Telugu Special Stories

ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. సుభద్రా శ్రీనివాసన్.

ఆలిండియా రేడియో అనేది భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో నిర్వహించబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థ అయినటువంటి దూరదర్శన్ యొక్క సోదర విభాగం. దీని ప్రధాన కార్యాలయము ఢిల్లీ లోని పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది.

భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారాలు జూన్ 1923 నాడు “రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి” ద్వారా ప్రసారం చేయబడ్డాయి. ఆ తరువాత ప్రసార కార్యక్రమాల కోసం “బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ” ఏర్పాటు చేయబడింది. జూలై 1927 లో “ఇండియన్ బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ” ప్రయోగాత్మకంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో బొంబాయి, కలకత్తా నగరాలలో  ప్రసారాలు చేసింది. ఆకాశవాణి కాలక్రమేణా 1936 నాటికి ప్రభుత్వ సంస్ధగా అవతరించింది.

శ్రోతలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందించే ఆకాశవాణి కేంద్రాలు స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారత దేశంలో కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి లలో మాత్రమే ఉండేవి. ఆకాశవాణిలో తొలి తెలుగు ప్రసారాలు 16 జూన్ 1938 నాడు ప్రారంభమవ్వగా, అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు త్యాగరాజ స్వామి రచించిన “శ్రీ గణపతిని సేవింపరాదే” అనే తెలుగు కృతిని సౌరాష్ట్ర రాగంలో “తిరువెన్కాడు సుబ్రహ్మణ్యపిళ్లై” తన నాదస్వరంపై వాయిస్తూండగా మద్రాసు కేంద్రంగా తొలి ప్రసారం ప్రారంభమైంది.

మద్రాసు కేంద్రం తొలి తెలుగు ప్రసంగాల్లో 18 జూన్ 1938 నాడు “సజీవమైన తెలుగు” అనే అంశంపై గిడుగు రామమూర్తి పంతులు, 21 జూన్ నాడు “మన ఇల్లు – దాని అందము చందము” అనే అంశంపై కోలవెన్ను రామకోటేశ్వరరావు, 23 జూన్ నాడు రవీంద్రుడు గురించి బెజవాడ గోపాలరెడ్డి 15 నిమిషాల వ్యవధి గల ప్రసంగాలు చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ముద్దుకృష్ణ వ్రాసిన అనార్కలి 24 జూన్ 1938 నాడు రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. 25 జూన్ 1938 నాడు రాత్రి తొలిగా జానపద సంగీతం ప్రసారమైంది. పిల్లల కార్యక్రమాల ద్వారా రేడియో తాతయ్యగా  సుప్రసిద్ధులయిన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు మద్రాసు రేడియో ప్రసారాల తొలి తెలుగు వ్యాఖ్యాత.

తెలుగులో తొలి ప్రసారాలు ఆకాశవాణి మద్రాసు కేంద్రం ప్రసారం చేయగా, 12 అక్టోబరు 1948 తొలి తెలుగు రేడియో స్టేషనుగా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం 01 డిసెంబరు నుంచి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభించింది. ఆకాశవాణి తెలుగునాట సాంస్కృతిక వికాసానికి ఎంతగానో తోడ్పడింది. నిజానికి బుల్లితెర, వెండితెర ప్రభావంతో రేడియో కార్యక్రమాలకు శ్రోతలు తగ్గిపోయారు. కానీ చక్కని ప్రామాణికమైన సంగీత, సాహిత్య కార్యక్రమాలకు నేటికీ ఆకాశవాణి దర్పణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఆకాశవాణి ద్వారా ఎందరో కళాకారులు ప్రజలకు చేరువయ్యారు. ఆకాశవాణికి స్వర్ణయగంగా భావించే 1950 – 70 మధ్యకాలంలో కార్యక్రమాలకు  మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో ఎందరో మహామహులు పనిచేశారు. 

