Telugu News

సమాన అవకాశాలను కల్పించేది.. ‘రిజర్వేషన్’!

చదువుకోసం కావొచ్చు… ఉద్యోగంకోసం కావొచ్చు… నేడు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వర్గాల వారీగా కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేవి అమలవుతున్నాయి. అన్ని వర్గాలవారికి సమన్యాయం అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లు.. తర్వాతి కాలంలో రాజకీయ నేతలు వినియోగించుకునే ఒక అస్త్రంగా మారిపోయాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ.. భావిభారత పౌరుల భవిష్యత్తు విషయంలోనూ రిజర్వేషన్లు అనేవి ముఖ్యభూమిక పోషిస్తాయి.. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి?, ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు ఉద్యమించిన నాయకులెవరు? వారి సిద్దాంతాలేంటి? ఆనాటి పరిస్థితుల గురుంచి ఇప్పుడు చూద్దాం:

రిజర్వేషన్లు ప్రధానంగా మూడు రకాలు:

*మొదటిది.. రాజకీయ రిజర్వేషన్ (రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు), 

*రెండు చదువుకోసం,

*మూడు ఉద్యోగాల్లో రిజర్వేషన్. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్‌కు మాత్రమే పదేళ్ల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోసం మన దేశ రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితిని విధించలేదు.

ఇకపోతే రిజర్వేషన్లు అనేవి స్వాతంత్ర్యానికి ముందు నుంచే అమల్లో ఉన్నాయి. మనదేశంలో రిజర్వేషన్లకు 120 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఆనాటికి జాతీయ ఉద్యమం సాగుతున్న కాలంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసిఎస్) కేవలం బ్రిటిష్వారికే ప్రవేశముండేది. కొన్నాళ్లకు భారతీయులకు కూడా హక్కు కల్పించాలని కోరగా.. మనకు కూడా అవకాశం కల్పించారు. 

అయితే, 1890 నుంచి 1945 వరకు ఈ ఐసీఎస్ గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే…

1892- 1904ల కాలంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి 16 మంది సెలక్ట్ కాగా అందులో 15 మంది బ్రాహ్మణులే ఉన్నారు.

1914 నాటికి 128 మంది జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేటివ్ కు ఎన్నికవ్వగా.. అందులో 93 మంది బ్రాహ్మణులే ఉండటం విశేషం.

1944లో 650 మంది పట్టభద్రులు అయితే అందులో 452 మంది బ్రాహ్మణులే ఉన్నారు. 

ఇకపోతే విద్యారంగంలో ఫీజుల్లో రాయితీల కోసం మనదేశంలోని అనేక వర్గాలవారు బ్రిటిష్ వారికి అర్జీలు పెట్టుకున్నారు. వీరిలో ఎక్కువమంది ముస్లింలే ఉండటం విశేషం. వీరి అర్జీలను పరిశీలించడానికి 1982లో బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ ను నియమించారు. ఈ కమిషన్ ముస్లింల విద్యాపరమైన స్థితిగతులను పరిశీలించి, ప్రత్యేక సదుపాయాల కోసం సిఫార్సు చేయడం జరిగింది. అలా రిజర్వేషన్ల వ్యవహారం ప్రారంభమైందని చెప్పొచ్చు.

1883లో 11, 1893లో 39 కులాలను తొలుత  బిసీలుగా గుర్తించారు. 1913 నాటికి కమ్మ, 1933 నాటికి కాపు కులం వెనుకబడిన కులాల జాబితాలో చేరాయి. 1943 తర్వాత కాపులకు కూడా రిజర్వేషన్లను అమలు చేయడం జరిగింది. 

మన రాజ్యాంగం ఏం చెబుతుందంటే…

భారతదేశంలోని పురాతన కుల వ్యవస్థ.. అనేది దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ ఆవిర్భావానికి బలమైన కారణమైంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలు, చట్టసభల్లో కూడా నిర్దిష్ట జనాభాకు సీట్లను పొందేందుకు వీలు కల్పిస్తుంది.

రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే, దేశ పౌరులైన ఎవరిని కూడా జాతి, కుల, మత, లింగ, వంశ, ప్రాంతాల ప్రాతిపాదికన ప్రభుత్వ ఉద్యోగాలుగాని, పదవులకుగాని అర్హులని భావించకూడదు. వివక్ష పాటించకూడదు. 

ఆర్టికల్ 16(1) ఏ ప్రకారం.. ప్రభుత్వం ఉద్యోగం విషయంలోనైనా, పదవి విషయంలోనైనా పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తెలుపుతోంది. చదువు, ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలను కూడా ఉన్నత స్థానాలకు తీసుకొచ్చేందుకు ఆయా రంగాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. కానీ ఈరోజుకీ అది సాధ్యం కాలేదు. 

