర పేర్లు  :    స్వర్ణలత

జననం   :     10 మార్చి 1928

స్వస్థలం :    చాగలమర్రి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి   :    నేపథ్య గాయని, రంగస్థలం నటి

తండ్రి    :   రామ సుబ్బన్న

తల్లి      :    సుబ్బమ్మ 

జీవిత భాగస్వామి :   అమరనాథ్ రాజ్ 

పిల్లలు      :    ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు

మరణ కారణం    :     హత్య

మరణం      :     10 మార్చి 1997, మద్రాసు

*నేపథ్యం*…

స్వర్ణలత అసలు పేరు మహాలక్ష్మి. 10 మార్చి 1928 నాడు కర్నూలు జిల్లా చాగలమర్రిలో జన్మించారు. నాన్న రామసుబ్బన్న, తల్లి పేరు సుబ్బమ్మ. తల్లిదండ్రులకు మహాలక్ష్మి పెద్ద కుమార్తె. ఈమెకు ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెల్లు. మహాలక్ష్మికి ఊహ తెలిసే సమయానికి వాళ్ళ నాన్న కుటుంబాన్ని కడప జిల్లా ప్రాద్దుటూరుకు మార్చారు. వారికి అక్కడ 200 ఎకరాల పొలం ఉండేది. అక్కడే ఒక హోటల్ ను కూడా నడుపుతూండేవారు. వారికి కొన్ని లారీలు కూడా ఉండేవి. వారికి ఆరుగురు సంతానం ఉన్నారు.మహాలక్ష్మికి పాటలు పాడడం అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆమెకు సంగీతం అన్నా కూడా ఆసక్తి చూపించేవారు.

అలా ఆమెకు సంగీతంపై గల ఆసక్తిని గమనించిన వాళ్ళ నాన్న ఆమెను “ఫిడెల్ సుబ్బన్న” దగ్గర సంగీత శిక్షణకు పంపించారు. అప్పటికీ ఆమె వయస్సు అయిదు సంవత్సరాలు. ఆయన శాస్త్రీయ సంగీతంతో పాటు వయోలిన్ లో కూడా శిక్షణ ఇచ్చేవారు. ఇలా ఆమె వయస్సు 13 సంవత్సరాలు వచ్చేవరకు కొనసాగింది. అలాగే శాస్త్రి అనే నాట్యాచార్యుని వద్ధ నాట్యం కూడా నేర్చుకున్నారు. ఆమె తన చదువు ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యేలోపు, నాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆమెకు తాను ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉండగానే సొంతంగా గాత్రకచేరి చేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత 12 యేండ్ల వయస్సులో కొల్లాపూర్ రాజా వారి సంస్థానంలో శాస్త్రీయ సంగీత కచేరి చేసి, రాజా వారు ఇచ్చిన బంగారు నాణేలతో బంగారు ఆభరణాలు కూడా చేయించుకున్నారు. ఆ ఆభరణాలను చాలా సంవత్సరాల ధరించారు.

*ఆకాశవాణి లో గాయనిగా*…

ఆమెకు సంగీతంలో ప్రావీణ్యత, ఆమె చక్కని కంఠం వలన ఆమెకు నాటకాలలో నటించే అవకాశం కూడా వచ్చింది. ఆమె ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు “సతీసక్కుబాయి”, “శ్రీకృష్ణతులాభారం”, “తారా శశాంకం” లాంటి సంగీత ప్రధానమైన నాటకాలలో నటించారు. ఒకవైపు చదువు, మరోవైపు సంగీత శిక్షణ, ఇంకోవైపు నాట్య శిక్షణ, వాటితో పాటు నాటకాల ప్రదర్శన ఇన్నింటిలో మహాలక్ష్మి బాల్యం ఖాళీ లేకుండా గరిచిపోయింది. ఆమె నటనకంటే గాయనిగా స్థిరపడిపోతుందని నమ్మిన వ్యక్తి “కొండ సుంకేసుల కమాల్”. ఆయన మహాలక్ష్మిని మద్రాసు పంపించాల్సిందిగా తండ్రి రామసుబ్బన్నను కోరగా, ఆమెకు తోడుగా మహాలక్ష్మి తల్లి సుబ్బమ్మను పంపించారు. కొండ సుంకేసుల కమాల్ ను గురువుగా భావించేవారు మహాలక్ష్మి. కమాల్ ఆమెకు 1945 సంవత్సరంలో మద్రాసులో ఆకాశవాణిలో గాయనిగా అవకాశం ఇప్పించారు. 

