CINEMATelugu Cinema

తెలుగు సినిమా చరిత్రలో సంభాషణల నిధి.. త్రిపురనేని మహారథి.

మనిషికి విపరీతమైన వత్తిడి నుండి, అనేకరకమైన బాధల నుండి కొంత ఉపశమనం కలిగించే మాధ్యమం సినిమా. అందులోని హాస్యం గానీ, నృత్యాలు గానీ, పాటలు గానీ, పోరాట సన్నివేశాలు గానీ చూస్తున్నంతసేపు మనిషిని బాధల నుండి ఆనందలోకం లోకి తీసుకెళ్లగలిగేది కూడా సినిమానే. ఆ సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించగలుగుతుంది, ఆ సినిమా విజయవంతం అవుతుంది కూడా. అలాంటి సినిమాను ప్రజలలోకి, ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం ఉన్న విభాగంలో సంభాషణల రచన ఒకటి. విజయవంతమైన ఏ సినిమాను తీసుకున్నా, అజరామర చిత్రాలని మనం పరిశీలించినా వాటిల్లో సంభాషణల ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది.

అలా సంభాషణలను, మాటలను ప్రేక్షకుల హృదయాలలోకి చొచ్చుకుపోయి వారి మనసులని రంజింపజేయగల రచయిత త్రిపురనేని మహారథి. అప్పట్లో జనం వెండితెరపై రచయితల టైటిల్ కార్డు చూసి కూడా చప్పట్లు కొట్టేవారు. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో ప్రముఖులు త్రిపురనేని మహారథి. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో తెలుగు సినిమాలలో “నేరుగా కథ చెప్పడమే” ఒకప్పుడు ప్రధానంగా ఉండేది. కానీ అందులోనూ స్క్రీన్ ప్లే ను కూడా చొప్పించి సినిమాను మరింత రంజింపజేయవచ్చునని తలచిన రచయితలలో త్రిపురనేని మహారథి కూడా ఒకరు.

పెత్తందారులు, నిలువుదోపిడి, కంచుకోట, ప్రజారాజ్యం, దేశోద్ధారకులు, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన మాటలు వ్రాశారు. త్రిపురనేని మహారథి సంభాషణలు వ్రాసిన “అల్లూరి సీతారామరాజు” సినిమా కృష్ణ 100వ సినిమాగా విడుదలై భారీ విజయాన్ని చవిచూసి, 19 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిందంటే మహారథి వ్రాసిన సంభాషణల పరంపర ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకోవడంతో పాటు “ఆఫ్రో – ఏషియన్” చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడి బహుమతి కూడా పొందింది.

కలం బలం తెలిసిన దర్శకులు వి.మధుసూదనరావుతో కొంతకాలం ప్రయాణం చేసి ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “రక్తసంబంధం” చిత్రానికి పనిచేశారు. అదే సంస్థ నందమూరి తారకరామారావు తోనే తెరకెక్కించిన “బందిపోటు” సినిమాతో పూర్తిస్థాయి రచయితగా మహారథికి మంచి పేరు లభించింది. అలాగే యన్టీఆర్ సమీపబంధువు యు.విశ్వేశ్వరరావు తెరకెక్కించిన “నిలువుదోపిడి”, “కంచుకోట”, “దేశోద్ధారకులు”, “పెత్తందార్లు” చిత్రాలకు మహారథి చేసిన రచన ఎనలేని గుర్తింపును సంపాదించిపెట్టింది. కథానాయకులు కృష్ణ నిర్మించిన “దేవుడు చేసిన మనుషులు” చిత్రానికి మహారథి చేసిన రచన వెన్నుదన్నుగా నిలచింది.

మహారథి తన సినిమా ప్రస్థానంలో కృష్ణ సినిమాలకే వరుసగా మాటలు రచయితగా ఉంటూ, వారితోనే ప్రయాణం కొనసాగడం వలన కాబోలు ఆయనకు ఇతర చిత్రాల అవకాశాలు సన్నగిల్లాయి. అయినా కూడా తన వద్దకు వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకుంటూ ఇతర చిత్రాలకు తనదైన పంథాలో మాటలు పలికించారు మహారథి. ఆయన తన రచనలతో సినిమా కొత్త పుంతలు తొక్కాలని నిత్యం తపించేవారు. వేగంగా నడుస్తున్న ప్రపంచ సినిమాను అధ్యయనం చేసి, ఆ పోకడలను తెలుగు చిత్రాల్లోనూ ప్రవేశ పెట్టాలని ఆయన విపరీతంగా తపనపడేవారు.

