సింగపూర్ పర్యటన. సక్సెస్ అయ్యిందిలా.ఐటీ, ఎంఎస్ఎంఈ, ఎకో టూరిజం రంగంలో పెట్టుబడులపై హర్షం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయి. వ్యాపారాభివృద్ధికి ఇక్కడ పెద్దఎత్తున అవకాశాలున్నాయి. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములవ్వండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని దిగ్గజ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. సింగపూర్ పర్యటన చివరి రోజున ఆయన పలు కంపెనీలతో భేటీ కాగా, రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించారు.
వివిధ సెక్టార్లలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి, కీలక కంపెనీలుగా ఉన్న కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడిగా చర్చలు జరిపారు. పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన నిన్నటితో విజయవంతంగా పూర్తైంది. మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి సీఎం సింగపూర్‌లో నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొనడం విశేషం!
సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజిట్ చేసి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా ఉన్నవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలు జరిగాయి. గత పాలకుల చర్యల కారణంగా ఏపీ-సింగపూర్ మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు మళ్లీ ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా, పెట్టుబడులు పెట్టేలా చేయగలిగారు. నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల్ని సీఎం ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు.
పెట్టుబడులకున్న అవకాశాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి వారికి అవగాహన కల్పించారు. పట్టణాభివృద్ధి, ఐటీ, ఏఐ, ఫిన్‌టెక్, మారిటైమ్, పోర్ట్స్ మౌలిక సదుపాయాలపై ఇక్కడి వనరుల్ని వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ ఒక గమ్యస్థానంగా నిలవాలని కోరారు. రాష్ట్రంలోకి వచ్చే కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు సైతం ఉంటాయన్నారు.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్‌షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా) ప్రతినిధులతో మాట్లాడారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటు, హైదరాబాద్- బెంగళూరు- అమరావతి- చెన్నైల మధ్య ఎయిర్‌పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి వివరించారు. రియల్, కార్పొరేట్ రంగాలతో పాటు ఎకోటూరిజం రంగంలోనూ పెట్టుబడులను కోరారు.
వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్శిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ల ఏర్పాటుపై స్పెషల్‌గా చర్చించారు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూపార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేసే అంశంపై ఇంట్రెస్ట్ చూపారు. వైజాగ్‌లో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు ప్రణాళికలతో వెళ్తున్నామని.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. ఇక పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్తో సీఎం సమాలోచనలు జరిపారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ, డిఫెన్స్, సివిల్ ఏరోస్పేస్ కారిడార్ వంటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లెండిరగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి తెలిపారు.
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆ సంస్థ నుంచి పూర్తిస్థాయిలో సహకారం కోరారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పనవంటి రంగాల్లో ఏపీలోవున్న అవకాశాలను సైతం వివరించారు.
రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరింది.
మొత్తం పర్యటనలో సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశం విశేషంగా నిలిచిందనే చెప్పాలి. పర్యటన స్టార్టింగ్‌లో సింగపూర్‌తో పాటు సమీపంలోని ఐదు దేశాల నుంచి వచ్చిన తెలుగువారు ఆత్మీయ, అభిమానాలతో ముఖ్యమంత్రి బృందానికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. పర్యటన చివరి రోజైన బుధవారం కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రానికి రిటర్న్ అయ్యారు.










