
సినిమా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ, నిర్మాణ సంస్థ ద్వారా స్క్రిప్టు రచన, దర్శకత్వం, కూర్పు (ఎడిటింగ్), సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు వంటి, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలను ప్రణాళికా చేసి, సమన్వయం చేసేవారిని నిర్మాత అంటారు. సినిమా నిర్మాత ప్రధాన లక్ష్యం డబ్బు సంపాదన. డబ్బు సంపాదించే లక్ష్యం తోనే వారు సినిమాలు నిర్మిస్తారు, భారీ రాబడిని లెక్కించి వారు పెట్టిన పెట్టుబడియే కాకుండా లాభాలను కూడా తిరిగి పొందుతారు. చాలా వరకు సినిమాలు విమర్శకులచే విమర్శించబడుతున్నాయి, కానీ బాక్సాఫీస్ వద్ద చాలా వసూళ్లు సాధిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని చిత్రాలు విమర్శకులచే ప్రశంసలు పొందుతున్నాయి.
కానీ వాణిజ్యపరంగా వసూళ్లు తక్కువగా ఉంటున్నాయి. ఈ చిత్రాలను అజరామర చిత్రాలుగా మనం పరిగణిస్తాము. వాటిలో కొన్ని సమయం గడిచేకొద్దీ ప్రేక్షకులకు సంబంధించిన సందర్భోచితంగా ఉంటాయి. ఒక కల్ట్ క్లాసిక్ సినిమా అనేది కాలక్రమేణా ఒక నిర్దిష్ట అభిమానులను సంపాదించుకోగల చలనచిత్రంగా మారుతుంది. కల్ట్ క్లాసిక్ సినిమాలు సాధారణంగా విడుదలైన తర్వాత మంచి ఆదరణ పొందకపోవచ్చు, కానీ కాలక్రమేణా అంకితభావంతో కూడిన అభిమానుల సంఖ్యను పెంచుకుంటాయి. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను నిర్మించిన చిత్ర నిర్మాతలు అతి తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు డి.యల్. నారాయణ. అసలు పేరు ద్రోణావఝ్ఝుల లక్ష్మీనారాయణ.
డి.యల్. నారాయణ అంటే ఒక దైర్యమున్న నిర్మాత, ఒక పట్టుదల ఉన్న నిర్మాత, ఒక తెగింపు ఉన్న నిర్మాత,ఒక అభిరుచి ఉన్న నిర్మాత. ఒక “దేవదాసు” (1953), ఒక “కన్యాశుల్కం” (1955), ఒక “ఏకవీర” (1969) లాంటి అజరామర చిత్రాలను నిర్మించాలంటే ఉత్తమ అభిరుచి కావాలి, మొక్కవోని ధైర్యం కావాలి, లాభ నష్టాలు బేరీజువేసుకోని తెగింపు కావాలి, ప్రయోగాలు చేసే వ్యవహార శైలి కావాలి. ఇవన్నీ డి.యల్. నారాయణలో పుష్కళంగా ఉన్నాయి గనుకనే ఇంత మంచి చలనచిత్రాలను తెరకెక్కించారు. ఆయనే గనుక పట్టుదల, ధైర్యం, తెగింపు, ప్రయోగాలు చేయకపోయి ఉంటే ఒక దేవదాసు, ఒక కన్యాశుల్కం, ఒక ఏకవీర లాంటి చిత్రాలను తెలుగు చలనచిత్ర సీమకు, తెలుగు ప్రేక్షకులకు అందించేవారు కాదు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేవారు డి.యల్.నారాయణ. దేవదాసు చిత్రం ప్రారంభించిన కొద్దిరోజుల తరువాత మిగతా భాగస్వామి నిర్మాతలు ఆ సినిమా నిర్మాణం నుండి తప్పుకుంటే తానొక్కడే ఆ బాధ్యతను భుజాన మోసి, ధైర్యంగా చిత్రాన్ని నిర్మించి విడుదల చేసిన ధైర్యమున్న నిర్మాత డి.యల్. చదివింది యస్.యస్.యల్.సి, అయినా కూడా తెలుగు సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. ఆ అభిరుచినే దేవదాసు, కన్యాశుల్కం, ఏకవీర చిత్రాలను నిర్మించేలా చేయగలిగింది.