మహారథి తన రచనలను పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో వ్రాస్తున్నారనీ చాలామంది విమర్శించేవారు. అయితే ఆ రచనలకే భవిష్యత్తులో “స్క్రీన్ ప్లే” కు విశేషమైన స్థానం ఉంటుందని త్రిపురనేని మహారథి ఆ రోజుల్లోనే చాటి చెప్పి, అదే తీరున రచనలు సాగించారు. దీనిని అనుసరించే కాబోలు  ఎంతోమంది తరువాతి తరం రచయితలు ఆయన బాణీనే అనుసరిస్తూ ముందుకుసాగారు. మహారథి సంభాషణలు వ్రాసిన చివరి సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “శాంతి సందేశం”. ఆయన చివరిసారిగా ఆ చిత్రానికి మాటలు వ్రాశారు. రాజకీయంగా ఆయన ఆరంభంలో జనతా పార్టీ నుండి ప్రాతినిథ్యం వహించినా కూడా, చివరలో సొంతంగా త్రిలింగ అనే రాజకీయ పార్టీని కూడా స్ధాపించారు. పార్టీ తరపున రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేసిన ఆయన తన ప్రసంగాలకు స్క్రిప్టు తానే వ్రాసుకునేవారు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  త్రిపురనేని మహారథి

ఇతర పేర్లు   :   బాల గంగాధరరావు

జననం   :     20 ఏప్రిల్ 1930

స్వస్థలం :    పసుమర్రు గ్రామం, గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా

వృత్తి   :         సినీ రచయిత

తండ్రి        :      సత్యనారాయణ

తల్లి          :     పుణ్యవతి

మరణం      :     23 డిసెంబరు 2011

నేపథ్యం…

వంద సంవత్సరాల క్రిందట కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబానికి చెందిన త్రిపురనేని సత్యనారాయణ కు ఇద్దరు భార్యలు. వారికి ఆడ సంతానం మాత్రమే ఉన్నారు. మగ సంతానం లేదు. దాంతో ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు పుణ్యవతి. ఆ దంపతులకు 20 ఏప్రిల్ 1930 నాడు ప్రమోదూత సంవత్సరం చైత్ర బహుళ సప్తమి ఆదివారం నాడు మగ సంతానంగా త్రిపురనేని మహారథి జన్మించారు. ఆయన అసలు పేరు త్రిపురనేని బాల గంగాధరరావు. భూస్వామ్య కుటుంబం చెందిన వాళ్ళ నాన్న అక్కడ కొన్ని ప్రాంతాలకు మునసబు. పాతిక గ్రామాల మీద ఆధిపత్యంతో ఏడు తరాల అష్టైశ్వర్యాలతో తులతూగిన కుటుంబం వారిది.

త్రిపురనేని మహారథికి బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నారు. చిన్నతనంలో పసుమర్రుకు చెందిన వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్న మాణిక్యాచార్యుల వారు మహారథికి అక్షరాభ్యాసం చేశారు. ఆయనకు ఇసుకలో అక్షరాలను దిద్దించారు. వీధి బడిలో చదువుకున్న ఆయనకు ఒక్కసారి వింటే చాలు విద్య బోధపడేది. అలా రెండు సంవత్సరాలకే నాలుగు తరగతులు పూర్తి చేశారు. తొమ్మిదో సంవత్సరం లోనే ఆయనను పామర్రు లోని బోర్డు పాఠశాలలో మొదటి ఫారంలో చేర్చారు. చిన్న వయస్సు లోనే ఇంటి వద్ద ఆయన రామాయణ, మహాభారతాలను చదివేశారు. ఎస్.ఎస్.ఎల్.సి కి వచ్చేసరికి ఆయన వయస్సు సరిపోలేదు. అందువలన ఆయనకు పరీక్ష వ్రాయడం ఇబ్బంది అయ్యింది. దాంతో వారి తండ్రి ఎలాగోలా ఒక వయస్సు ధ్రువీకరణ పత్రం సంపాదించి విజయవాడ మున్సిపల్ పాఠశాలలో చేర్పించారు.