మునిమాణిక్యం నరసింగరావు, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వింజమూరి శివరామరావు, బుచ్చిబాబు వంటి సాహితీవేత్తలు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి అనసూయ – సీత సోదరీమణులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి సంగీత విద్వాంసులు, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వర రావు మొదలైన నటులు, న్యాయపతి కామేశ్వరమ్మ, న్యాయపతి రాఘవరావు వంటి కార్యక్రమ నిర్వాహకులు ఆకాశవాణికి వన్నె తెచ్చారు. వీరంతా తెరవెనక ఉండి కార్యక్రమాల రూపకల్పన చేస్తూ ప్రసారం, ప్రామాణాల్లో, నాణ్యతలతో రాజీ పడకుండా ఆకాశవాణి వైభవానికి కారణభూతులైన వారు ఉన్నారు. వారిలో ప్రముఖులు “శ్రీమతి సుభద్ర శ్రీనివాసన్”. ఈమె మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో కార్యక్రమాల రూపశిల్పిగా, కార్యక్రమాల నిర్వాహకురాలిగా నిరూపమానమైన సేవలు అందించారు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :   సుభద్ర

ఇతర పేర్లు   :    సుభద్ర శ్రీనివాసన్

జననం   :     18 ఆగస్టు 1925

స్వస్థలం :    బళ్లారి, కర్నాటక, భారతదేశం

వృత్తి   :         ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు

ఉద్యోగం       :     ఎ.పి. బేవరేజస్ కార్పొరేషన్

జీవిత భాగస్వామి     :  పార్థసారథి శ్రీనివాసన్

పిల్లలు       :    రంగరాజన్, విజయశ్రీ

తండ్రి         :       పరాంకుశం నరసింహస్వామి

తల్లి          :       ఆండాళమ్మ

మరణ కారణం   :    అనారోగ్యం

మరణం      :     05  నవంబరు 1972

నేపథ్యం…

సుభద్రా శ్రీనివాసన్ 18 ఆగస్టు 1925 నాడు కర్నాటక రాష్ట్రము లోని బళ్లారి జిల్లాలో పరాంకుశం నరసింహస్వామి, ఆండాళమ్మ దంపతులకు జన్మించారు.  పరాంకుశం నరసింహస్వామి స్వగ్రామం ఒరిస్సా రాష్ట్రము లోని బరంపురం. ఆయన ఉద్యోగరీత్యా బళ్లారిలో పోలీస్ ఇనస్నెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఆయన విశాఖపట్టణం మరియు విజయనగరం జిల్లాలలో కుడా ఉద్యోగరీత్యా పనిచేయడం వలన సుభద్ర ఎ.వి.ఎన్. కళాశాల విశాఖపట్టణం లోనూ, యం.ఆర్. కళాశాల విజయనగరం లోనూ విద్యను అభ్యసించి ఆమె రసాయన శాస్తంలో పట్టభద్రులయ్యారు. విద్యాభ్యాసం అనంతరం మద్రాసు ఆకాశవాణి 1948లో కార్యక్రమాల ప్రసార కార్యదర్శిగా చేరారు. తమిళనాడు లోని శ్రీరంగానికి చెందిన పార్థసారథి శ్రీనివాసన్ కూడా మద్రాసు ఆకాశవాణిలో కార్యక్రమాల ప్రసార కార్యదర్శిగా ఉండేవారు. పార్థసారథి శ్రీనివాసన్ ఆకాశవాణిలో చేరిన కొద్ది కాలానికే ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటయ్యి జీవితంలో కూడా చేయి చేయి కలిపి ఒకే మాట ఒకే బాటగా నడిచారు. వారి పరిచయం వివాహబంధంగా మారింది. పార్థసారథి శ్రీనివాస్ ను, సుభద్ర పెళ్లి చేసుకున్నారు. వారు అనన్య సామాన్య దంపతులు.

గొప్ప క్రియాశీలక వ్యక్తి సుభద్ర…

పార్థసారథి శ్రీనివాస్ ను, సుభద్రల  వీరిరువురికి రేడియో గురించి, రేడియో శక్తి గురించి లోతైన పరిజ్ఞానం ఉన్నందున ప్రముఖ ప్రముఖ రాజనీతి శాస్త్రాచార్యులు, క్రికెట్ వ్యాఖ్యాత ఆచార్య ఏ. ప్రసన్న కుమార్ “వారికి పని పట్ల శ్రద్ధతో కూడిన బాధ్యత, హృదయం నిండా పని చేయాలనే తపన ఉండడం, ఆకాశవాణి కేంద్రానికి కొండంత అండ” అని అంటుండేవారు. ఈ దంపతులు ఉండడం మద్రాసు లోనే అయినా, ఆ రోజుల్లో ఆంధ్రదేశంలోని నలుమూలలో ఉన్న ప్రజలను, శ్రోతలను ఆకాశవాణి ఆకర్షించిన ఘనత సుభద్రమ్మదే అని చెప్పాలి. 12 అక్టోబరు 1948 నాడు తొలి తెలుగు రేడియో స్టేషనుగా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం 01 డిసెంబరు నుంచి విజయవాడ కేంద్రం రేడియో ప్రసారాలు ప్రారంభించింది.