డి.యల్. నారాయణ బొమ్మలు వేసేవారు, ఉర్దూ కవిత్వం, గజల్స్, హిందూస్తానీ సంగీతం అంటే ఇష్టం. కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లే మనస్తత్వం తప్ప, ఏ రోజూ పేరు కోసం ప్రాకులాడే వారు కాదు, ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోని ప్రవర్తన డి.యల్ వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. చిన్నతనం నుండే వ్యాపారం చేస్తూ, కురుకూరి సుబ్బారావు పరిచయంతో సినిమా రంగ ప్రవేశం చేసి, పది సంవత్సరాలు ప్రొడక్షన్ మేనేజరుగా, ఆ తరువాత భాగస్వాములతో కలిసి వినోదా పిక్చర్స్ స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు డి.యల్.నారాయణ. 25 సంవత్సరాల తన సినీ నిర్మాణంలో మొదటి పది సంవత్సరాలలో ఏడు సినిమాలు, తరువాత చివరి పదిహేను సంవత్సరాలలో నాలుగు సినిమాలు నిర్మించారు.
వాటిల్లో అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడిగా మూడు సినిమాలు, ఎన్టీఆర్ కథానాయకుడిగా నాలుగు సినిమాలు, జమున కథానాయికగా ఆరు సినిమాలు, సావిత్రి కథానాయికగా మూడు సినిమాలు నిర్మించారు డి.యల్.నారాయణ. ఆయన నిర్మించిన చిత్రాలలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించినవారు వేదాంతం రాఘవయ్య (నాలుగు సినిమాలు). 1972 లో డి.యల్.నారాయణ, విజయవాడలో సొంత ఇల్లు కొన్నారు. ఆయన మరణాంతరం అదే ఇంటిలో ఆయన భార్య నాంచారమ్మ పది సంవత్సరాలపాటు జీవించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు లతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తూ వారితో చాలా సన్నిహితంగా ఉండేవారు డి.యల్.నారాయణ.
నేపథ్యం…
ద్రోణావఝ్ఝుల లక్ష్మీనారాయణ (డి.యల్. నారాయణ) మచిలీపట్నం ను ఆనుకుని ఉన్న చింతగుంటపాలెం అనే ఊరులో 1914 వ సంవత్సరంలో జన్మించారు. చింతగుంటపాలెం అనే గ్రామం విరిగిన ఎముకలకు కట్లు కట్టే వైద్యానికి ప్రసిద్ధి. ఆ గ్రామంలో 110 సంవత్సరాల క్రిందట ద్రోణావఝ్ఝుల కృష్ణయ్య, కృష్ణవేణి దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమారుడు వెంకట్రామయ్య, ఈయన తన జీవిత కాలం ఆ ఊర్లోనే జీవనాన్ని వెళ్ళిబుచ్చారు. రెండవ కుమారుడు లక్ష్మీనరసింహారావు, ఈయన విజయవాడలో వెళ్లి ఆదాయపు పన్ను అభ్యాసకుడిగా 40 సంవత్సరాలు తన కార్యాలయం నడిపించారు. మూడవ కుమారుడు ద్రోణావఝ్ఝుల లక్ష్మీనారాయణ (డి.యల్. నారాయణ). ఈయన చిన్న తనం నుండే పాఠశాలకు వెళ్లి చదువుకునేవారు.
చదువుకన్నా ఎక్కువగా ఆయనకు కుస్తీ పోటీలపై మక్కువ ఉండేది. కుస్తీ పోటీలలో పాల్గొనే క్రమంలో తన చేయి విరిగిపోయింది. దాంతో యస్.యస్.యల్.సి పరీక్షలు వ్రాయలేకపోయారు. చిన్ననాటి నుండే పట్టుదల ఎక్కువగా ఉండే డి.యల్. తన సొంత కాళ్లపై నిలబడాలని కానీ, ఏదైనా సాధించాలనే పట్టుదల కానీ ఉండేది. ఒప్పందం ప్రాతిపదికన నాటకాలు వేసే ఓక సంస్థను కాంట్రాక్టు తీసుకుని చుట్టుప్రక్కల గ్రామాలలో ఆ నాటకాలను నడిపిస్తూ ఆ నాటకాల ద్వారా ఆదాయాన్ని సమాకుర్చుకునేవారు. అలా కొంతకాలం కొనసాగించారు. ఆ తరువాత ఆయన విజయవాడకు వచ్చి ఒక కిరాణ దుకాణంలో గుమస్తాగా చేరిపోయారు. ఆయన జీతం పదిహేను రూపాయలు. అప్పటికి ఆయన వయస్సు 22 సంవత్సరాలు. ఆ తరువాత 1937 – 38 ప్రాంతంలో “గాంధీ పెర్ఫ్యూమరీ వర్క్స్” అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించి అత్తరు, వ్యాసిలీన్ లను తయారుచేయించి అమ్ముతూ ఉండేవారు. ఆ వ్యాపారంలో నెలకు సుమారు ఇరవై అయిదు రూపాయలు మాత్రమే లాభం ఉండేది.