“క్విట్ ఇండియా” ఉద్యమంలో తన వంతుగా…

ఎస్.ఎస్.ఎల్.సి లో పి.ఎస్.ఆర్ ఆంజనేయ శాస్త్రి, ప్రఖ్య శ్రీరామమూర్తి (ప్రఖ్యాత నాటక రచయిత) మొదలగు వారు  త్రిపురనేని మహారథి తరగతికి చెందినవారు. అందులో ప్రఖ్య శ్రీరామమూర్తి, త్రిపురనేని ఓకే బెంచ్ లో కూర్చునేవారు. క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న 1942 ప్రాంతంలో విజయవాడ మునిసిపల్ పాఠశాలలో విద్యార్థులకు విజయవాడకే చెందిన  వైద్యుల రమణారావు నాయకులుగా ఉండేవారు. పాఠశాల గోడల నిండా, అలాగే ఎదురుగా వున్న పార్కు గోడల నిండా “క్విట్ ఇండియా” అని ఆంగ్లములో మరియు తెలుగులో వ్రాయండి అని వారికి రమణ రావు చెప్పాడు. ఉద్యమంలో పాల్గొనేటంత పెద్ద వారు కాదు వాళ్ళు. చిన్న పిల్లలే కనుక గోడలపై అలా వ్రాస్తే చాలు అని చెప్పాడు.  వారు ముగ్గురు (త్రిపురనేని మహారథి మరియు ఇద్దరు మిత్రులు) తమ పాఠశాలకి ఎదురుగా ఉన్న పార్కు గోడల మీద వ్రాస్తున్నారు.

సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన ఒక పోలీసు కానిస్టేబుల్ “ఒరేయ్ సార్జెంటు వస్తున్నాడు “పారిపోండ్రా” అని అరిచాడు. ఆ ముగ్గురు పరుగు లంఘించుకున్నారు. అలా పరుగెత్తే క్రమంలో మహారథి క్రిందపడిపోయారు, ముఖం పగిలింది కూడా. ఆ కానిస్టేబుల్ చెప్పినట్లు నిజంగానే “సార్జెంట్” అనే ఆంగ్ల పోలీసు అధికారి పార్కు ప్రక్కనుండే వెళ్లిపోయారు. దాంతో మహారథి మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లి గోడలపై మిగిలిపోయిన అక్షరాలు వ్రాస్తుంటే “ఆ సార్జెంట్ మళ్ళీ వస్తాడు, తొందరగా కానివ్వు” అని ఆ కానిస్టేబుల్ మళ్ళీ అరిచాడు. “స్వదేశానికి, గాంధీ మహాత్ముడికి సేవ చేసే భాగ్యం లేని వాళ్ళం, బానిసలకు కూడు కూడా సహించదు” అని ఆ కానిస్టేబుల్ ఆ సందర్భంలో అన్నాడు. మహారథి తన జీవిత చరిత్ర వ్రాసుకున్నప్పుడు ఈ సంఘటనను పద్య రూపంలో వ్రాసుకున్నారు.

తండ్రి మరణం…

1941 – 1942 సంవత్సరాలలో అనుకోకుండా ఒకనాడు మహారథి వాళ్ళ దివాణం మొత్తం తగలబడిపోయింది. వాళ్ళ ఆస్తులు మొత్తం పోయాయి. చేసేది లేక వాళ్ళ నాన్న సత్యనారాయణ మరియు చిన్నాన్న కుటుంబాలతో కలిసి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామానికి వలస వచ్చేసారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా నాన్న, మహారథిని చదువు మన్పించలేదు. ఆయనను మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేర్చారు. ఆ కళాశాలలో కవి పాదుషా పువ్వాడ శేషగిరిరావు (తెలుగు అధ్యాపకులు) వద్ద పద్యాలు వ్రాయడం నేర్చుకున్నారు మహారథి. నిజానికి ఆయనది ఇంటర్మీడియట్ లో ఎం.పీ.సీ గ్రూపు అయినా కూడా, ఆయన అభిరుచి ఎక్కువగా సాహిత్యం మీద ఉండేది. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూండగానే నాన్న సత్యనారాయణ చనిపోయారు.

