CINEMATelugu Cinema

మంచుపల్లకి” విజయంతో తొలి విఘ్నం దాటేసిన దర్శకులు. వంశీ.

స్వాతి వారపత్రికలో ఈ కథలు అశేష ప్రజాధరణ పొందినవి “మా పసలపూడి కథలు”. ఈ అందమైన కథలు ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన వంశీ కలం నుండి జాలువారినవే. ఆయన కేవలం దర్శకుడే కాదు, మంచి కథకుడు కూడా. గోదావరి పరీవాహక ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలోని మనుషుల జీవితాలను, అక్కడి చెట్టూచేమలను అన్నింటినీ కథావస్తువులుగా మలిచి కథలు వ్రాస్తూ ఉంటారు. మాములుగానే కథా రచయితలకు గురువులు ఉంటారు, లేదా కథా రచనవైపు ప్రోత్సహించేవారు ఉంటారు. కానీ వంశీ వాటికి భిన్నంగా పుస్తకాలు విపరీతంగా చదవడం, జీవితాన్ని చవిచూడడమే తనను కథా రచయితగా చేశాయి.

గోదావరి పరివాహక ప్రాంతంలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుండి సాహిత్యం అంటే పిచ్చి. పాఠశాలలో పాఠ్యపుస్తకాల కన్నా కథలు, నవలలు ఎక్కువగా చదివేవారు. 15 సంవత్సరాల వయస్సు నుండే కథలు వ్రాయడం ప్రారంభించిన వంశీ తన మొదటి కథ “సత్య సుందరి నవ్వింది” 1987 వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో చదవబడింది. అలాగే “మంచు పల్లకి” మరియు “కర్మ సాక్షి” అనే రెండు నవలలను కూడా వ్రాశారు. అవి తన సినీ జీవితాన్ని ప్రారంభించే ముందు “ఆంధ్రజ్యోతి మాస పత్రిక” లో ప్రచురించబడ్డాయి.

1993 నుండి అనేక రకాల కథలు వ్రాశారు వంశీ. తన ప్రధాన రచనలు “మహల్లో కోకిల”, “మంచుపల్లకి”, “ఆనాటి వాన చినుకులు”, “వెండితెర కథలు”, “వెన్నెల బొమ్మ” , “గోకులంలో రాధ”, “రవ్వల కొండల సేవ మన్యం రాణి”, “రంగులరాట్నం మొదలైనవి. స్వాతి (పత్రిక) వారపత్రికలో ప్రచురితమైన “మా దిగువ గోదావరి కథలు” శీర్షికన దాదాపు 360 కథానికలను వంశీ వ్రాశారు. స్థానిక విధానంతో కథాకథనానికి ఆయన చేసిన కృషికి, ఆయనకు 17 ఏప్రిల్ 2011 నాడు రాజమండ్రిలో “శ్రీపాద పురస్కారం” కూడా లభించింది. నిజానికి తాను రచయితగానే ఉండాలనుకున్నారు.

సినిమాలు చూడడం గానీ, చిత్రసీమలోకి ప్రవేశించడంపై ఏమాత్రం ఆసక్తి చూపని వంశీకి అనుకోకుండా 1977 లో ఎదురీత సినిమాతో సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ తరువాత కె.విశ్వనాథ్, భారతీరాజా లాంటి దర్శకుల వద్ద “శంకరాభరణం”, “సీతాకోకచిలుక” వంటి చిత్రాలకు పనిచేశారు. 30 సంవత్సరాల వయస్సులో దర్శకత్వం చేయాలనుకున్న తనకు 24 సంవత్సరాలకే “మంచుపల్లకి” (1982) రూపంలో దర్శకుడిగా అవకాశం వచ్చింది. దర్శకుడిగా కొత్తే అయినా, తొలి సినిమా “మంచుపల్లకి” (1982) తో వాణిజ్యపరమైన విజయం దక్కించుకున్నారు.