చిత్ర రంగ ప్రవేశం…
విజయవాడలో అత్తరు వ్యాపారం చేస్తున్న సమయంలో డి.యల్.నారాయణ కు “ద్రౌపది వస్త్రాపహరణం” అనే సినిమాను నిర్మించిన “కృత్తివెన్ను బ్రదర్స్” లలో ఒకరైన కురుకూరి సుబ్బారావు పరిచయమయ్యారు. కురుకూరి సుబ్బారావు తో కలిసి కడారు నాగభూషణం 1939 లో భవాని పిక్చర్స్ స్థాపించి “చండిక” (1940) అనే చిత్ర నిర్మాణం చేపట్టారు. భాగస్వామి కడారి నాగభూషణంతో మాట్లాడి ఆ సినిమాకు సహాయకుడిగా డి.యల్.నారాయణను ఎంపిక చేసి 1939 వ సంవత్సరంలో మద్రాసుకు పంపించారు కురుకూరి సుబ్బారావు. ఏప్రిల్ 1940 వ సంవత్సరంలో “చంద్రిక” సినిమా విడుదలైంది. నిర్మాణ శాఖలో సహాయకుడిగా ప్రారంభమైన డి.యల్, నిర్మాణ విభాగంలోని అన్ని విభాగంలో పనులు చేస్తూ ఉండేవారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న డి.యల్. నమ్మకంగా ఉంటూనే ఆ విభాగంలో ఎవ్వరికి ఏమి కావాలో సమకూరుస్తూ చురుగ్గా దూసుకెళ్లేవారు. దాంతో ఆయన కడారు నాగభూషణం కు బాగా నచ్చేశారు.
కడారు నాగభూషణం, కన్నాంబలు కలిసి “రాజరాజేశ్వరీ ప్రొడక్షన్స్” స్థాపించి జ్యోతిష్ సిన్హా దర్శకత్వంలో “తల్లి ప్రేమ” (1941) అనే సినిమాను నిర్మించ తలపెట్టారు. ఆ చిత్రానికి కడారు నాగభూషణం ప్రొడక్షన్ మేనేజరుగా వ్యవహరించారు. ఈ సినిమాకు కూడా డి.యల్.నారాయణ సహాయకుడిగా ఉన్నారు. 31 మే 1941 నాడు ఈ సినిమా విడుదలైంది. “తల్లి ప్రేమ” సినిమా తరువాత కడారు నాగభూషణం తన స్వీయ దర్శకత్వంలో “సుమతి” అనే సినిమాను తెరకెక్కించారు. అప్పటివరకు నిర్మాణ విభాగంలో సహయకులుగా ఉన్న డి.యల్.నారాయణ, ఈ సినిమాతో ప్రొడక్షన్ మేనేజరుగా ఎంపికయ్యారు. సుమతి చిత్రం 19 అక్టోబరు 1942 నాడు విడుదలైంది. సరిగ్గా అదే సమయానికి రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధ మేఘాలు మద్రాసును కూడా ఆవరించేసరికి చిత్ర పరిశ్రమ మూతపడింది.
పది సంవత్సరాలు ప్రొడక్షన్ మేనేజరుగా…
సుమతి (1942) సినిమా తరువాత సత్య హరిశ్చంద్రుడి పురాణం ఆధారంగా కడారు నాగభూషణం దర్శకత్వంలో తమిళంలో “హరిశ్చంద్ర” (1944) అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి కూడా డి.యల్. నారాయణ, ప్రొడక్షన్ మేనేజరుగా వ్యవహారించారు. ఆయనకు ప్రొడక్షన్ మేనేజరుగా ఇది రెండో సినిమా. ఆ చిత్రం పూర్తయిన తరువాత చిత్తూరు వి.నాగయ్య, గూడూరుకి చెందిన మైకా వ్యాపారి దువ్వూరు నారాయణ రెడ్డి సహాయంతో రేణుకా పిక్చర్స్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థ నిర్మించే చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా సంవత్సరంన్నర పనిచేశారు డి.యల్. నారాయణ. ఆ తరువాత రామకృష్ణ, భానుమతిల సొంత సంస్థ “భరణి పిక్చర్స్” కు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశారు. డి.యల్. నారాయణ ఏ సంస్థ లో చేరినా కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా భరణి లో కూడా అదే పంథాను కొనసాగించారు.