తండ్రి చనిపోయినా కూడా మహారథి చదువు ఆపకుండా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదివారు. కానీ అందులో తప్పారు. దాంతో ఇంటర్మీడియట్ పూర్తి కాలేదు. 1945 వేసవి సెలవులలో మహారథి కూడా నిజామాబాద్ జిల్లా ధర్మారం వచ్చేశారు. ఒకవైపు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడక ఇబ్బందులు ఎదుర్కొంటూనే, మరోవైపు అక్కాచెల్లెళ్ళ పెళ్లి బాధ్యతలు తనపై ఉండడంతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు మహారథి. అడవిలో ఉండే చెట్లను కొట్టి, తన తండ్రి మొదలుపెట్టి, ఆపేసిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దున్నపోతుల బండిపైనే ఎరువులు తెచ్చుకునేవారు. దున్నపోతులను కట్టి పొలం దున్ని సేద్యం చేసేవారు. ఒకవైపు సేద్యం చేస్తున్నా కూడా మరోవైపు చదువు మాత్రం మానలేదు. తెలుగు, ఆంగ్లం, జెర్మనీ సాహిత్యాలు చదివేవారు. “ఏ టైల్ అఫ్ టు సిటీస్”, “గుడ్ అర్త్” మొదలగు ఆంగ్ల నవలలు కూడా వాటిలో ఉన్నాయి. రెండేళ్లు వ్యవసాయం చేసిన తరువాత ఆ పొలం అమ్మేసి 1946 వ సంవత్సరంలో అక్క, చెల్లెలు ఇద్దరి పెళ్లిళ్లు జరిపించేశారు. దాంతో ఆయనకు వంట సామాగ్రి తప్ప ఇంకేమీ కూడా మిగలలేదు. 

దక్కన్ రేడియోలో ప్రకటనకర్తగా ఉద్యోగం…

పొలం అమ్మేసి అక్కకు, చెల్లికి పెళ్లిచేసిన తరువాత మహారథికి ఇల్లు, వంట సామాగ్రి మాత్రమే మిగిలింది. అప్పట్లో ఎక్కువగా రజాకార్ల గొడవలు ఎక్కువగా ఉండేవి. స్వతంత్ర్య భావాలు ఎక్కువగా ఉండే మహారథి ముక్కు సూటిగా మాట్లాడేవారు, దేనినైనా ఎదిరించేవారు. ఒకసారి ఆదిలాబాద్ జిల్లా లోని కాగజ్‌నగర్ మండలానికి చెందిన బోరేగాం గ్రామంలోని ఒక వంతెన దగ్గర ఒక యువతిని బలవంతంగా అనుభవిస్తున్న రజాకార్, వాడికి కాపలాగా ఉన్న మరో రజాకార్ కనిపించారు. తన మిత్రుడితో కలిసి అదే ప్రాంతం గుండా వెళుతున్న మహారథి ఆ సన్నివేశం చూసి కోపంతో ఇదేమి అన్యాయం అని ప్రశ్నించారు. దానికి కాపలాగా ఉన్న రజాకార్ కోపంతో బండబూతులు అందుకున్నాడు. అప్పుడు మహారథిని తన మిత్రుడు అక్కడినుండి లాక్కుపోయాడు. ఇదే విషయాన్ని డిచ్ పల్లిలో అమీన్ కు చెబితే, అతను పగలబడి నవ్వేసి “వాడికి అవకాశం వచ్చింది, అనుభవిస్తున్నాడు. నీకేమైంది? అని అమీన్ సమాధానం ఇచ్చాడు.

ఇలాంటి ఎన్నో సంఘటనలు చూసి తన గుండె రగిలిపోయేది. జనవరి 1947 స్వాతంత్రం రావడానికి కొంచెం ముందు   హైదరాబాద్ వచ్చేశారు మహారథి. అప్పట్లో హైదరాబాదు రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే స్థానిక ధ్రువీకరణ పత్రం అవసరం ఉండేది. స్థానిక ఉద్యోగాలకు స్థానికులే అర్హులు అని తెలిపే నియమం అక్కడ బలంగా ఉంది. దీనినే ముల్కీ అంటారు. ముల్కీ ధ్రువీకరణ ఉంటే హైదరాబాదులో ఉద్యోగం దొరికినట్లే. అందుకని ముందుగా ముల్కీ సర్టిఫికెట్ సంపాదించి నీటిని శుభ్రంచేసి సరఫరా చేసే వాటర్ వర్క్స్ లో క్లర్క్ గా ఉద్యోగం దొరకబుచ్చుకున్నారు. అందులో ఆరు నెలలు పనిచేశారు. ఆ తరువాత దక్కన్ రేడియోలో ప్రకటనకర్తగా ఎంపికయ్యారు. ఒకవైపు దక్కన్ రేడియోలో ప్రకటనకర్తగా ఉంటూనే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో రజాకార్ల నుండి తప్పించుకోవడానికి 1950 లో హైదరాబాదు నుండి దూరంగా పారిపోయారు.

