Telugu News

P4 పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

పేదరిక నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పీ-4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే తమ అసలైన లక్ష్యమని చెప్పారు. చివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పీ-4పై సమీక్షించారు. ఈ నెల 19వ తేదీ నుంచి కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత కలగకూడదని సూచించారు. మార్గదర్శులు చిన్న ఆసరా పేదలకు కొండంత అండగా మారతారని చెప్పారు. బంగారు కుటుంబాలకు అవసరమయ్యే అంశం అనుబంధమే, చేయూతే అన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో బిల్ గేట్స్‌, వేదాంత లాంటి సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. అయితే వాటికన్నా ఎక్కువగా కుటుంబాల సాధికారతే పీ-4 లక్ష్యమని చెప్పారు. ప్రజలే ఆస్తిగా భావించి జీరో పావర్టీ మిషన్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.

మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలని చెప్పారు. ఎవరినీ బలవంతంగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని హెచ్చరించారు. మంచి కార్యక్రమాలకు వ్యతిరేకంగా కొందరు ప్రయత్నిస్తారని, వారికి అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. గతంలో జన్మభూమి, శ్రమదానం లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. కొందరికి వనరులు ఉన్నా సహాయమనేది చేయలేరు. మరికొందరికి సహాయమనసు ఉన్నా సమయం లేకపోవచ్చు. అలాంటి వారిని గుర్తించాలన్నారు.

ఇప్పుడున్న బంగారు కుటుంబాల్లో ఉన్నవారే రేపు మార్గదర్శులుగా మారవచ్చని అన్నారు. పీ-4 ద్వారా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అదనంగా సాయం అందుతుందని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు 9,37,913 బంగారు కుటుంబాలు ఎంపిక అయ్యాయని, 1,03,938 మార్గదర్శులు గుర్తించామని తెలిపారు. 11 ప్రశ్నల ఆధారంగా ఏఐతో వివరాలు విశ్లేషించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుటుంబాల అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించామని వివరించారు.

వారిలో 31 శాతం ఉద్యోగ అవకాశాలు, 22 శాతం వైద్యం, 9 శాతం వ్యాపార అభివృద్ధికి అవసరం ఉందని చెప్పారు. కొన్ని గ్రామాలు, మండలాలను దత్తత తీసుకోవడానికి కొందరు ముందుకొచ్చారని తెలిపారు. తాను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా కూడా పీ-4 కార్యక్రమ లక్ష్యాలను చేరుకుంటున్నామని చెప్పారు.

Show More
Back to top button