ఆకాశవాణిలో గాయనిగా అవకాశం వచ్చేటప్పటికి మహాలక్ష్మి వయస్సు 17 సంవత్సరాలు. గాయనిగా ఆమెకు వచ్చే పారితోషికంతోనే ఆమె జీవనం కొనసాగేది. అలా ఆమె ఆకాశవాణిలో గాయనిగా రెండు సంవత్సరాలు కొనసాగింది. ఆ రోజులలో గ్రామ్ ఫోన్ రికార్డు వారు రంగస్థలం గాయనీ, గాయకుల చేత పాటలను రికార్డు చేయించేవారు. హెచ్.ఎం.వి కంపెనీ వారు ఆకాశవాణిలో గాయనిగా ఉన్న మహాలక్ష్మిని సంప్రదించి ఆమెతో కూడా గ్రామ ఫోన్ రికార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. 1946 – 47 ప్రాంతంలో మాస్టర్ వేణు, సాలురి రాజేశ్వరరావుల సంగీత దర్శకత్వంలో మహాలక్ష్మి ఇచ్చిన గ్రామ ఫోన్ రికార్డులు ఇచ్చారు. “కనవోయి నవ యువత, కలిసి పోదాము రావోయి”, “లేపనైనా లేప లేదే రాధిక” లాంటి పాటలు ఈమె పాడినవే. ఆ గ్రామ్ ఫోన్ రికార్డులు విపరీతంగా అమ్ముడయ్యాయి. ఆ విధంగా ఆమెకు గ్రామ్ ఫోన్ రికార్డులలో కూడా మంచి పేరు వచ్చింది. ఇలా రెండు, మూడేళ్లు గడిచింది.

*చిత్ర రంగంలో గాయనిగా*...

ప్రముఖ హస్యనటులు కస్తూరి శివరావు స్వయంగా నిర్మించిన “పరమానందయ్య శిష్యులు” (1950) సినిమాకు సంగీత దర్శకులు ఓగిరాల రామచంద్రరావు. ఆయనతో పరిచయం ఉన్న “కొండ సుంకేసుల కమాల్” వారి దర్శకత్వంలో పాడడానికి మహాలక్ష్మిని సిఫారసు చేశారు. అప్పటికే ఆమె ఆకాశవాణిలో పాడుతుందడం వలన వారు అభ్యంతరం తెలపకుండానే అంగీకరించారు. దాంతో ఆమెకు చిత్రరంగంలో పరమానందయ్య శిష్యులు (1950)  తో మహాలక్ష్మికి గాయనిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే మహాలక్ష్మి పేరు స్వర్ణలతగా మార్చారు. ఈ సినిమాలో ఆమె పాడిన పాట “పోలిక రాదా గురుతే లేదా ఎటులో గదా మనో వ్యధ “. సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తితో కలిసి ఈ పాటను పాడారు. అలాగే ఈ సినిమాలో ఆమె ఒక చిన్న పాత్ర కూడా పోషించారు.