దాంతో సుభద్ర, శ్రీనివాసన్ లు మద్రాసు నుండి విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న అనేక గ్రామాలను వెళ్లి అక్కడున్న ప్రభుత్వ అధికారులు కలిసేవారు. పల్లెలలో, పట్టణాలలో ఉన్న వైద్యులను, న్యాయవాదులను, అధ్యాపకులను కలిసి వారితో చర్చించేవారు. అనేక రంగాలలో ఉన్న నిపుణులను అంచనా వేసేవారు. వారిని  ఆకాశవాణి ప్రసంగాలకు ఆహ్వానించేవారు. అందుకే ఆకాశవాణిలో ఉన్నతస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రయోగ వేదవతి అనే వ్యక్తి సుభద్రను గొప్ప క్రియాశీలక వ్యక్తిగా అభివర్ణిస్తారు.

యువకులు, మహిళలు, కళాకారులను ప్రోత్సహించి…

ఇప్పట్లో అంతా రికార్డింగు చేసే పద్ధతి ఉన్నది గనుక ఎప్పుడో చేసిన కార్యక్రమం కూడా ఎప్పుడు పడితే అప్పుడే ప్రసారం చేసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఇప్పటిలా రికార్డింగ్ పద్ధతి లేదు. ఎవ్వరైనా సరే అప్పటికప్పుడు లైవ్ ప్రోగ్రాం ఇవ్వాల్సిందే. రికార్డింగ్ లేని ఆ రోజులలోనే ఆంధ్రదేశం పలుమూలల నుండి వచ్చి ఆకాశవాణిలో పాల్గొనేవారు. ఇదంతా సుభద్ర శ్రీనివాసన్ చొరవ, ఆమె ఘనత కూడా. ఆమె కేవలం నిర్వాహకులు మాత్రమే కాదు, నిర్దేశకులు కూడా. ఆంధ్రప్రదేశ్ లోని ఆయా ప్రాంతాలలోని యువకులు, మహిళలు, పిల్లలు, సంగీత కళాకారులు, రంగస్థలం కళాకారులు ఇలా అందరినీ సుభద్ర ప్రోత్సహించేవారు.

మహిళా మండళ్లను సందర్శించి, వారిని ప్రోత్సహించి, వారి చేత చక్కటి కార్యక్రమాలు చేయించేవారు సుభద్ర. రేడియో కార్యక్రమాలకు వ్రాసే వాక్యాలు ఏ విధంగా ఉండాలో, వాక్య రచన విన్యాసం ఎలా ఉండాలో ఆమె చెప్పేవారు. రేడియో కార్యక్రమాలకు ప్రసంగం వ్రాయడం ఒక ఎత్తైతే, దానిని ఉపన్యాస ధోరణి ఉట్టిపడేలా చదవడం మరో ఎత్తు. చూసి చదువుతున్నా కూడా మాట్లాడుతున్నట్లు ఉండాలంటే ఎలా ఉచ్చరించాలో, ఎక్కడ ఆపాలో, ఉదాత్త, అనుదాత్త స్వరాల వినియోగం ఎలా ఉండాలో సుభద్ర చదివి, ఆచార్య కోలవెన్ను మలయవాసిని చేత చదివించేవారు. ఆయన సుభద్ర పర్యవేక్షణలో ఆకాశవాణిలో తొలి దశలో ప్రసంగాలు చేశారు. ఆమె వ్యక్తులకు సూచించే ప్రసంగాలు కూడా కాలదోషం పట్టనివి, వినూత్నమైనవిగా ఉండేవి.