అరణ్యవాసం…

దక్కన్ రేడియోలో ప్రకటనకర్త గా పనిచేసినంత కాలం ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను తెలంగాణ రైతంగ పోరాట నేతలకు అందించేవారు. ఈ విషయం చిన్నగా పోలీసులకు తెలిసింది. దీంతో వారు మహారథి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇది తెలిసిన మహారథి పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. అలా వారికి దొరకకుండా అరణ్యవాసం చేస్తూ ముందుగా ఆయన విజయవాడ వెళ్లారు. అక్కడి కొన్నిరోజులు ఉండి అక్కడనుండి మద్రాసు వెళ్లారు. మద్రాసు నుండి తిరిగి గుంతకల్లు వచ్చారు. అక్కడనుండి మళ్ళీ మద్రాసు ఇలా మూడేళ్లు తిరుగుతూనే ఉన్నారు. ఈ అరణ్యవాసం చేస్తూ విజయవాడలో రెండు నెలలు పాతూరు నాగభూషణం స్వతంత్ర ప్రెస్ లో పనిచేశారు. ఆ సమయంలోనే “కవి గంగన్న” మకుటంతో ఒక శతకం వ్రాసి దానికి ముందుమాట వ్రాయమని విశ్వనాథ సత్యనారాయణను  కోరారు. ఇతడి యందు కవిత శక్తి అది చదివిన విశ్వనాథ సత్యనారాయణ ఇతడు వ్రాసిన పద్యములు వేమన, చౌడప్ప పద్యముల వలె ఉన్నవి. ధారాశుద్ధియును కలిగి ఉన్నది. ఆ పద్యాల భావాలు ప్రముఖ కవులు శ్రీశ్రీ మొదలగు వారి రచనల భావాల మాదిరిగా ఉన్నాయని ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ వ్రాశారు.

చిత్ర రంగ ప్రవేశం…

ప్రవాసంలో ఉండగానే పలుమార్లు విజయవాడ నుండి మద్రాసుకు వెళ్ళి రావడం వలన కాబోలు మహారథికి మద్రాసు పట్టణం అంటే అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం వలన అయన హైదరాబాదు డెక్కన్ రేడియో నుండి మద్రాసు రేడియోకు ప్రకటనకర్తగా బదిలీ చేయించుకోవాలని అనుకున్నారు. 1949 లో ఆ ప్రయత్నం బెడిసికొట్టేసరికి మద్రాసులో ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా తిరగ్గా తిరగ్గా శాంతి పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. దాంతో కుప్పుస్వామి వీధిలో ఒక కిరాయి గదిలో అద్దెకు దిగారు. ఆ గదిలో మహారథితో బాటుగా మరో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిలో ఒకరు యస్.టి.రామారావు సినిమా ప్రయత్నం కోసం మద్రాసు వచ్చాడు. రెండో వ్యక్తి వెంకటరత్నం. ఈయన కూడా సినిమాలలో అవకాశం కోసమే వచ్చారు.

వెంకటరత్నం అనే వ్యక్తి యస్.టి.రామారావు క్లాస్ మేట్. వీరు ముగ్గురు అద్దెకు ఉంటున్న గదికి త్రిపురనేని గోపీచంద్ కూడా వచ్చేవారు. ఇలా సినిమా వాళ్ళతో ఏర్పడిన అనుబంధం కారణంగా నటి కృష్ణవేణి మరియు ఆమె భర్త మీర్జాపురం రాజా వారు శోభనాచల స్టూడియోలో నిర్మించిన, ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా మన దేశం (1949) సినిమా చిత్రీకరణ సమయంలో మహారథి అక్కడే ఉన్నారు. మహారథి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అయనపై పెట్టిన కేసులన్నింటిని 1953 లో ఎత్తేశారు. వాటి పైల్స్ అన్నింటినీ తగులబెట్టారు. ఈ విషయం తెలిసిన మహారథి అజ్ఞాతం వీడినేని నేరుగా నిజామాబాద్ జిల్లా ధర్మారం వెళ్లారు. అక్కడే సుమారు 18 నెలలు వ్యవసాయం చేశారు. ఆ తరువాత 1954 వ సంవత్సరం చివరలో హైదరాబాదుకు వచ్చి సూర్యదేవర రాజ్యలక్ష్మి నడుపుతూ ఉండే “తెలుగుదేశం” పత్రికలో ఉప సంపాదకులుగా చేరారు. కొన్నాళ్ళకు తన ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేక, ఉప సంపాదకులుగా జీతం సరిపడక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసుకు వెళ్లిపోయారు.