06 అక్టోబరు 1950 నాడు పరమానందయ్య శిష్యులు సినిమా విడుదలైంది. దానికంటే ముందుగానే విడుదలైన “మాయా రంభ” (1950) లో కూడా స్వర్ణలత ఓ పాట పాడారు. ఈ చిత్రానికి ఓగిరాల రామచంద్రరావు సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో కస్తూరి శివరావు పాత్ర పేరు చంపక. ఆయనతో కలిసి స్వర్ణలత యుగళగీతం పాడారు. “రాత్రి పగలనక నీవు రంగు రింగు చేసుకొని రాకపోకలేలనే రమణీ ముద్దుల రమణీ” అని కస్తూరి శివరావు పాడితే, “కారు మబ్బులు వచ్చే ఏరు మీద ఏరు వచ్చే ఏరు వెంట నావ లేక ఇంత రేతిరాయెరా” అని స్వర్ణలత పాడారు. మాయా రంభ (1950) చిత్రం పరమానందయ్య శిష్యులు సినిమా కంటే ముందుగానే 02 సెప్టెంబరు 1950 నాడు విడుదలయ్యింది. మాయా రంభ (1950) చిత్రం ఎన్టీఆర్ నటించిన తొలి పౌరాణికమైతే, పరమానందయ్య శిష్యులు అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం. ఈ రెండు సినిమాలలో స్వర్ణలత పాడిన పాటలతో ఒక మంచి గాయని చిత్ర పరిశ్రమకు దొరికిందని తెలిసిపోయింది.

*హాస్య గీతాలకు చిరునామా స్వర్ణలత*…

పరమానందయ్య శిష్యులు (1950), మాయా రంభ (1950) సినిమాలలో పాటలు పాడడంతో ఆమెకు మెల్లిమెల్లిగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తరువాత “సారథి ఫిలిమ్స్” వారు “అగ్ని పరీక్ష” (1951) సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో ఆమె యం.యస్. రామారావు తో కలిసి “ఓ గిలిబిలి వలపుల రాణి” అనే హాస్య గీతం పాడారు. “జిలిబిలి వలపుల రాణి మనసా ఓ కోయెసాని” యం.యస్. రామారావు పాడితే, “చాలు చాలు నా దరికి రాకురా, నీ వగలు తెగులు మానరా” అని స్వర్ణలత పాడారు. ఈ పాట ఒకే శృతిలో కాకుండా భిన్న శృతులలో పాట కొంతసేపు వేగంగా, కొంతసేపు నెమ్మదిగా సాగుతుంది. ఈ పాట విన్న ఎవరికైనా ఇది ఆమె మూడవ చిత్రం అంటే నమ్మలేరు కూడా. హాస్య గీతానికి కావలసిన చురుకుతనం, చిలిపితనం ఇవన్నీ స్వర్ణలతకు సమపాళ్లలో అబ్బినాయి అని చెప్పాలి. ఆమెకు పూర్వాభ్యాసం (రిహార్సల్) అవసరం లేకుండానే ఆమె సంగీతానికి తగిన విధంగా పాడగలుగుతున్నారు.

సంగీత దర్శకులకు ఆమె అభిమాన గాయనీమణి అయ్యారు. ముఖ్యంగా పెండ్యాల నాగేశ్వరావు, ఘంటసాల రాజేశ్వరరావు, టీ.వీ.రాజు మొదలైన సంగీత దర్శకులకు ఆమె అభిమాన పాత్రులయ్యారు. విజయా వారి చిత్రాలలో దాదాపు హాస్య గీతాలన్నీ స్వర్ణలత పాడినవే. అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే (పెళ్లి చేసి చూడు), “విన్నావటమ్మా ఓ యశోదమ్మా” (మాయాబజార్), “ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక”, “కాశీకి పోయాను రామాహరి, గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి” (అప్పుచేసి పప్పుకూడు),  “కొప్పునిండా పూవులేమే కోడలా కోడలా నీకెవరు ముడిచినారే”, “ఆశా ఏకాశా నీనీడను మేడలు కట్టేశా చింతలూ, రెండు చింతలూ నా చెంతకాదు నీ తంతులు” (జగదేకవీరుని కథ), “ఆడనీవు ఈడనేను సూసుకుంటు కూసుంటే ఎన్నాళ్ళు”, మరొక గాయని సుశీలతో కలిసి “నీవు మాకు చిక్కినావులే రాజా మేము నీకు దక్కినాములే” (సత్య హరిచంద్ర) వంటి పాటలు పాడారు.

