CINEMATelugu Cinema

తొలి సినిమా చిత్రీకరణలో, తొలి రోజు స్టూడియో అనుభవం. యస్.వి. రంగారావు.

ప్రతీ మనిషి యొక్క జీవితం విశాలమైనది. అలాంటి విశాలమైన జీవితరంగంలో అడుగుపెట్టే ప్రతీ వ్యక్తి కూడా ఎన్నో సమస్యలను, మరెన్నో అవాంతరాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో దృక్పథంతో, ఒక్కో ఆశయంతో జీవిత సమరంలోకి ప్రవేశించి ముందుకు సాగిపోవాల్సిన అవసరం కలుగుతుంది. కొంత దూరం అలా వ్యూహాలను ఛేదించుకుంటూ వారు తమ కలలను, తమ ఆశయాలను, తమ లక్ష్యాలను, తమ గమ్యాలను చేరుకున్నాక వెనక్కి తిరిగి చూసుకుంటే, వారి చేరుకున్న గమ్యాల తొలి నాటి అనుభవాలు ప్రతీ మనిషికి మర్చిపోవడానికి వీలు లేకుండా ఉండిపోతాయి.

ఒక విద్యార్థి తన జీవితంలో కొత్తగా పాఠశాలలో లేదా కళాశాలలో చేరినప్పుడు గానీ, కొత్తగా కార్యాలయంలో ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడు, పెళ్లయ్యి పెళ్లి కొడుకుకు శోభనం గదిలో భార్యతో సంసార జీవితం ఆరంభించినప్పుడు కలిగే తొలి అనుభవం జీవితాంతం మనల్ని వెంటాడుతూ గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ప్రతీ ఒక్కరి తొలి నాటి అనుభవం అంత ఆనందంగా ఉండకపోవచ్చు, కానీ అవి జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ ఒక విధమైన ఆనందానుభూతులకు గురికాక తప్పదు.

నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి అనే బిరుదాంకితులు అయిన యస్.వి.రంగారావుకు తన జీవితంలో ఎప్పటికైనా ఒక మంచి నటునిగా రూపొందాలనే చిరకాల వాంఛతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తన సినిమా రంగంలో తొలి నాటి అనుభవాలు నిజంగా ఆయన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయి, అప్పుడప్పుడు ఆయనకు మధురానుభూతులు అందిస్తూ ఉంటాయని ఆయన పలుమార్లు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాము..

యస్.వి.ఆర్ గురించి సంక్షిప్తంగా…

సామర్ల వెంకట రంగారావు అనే పేరు ఇప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించే పేరు. కానీ యస్వీ రంగారావు లేదా యస్వీయార్ అంటే మహానటుడు గుర్తొస్తారు. యస్వీయార్ అంటే నిండైన విగ్రహం, గంభీరమైన స్వరం. ఆయన నట యశస్వి, నటసామ్రాట్  మరియు విశ్వనట చక్రవర్తి. ఆ అజానుబాహుడు కనుసైగలతో ప్రేక్షకుల గుండెలను మీటిన స్ఫురద్రూపి, తన నటనతో వీక్షకులను మంత్రముగ్ధులను చేయగల మాంత్రికుడు. “నర్తనశాల” సినిమాలో ఆయన పోషించిన కీచక పాత్ర పోషించినందుకు గానూ భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా లోని జకార్తాలో జరిగిన చలనచిత్రోత్సవం లో అంతర్జాతీయ బహుమతి కూడా అందుకున్నారు. తన మూడు దశాబ్దాల చలనచిత్ర జీవితంలో యస్వీఆర్ ఐదు భాషలలో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో) మూడొందలకు పైగా చిత్రాలలో నటించారు. రావణుడు, కీచకుడు, నరకాసురుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు,  మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల.

