Telugu News

సోషల్ మీడియా, ఓటీటీల నుంచి పిల్లలను కాపాడటం ఎలా?

ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాలు, ఓటీటీ (OTT) వెబ్ సిరీస్‌ల వాడకం విపరీతంగా పెరగడం పిల్లల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం హింసాత్మక ఘటనలకు దారితీస్తోంది. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్యకేసులో మైనర్ బాలుడు క్రైమ్ వెబ్ సిరీస్‌ల నుంచి ప్రేరణ పొంది, చోరీ చేసి, ఆ తర్వాత బాలికను చంపినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, బెంగళూరులో ఓ 14 ఏళ్ల బాలుడు వెబ్ సిరీస్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు ఒకే బైక్‌పై ఎనిమిది మంది ఎక్కి నడపడం వంటి సాహసాలకు ఒడిగడుతున్నారు.

ఇలాంటి విపరీత ప్రవర్తనకు స్మార్ట్‌ఫోన్ల విపరీత వినియోగం, వెబ్ సిరీస్‌లు ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాలకు బానిసలవడం వల్ల పిల్లల్లో ఓపిక, సహనం, ఆలోచనాశక్తి నశించి, విద్యలో వెనకబడుతున్నారు. పగ, శత్రుత్వం, దాడులకు పాల్పడుతూ నేరాల బారిన పడుతున్నారు. ఇది శాంతిభద్రతల సమస్యలకు కూడా దారితీస్తోంది. గతంలో పెద్దలకే పరిమితమైన ఈ ఆన్‌లైన్ వేదికలు ఇప్పుడు పిల్లల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆటపాటలతో సాగే బాల్యం మొబైల్ స్క్రీన్‌కు పరిమితం కావడంతో పిల్లల్ని కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది.

ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే దీనిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో నడిచే ప్రయత్నం చేస్తోంది. ఒక పాఠశాలలో జరిగిన దాడి ఘటన తర్వాత, 15 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే యోచనలో ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక బాల జనాభా గల భారతదేశంలో కూడా బాలలను ఈ వ్యసనం నుంచి దూరం చేయాలి.

ప్రభుత్వం చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. 2023లో కర్ణాటక హైకోర్టు పాఠశాల పిల్లలు సామాజిక మాధ్యమాలకు ఎక్కువగా అలవాటుపడటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటిని వినియోగించడానికి 21 సంవత్సరాల వయోపరిమితిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కూడా పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంలో కొన్ని షరతులు విధించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆన్‌లైన్ డేటాను నిర్వహించడానికి కంపెనీలు తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలని పేర్కొంది.

పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతున్న నేపథ్యంలో, వారిని డిజిటల్ పరికరాలకు దూరం చేయడం చాలా ముఖ్యం. విద్యా అవసరాలకు ఫోన్ వాడుతున్నప్పుడు పిల్లలు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ, వారిలో విపరీత పోకడలను సరిదిద్దాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి ఫోన్ హాలిడే పెట్టుకోవడం వల్ల పిల్లలు మంచి విలువలు నేర్చుకుంటారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఒక గ్రామ పంచాయతీ పిల్లలు ఫోన్ గేమ్స్ ఆడితే తల్లిదండ్రులకు రూ. 3,000 జరిమానా విధించే ఆంక్షలు విధించగా, ఆ గ్రామంలో మంచి మార్పు కనిపించింది. ఇలాంటి కఠిన చర్యలు ప్రతి గ్రామంలో రావాలి. ఆన్‌లైన్ మనీ గేమ్స్ వల్ల ఆర్థికంగా నష్టపోతున్న యువతను కాపాడటానికి కేంద్రం ఇటీవల ఆన్‌లైన్ గేమ్ నియంత్రణ బిల్లు 2025ను కూడా ఆమోదించింది. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలకు కుటుంబ సంబంధాలు, విలువలు గురించి బోధించి, వారితో కలిసి ఆడుకోవాలి.

Show More
Back to top button