“భరణి పిక్చర్స్” సంస్థలో నృత్య దర్శకులుగా “వేదాంతం రాఘవయ్య”, రచయితగా “సముద్రాల రాఘవాచార్య”, సంగీత దర్శకులుగా “చింతామణి రామసామి సుబ్బరామన్” (సి.ఆర్. సుబ్బరామన్) లను సాంకేతిక నిపుణులుగా తీసుకున్నారు. యస్.సౌందరరాజన్ నిర్మించిన “చెంచులక్ష్మి” (1943) సినిమా నుండే ఈ ముగ్గురితో, డి.యల్.నారాయణ కు పరిచయం ఉంది. ఎందుకంటే యస్.సౌందరరాజన్ నిర్మించిన “చెంచులక్ష్మి” సినిమాకు కూడా డి.యల్.నారాయణ ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశారు. భరణి పిక్చర్స్ పతాకంపై వచ్చిన రత్నమాల (1948), లైలా మజ్ను (1950) సినిమాలకు కూడా డి.యల్.నారాయణ ప్రొడక్షన్ మేనేజరుగా ఉన్నారు. భరణి సంస్థ అంటే తన సొంత సంస్థ లాగా భావించేవారు డి.యల్. ఆ సంస్థతో అంతలా ఆయనకు అవినాభావ సంబంధం ఏర్పడింది.
నిర్మాతగా తొలి చిత్రం స్త్రీ సాహసం (1951)…
అప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయింది. దాంతో తాను కూడా సినిమాలు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఆ ముగ్గురితో కలిసి (వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, సి.ఆర్. సుబ్బరామన్) “వినోద పిక్చర్స్” సంస్థను స్థాపించి, తొలి సినిమాగా “వేదాంత రాఘవయ్య” దర్శకత్వంలో “స్త్రీ సాహసం” నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి నాయకా, నాయికలుగా నిర్మించిన ఈ చిత్రం 09 ఆగస్టు 1951 నాడు విడుదలై ఘన విజయం సాధించింది. ఆ విజయం లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఆ భాగస్వామ్య నిర్మాతలు శరత్ చంద్ర ఛటోపాధ్యాయ వ్రాసిన “దేవదాసు” అనే ఒక బెంగాళీ నవలను చక్రపాణి తెలుగులోకి అనువదించగా దానిని తెలుగులో సినిమాగా మలచాలని వినోదా పిక్చర్స్ నిర్మాతలు డి.యల్. నారాయణ బృందం ఒక నిర్ణయానికి వచ్చారు.
భగ్నప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొదటిది అని చెప్పుకోవచ్చు. రెండో సినిమానే “దేవదాసు” నవలను నిర్మిద్దాం అనుకోవడం సాహసోపేతమైన నిర్ణయం. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు 24 నవంబరు 1951 నాడు “రేవతి స్టూడియో” లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నలుగురు నిర్మాతలు డి.యల్.నారాయణ, వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, సి.ఆర్. సుబ్బురామన్ లతో పాటు ఛాయాగ్రహకులు బి.ఎస్.రంగా, వేదాంతం రాఘవయ్య భార్య సూర్యప్రభ, సూర్యప్రభ అక్కయ్య పుష్పవల్లి, పార్వతీ పాత్రకు ఎంపికైన షావుకారు జానకి, ఋష్యేంద్రమణి, హాస్యనటి గిరిజ మొదలగువారు హాజరయ్యారు. రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ ఫోటో పెట్టి పూజ కార్యక్రమాలు కూడా చేశారు.