*రెండు దశబ్దాలు పాటలతో అలరించి*…

హాస్య గీతాలు కాకుండా స్వర్ణలత పాడిన మామూలు పాటలు కొన్నిటిని మనం పరిశీలన చేస్తే “శ్రీ వెంకటేశ్వర మహత్యం” (1960) సినిమాలో  “చిరు చిరు నగవుల చిలికే తండ్రి” పాటను శాంతకుమారితో కలిసి స్వర్ణలత పాడారు. జల్సారాయుడు (1960) సినిమాలో ఆరుద్ర వ్రాసిన “రాకు రాకు రాకు నా దగ్గరికి షాకు తగిలేను” పాటను పిఠాపురం నాగేశ్వరావుతో, రాణి రత్నప్రభ (1960) లో కొసరాజు వ్రాసిన “నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న”, “విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా” పాటలు ఘంటసాలతో, ఉయ్యాల జంపాల (1965) సినిమాలో “రుక్మిణమ్మా రుక్మిణమ్మా కృష్ణమూర్తితో నువ్వు కులికావమ్మా” పాటను సుశీల బృందంతో, పవిత్ర బంధం (1971) సినిమాలో కొసరాజు వ్రాసిన “తంత్రాల బావయ్య రావయ్యా నీ మంత్రాలకు” పాటను పిఠాపురం నాగేశ్వరావుతో కలిసి వెండితెరపై గాయనిగా తన స్వర సంతకాలు చేశారు స్వర్ణలత.

రాజ్యం ప్రొడక్షన్స్ వారి హరిశ్చంద్ర (1956) సినిమాకు లక్ష్మీరాజ్యం కోసం స్వర్ణలత పాడిన “శ్రీమన్ మహా యఙ్ఞ్నమూర్తి జగజ్జాల రక్షా” లాంటి స్వరాన్ని విన్నప్పుడు ఆమెను మాములు పాటలకు కూడా స్వర్ణలత స్వరాన్ని వినియోగించుకుంటే ఎన్ని పాటలు వచ్చేవో అనిపిస్తుంది. అలాగే హరిశ్చంద్ర (1956) సినిమాలో “అయ్యో ఇదేం న్యాయమో అయ్యో ఇదేం ఘోరమో” పాట వింటుంటే గాయనిగా హాస్యపాటలే కాదు స్వర్ణలతలోని మరొక కోణం కూడా అర్థమవుతుంది. నందినీ ఫిల్మ్‌స్ బ్యానర్‌ వారి అత్తలు కోడళ్లు (1971) సినిమాలో తన తరువాత తరం గాయకులు యస్.పి.బాలసుబ్రమణ్యంతో కూడా కలిసి “బలే బలే బావయ్య” అనే పాటను పాడారు. స్వర్ణలత చిట్టచివరిగా 1972 లో జయంతి నటిగా వచ్చిన చిత్రంలో పాడారు. ఆమె 1950 నుండి 1972 వరకు వరకు రెండు దశాబ్దాలలో, ఎనిమిది భాషలలో ఎన్నో వేల పాటలు పాడారు. ఎన్నో రంగస్థలం కచేరీలు చేశారు. ఎన్నో  గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చారు. 1972 తరువాత ఆమె సినిమా గీతాలకు స్వస్తి పలకడం విశేషం, అది ఆమె వ్యక్తిగత విషయం.