03 జులై 1918 లో కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన ఎస్.వి. రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, ఆ తరువాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. తన పన్నెండవ యేట నుండే నాటకాలంటే మక్కువ ఉన్న ఎస్.వి.ఆర్, తాను చదువుకున్న మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో, పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. ఆ నాటకంలో తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతడిలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. అప్పటినుండి పాఠశాలలో ఏ నాటకం జరిగినా ఏదో ఒక పాత్రలో ఆయన నటించేవారు. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో బళ్ళారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసిన యస్.వి.రంగారావు, తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. బి.యస్సీ చదువు పూర్తయిన తరువాత అగ్నిమాపక శాఖలో ఉద్యోగం వచ్చింది. మొదట బందరులో, ఆ తరువాత విజయనగరంలో అగ్నిమాపక అధికారిగా పనిచేసిన రంగారావుకు, ఆ ఉద్యోగంలో  పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఆ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నాటకాలలో నటించడానికి వీలులేదు. దాంతో తాను కళకు దూరం అవుతున్నానేమోనని భావించి నాటకాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఎస్.వి. రంగారావు నటుడిగా తొలి చిత్రం 1946లో వచ్చిన “వరూధిని”. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో సినిమా అవకాశాలు రాలేదు. ఈ సినిమా దర్శకుడు బి.వి. రామానందం అనే వ్యక్తి రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, ఆయనకు జోడీగా దాసరి రామతిలకం (నటి గిరిజ తల్లి) నటించారు. వరూధిని సినిమాలో ప్రవరాఖ్యుడిగా పాత్ర పోషించినందుకు గాను యస్.వి.రంగారావు 750 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. వాణిజ్య పరంగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచడంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు. అక్కడ పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. అందులో భాగంగా వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా ఆయన వేషాలు వేసేవారు. తనకు మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు.

తొలి రోజు స్టూడియో లో…

“ఆంధ్రా శాంతారాం” అని పేరుపొందిన బి.వి.రామానందం (బయ్యపునీడి వెంకట రామానందం), తెలుగు సినిమా దర్శకులు. అనేక మంది నటులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. రాజమహేంద్రవరం కు చెందిన ఈయన ఎస్.వి.రంగారావుకు బంధువు.  బీ.వి.రామానందం ద్వారానే ఎస్.వి.రంగారావు తొలిసారిగా సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఆయన నటించిన తొలి చిత్రం వరూధిని (1946). విద్యావంతులైన నటీనటులు, విజ్ఞాన సంపన్నులైన సాంకేతిక నిపుణులు, మృదుమధురమైన సంభాషణలు, ఆశ్చర్యకరమగు ట్రిక్కులు, దేశీయమగు భరత నాట్యాలు, అన్నీ కలగలిపి వరూధిని చిత్రాన్ని తెలుగువారికి అందించారు. దాని చిత్రీ కరణ “సేలం మోడ్రన్ థియేటర్స్ స్టూడియో” లో జరిగింది. తమిళ దేశం, కొత్త ఊరు కొత్త ముఖాలు, కొత్త వాతావరణం. ఇవన్నీ సేలంలో యస్.వీ.ఆర్ ను బలవంతంగా చుట్టుముట్టాయి. వరుధిని చిత్రానికి ఎంపికైన ఆయన సెట్ లోకి అడుగు పెట్టవలసిన రోజు రానే వచ్చింది. ఆయన వేషధారణ ఏవిధంగా ఉండాలనే విషయంపై మేకప్ మేన్ కు సూచనలు ఇచ్చి వెళ్లిపోయారు దర్శకులు బి.వి.రామానందం. ఆ సినిమాలో తాను వేసే ప్రవరాఖ్యుడి పాత్ర వేషం ఒక గంటలో తయారయ్యింది.

నిస్సత్తువ అలుముకుని…

ప్రవరాఖ్యుడి రూపంలో ఆయన సెట్ మీద కాలు మోపడంతో అందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయి. అలా అందరూ ఒక్కసారిగా యస్.వి.రంగారావు వంక తదేక దీక్షితో చూడడం ఆయనకు ఎందుకో ఇబ్బంది అనిపించింది. వాళ్లంతా ఆయనను దిగంబరునిగా చేసి తమాషా చూస్తున్నట్లు ఆయనకు అనిపించింది. ఆరోజు ఎవ్వరూ కూడా యస్.వి.రంగారావుతో ఎక్కువగా మాట్లాడలేదు. ఆయనకు కూడా ఎందుకో అక్కడ ఉన్న ఎవ్వరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. అర్థం కాని ఆయన ఏదో అనుభూతిలో ఉండిపోయారు. సెట్ అంతా నిశ్శబ్ద వాతావరణంతో ఉంది. సెట్ లో ఎవరో “లైట్స్” అంటూ పెద్దగా కేకపెట్టారు. దాంతో యస్.వి.రంగారావు ఉలిక్కిపడ్డారు.