రెండో సినిమానే “శాంతి” (1952)…
దేవదాసు సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో ప్రతీ విభాగంలో కూడా డి.యల్.నారాయణ తనవంతు పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఇండోర్ లో ఒక సెట్ వేసి వారం రోజుల పాటు దేవదాసు, పార్వతిల బాల్యం చిత్రీకరించారు. కానీ అప్పటికే చిత్ర పరిశ్రమ నుండి ఆ సినిమా చిత్రీకరణపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. దేవదాసు నవలతో అక్కినేని కథానాయకుడిగా నటించడం, రెండో సినిమానే బెంగాళీ నవలను సినిమాగా తీయడం, తాహతుకు మించిన సాహసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి విమర్శల వస్తున్న నేపథ్యంలో వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, సి.వి.సుబ్బరామన్ లు, కథానాయకులు అక్కినేనిని కలిసి ఈ సినిమాపై వచ్చే విమర్శల దృష్ట్యా దేవదాసు చిత్రీకరణ ఆపేద్దామని చెప్పారు.
దానికి అక్కినేని కూడా అంగీకరించారు. దాంతో ఆ సినిమాను ఆపేసి అదే సినిమా సెట్ లలో తక్కువ వ్యయంతో, రామచంద్ర కాశ్యప్ (డి.యల్. నారాయణ బంధువు), చంద్రకుమారి, గోవిందరాజుల సుబ్బారావు, సావిత్రి, పేకేటి శివరాం మొదలగు తారాగణంతో “శాంతి” (1952) అనే ఒక సినిమాను చిత్రీకరించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామచంద్ర కాశ్యప్, చంద్రకుమారిలు నాయక, నాయికలు కాగా, పేకేటి శివరామ్, నటి సావిత్రిలు హాస్య పాత్రలలో నటించారు. పూర్తి నిడివి గల పాత్రలో నటించిన నటి సావిత్రి “శాంతి” చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు మూడో భార్య పాత్రను పోషించారు. కేవలం రెండు నెలల్లో పూర్తి చేసిన ఈ చిత్రాన్ని 12 ఫిబ్రవరి 1952లో విడుదల చేశారు. ఇది కూడా ఘనవిజయం సాధించింది.
అజరామర చిత్రంగా దేవదాసు (1953)…
శాంతి (1952) సినిమా ఘనవిజయం తరువాత తన భాగస్వాములను పిలిచిన డి.యల్. నారాయణ, చిత్రీకరణ ఆపేసిన “దేవదాసు” సినిమాని పూర్తిచేద్దామనుకున్నారు. కానీ అందుకు వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, సి.వి.సుబ్బరామన్ లకు ధైర్యం చాలలేదు. వారు ఆ సినిమా నిర్మాణానికి ధైర్యం చేయలేక భాగస్వామ్యం నుండి తప్పుకున్నారు. దాంతో డి.యల్. నారాయణ ఒక్కరే “దేవదాసు” చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఆగస్టు – సెప్టెంబరు 1952 ప్రాంతాలలో చిత్రీకరణ ప్రారంభమైంది. షావుకారు జానకి కార్యదర్శిగా ఉన్న కొమ్మూరు సాంబశివరావు ఆమె డేట్లను సర్దుబాటు చేయలేకపోవడంతో షావుకారు జానకిని తప్పించి ఆమె స్థానంలో పార్వతి పాత్రకు సావిత్రిని కథానాయికగా తీసుకున్నారు. వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, సి.ఆర్.సుబ్బరామన్ లు ఈ చిత్ర నిర్మాణం నుండి తప్పుకున్నా కూడా, వారు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సినిమా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు చిత్రం 26 జూన్ 1953 నాడు విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. “దేవదాసు” చిత్రం ప్రస్తావనకు వస్తే తప్పకుండా డి.యల్. నారాయణ పేరు తప్పకుండా చర్చకు వస్తుంది. డి.యల్. నారాయణ గురించి చర్చ జరిగితే, దేవదాసు సినిమా ప్రస్తావన తప్పకుండా వస్తుంది. అంతలా దేవదాసు చిత్రం అజరామరంగా నిలిచిపోయింది. దేవదాసు చిత్ర నిర్మాణం ఎంత ప్రమాదకరమైనదో, అందులో డి.యల్.నారాయణ అత్యంత ఘనవిజయం సాధించారు. ఆ ముగ్గురు భాగస్వాములు వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, సి.ఆర్.సుబ్బరామన్ లు దేవదాసు చిత్ర నిర్మాణం నుండి తప్పుకున్నా కూడా డి.యల్. నారాయణ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం తెలుగు సినిమా చరిత్రలోనే “దేవదాసు” చిత్రాన్ని అజరామర చిత్రంగా నిలబెట్టడానికి దోహదం చేసింది.