“బందిపోటు” (1963) సినిమాతో రచయితగా…

సినిమాలలో రాణించాలనుకునే మహారథికి అంత తొందరగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అభ్యుదయవాది, అభిరుచిగల ప్రముఖ దర్శక, నిర్మాత కె.బి.తిలక్ నిర్మాణంలో అనుపమ ఫిల్మ్స్ పతాకంపై తన ద్వితీయ చిత్రం ఎం.ఎల్.ఏ. (1957). కొత్తగా సినిమాలలో చేరాలనుకునే వారికి కె.బి.తిలక్ ఆశ్రయదాత. ఎం.ఎల్.ఏ. సినిమాకు మహారథిని సహాయకుడిగా తీసుకున్నారు. ఆ తరువాత కె.బి.తిలక్ దర్శకత్వంలోనే తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం “అత్తా ఒకింటి కోడలే” (1958) చిత్రానికి కూడా సహాయకుడిగా వ్యవహారించారు. అలాగే కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన పౌరాణిక చిత్రం “రేణుకాదేవి మహాత్మ్యం” (1960) కు స్క్రిప్టు విభాగంలో పనిచేశారు. అదేవిధంగా విశ్వరూప పిక్చర్స్ పతాకంపై సి.శేషగిరి రావు నిర్మించగా శోభనాద్రి రావు దర్శకత్వంలో తెరకెక్కిన “కూతురు కాపురం” (1959) సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 

ఒకవైపు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే తనకు అలవాటైన రచనను కూడా పరీక్షించుకునేవారు. అందులో భాగంగానే 1959 వ సంవత్సరం నుండి తమిళం నుండి తెలుగులోకి అనువాదం చేసే సినిమాలకు డబ్బింగ్ వ్రాయడం మొదలుపెట్టారు. శివగంగై సీమై (1959) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో నిర్మించిన జి. రామకృష్ణారెడ్డి మహారథికి సంభాషణలు వ్రాసే అవకాశం ఇచ్చారు. బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై కె.శంకర్ దర్శకత్వంలో వినాయక చవితి సందర్భంగా విడుదలైన డబ్బింగ్ సినిమా యోధాన యోధులు (1961) కు మహారథి తెలుగులో మాటలు వ్రాశారు.

1962 వ సంవత్సరంలో నేరుగా తెలుగు సినిమాకి సంభాషణలు వ్రాసే అవకాశం వచ్చింది. అది ఎన్టీఆర్ నటించిన “బందిపోటు” (1963) సినిమా. సుందర్ లాల్ నహతా, డూండీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను బి.విఠలాచార్య తెరకెక్కించారు. ఈ చిత్రానికి కథా రచయిత, మాటలు మహారథి. ఆ సినిమా 1963 లో విడుదలైంది. అలా మొదలైన ప్రయాణం కంచుకోట (1967), సతీ అరుంధతి (1968), నిలువు దోపిడీ (1968), పెత్తందార్లు (1970), దేశోద్ధారకులు (1973), దేవుడు చేసిన మనుషులు (1973) వంటి సినిమాలకు మాటలు వ్రాయడం వరకు కొనసాగుతూనే వుంది. శోభన్ బాబుతో దేశమంటే మనుషులోయ్ (1970) సినిమాకు కూడా మహారథి రచనలు చేశారు. 