*బంగారం అంటే ఆమెకు ఇష్టం*…

భర్త అమరనాథ్ రాజ్ వాళ్ళది పాండిచ్చేరి. వారిది వ్యాపారవేత్తల కుటుంబం. మొదటి నుంచి స్వర్ణలత రంగస్థలం కచేరీల నుండి గానీ, గ్రామ ఫోన్ రికార్డుల నుండి గానీ,సినిమాల నుండి గానీ వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా పెట్టుబడులుగా మారుస్తూ వచ్చారు. బంగారం కొనడం, ఇళ్ళు కొనుక్కోవడం వంటి వాటిమీద పెట్టుబడులు పెట్టారు. ఆమెకు తన వివాహానికి ముందే మద్రాసులోని నార్త్ భోగ్ రోడ్డులోని 41వ నెంబరులో అతి పెద్ద మేడ కట్టించారు. అలాగే మద్రాసులో రెండు ఇళ్ళు, బెంగళూరులో రెండు ఇళ్ళు కొన్నారు. స్వర్ణలత అనే ఆమె పేరుకు తగ్గట్టుగానే బంగారం కూడా కొనుగోలు చేసేవారు. తన సంపాదనలో అధిక భాగం బంగారం కొనడానికి వెచ్చించారు.  ఆమె దగ్గర నలభై బంగారు గాజులు, ఏడు వారాల నగలు, వడ్డానం ఉండేవి. అవన్నీ ధరించి అడుగేస్తే, ఆమె నిజంగానే నడుస్తున్న స్వర్ణలతగా ఉండేవారు. ఏడు వారాల నగలను వివిధ రకాల కలయికలో అమర్చుకుని పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు. ఆమె పాటలు పాడేటప్పుడు బంగారు గాజులు శబ్దం చేస్తున్నాయని రికార్డిస్టు చెబితే వాటిని దారంతో కట్టేవాళ్ళు, అంతే గానీ వాటిని చేతుల నుంచి తీసే వాళ్ళు కాదు. కానీ ఆమె అమితంగా ఇష్టపడ్డ బంగారమే ఆమె ప్రాణాలను హరించుకు పోతుందని ఆమె ఊహించలేదు. ఆమెనే కాదు ఇంకెవ్వరూ ఊహించలేదు.

*ఆప్తులకు సాయం చేస్తూ*…

ఒక గాయనిగానే కాదు, ఒక ఒక గృహిణిగా, ఒక తల్లిగా ఆమె నిర్వర్తించిన బాధ్యత అమోఘం అని చెప్పాలి. తమ సమకాలీన గాయనీ, గాయకులతో పోల్చి చూస్తే ఆమె సాధించిన విజయం అద్వితీయం. ఆమెకు డబ్బు సంపాదించడమే కాదు అవసరమైన వారికి సాయం కూడా అందించేవారు. ఒకసారి ఆమె హాజరైన పెళ్లి వేడుకలో వరుడు కట్నం పూర్తిగా ఇస్తేనే తాళి కడతానని మొండికేసిన సమయంలో తన రెండు బంగారు గాజులు ఇచ్చి ఆ పెళ్లి జరిపించేశారు. అలాగే తన తమ్ముళ్లు, చెల్లెళ్లకు కూడా సాయం అందించేవారు. వారిని కూడా జీవితంలో స్థిరపడేలా చేశారు. అలాగే తనను సినీ ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తన వృత్తి జీవితానికి కూడా దోహదం చేసిన కొండ సుంకేసుల కమాల్ కుటుంబాన్ని కూడా ఆమె ఎంతో ఆదుకున్నారు. స్వర్ణలత తదనంతరం, ఆమె మరణించిన 27 సంవత్సరాల తరువాత కూడా కొండ సుంకేసుల కమాల్ పిల్లలకు స్వర్ణలత చిన్నబ్బాయి అనిల్ రాజ్ తమ ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇది స్వర్ణలత పెంపకానికి, కృతజ్ఞత భావాలకు, వారి స్వచ్ఛమైన అనుబంధాలకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. జీవిత మలిదశలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సురభి బాల సరస్వతి క్షేమసమాచారాలను కూడా స్వరలత చూసుకున్నారు. 

