
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌పై అమెరికా మరోసారి విమర్శలు గుప్పించింది. వైట్ హౌస్ సలహాదారుడు పీటర్ నవారో, భారత్‌ను ఉద్దేశించి, “మోడీ యుద్ధం” అని అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ రష్యా నుండి రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేయడమే కారణమని ఆయన ఆరోపించారు. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఈ ఆరోపణలు, భారత్‌పై అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చాయి.
పీటర్ నవారో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే భారత్ సహకరించాలని అన్నారు. ఒకవేళ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తే, అప్పుడు సుంకాలను 25 శాతానికి తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ లాంటి పరిణతి చెందిన నాయకుడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని నవారో వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా సాయం చేస్తోందని పీటర్ ఆరోపించారు. భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ, రష్యాకు ఆదాయాన్ని అందిస్తోందని, ఆ ఆదాయాన్ని రష్యా ఉక్రెయిన్‌ను అణిచివేసేందుకు ఉపయోగిస్తోందని ఆయన విమర్శించారు. పీటర్ నవారో భారత్‌పై ఇలాంటి విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా రష్యా ముడి చమురును శుద్ధి చేసి, అమెరికాకు విక్రయించడం ద్వారా భారత్ భారీ లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. రష్యా ఆ సొమ్మును ఉక్రెయిన్ వినాశనానికి వాడుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.