చురుకైన కార్యనిర్వాహణ చాతుర్యం ఆమె సొంతం…

ఆకాశవాణిలో ఉద్యోగం ఒక వృత్తిలా కాకుండా, ఒక ఉద్యమంలా భావించేవారు సుభద్ర. ఆమె గొప్ప అంకితభావంతో, మంచి అభిరుచి, అభినివేశాలతో కార్యక్రమాలు రూపొందించేవారు. ఏ గొప్ప విజయాన్ని అయినా సవినయంగా సాధించే మనస్తత్వం ఆమెకు ఉండేది. అంతటి సుభద్ర గారి వ్యక్తిత్వం ఆమె సొంతం. ఆమె విజయవాడ కేంద్రానికి కార్యక్రమం కోసం వచ్చే మహిళలను తమ సొంత అతిథుల్లా ఆదరించే వారని ఆమెతో పనిచేసిన సహోద్యోగులు, ఆకాశవాణితో చిరకాల అనుబంధం ఉన్న గొల్లపూడి మారుతి రావు లాంటి వారు చెబుతుండేవారు. ఏప్రిల్ 1965 లో డేవిస్ కప్ మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా విజయవాడలో జరిగింది.

దానికి వ్యాఖ్యాతలుగా విశాఖపట్నం  ఆర్.నారాయణస్వామి (డీ.ఐ.జీ. ఆఫ్ పోలీస్), ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ ప్రసన్నకుమార్ లు నిర్ణయించబడ్డారు. వ్యాఖ్యలు డి.ఐ.జి వ్యాఖ్యాత అవ్వడంతో పోలీసు బలగం ఎక్కువగా మోహరించి ఉంది. రేడియో వ్యాఖ్యానంలో ఆపడం, అవరోధం లాంటివి ఉండకూడదు. డి.ఐ.జి మైక్రోఫోన్ ను కొంచెం దూరంగా పెట్టుకోవడంతో వారి మాటలు శ్రోతలకు వినబడడం లేదు. అది గమనించిన సుభద్ర, వారి చేతుల్లోని మైక్ వేగంగా తీసుకొని ముఖానికి దగ్గరగా పెట్టి అలాగే ఉంచమని నెమ్మదిగా చెప్పారు. ఈ చర్యకు పోలీసులు మొదట గాబరాపడ్డారు. ఆ తరువాత వ్యాఖ్యానం సాఫీగా సాగింది. ఇది సుభద్ర చురుకైన కార్యనిర్వాహణ చాతుర్యానికి దుష్టాంతం.

మరణం… 

ఆ రోజుల్లో విద్యార్థులతో యువతతో “యువ వాణి” అనే ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించేవారు సుభద్ర. మంచి మంచి కథల్ని ఎంచుకుని పిల్లల నాటకాలుగా రూపొందించి ఆమె ప్రసారం చేయించేవారు. ఆమెకు సమాజ సేవ అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో “గిల్ట్ ఆఫ్ సర్వీస్” లో సభ్యురాలుగా చేరిన ఆమె అనేక సేవా సంఘాలకు, అసహాయులకు వారధిగా పని చేసేవారు. ఆమె భర్త శ్రీనివాసన్ కూడా ప్రతిభాశాలి అయిన కార్యనిర్వాకులు. ఆయన సుభద్రను ఎంతగానో ప్రోత్సహించేవారు. వారిరువురు దంపతులు చర్చించుకుని ఆకాశవాణికి కొత్త కళాకారులను పరిచయం చేయడంలో ఎంతో దోహదం చేసేవారు.

పచ్చని మేని ఛాయతో, చక్కని అలంకరణతో భద్రాయిత మూర్తిగా కనిపించే వారు సుభద్ర. నాగాలాండ్ లోని కోహిమాలో పని చేస్తుండగానే సుభద్ర ఆరోగ్యం పాడైపోయింది. ఈ చిరయశస్వి 05 నవంబరు 1972 దీపావళి నాడు తిరుపతిలో స్వర్గస్తులయ్యారు. ఆవిడ మరణించిన 30 సంవత్సరాల తరువాత భర్త శ్రీనివాసన్ 09 జనవరి 2002 నాడు దివంగతులయ్యారు. సుభద్ర శ్రీనివాసన్ లకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు రంగరాజన్ విశాఖపట్నం యస్.యస్.టి.యల్ ఉన్నతోద్యోగిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. సుభద్ర శ్రీనివాసన్ ల కుమార్తె పేరు విజయశ్రీ.

Show More
Back to top button