అణగారిన వర్గాలవారికి రాజకీయ హక్కులు లభించాలంటే వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ అప్పట్లో డిమాండ్ చేశారు. కానీ గాంధీజీ అందుకు అంగీకరించకపోగా… ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. చివరికి, అంబేడ్కర్ రాజీ పడి, రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు అంగీకరించారు. ఆ సమయంలో గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్నే పుణా ప్యాక్ట్ (పూనా ఒప్పందం)గా చెప్పుకుంటాం.

‘ఇదే పద్ధతిని దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం కూడా స్వీకరించింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. దీన్నే రాజకీయ రిజర్వేషన్ అంటారు.

కానీ నేటి దేశ రాజకీయాలను చూస్తుంటే… స్థానికంగా నమోదయ్యే ఓట్లన్ని కూడా అధిక శాతం కులాలవారిగానే ఉండటం ఆశ్చర్యం… పార్లమెంటులో కూర్చునే ప్రజాప్రతినిధులు తమ వైఫల్యాలను, అభివృద్ధి లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి పదేళ్లకు రిజర్వేషన్లను పొడిగిస్తూ వస్తున్నారు.

కానీ, రాజకీయ రిజర్వేషన్ అనేది ప్రతి పదేళ్లకు పైగా కొనసాగాలని 1949లో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగప్ప డిమాండ్ చేశారు. లేకపోతే షెడ్యూల్డ్ కులాలవాళ్లు అగ్రవర్ణాల స్థాయికి చేరుకోలేరని ఆయన అభిప్రాయం.

నాగప్ప డిమాండుకు అంబేడ్కర్ గారు సమాధానమిస్తూ… ‘వ్యక్తిగతంగా నేను కూడా రిజర్వేషన్లు ఎక్కువ కాలంపాటు కొనసాగాలనే అనుకున్నా.. షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగ సభ ఎక్కువ కాలంపాటు రిజర్వేషన్లు కల్పించాల్సింది. కానీ, రాజ్యాంగ సభ అలా చేయలేదు. పదేళ్ల వరకు మాత్రమే రిజర్వేషన్లను కల్పించేందుకు నిర్ణయించింది. కానీ, ఈ పదేళ్లలో షెడ్యూల్డ్ కులాలు ఆశించినంత పురోగతి కనబరచకపోతే ఇంకొంతకాలం రిజర్వేషన్లను పొడిగించేలా నేను నియమం పెట్టానని తెలిపారు.

తర్వాతి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. దీనివల్ల రాజకీయాల్లో చాలా వర్గాలు క్రియాశీలంగా మారాయని చెప్పొచ్చు.

రిజర్వేషన్ల అమలులో వీరి పాత్రే కీలకం…

*1882లో హంటర్ కమిషన్ ముందు మహాత్మ జ్యోతిరావ్ పూలే శూద్రులకు, దళితులకు సైతం విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలని కోరారు. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి సాధికారత కోసం కృషి చేసిన పూలే… విద్యా, వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. 

సమాజం విద్యాపరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించిన పూలే… 

1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలో జన్మించారు. తండ్రి పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందిందని ప్రతీతి. అతి తక్కువరోజులే పాఠశాలకు వెళ్ళినప్పటికీ, ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన్ను అప్పట్లో శివాజీ, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు బాగా ప్రభావితం చేశాయి. అంతేకాక 1848లో వ్యక్తిగతంగా కుల‌వివ‌క్ష‌కు గురైన ఫూలే.. ఆనాటి నుంచి కుల వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. అంతేగాక ప్రజల్లో సాంఘిక అసమానతల నుంచి చైత‌న్యం తీసుకొచ్చారు. మహిళా చ‌దువు కోసం పాటుప‌డ్డారు. ఆ కాలంలోనే మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై, ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్..‌ సైతం జ్యోతిబాపూలేను తన గురువుగా ప్రకటించుకున్నారంటే అతిశయోక్తి కాదు.

దీంతో 1885లో కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరంలోనే మద్రాస్ ప్రభుత్వం అట్టడుగువర్గాలకు విద్య అందుబాటులోకి తేవడానికి సబ్సిడీనిచ్చింది. దేశంలోనే మొదటిసారి 1895 జూన్ లో కొన్ని పదవులను వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్ చేస్తూ, సర్క్యులర్ సైతం జారీ చేసింది. 

*1902లో సాహు మహారాజ్ కొల్హపూర్ సంస్థానంలో బ్రాహ్మణేతరులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఎంతో కృషి చేశారు. 1905లో తమిళనాడులో దక్షిణభారత విముక్తి సమైక్య ఏర్పడి, అట్టడుగు కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేసింది. ఈ సమైక్యయే జస్టిస్ పార్టీగా తరువాత రూపాంతరం చెందింది.