*క్రైస్తవ మతం స్వీకరించి*…

స్వర్ణలత పెద్దమ్మాయి పేరు చాముండేశ్వరి దేవి. ఆమెకు బాల్యంలో మాటలు వచ్చేవి కాదు. తండ్రి అమరనాథ్ రాజ్ వైద్యులే (డాక్టరు). అయినా ఏం చేయలేకపోయారు. ఎంతో మంది వైద్యులకు చూపించినా కానీ ఫలితం శూన్యం. ఆమెను ఎన్నో దేవాలయాలకు తీసుకెళ్లేవారు స్వర్ణలత. అయినా కూడా మాటలు రాలేదు. ఒకనాడు సంగీత దర్శకులు మాస్టర్ వేణు భార్య శకుంతల చాముండేశ్వరి దేవిని చర్చికి తీసుకెళ్ళమని స్వర్ణలతకు సలహా ఇచ్చారు, కానీ ఆమె పట్టించుకోలేదు. చేసేది లేక ఒకరోజు శకుంతలనే దగ్గరుండి మరీ చాముండేశ్వరి దేవిని చర్చికి తీసుకెళ్లారు. ఆమెకు నెమ్మదిగా మాటలు రావడం మొదలయ్యాయి. దాంతో తరుచూ చర్చికి వస్తూండడంతో ఆమె పేరు మరియమ్మగా నామకరణం చేసుకున్నారు. పేరు మార్చుకోవడమే కాకుండా క్రైస్తవ మతం కూడా తీసుకున్నారు. పాల్ అనే ఒక క్రైస్తవుడిని పెళ్లి చేసుకుని హైదరాబాదులో స్థిరపడ్డారు. 

స్వర్ణలత తన కూతురు మరియమ్మ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉండేది. అలా క్రమక్రమంగా ఆమె కూడా క్రైస్తవ మతం వైపు మొగ్గుచూపుతూ 1976లో పూర్తిగా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అప్పటి నుండి స్వర్ణలత సినిమాలలో సినిమా పాటలు పాడడం మానేసి క్రైస్తవ పాటలు పాడటం మొదలుపెట్టారు. అలా ఆ తరువాత 20 సంవత్సరాలలో పూర్తిగా క్రైస్తవ గీతాలే ఆమె పాడారు. ఆరాధన, ఆణిముత్యాలు వంటి పేరుతో భక్తి గీతాలు కూడా విడుదల చేశారు. అప్పుడప్పుడు యస్.జానకి ఇంటికి మాత్రమే వెళ్లేవారు. అంతే తప్ప చిత్రపరిశ్రమకు సంబంధించిన వారి ఇళ్లకు కానీ, సినిమా వేడుకలకు కానీ హాజరు అయ్యేవారు కాదు. ఆమె చిత్ర పరిశ్రమకు చెందిన ఎవ్వరితోనూ సంబంధాలు లేకపోవడం వలన ఆమె వివరాలు కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియవు. స్వర్ణలత చిన్నబ్బాయి నటరాజుకు జరిగిన కొన్ని అనుభవాలు, అనారోగ్యం నుండి కోలుకోవడం లాంటి సంఘటనలు అనంతరం ఆయన కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించి అనిల్ రాజ్ అయ్యారు. నృత్యదర్శకుడి వృత్తికి స్వస్తిచెప్పి క్రైస్తవ మత బోధకుడిగా మారిపోయారు.

*వ్యక్తిగత జీవితం, కుటుంబం*..