నేపథ్యం…

తెలుగునేల పచ్చ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసే కోనసీమ ప్రాంతం ఉభయగోదావరి. అందులో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి దగ్గరలో పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉన్న గ్రామం పసలపూడి. దర్శకుడు వంశీ పుట్టిన ఊరు అదే. ఆయన అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. తాను మాములుగానే మంచి కథా రచయిత, నవలా రచయిత కూడా. తన ఊరిలో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలను ఓ పట్టు పట్టి వాటిని విపరీతంగా చదవడం, పుస్తకాలలోని సాహిత్యాన్ని, భావాలని పూర్తిగా అర్థంచేసుకోవడం వలన తనకు సాహిత్యం అంటే వల్లమాలిన ఇష్టం ఏర్పడింది. తరుచూ నవ్వుతూ ఉండే ఒక స్త్రీని ప్రేరణగా తీసుకుని “సుందరి నవ్వింది” అనే కథ వ్రాశారు.

వంశీ కి సాహిత్యం పై ఆసక్తి కలగడానికి ఓ ప్రధాన కారణం, ఆ రోజులలో అమలాపురంలో కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్న పైడిపాల. అలాగే వంశీకి మిత్రుడైన రవి 14 ఏళ్ల వయస్సులో సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలను తెలుగులో అనువదించడం చూసి, వంశీ కూడా కథా రచనలు మొదలుపెట్టి “సుశీల” అనే కథను వ్రాసి ఆంధ్రజ్యోతి పత్రికకు పంపించగా, అది 1974 వ సంవత్సరంలో దీపావళి సంచికలో ప్రచురితమైంది. అలాగే వరుసగా “కర్మభూమి”, “మంచుపల్లకి” మొదలగు నవలలు వ్రాశారు. అప్పటికి వంశీ వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. అలా ఒక్కొక్కటిగా నవలలు వ్రాస్తూ, రెండు సంవత్సరాలు అలా గడిచిపోతుండగా తన జీవితంలో అనుకొని సంఘటన జరిగింది. ఉన్నట్టుండి సమయంలో వంశీ నాన్న చనిపోయారు. దాంతో తన జీవితం అంధకారంలో పడిపోయింది. అప్పటికి వంశీ 18 ఏళ్ల లేత వయస్సులో ఉన్నారు. తనకు అదొక జీర్ణించుకోలేని విషయం.

మలుపు తిప్పిన తప్పుడు చిరునామా…

తండ్రి మరణంతో చీకటి ఊబిలోకి కూరుకుపోయాననుకున్న వంశీ జీవితానికి తన బంధువు వెలుగులా కనిపించాడు. వంశీకి ఉన్న తెలివికి తాను ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అని, తన బంధువు ఆయనను మద్రాసుకు తీసుకెళ్లాడు. వెళ్ళేది మద్రాసుకు, అక్కడ మాట్లాడేది తమిళం కనుక ఎలాగైనా తమిళం మాట్లాడాలనుకుని 30 రోజుల్లో తమిళ భాష పుస్తకం చదివి, కొంత తమిళం నేర్చుకున్నారు వంశీ. నిజానికి వంశీకి చిన్నప్పటి నుండి సినిమాలు చూసే అలవాటు లేదు. అందువలన సినిమా రంగవైపు వెళ్ళాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు కూడా. కానీ తన ఇష్టమైన రచయిత అయిన బాపును కలవాలని ఉండేది. ఆ అభిలాషతో మద్రాసులో ఆయన ఇల్లు ఎక్కడ అని వెతుక్కుంటూ, అగుపించిన వారిని చిరునామా అడుగుతూ వెళ్లారు.