అల్లూరి సీతారామ రాజు (1974)…

మహారథి రచయితగా పనిచేసిన సినిమాలలోకెల్లా ఉత్తమ సినిమా అల్లూరి సీతారామ రాజు అనే చెప్పాలి. దానిని ముందుగా ఎన్టీఆర్ తీయాలనుకున్నారు. కానీ ఎందుచేతనో వాయిదా పడుతూ వచ్చింది. 1973 వ సంవత్సరంలో ఒక రోజు ఘట్టమనేని హనుమంతరావు (కథానాయకులు కృష్ణ గారి సోదరుడు) వచ్చి పెట్టె బేడా సర్దుకుని విజయవాడ రావాలన్నారు. కానీ అక్కడికి తీసుకెళ్లకుండా విచిత్రంగా మద్రాసు లోని వుడ్ ల్యాండ్స్ హోటల్ గదికి  తీసుకెళ్లారు. ఆ సందర్భంలో “అల్లూరి సీతారామరాజు” సినిమా తీసే ఆలోచన గురించి చెప్పారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 

అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఆ తరువాత నెల్లూరు కాంతారావు, కె.సి.శేఖర్ బాబు, డి.ఎల్ నారాయణ ఇలా అనేక మంది ఆ సినిమా తీసే ప్రయత్నాలు చేశారు. స్క్రిప్టు కూడా వ్రాయించారు. వారందరూ కూడా అంతకుముందే మహారథిని సంప్రదించారు. అందులో నందమూరి తారకరామారావు ఈ సినిమా కంటే 18 సంవత్సరాల క్రితమే పడాల చేత స్క్రిప్టు వ్రాయించారు. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన డీ.ఎల్. నారాయణ వద్ద ఉన్న స్క్రిప్టు పుచ్చుకుని ఘట్టమనేని కృష్ణ, ఆయన సోదరులు ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావులు సినిమా తీయడం కోసం ప్రయత్నం ప్రారంభించారు. ఇలాంటి ఒక గొప్ప సినిమా కోసం సంభాషణలు వ్రాయడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న మహారథికే ఆ అవకాశం దక్కింది. ఈ ప్రయత్నం విఫలం కాకూడదని అప్పటికే తన చేతిలో ఉన్న నాలుగు సినిమాలను వదులుకున్నారు.

మైలురాయి చిత్రంగా  నిలిచిన”అల్లూరి సీతారామ రాజు”..

ఒక్కపూట భోజనం చేస్తూ, మాంసాహారం ముట్టుకోకుండా, ధ్యానంలో ఉంటూ, చాలా నిష్ఠగా వ్యవహరించి స్క్రిప్టు పనులు ప్రారంభించారు. ఆయనకు ఆ సమయంలో తన భార్య ప్రోత్సాహం కూడా ఉండేది. చింతపల్లి అడవులలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. తీయబోయే దృశ్యం గురించి ముందు రోజే తెలుసుకుని, ఆ తరువాత ఉదయం లేచి ధ్యానం చేసి ఒక చెట్టు క్రింద కూర్చుని సంభాషణలు వ్రాసేవారు. ఈ సినిమాలో కథానాయకులు కృష్ణనే అయినా దృశ్యంలో మాత్రం సీతారామరాజు మాత్రమే కనిపిస్తాడు. ఆ దృశ్యంలో  సీతారామరాజు లేకపోతే ఆయన వినిపిస్తాడు. అంత అద్భుతంగా సంభాషణలు వ్రాశారు. దేవుడు చేసిన మనుషులు చిత్రం విజయవంతమైన తర్వాత కృష్ణ ఈ చిత్ర నిర్మాణం చేపట్టారు.

అప్పటికే వి.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అసాధ్యుడు (1968) చిత్రంలో కృష్ణ ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. దానితో వి.రామచంద్రరావునే ఈ సినిమాకు దర్శకునిగా కృష్ణ తీసుకున్నారు. ఈ సినిమా మూడొంతులు మాత్రమే పూర్తయ్యింది. అంతలోనే హఠాత్తుగా దర్శకులు వోరుగంటి రామచంద్ర రావు మరణించారు. ఆ తరువాత మిగిలిన సినిమాను కథానాయకులు కృష్ణ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు చనిపోతూ ఆయన చెప్పే సంభాషణలు “మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వాతంత్ర్య భారతి జయ కేతానంగా నిలుస్తాను” అనే సంభాషణ వ్రాయడానికి మూడు రోజుల పట్టింది. సినిమా చూసిన ప్రతీఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సినిమాతో త్రిపురనేని మహారథికి ఊహించనంత పేరొచ్చింది.