గాయనిగా స్థిరపడ్డ స్వర్ణలతకు సినిమా అవకాశాలు బాగా పెరిగిపోయాయి. దాంతో ఆమె అమ్మ నాన్నలు కూడా ఆమెతో బాటు మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. ఆమెకు ఎప్పుడైనా అస్వస్థగా ఉన్నప్పుడు ఆమె ఇంటికే వైద్యులు వచ్చి వైద్యం చేసి వెళ్లేవారు. అలా వైద్యం చేయడానికి వైద్యులు అమరనాథ్ రాజ్ (మద్రాసు జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేసేవారు) కూడా వచ్చేవారు. ఆయన అప్పుడప్పుడు స్వర్ణలత ఇంటికి వస్తూ ఉండడం వలన స్వర్ణలత, అమరనాథ్ రాజ్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రణయంగా మారింది. ఆ ప్రణయం వారి ప్రేమ వివాహానికి దారితీసింది. దాంతో 22 మే 1956 నాడు డాక్టర్ అమరనాథ్ రాజ్, స్వర్ణలతలు వివాహంతో భార్యాభర్తలు అయ్యారు. స్వర్ణలత, డాక్టర్ అమరనాథ్ రాజ్ లకు 9 మంది సంతానం. వారిలో ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

*తండ్రితో కలిపి ఆరుగురు వైద్యులు*…

భర్త అమరనాథ్ రాజ్ వైద్యులు (డాక్టరు) గనుక వారితో సమానంగా నలుగురు అబ్బాయిలను, ఒక అమ్మాయిని డాక్టర్ లను చేశారు. ఒకే ఇంట్లో అయిదుగురు పిల్లలు, ఒక తండ్రి వైద్యులు (డాక్టర్లు) అన్నమాట. పెద్దబ్బాయి ఆనంద్ రాజ్ తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖ ప్రతినాయకులు.  పెదరాయుడు, గ్యాంగ్ లీడర్, సూర్యవంశం, బావ బామ్మర్ది సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన తమిళంలో వందలాది చిత్రాలలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు. అరుణరాజ్ (డాక్టరు), శేఖర్ (డాక్టరు), బాలాజీ (డాక్టరు), అమృత్ రాజ్ (డాక్టరు), అందరు అమెరికాలో స్థిరపడ్డారు. 

అందరికంటే చిన్నబ్బాయి అనిల్ రాజ్ (ఆయన అసలు పేరు నటరాజు) 1980 – 90 లలో తెలుగు సినిమాలలో నృత్యదర్శకుడిగా ఉన్నారు. “చిల్లర కొట్టు చిట్టెమ్మ” సినిమాలో మాడాతో నృత్యం కూడా చేశారు. “ఆల్ రౌండర్” సినిమాల్లో “అత్తరు సాయబో రారా” పాటతో నృత్య దర్శకుడిగా మారారు. జయం సినిమాలో “రాను రానంటూనే చిన్నదో” పాటతో సహా మొత్తం 70 పాటలకు నృత్య దర్శకత్వం వహించారు. అమ్మాయిలలో పెద్దమ్మాయి చాముండేశ్వరి (మరియమ్మ గా పేరు మార్చుకున్నారు) ప్రస్తుతం శంషాబాద్ లోని ఒక చర్చిలో మతబోధకురాలుగా ఉన్నారు. రెండవ అమ్మాయి ఎస్తరాణి (డాక్టరు), ఆమె భర్త కూడా డాక్టరు. వారిరువురు అమెరికాలో స్థిరపడ్డారు. ఆఖరి అమ్మాయి విజయ. ఆమె గాయనిగా కొన్ని పాటలు కూడా పాడారు. దురదృష్టవశాత్తు పెళ్లి కాకుండానే ఆమె అతి చిన్న వయస్సులోనే మరణించారు.

*హత్యాయత్నం*…

కొన్నిసార్లు కొందరు సంపాదించిన సంపద, వారి ఆహార్యం వారికి సమస్యలను తెచ్చిపెట్టడమే కాకుండా వారికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. గాయని స్వర్ణలత జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె జీవిత మలిదశలో చివరి ఐదు రోజులు అత్యంత విషాదకరంగా మారిపోయాయి. బహుశా ఇలాంటివి మరెవరి జీవితంలోనో జరిగి ఉండకపోవచ్చు. ఆమె సంతానంలో ఒకరు చనిపోగా మిగిలిన ఎనిమిది మంది ఆర్థికంగా స్థిరపడ్డారు. మద్రాసులోని నార్త్ బోవ్ లో గల తన పెద్ద బంగళాను ఆ రోజులలోనే ఆరు కోట్ల డెబ్భై లక్షల రూపాయలకు అమ్మేసి, ఆ ఆస్తిని తన పిల్లలందరికీ కూడా సమానంగా పంచేశారు స్వర్ణలత. ఆ తరువాత ఆమె తన చిన్న కొడుకు అనిల్ రాజ్ ఇంట్లోనే ఉండేవారు. 1997 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమెరికా వెళ్లి న్యూయార్క్ నగరంలో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి తిరిగి వచ్చారు. 