నేరుగా వెళ్లి మొదటి బజారు ఎడమవైపు తిరగాలి అని ఒక వ్యక్తి సూచించిన చిరునామాను ప్రకారం వెళ్లకుండా మరచిపోయి, రెండవ బజారు ఎడమ మలుపు తిరిగారు. ఆ పొరపాటులో బాపు ఇల్లుకు బదులుగా విక్టరీ మధుసూదన రావు ఇంటి తలుపు తట్టారు. పొరపాటున తిరిగిన ఆ ఒక్క మలుపే వంశీకి సినిమా జీవితాన్ని తెర తీసింది. ఆయన చేతిలో ఉన్న నవలలు చూసి, ఆ నవలలను చదివిన మధుసూదన రావు “ఇది నీవే వ్రాశావా” అని ఆశ్చర్యపోయారు. దాంతో వంశీ వ్రాసిన నవలలను ప్రచురించిన పత్రిక వాళ్ళు ఆయనకు అందజేసిన అనుమతి పత్రాలను మధుసూదన రావుకు చూపించారు. అప్పుడు ఆనందంతో పరవశుడైన విక్టరీ మధుసూదన రావు, కొత్త రెండు రూపాయల నోట్లను సుమారు 20 వరకు వంశీ చేతిలో పెట్టి, మద్రాసులో ఉన్న కేసినో థియేటరులో లూయిస్ గిల్బర్ట్ దర్శకత్వం వహించిన ఫ్రెండ్స్ సినిమా తిలకించి దాని కథను తెలుగులో వ్రాసుకుని రమ్మని చెప్పారు.

సహాయ దర్శకుడిగా…

విక్టరీ మధుసూదన రావు చెప్పగానే అదే సాయంత్రం “ఫ్రెండ్” అనే సినిమా చూసి రాత్రికి రాత్రే దానిని తెలుగులో వ్రాసి, మరునాడు ఉదయం ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి వెళ్లారు. వంశీని చూసిన మధుసూదన రావు వారం తరువాత రమ్మన్నాను కదా! అప్పుడే వచ్చావెందుకు అని ఆయనపై చిరాకు పడ్డారు. ఎందుకంటే అప్పటికే మధుసూదన రావు ఎవరిమీదనో కోపంతో అరుస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి వంశీ వెళ్లారు. తాను వ్రాసిన కాగితాలు చూసి, చదివి వెంటనే వంశీని గట్టిగా హత్తుకున్నారు. ఆ తరువాత ఆయన వంశీని తనతోపాటే “మల్లెపువ్వు” (1978) చిత్రీకరణకు తీసుకెళ్లారు. గురుదత్ హిందీ చిత్రం “ప్యాసా” (1957) ఆధారంగా మల్లెపువ్వు తీయబడింది. ఆ తరువాత ఎదురీత (1977) చిత్రానికి సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.

ఎదురీత సినిమా బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన విజయవంతమైన హిందీ చిత్రం “అమానుష్” ఆధారంగా, తెలుగులో ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా తెరకెక్కించబడింది. ఈ చిత్రం ఎక్కువభాగం ఔట్ డోర్ లో (తూర్పు గోదావరి లంక గ్రామాల్లో) చిత్రీకరింపబడింది. ఆ తరువాత మధుసూదనరావు వద్ద అనేక సినిమాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. అప్పుడు పరిచయమైన కె.విశ్వనాథ్, భారతీరాజా లాంటి వారి వద్ద పనిచేసే అవకాశం లభించడంతో “శంకరాభరణం”, “సీతాకోకచిలుక” వంటి సినిమాలకు పనిచేశారు. ఒకవైపు సహాయ దర్శకుడిగా పనిచేస్తూనే మరోవైపు డిటెక్టివ్ నవలలు వ్రాస్తుండేవారు. తెరచాటు రచయితగా వుండి ఇతర రచయితలకు నవలలు వ్రాసేసి నవలకు వంద రూపాయల చొప్పున తీసుకునేవారు. అదేవిధంగా జ్యోతి, స్వాతి, యువ లాంటి పత్రికలకు కథలు వ్రాసి మరికొంత డబ్బు సంపాదించేవారు. అందువలన వంశీకి డబ్బు పరంగా ఏనాడూ ఆర్థిక ఇబ్బందులు కలుగలేదు. 