మద్రాస్ ఫ్రావిన్స్ లో పెరియర్ ఇ.వి.రామస్వామి నాయకర్, జస్టిస్ పార్టీని నడపగా అనేక పోరాటాల ఫలితంగా కమ్యూనల్ జీవోను ప్రకటించింది. 

దత్తతగా స్వీకరించబడిన సాహు మహారాజ్… సాహు శూద్రుడేనని, క్షత్రియ వంశానికి చెందినవాడు కాదని తెలిసి, ఎన్నో అసమానతలను ఎదుర్కొన్నాడు. ఆ అవమానాల నుంచే విద్యను ఉద్యమంగా స్థాపించాడు. బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చే బడులను స్థాపించాడు. వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్, హాస్టల్స్  ప్రారంభించి విద్యని కనీస అవసరంగా కాక ఒక ఉద్యమంలా చేశాడు. 

ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యాసంస్థలను రద్దు చేస్తూ అన్ని కులాల, మతాలవారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యా సంస్థలోనైనా చదువుకోవచ్చని తెలిపింది.

వ్యవసాయం, ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి బడులు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్​లు కల్పిస్తూ ఒక సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది వీరి ప్రభుత్వం.

కొల్హాపూర్ సంస్థానంలో ప్రత్యేకించి బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించడమే కాదు. వారికి ఉపకార వేతనాలు, ఉచిత భోజనవసతి సదుపాయాలు కల్పించాడు. 

1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టాన్ని,  కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టం చేయడం,  విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే తొలి ప్రాధాన్యతనిస్తూ.. విడాకుల చట్టం.. వంటి మహిళాచైతన్యం కోసం ఎన్నో చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. 

కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాంగంలో కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా అప్పటి ప్రభుత్వాన్ని కోరడమేకాక.. మహారాష్ట్రకే పరిమితం కాకుండా జస్టిస్​ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపించేలా చేసిన మహనీయుడు సాహు మహారాజ్..

కమిటీలు – ఫలితాలు…

*1908కి ముందు రాజకీయ రిజర్వేషన్ కోసం ముస్లింలు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అయితే మింటో మార్లే సిఫార్సు మేరకు అదే ఏడాది ముస్లింలకు ప్రత్యేక స్థానాలు కేటాయించబడ్డాయి. దీంతో బీ.ఆర్.అంబేద్కర్ దళితులకు రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాడటం జరిగింది. 

*మన దేశంలో 1919లో మాంటెంగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా ముస్లింలకు సైతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.

*1921లో నియమించిన మిల్లర్ కమిటీ మనదేశంలో బీసీలపై నియమించిన మొట్టమొదటి కమిటీగా చెప్పొచ్చు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా మైసూర్ సంస్థానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించడం సాధ్యమైంది. 

*ఇదే ఏడు.. బ్రాహ్మణ వ్యతిరేకులందరూ సంఘటనగా ఏర్పడి మాకు కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేయడంతో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 

*మొత్తంగా 1927లో మద్రాస్ రాష్ట్రంలో అట్టడుగు కులాల వారిని ఐదు తరగతులుగా విభజించి, వారికి కోటాలు కేటాయించడం జరిగింది. మద్రాస్ తరహాలోనే మైసూర్ రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించి బ్రాహ్మణ వ్యతిరేకులంతా ఆందోళన చేయగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది.

*1932 ఏప్రిల్ నెలలో రామ్స్ మెక్ డొనాల్డ్, అంబేద్కర్ కృషి ఫలితంగా కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. ఈ ప్రకటన దళితులకు, సిక్కులకు, క్రైస్తవులకు విడివిడి నియోజకవర్గాలను  కేటాయించింది. దళితులకు కూడా 71 నియోజకవర్గాలు కేటాయించారు. ఈ ఒప్పందాన్ని గాంధీ వ్యతిరేకించి ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం జరిగింది. 

తరువాత దళితులకు కేటాయించిన స్థానాలు 71 నుంచి 144 స్థానాలకు పెరిగాయి. 

*1935లో ట్రావెల్కో సంస్థానం విద్యా, ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు. 

*1945లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత ఐదేళ్లకు రాజ్యాంగం సైతం అమల్లోకి వచ్చింది. రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయాలని అడిగినప్పుడు… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇలా వివరణ ఇచ్చారు. 

“నేటికీ కొనసాగుతున్న కుల వివక్షణను అధిగమించాలంటే రాజ్యాంగాన్ని అమలు చేయాలి. చారిత్రకంగా జరిగిన తప్పిదాన్ని సవరించాలన్న రిజర్వేషన్ చాలాకాలం పాటు అమలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి, రిజర్వేషన్లు ప్రజలకు ఊతకర్ర లాంటివి.. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అంతే తప్ప.. శాశ్వత పరిష్కారం లభించదు. సంపదలో అందరికీ భాగస్వామ్యం కల్పించినప్పుడు మాత్రమే రిజర్వేషన్ అవసరం తీరుతుందని” ఆయన చెప్పుకొచ్చారు.