గురజాడ “కన్యాశుల్కం” కథను సినిమాగా..
దేవదాసు (1953) చిత్రం తరువాత “వినద పిక్చర్స్” బ్యానరుపై డి.యల్. నారాయణ నిర్మాణం చేసిన మరొక చిత్రం “కన్యాశుల్కం”. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించటానికి ఎంతగానో ప్రయత్నం చేశారు డి.యల్. నాటకం నిడివి ఆరు గంటలు. దానిని కుదిరిస్తే కథ యొక్క ఆత్మ పోతుందని, తద్వారా చిత్రాన్ని ప్రేక్షకులు స్వీకరించరని హెచ్చరించారు కూడా. కానీ ధైర్యానికి మారు పేరైన డి.యల్. నారాయణ, అలాంటి హెచ్చరికలను ఖాతరు చేసివుంటే దేవదాసు చిత్రాన్ని నిర్మించి ఉండేవారు కాదు. అదే ధైర్యం, అదే ఆత్మవిశ్వాసంతో ఎవరేమన్నా సరే చేసే పనిని చిత్తశుద్ధితో చేయాలని నమ్మి ముందుకెళ్లారు. ఎవరెన్ని చెప్పినా తన ప్రయోగాత్మక కన్యాశుల్కం కథను ముందుకు కొనసాగించారు. ఆరు గంటల కథను సినిమాకు సరిపడా తగ్గించి వెండితెర అనువాదం చేయడానికి వెంపటి సదాశివబ్రహ్మం ను ఎంచుకున్నారు.
ఇందులో ప్రధానమైన పాత్ర గిరీశం. దానికోసం కోసం ముందుగా అక్కినేని నాగేశ్వరావు సంప్రదించారు. కానీ దేవదాసు చిత్రంలో విషాదకరమైన పాత్ర పోషించి, మళ్లీ గిరీశం పాత్రలో నటిస్తే స్వీకరించరేమో అన్న సందేహం వ్యక్తపరుస్తూ రచయిత “మల్లాది రామకృష్ణ శాస్త్రి” సలహాను అనుసరించి ఈ సినిమాను తిరస్కరించారు. దాంతో గిరీశం పాత్రకు నందమూరి తారకరామారావును ఎంచుకున్నారు. మరొక పాత్ర బుచ్చమ్మ కోసం జమునను సంప్రదించగా ఆదిలోనే విధవరాలి పాత్ర పోషించడం ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు బుచ్చమ్మ పాత్రకు జమునను వద్దన్నారు. దాంతో బుచ్చమ్మ పాత్ర కోసం షావుకారు జానికి సంప్రదించగా ఆమె సరేనన్నారు. మధురవాణిగా సావిత్రి, రామప్ప పంతులుగా సీఎస్‌ఆర్ ఆంజనేయులు, లుబ్ధావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు, సౌజన్య రావుగా గుమ్మడి, అగ్నిహోత్రావధానులుగా విన్నకోట రామన్న పంతులు, కరటక శాస్త్రిగా వంగర వెంకట సుబ్బయ్య, మీనాక్షిగా సూర్యకాంతం, పుటకూల్లమ్మగా ఛాయా దేవి, వెంకమ్మగా హేమలత, పోలిశెట్టిగా చదలవాడ కుటుంబరావు తదితరులు నటించారు.
30 యేండ్ల తరువాత కన్యాశుల్కం విజయం…
వినోద పిక్చర్స్ నిర్మాణ సంస్థకు వరుసగా మూడు (స్త్రీ సాహాసం, శాంతి, దేవదాసు) చిత్రాలకు దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య మరొక చిత్రంతో తీరిక లేకుండా ఉండడంతో కన్యాశుల్కం చిత్రానికి పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. సినిమా నిర్మాణం జరిగినన్ని రోజులు పి.పుల్లయ్య పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మద్రాసు లోని కోడంబాక్కం లోని నరసు, రేవతి మరియు వీనస్ సినీ స్టూడియోలలో నిర్మించిన సెట్లలో ప్రధాన ఛాయాగ్రహణం (ఫోటోగ్రఫీ) జరిగింది. మద్రాసులోని విజయ లాబొరేటరీలో పోస్ట్-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తయ్యాయి. కన్యాశుల్కము చిత్రం 26 ఆగస్టు 1955 నాడు థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది, వారు నాటకాన్ని చలనచిత్రంగా మార్చేటప్పుడు చేసిన మార్పులను విమర్శించారు.
కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా మార్చడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. పరాజయం పాలైంది. మొదట్లో ఈ సినిమా నిరాశపరిచింది. కానీ తాను నమ్మిన నమ్మకం వమ్ము కాలేదని 30 సంవత్సరాల తరువాత ప్రేక్షకులు నిరూపించారు. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత సంధ్య 70 యం.యం. థియేటర్ లో మధ్యాహ్నం ఆటకు విడుదల చేసినప్పుడు 19 వారాల పాటు ఏకబిగిన ప్రదర్శింపబడింది. ఆ తరువాత కల్పనా, దీపక్ సినిమా థియేటర్ లలో నిరంతర ప్రదర్శనలతో సిల్వర్ జూబ్లీ కూడా చేసుకుంది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు 1986 వ సంవత్సరంలో విజయవాడలో కన్యాశుల్కం సినిమా విడుదలై 100 రోజులు ప్రదర్శింపబడింది. మళ్లీ 1996 లో హైదరాబాద్ లోని సప్తగిరి థియేటర్ లో విడుదలై 51 రోజుల ఆడింది, అలాగే షిఫ్టులతో వంద రోజులు ఆడింది. డి.ఎల్. నారాయణ ను ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ విజయాన్ని డి.ఎల్ చూడలేకపోయారు.
జమున కథానాయికగా “చిరంజీవులు” (1956)…
కన్యాశుల్కం సినిమా తరువాత “వినోద పిక్చర్స్” బ్యానరులో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డి.యల్. నారాయణ “చిరంజీవులు” చిత్రం నిర్మించతలపెట్టారు. ఈ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు జమునను సంప్రదించగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు తదితరులు నటించిన ఈ సినిమా 15 ఆగస్టు 1956 నాడు విడుదలై ఓ మాదిరిగా ఆడింది, నష్టాలు మాత్రం రాలేదు.
“చిరంజీవులు” చిత్రం తరువాత “దొంగల్లో దొర” (1957) సినిమా నిర్మించారు డి.యల్. నారాయణ. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జమున లు నాయక, నాయికలు. ఈ సినిమా కు దర్శకుడిగా చెంగయ్యను ఎంచుకున్నారు. మూడేళ్ల వయసున్న సుబ్బలక్ష్మి (నిర్మాత డి.యల్.నారాయణ కూతురు) “దొంగల్లో దొర” సినిమాలో చిన్నప్పటి నాగేశ్వరావు పాత్ర ధరించారు. 19 జులై 1957 నాడు ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా విజయవంతమైంది.
నిరాశపరిచిన “సిపాయి కూతురు” (1959)…
“దొంగల్లో దొర” సినిమా తరువాత “సిపాయి కూతురు” సినిమాను నిర్మించాలనుకున్నారు నిర్మాత డి.యల్. వాడుక భాషలో అందరికీ అర్థం అయ్యే రీతిలో నవలా రచన చేసే కొవ్వలి లక్ష్మీనరసింహరావు 1116 నవలలు వ్రాశారు. ఆయన అంతకుముందు “శాంతి” (1952) అనే సినిమాకు రచన చేశారు. ఆయన వ్రాసిన “పన్నా” అనే నవలన “సిపాయి కూతురు” సినిమాగా తీయాలనుకున్నారు నిర్మాత డి.యల్. ఇందులో కథనాయిక జమున. అప్పుడే సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న కైకాల సత్యనారాయణను కథానాయకుడుగా తీసుకున్నారు నిర్మాత. ఈ సినిమాకు కూడా దర్శకులు చెంగయ్యనే. ఈ సినిమాలో డి.ఎల్. నారాయణ కు సొంతంగా మూడు గుర్రాలు ఉండేవి. వాటిల్లో ఒక గుర్రాన్ని ఈ సినిమాలో ఉపయోగించారు. 11 సెప్టెంబర్ 1959 నాడు “సిపాయి కూతురు” సినిమా విడుదలైంది. నిర్మాత అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా పరాజయం పాలైంది.