ఒక్కసారిగా లైట్లు వెలగడంతో, సెట్ మొత్తం పట్టపగలులాగా వెలిగిపోతున్నది. సరిగ్గా అదే సమయానికి దర్శకులు బి.వి.రామానందం నటులు యస్.వి.రంగారావు వైపు తిరిగి ఆ స్థలం దగ్గరికి వెళ్లి నిలబడు అన్నారు. అంతే యస్.వి.ఆర్ కు ఏదో తెలియని జంకు మొదలైంది. ఆ జంకుతోనే స్థంభం దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. ఏం చేస్తున్నారో యస్.వి.ఆర్ కే తెలియదు. ఆయన చుట్టూ ఉన్న వారంతా ఆయన గురించి ఏమనుకుంటున్నారో అనే సంశయం ఆయనలో ఉండిపోయింది. ఆ వేషధారణ బాగుందో లేదో, ఆయన నడక తీరు బావుందో లేదో, ఆయన ముఖం బాగుందో లేదో ఇలా సందేహాల మీద సందేహాలు. సమాధానం లేని సందేహాలు, ఒక్కసారిగా ఆయనలో నిస్సత్తువ అలుముకుంది. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించవచ్చు.

కథానాయికకు దూరంగా తొలిగి నిలబడి…

స్టూడియోలో వాతావరణం కాస్త భయంగా మారిపోయింది. యస్.వి. రంగారావు గొంతు ఎండిపోవడం ఆరంభించింది. ఆయన నాలుక పిడచ కట్టుకుపోతున్నది. ఆయన కళ్ళు ఆయనకు సరిగ్గా కనిపించడం లేదు. ఆయన చెవులకు ఏది కూడా వినిపించడం లేదు. శరీరంలో ఎక్కడో ఇంకా పిసరంత చైతన్యం ఉన్నందు వలన కాబోలు, దర్శకుడు గొంతు మాత్రం ఆయనకు వినిపిస్తున్నది. యస్.వి.ఆర్ తో కలిసి నటించవలసిన అమ్మాయిని వెళ్లి ఆయన ప్రక్కన నిలబడవలసిందిగా దర్శకులు చెబుతున్నారు. ఎక్కడినుంచో ఒక గంధర్వ కన్య వచ్చి ఆయన పక్కన నిల్చున్నది. అమె మరీ అతి చేరువగా వచ్చి నిలబడేసరికి బ్రహ్మచారిగా ఉన్న యస్.వి.ఆర్ ఆమెకు కాసింత దూరంగా తొలిగి నిలబడ్డారు. దాంతో “అలా పరిగెత్తావేమిటయ్యా, ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది” అంటూ కేకలు పెట్టారు ఆ చిత్ర దర్శకులు బి.వి.రామానందం. ఆ సెట్ లో ఉన్నవారు అంతా గొల్లుమని నవ్వారు. ఏమిటా మనిషి మర్యాద లేకుండా మాట్లాడుతారు అని బి.వి.రామానందం మీద ఆయనకు పీకల దాకా కోపం వచ్చింది. ఒక అపరిచితురాలైన స్త్రీ ముందు నన్ను అలా అంటాడేమిటి అని యస్.వి.ఆర్ కు చాలా బాధనిపించింది. కానీ దర్శకులు అట్లాగే మాట్లాడతారని, అది సినిమా భాష అని ఆ తరువాత యస్.వి.ఆర్ కు తెలిసింది.