మద్రాసు ప్రభుత్వం 1948లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువస్తే.. 

దానిపై 1950లో శ్రీమతి చంపకం దొరైరాజన్, శ్రీనివాస్ అనే ఇద్దరూ రాజ్యాంగంలోని 15 (1) ఆర్టికల్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు సరికావని హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు దొరైరాజన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్రాస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించగా సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుపై స్పందించింది. ఆ విధంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం ఆమోదించడం జరిగింది.

1950లో కేరళ రిజర్వేషన్ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అప్పుడు ఇఎంయస్ నంబూద్రిపాద్ అధ్యక్షత కమిటీ ఏర్పడింది. 

ఎస్సీ, ఎస్టీలకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించొచ్చు. బీసీలకు మాత్రం కొన్ని కులాలను సామాజికంగా వెనుకబడిన కులాలుగా పరిగణించిన కులాలకు ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించాలని ఈ కమిటీ సూచించింది.

1951 జనవరి 29న కాకా కలేల్కర్ కమిటీ ప్రకారం.. 2,399 కులాలను బీసీ కులాలుగా గుర్తించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సామాజిక వెనుకబాటుతనాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని వీరు సూచించారు. 

రీసెర్చ్, న్యాయవ్యవస్థ, రక్షణ, ప్రభుత్వ సెక్రటేరియట్, ఈ నాలుగు విభాగాల్లో ఇప్పటికీ ఎలాంటి రిజర్వేషన్లు లేవు. మహిళలందరిని బీసీలుగానే గుర్తించాలని సూచించారు. బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని కేంద్రం 1961లో సూచించింది. 1963లో ఆంధ్రప్రదేశ్ అనంతరామన్ కమీషన్ ను వేశారు. ఈ కమీషన్ ను సమగ్రంగా విచారించి, 1970లో నివేదిక ఇచ్చింది. బీసీలకు వారికి కేటాయించిన రిజర్వేషన్లకు కులాన్నే ప్రతిపాదికగా తీసుకోవాలని, 30 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని సిఫార్సు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 25% మాత్రమే ఇచ్చింది.

దీంతో బీసీ నాయకులంతా రిజర్వేషన్లలో మాకెందుకు ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు అని ఆందోళన చేయగా అగ్ర కులాలవారు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు? అని రెండువైపులా ఇఎంఎస్ సంబూద్రిపాద్ కమిటీపై దాడి చేశారు. 

బీసీలకు రిజర్వేషన్ల విషయమై 1967లో ఎన్. దామోదరన్ కమిటీ వేయగా, 1969లో ఈ కమిటీ ఇఎంఎస్ ప్రతిపాదనలు సమర్ధిస్తూ నివేదిక ఇచ్చింది.

ఇకపోతే నేటికీ మన దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒకచోట, ఏదో ఒకరకంగా దళితులపై దాడులు లేదంటే అత్యాచారాలు విస్తృతంగా జరుగుతూనే ఉన్నాయి. 1985లో దళితులపై 20వేలకు పైగా దాడులు జరిగితే 2012 నాటికి 35వేలు, అది కాస్త 2014 నాటికి 47064కు పెరిగాయి. దాడుల సంఖ్య ఏటికేడు, దశాబ్దాలవారీగా తరచి చూసినా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. 

మనకు రిజర్వేషన్ ఎందుకు అవసరం?

దేశంలో వెనుకబడిన కులాలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను సరిచేయడం..

వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం..

మనకు రిజర్వేషన్ తప్పనిసరి.

అట్టడుగు స్థాయిలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అవసరం. దీనిపై అవగాహన కల్పించాల్సినవశ్యకం కూడా ఉంది. 

ఎందుకంటే అన్‌రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లు, నిబంధనను వ్యతిరేకిస్తూనే ఉంటారు. రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లలోని అత్యంత అవసరమైన విభాగాలు ఈ నిబంధన నుంచి ఎలా ప్రయోజనం పొందాలని చూస్తాయి. 

అన్ని కులాల్లోని క్రీమీలేయర్‌ను రిజర్వేషన్ నుంచి మినహాయింపు ఇవ్వడం, ఉన్నత విద్య లేదా ఉద్యోగాల్లో ప్రవేశానికి, విద్యార్థి/ ఉద్యోగార్థికి రిజర్వేషన్‌ అనేదాన్ని ముడిపెట్టే బదులు వారి శక్తిసామర్థ్యాలను పెంపొందించేలా చేయడం అనేది శాశ్వత పరిష్కారంగా తోస్తుంది.

Show More
Back to top button