రాజకీయం…

25 జూన్ 1975 రాత్రి భారతదేశానికి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. త్రిపురనేని మహారథి కోసం పోలీసులు ఆరాతీయడం మొదలుపెట్టారు. కానీ అల్లూరి సీతారామ రాజు స్క్రిప్టు వ్రాస్తున్నందున ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన ఘట్టమనేని హనుమంతరావు పోలీసు వాళ్లకు నచ్చజెప్పి పంపేశారు. అప్పటివరకు అజ్ఞాతంలో వున్న మహారథి 1977 లో జనతా ప్రభుత్వం ఏర్పడ్డాక మద్రాసు వచ్చిన నీలం సంజీవరెడ్డిని కలిశారు. అప్పుడు జనతా పార్టీ గెలుపు తథ్యం కనుక అజ్ఞాతం వీడాలని నీలం సంజీవరెడ్డి చెప్పారు. అప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు జనతా పార్టీ బాధ్యతలు స్వీకరించి వున్నారు. ఆయన మహారథిని జనతా పార్టీలో చేరమని కోరారు. బి.సత్యనారాయణ రెడ్డి, టి.లక్ష్మీకాంతమ్మ, తుర్లపాటి సత్యనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన రాష్ట్రమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు.

1978 వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మహారథి బోధన్ నుండి జనతా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికలలో అదే బోధన్ నియోజకవర్గం నుండి “రెడ్డి కాంగ్రెస్” తరపున ఎం. నారాయణరెడ్డి, “ఇందిరా కాంగ్రెస్” తరపున గులాం సంథానీ పోటీచేశారు. అప్పటి జనాదరణ ప్రకారం జనతా గెలుపు ఖాయం అనుకున్నారు. తెన్నేటి విశ్వనాథం ముఖ్యమంత్రి, అలాగే సమాచార మంత్రిగా మహారథి అని తుర్లపాటి సత్యనారాయణ రాజకీయ జోష్యం కూడా చెప్పేశారు. 25 మార్చి నాడు ఎన్నికలు జరిగాల్సి ఉండగా 21 వరకు మహారథి గెలుస్తాననే అనుకున్నారు. 21 తెల్లవారుఝామున ఇందిరాగాంధీ ప్రచారానికి వచ్చారు. బోధన్ నియోజకవర్గంలో మూడు ప్రాంతాలలో ఆమె మాట్లాడారు. నేను మీకోసం ఎన్నో చేయాలనుకున్నాను. కానీ నన్ను ప్రతిపక్షాల వారు బతకనిచ్చేలా లేరు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ప్రసంగం విన్న ప్రతీ ఆడవారు ఇందిరా కాంగ్రెస్ కే ఓటు వేశారు. జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. బోధన్ లో సంథానీ గెలిచారు. 

మరణం…

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలతో మహారథికి ఎనలేని అనుబంధం ఉండేది. ఆయన ఎప్పుడూ చెన్నారెడ్డి వర్గంలోనే ఉండేవారు. ఆయనకే మద్దత్తు తెలిపేవారు. ప్రత్యేక తెలుగురాష్ట్రం ఆవిర్భావం తరువాత 01 నవంబరు 1956 నీలం సంజీవరెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ సమావేశానికి మహారథి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహారథికి అన్ని రాజకీయ పార్టీలతో ఏదో ఒక విధంగా అనుబంధం ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి, జనతా ఇలా అన్ని పార్టీల అంతరంగం తెలిసిన మహారథి “త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ” స్థాపన చేశారు. కానీ ఎక్కువ రోజులు దానిని నడపలేకపోయారు. 

రేడియో ప్రకటన కర్తగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా ఇలా జీవితంలో రకరకాల పాత్రలు పోషించిన రచయిత త్రిపురనేని మహారథి అనారోగ్య కారణంగా హైదరాబాదు లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 డిసెంబరు 2011 నాడు ఉదయం తుదిశ్వాస విడిచారు. మరణించే నాటికి మహారథికి 82 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మహారథి కేవలం కీర్తి కాంక్షనే కోరుకున్నారు, కానీ ఆయనకు ఏనాడూ పదవీ వ్యామోహం కానీ,  ధన వ్యామోహం కానీ లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకతోనే యోగి.

Show More
Back to top button