దర్శకుడిగా…

రాబర్ట్ – రాజశేఖర్ ద్వయం తొలి దర్శకత్వం లో వచ్చిన “పలైవాన సోలై” (1981) అనే తమిళ సినిమాను, జ్యోతి మాసపత్రిక కు ఎడిటర్ గా ఉన్న వేమూరు సత్యనారాయణ మరియు రాజమండ్రికి చెందిన ఎం.ఆర్. ప్రసాదరావుతో కలిసి తెలుగులో పునః నిర్మించడానికి ప్రణాళిక చేశారు. ఆ సినిమాకు దర్శకులుగా బాపు, రేలంగి, జంధ్యాల, ఈరంకి శర్మ ఇలా చాలా మందిని అనుకున్నారు. కానీ ఏవేవో కారణాల వలన ఎవ్వరికీ కుదరలేదు. అప్పటికే “సీతాకోకచిలుక” చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ఖాళీగా ఉన్న వంశీ దగ్గరికి వచ్చిన వేమూరు సత్యనారాయణ, ఈ సినిమాకి దర్శకత్వం చేయాలని వంశీని కోరారు. వంశీ మద్రాసు వచ్చిన కొత్తలో వేమూరు సత్యనారాయణ ఎడిటర్ గా పనిచేస్తున్న “జ్యోతి” అనే మాస పత్రికకు “భారతీ” అనే నవల వ్రాశారు వంశీ.

అలా వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది. అదీకాక వంశీ అప్పటికే సహాయ దర్శకుడిగా పలు చిత్రాలకు పనిచేసి ఉన్నారు. అందువలన “పలైవాన సోలై” (1981) అనే తమిళ చిత్రం యొక్క తెలుగు రీమేక్ కోసం వంశీ దర్శకత్వం చేయాలని వేమూరు సత్యనారాయణ సూచించారు. 30 యేండ్లు దాటిత గానీ సినిమా దర్శకత్వం చేయకూడదు అనేది వంశీ అభిప్రాయం. కానీ వేమూరు సత్యనారాయణ మరియు ఎం.ఆర్. ప్రసాదరావు ల అభీష్టం మేరకు వంశీకి దర్శకత్వం చేయక తప్పేలా లేదు. అప్పటికే ఒకవేళ ఈ సినిమా పరాజయం పాలైనా కూడా తనతో మరో చిత్రానికి దర్శకత్వం చేయిస్తానని వంశీకి మాట కూడా ఇచ్చారు నిర్మాత ఎం.ఆర్. ప్రసాదరావు. చేసేది లేక సరేనన్నారు వంశీ. అలా తన ప్రమేయం లేకుండా, తన పూర్తి ఇష్టం లేకుండా ఆ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత తన భుజాలపై పడింది. అప్పుడు ఒక ట్రయల్ షూట్ చేశారు వంశీ. అది బాగా రావడంతో తన దర్శకత్వం మీద తనకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది.

“మంచు పల్లకి” గా సినిమా పేరు ఖరారు…

మొత్తానికి “పలైవాన సోలై” (1981) సినిమాను తెలుగులో పునర్నిర్మించడానికి రంగం సిద్ధమైంది. అప్పటికే శుభలేఖ, బిల్లా రంగా, యమకింకరుడు, మొండిఘటం వంటి సినిమాలు తీసి మాంచి ఊపు మీద ఉన్న చిరంజీవిని కథానాయకుడిగా తీసుకున్నారు. “పలైవాన సోలై” (1981) లో కథానాయికగా నటించిన సుహాసినినే ఇందులో కూడా కథానాయికగా కొనసాగించారు. దర్శకులు దేవదాస్ కనకాల దగ్గర తరుచూ కలుస్తూ ఉండే రాజేంద్రప్రసాద్ ను “హరి” అనే పాత్రకు ఎంచుకున్నారు. అంతులేని కథ సినిమాలో మిమిక్రీ కళాకారుడిగా చేసిన జి.వి. నారాయణరావు “వాసు” పాత్రలో, రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ను “కుమార్” పాత్రకు ఖరారు చేశారు.