“దొరికితే దొంగలు” (1965)…
సిపాయి కూతురు (1959) సినిమా నిరాశపరచడంతో రెండు మూడు సంవత్సరాల పాటు సినిమా నిర్మాణం ఆపేసి మంచి కథ కోసం వెతకసాగారు.చందమామ ఫిల్మ్స్ బ్యానర్‌పై డి.ఎల్. నారాయణ “దొరికితే దొంగలు” (1965) అనే చిత్రాన్ని నిర్మించారు. అపరాధ పరిశోధక సైంటిఫిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో గాలిలో విమానాలు బ్రద్దలవ్వడం, పారాచూట్ లలో క్రిందికి దిగడం, టేప్ రికార్డులు ద్వారా దుష్టత్రయ సంభాషణలు రికార్డు చేయడం, ఆటోమేటిక్ కెమెరాలు ఫోటో తీయడం లాంటి వినూత్నమైన ప్రయోగాలు ఈ సినిమాలో ఉన్నాయి. నూతన దర్శకులు పురాణ సుబ్రహ్మణ్యం ను ఈ సినిమాకు దర్శకుడిగా ఎంచుకున్నారు నిర్మాత డి.యల్. నారాయణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్, జమున నాయక, నాయికలు. ఈ సినిమాలో డి.ఎల్.నారాయణ కూతురు సుబ్బలక్ష్మి జమునతో కలిసి నృత్యం చేశారు. 26 ఫిబ్రవరి 1965 నాడు విడుదలైన ఈ సినిమా విజయవంతం అయ్యింది. ఈ సినిమా తరువాత డి.యల్.నారాయణ 1965 లో దగ్గరుండి జమున వివాహం రమణరావుతో జరిపించారు.
నిరాశను మిగిల్చిన “ఏకవీర” (1969)…
తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ఏకవీర నవలను “ఏకవీర” సినిమాగా తీయాలనుకున్నారు డి.యల్.నారాయణ. ఈ సినిమాకు మాటలు వ్రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. ఆయన తన సినీరచనా జీవితంలో సంభాషణలు వ్రాసిన సినిమాలలో ఇది మొదటిది. విశ్వనాథ సత్యనారాయణ నవల, దేవులపల్లి, సి.నారాయణరెడ్డి పాటలు, కె.వి మహదేవన్ సంగీతం, నందమూరి తారక రామారావు, కె.ఆర్.విజయ, కాంతారావు, జమున తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరలేకపోయింది. డి.యల్.నారాయణ అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలో “పూత వయసు పిలిచిందోయ్ సిరి సిరి మువ్వా” అనే పాటలో డి.ఎల్.నారాయణ కూతురు సుబ్బలక్ష్మి నృత్యం చేశారు.
మరణం…
కాలం మారుతున్నా కొద్దీ ప్రేక్షకులు మరియు సినిమా అభిమానుల అభిరుచులు మారుతున్నాయని గ్రహించిన డి.యల్. నారాయణ వారి అభిరుచులకు తగినట్టుగా సినిమా తీద్దామని శోభన్ బాబు, వాణిశ్రీ నాయకా, నాయికలుగా “దెబ్బకు ఠా దొంగల ముఠా” అనే సినిమాను దర్శకులు పురాణ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎస్వీ రంగారావు కూడా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను 20 మే 1971 నాడు విడుదల చేశారు. ఈ సినిమాలో జమున కథానాయికగా నటించలేదు. ఈ సినిమా కూడా పరాజయం పొంది పూర్తిగా నష్టాలనే మిగిల్చింది.
“దెబ్బకు ఠా దొంగల ముఠా” సినిమా తరువాత కొంత విరామం తీసుకుని మళ్లీ తన భాగస్వాములతో కలిసి కృష్ణ, జమున నటీనటులుగా “పెద్దలు మారాలి” సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకులు. పాంచజన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా 28 మార్చి 1974 నాడు విడుదలైంది. ఇది కూడా అనుకున్నంతగా విజయం సాధించలేదు.
పరాజయం పాలైన “పెద్దలు మారాలి” సినిమా కూడా నష్టాలనే బాటలోనే పయనించింది. అప్పటికే డి.ఎల్.నారాయణ కు నాలుగోసారి గుండెపోటు వచ్చింది. అంతకుముందు మూడుసార్లు గుండెపోటు వచ్చినా కోలుకున్నారు. కానీ నాలుగోసారి 19 మే 1974 నాడు గుండెపోటుతో మరణించారు. అదే సమయానికి కలకత్తాలో చదువుకుంటున్న కూతురు సుబ్బలక్ష్మి విమానంలో బయలుదేరి వచ్చారు. నటి జమున భర్త రమణరావు అంతక్రియలను పూర్తిచేశారు.