హైదరాబాదులో ఉంటున్న తన పెద్ద కూతురును చూడడానికి 05 మార్చి1997 నాడు మద్రాసు నుండి కారులో బయలుదేరి వెళ్లారు. ఆమెతో పాటు డ్రైవరు, చిన్న కొడుకు అనిల్ రాజ్ కూడా ఉన్నారు. ఎప్పటిలాగే ఆమె తన 40 బంగారు గాజులు, ఏడువారాల నగలు, వడ్డాణం ధరించి వెళ్లారు. ఒక అర్థరాత్రి వేళ, ఆమె కారుపై ఎవరో దాడి చేశారు. అనిల్ రాజ్, స్వర్ణలత, డ్రైవరును కొట్టి, ఆమె వద్ధ ఉన్న నగలను, నాలుగున్నర లక్షల నగదును లాక్కెళ్లారు. అనిల్ రాజ్ స్పృహ కోల్పోయారు. స్వర్ణలతకు బాగా దెబ్బలు తలిగాయి. పొలాల్లో ఉండే రైతులు ఆ సన్నివేశాన్ని గమనించి రోడ్డు మీదికి పరిగెత్తుకొచ్చేసరికి ఆ దొంగలు పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న ఆ ముగ్గురిని చూసి కారులో ఎక్కించేసి వారిని తిరిగి మద్రాసుకు పంపించేశారు. 

*నిష్క్రమణం*…

వారు కోలుకున్నారు. అనిల్ రాజ్ మరియు డ్రైవరుకు పెద్దగా గాయలేమీ లేవు. కానీ స్వర్ణలతకు మాత్రం ఒంటికి కనపడని గాయాలు తగిలాయి. 08 మార్చి 1997 నాడు కారు డ్రైవరు, అనిల్ రాజ్, స్వర్ణలతను ఆసుపత్రి నుండి ఇంటికి పంపించేశారు. 10వ తేదీ మార్చి నాడు స్వర్ణలత పుట్టినరోజు. 09వ తేదీ నాడు స్వర్ణలతకు గాయని సుశీల ఫోన్ చేసి రేపు నీ పుట్టినరోజు కదా! నేను అక్కడికి వచ్చేస్తాను అన్నారు. దానికి సమాధానంగా “అప్పటిదాకా బ్రతికి ఉండాలి కదా! ప్రభు దగ్గర నుండి పిలుపు వస్తే వెళ్ళిపోవాల్సి వస్తుంది” అన్నారామె. ఏ ఉద్దేశంతో ఆమె ఆ మాట అన్నారో ఏమో తెలియదు. కానీ 10 మార్చి 1997 ఆమె పుట్టినరోజు. సరిగ్గా అదే రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఈ లోకం నుండి స్వర్ణలత నిష్క్రమించారు. స్వర్ణలత కన్ను తెరిచిన రోజు సమయం, ఆమె కన్ను మూసిన రోజు సమయం ఒక్కటే కావడం అది కూడా మార్చి 10 వ తేదీ కావడం యాదృచ్చికం, విశేషం కూడనూ. హాస్య గీతాలతో అలరించి, క్రైస్తవ గీతాలతో అభిమానులను మెప్పించిన స్వర్ణలత సంగీత జీవితం, మత విశ్వాస జీవితం ఇలా ముగించడం దారుణం.

Show More
Back to top button