గాంధీ పాత్రకు గిరీష్ (సప్తపది సినిమాలో కథానాయకుడు), గీత తండ్రిగా సాక్షి రంగారావు, వాసు సహోద్యోగిగా పి.ఎల్. నారాయణ, శ్యామలమ్మగా అన్నపూర్ణ, భీమేశ్వరరావు, దేవదాస్ కనకాల, మల్లికార్జునరావు, వాసు తమ్ముడుగా మాష్టర్ ఆలీ ఇలా తారాగణాన్ని ఎంపికచేసుకున్నారు. అప్పటికే పేరుపొందిన రచయితగా ఉన్న యండమూరి వీరేంద్రనాథ్ ను సంభాషణల రచయితగా, ఛాయాగ్రహకులుగా హరి అనుమోలు, ఆర్ట్ డైరెక్టర్ గా చిత్రకారుడు చంద్ర, గేయ రచయితలుగా శ్రీ శ్రీ, వేటూరి, మైలవరపు గోపి, పంతులమ్మ నాగమల్లి చిత్రాలకు సంగీతం దర్శకత్వం చేసిన రాజన్ – నాగేంద్రలను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు వంశీ. ఈ చిత్రానికి ముందుగా “మా మంచి గీతకు మల్లెపూదండ” అని పెడదామన్నారు నిర్మాతలు (ఆ సినిమాలో కథానాయిక పేరు గీత కాబట్టి). కానీ వంశీకి ఇష్టం లేదు. “చేత వెన్నముద్ద చెంగల్వపూదండ” కూడా అనుకున్నారు. కానీ అది కూడా కాదని తాను వ్రాసిన నవల “మంచు పల్లకి” పేరు నే సినిమా పేరుగా ఖరారు చేశారు.

విజయంతో మొదలైన దర్శక ప్రస్థానం…

సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. సంజీవరెడ్డి నగర్, హైదరాబాదులో చిత్రీకరణ మొదలు పెట్టారు. దర్శకుడు కొత్తవాడు. ఇంతమంది కళాకారులను ఉపయోగించుకుని సినిమా ఎలా తీస్తాడు అనే సందేహంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తయ్యింది. 12 రోజులలో చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యాయి. ఒకే ఒక రాత్రిలో పతాక సన్నివేశాలు (క్లైమాక్స్) పూర్తిచేశారు. ఒకేఒక్క రోజులో “మేఘమా దేహమా” చిత్రీకరణ అవజేశారు. గోదావరి చిత్ర బ్యానరులో ఎం.ఆర్.ప్రసాద్ రావు నిర్మాణంలో, వంశీ దర్శకత్వం వహించిన తొలి సినిమా “మంచు పల్లకి” 19 నవంబర్ 1982 నాడు విడుదలై వాణిజ్యపరంగా విజయం సాధించింది.

“మేఘమా దేహమా” గేయానికి గానూ నేపథ్యగాయని ఎస్.జానకి ఉత్తమ గాయనిగా 1982 సితార పత్రిక అవార్డు అందుకున్నారు. 1982 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా వంశీకి తొలి సినిమానే అయినా కూడా వాణిజ్యపరంగా, సృజనాత్మకంగా తనకు సంతృప్తినిచ్చింది. అదేవిధంగా ఈ సినిమా నేరుగా తెలుగు కథ కాకపోవడం, తమిళంలో వచ్చిన “పలైవానా సోలై” (1981) సినిమాకు రీమేక్ కావడం కొంచెం అసంతృప్తికి లోనైనా సినిమా విజయం తనకు సంతృప్తినిచ్చింది. సుహాసిని తండ్రి చారుహాసన్, ఆమె పారితోషికంకు బదులుగా నెల్లూరు పంపిణీ హక్కులను తీసుకున్నారు. దర్శకుడిగా వంశీకి తొలి సినిమా మంచుపల్లకి (1982) తీయటి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ తరువాత తన సినీజీవితం అద్భుతంగా సాగిపోయింది.

Show More
Back to top button