తలవంచుకొని సంభాషణలు చెప్పేశారు…

ఇదిలా ఉంటే చిత్రీకరణ సెట్ లో ఒక మనిషి యస్.వి.ఆర్ దగ్గరకు వచ్చి “ఏది మీ సంభాషణ చెప్పండి”? అంటూ రంగారావు చెప్పవలసిన సంభాషణను, ఎలా పలకాలో ముందుగానే ఆయనకు చెప్పడం ఆరంభించాడు. కానీ వాస్తవం ఏమిటంటే ఆ సంభాషణలు అంతకు ముందు రోజు రంగారావు చేత వల్ల వేయించారు. దానికి ఉక్రోషంగా ఉన్న రంగారావు, అవి నాకు తెలుసులెండి అన్నారు. దాంతో అవతలి వ్యక్తికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మరైతే అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేమి ఆ సంభాషణలు చెప్పండి అన్నారు. ఆ కోప్పడ్డ వ్యక్తి ఎవరో కాదు ఆయనే సహాయ దర్శకులు. ఆ క్షణాన రంగారావుకు మామూలు కోపం రాలేదు. బయట ఎవ్వరినీ కూడా ఒక పల్లెత్తు మాట అనని రంగారావు, ఆయనను ఎవ్వరైనా ఏదైనా మాట అంటే మాత్రం ఊరుకునే వారు కాదు. అది ఆయన నిజమైన స్వభావం. అందువలననే సహాయ దర్శకుని మీద రంగారావుకు అంతగా కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని ఆయనలోనే దిగమింగుకొని ఏమి మాట్లాడితే ఏమి వస్తుందో అన్న భయంతో ఆయన నోరు కట్టుకొని కూర్చున్నారు. సహాయ దర్శకుడు చెప్పినట్టుగా సంభాషణలు వల్లించడం ఆరంభించారు యస్.వి.రంగారావు. కానీ ఆయన ప్రక్కన గంధర్వ కన్య ఉండడంతో రంగారావు తలవంచుకొని సంభాషణలు చెప్పారు.

రాత్రికి రాత్రే ఊరు వెళ్ళిపోదాం అనుకున్నారు..

నాటక రంగం మీద విజృంభించిన రంగారావుకు సంభాషణలు చెప్పడం చేతకాక కాదు. ఇది వెండితెర. ఎంత కాదన్నా అది కొత్త వాతావరణం. అందులోనూ నాటకాలలో స్త్రీల వేషాలు కూడా మగవాళ్ళు వేసేవారు. కానీ సినిమా రంగంలో పరిస్థితి అలా లేదు. నేరుగా సిసలైన స్త్రీతో మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి ఆయనకు ఇబ్బంది కదా. అంతవరకు ఓపిక పట్టిన దర్శకుడికి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో బి.వి. రామానందం ఆగలేకపోయారు. ఎక్కడో పాతాళంలోకి చూసి మాట్లాడుతావేమి? ఆవిడ ముఖం చూసి మాట్లాడవోయ్ అంటూ గావుకేక పెట్టారు. జీవితంలో పైకి రావాలనుకునే వారు ఎప్పుడూ పైకే చూడాలి, కానీ క్రిందకి చూసి మాట్లాడరాదన్నది దర్శకుడి అభిప్రాయం కావచ్చేమో.

ఎలాగైతేనేమి ఏదోవిధంగా ఆ రోజుకు చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ యమయాతన తన వల్ల కాదనుకుని రాత్రికి రాత్రే బండెక్కి తన ఊరు వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఈ విషయం దర్శకుడు బి.వి.రామానందం కు తెలిసిపోయింది. వెంటనే ఆయన రంగారావు బస చేసిన స్థలం దగ్గరికి వచ్చి ఆయనను ఓదార్చే కార్యక్రమం మొదలెట్టారు. బి.వి.రామానందం చెప్పిన ఓదార్పు మాటలు రంగారావుకు కాసింత ఉపశమనం కలిగించాయి. అప్పటినుండి యస్.వి.ఆర్ కొంచెంకొంచెంగా దారిలో పడటం ఆరంభించారు. ఇది యస్.వి.ఆర్ తొలినాటి షూటింగ్ అనుభవం.

Show More
Back to top button