CINEMATelugu Cinema

నిర్దిష్ట వేగంతో అద్భుత చిత్రాలు తెరకెక్కించిన దర్శకులు.. పాలువాయి రామకృష్ణ.

తెలుగు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు భానుమతి రామకృష్ణ. తెలుగు చిత్రసీమలో భానుమతి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి రామకృష్ణ ఎవరు? ఆయనే భానుమతి భర్త, పాలువాయి రామకృష్ణ. 1942 వ సంవత్సరంలో హనుమప్ప విశ్వనాథ్ బాబు దర్శకత్వంలో వచ్చిన “కృష్ణప్రేమ” చిత్రీకరణ సమయంలో భానుమతి మనసు దోచుకుని, ఆమెను పరిణయమాడిన సహాయ దర్శకులు. ఆ తరువాత అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ పేరు లిఖించుకున్న దర్శక, నిర్మాత పాలువాయి రామకృష్ణ.

పేదరికంలో జన్మించి, తండ్రి పైచదువులు చదివించలేని పరిస్థితులలో తన పెద్దబావ ఆర్థిక సహాయంతో ఇంటర్మీడియట్ వరకు చదువుకుని, ఆ తరువాత బావ మరణంతో చదువును ఆపేసి, మద్రాసులో ఉన్న పెద్దమ్మ ఇంటికి చేరారు రామకృష్ణ. పెద్దమ్మ, పెద్దనాన్న సిఫారసుతో సినిమా రంగంలోకి ప్రవేశించి వేల్ పిక్చర్స్ సంస్థలో శబ్దగ్రాహక శాఖలో పనిచేశారు రామకృష్ణ. ఆ తరువాత హెచ్.యం.రెడ్డి ఎడిటర్ గా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, తరువాత సహాయ దర్శకుడిగా ఎదిగారు. భరణి పిక్చర్స్ స్థాపించి దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అగ్రతారలతో సినిమాలు తెరకెక్కించి నిర్దిష్టమైన వేగంతో సినిమాలు తీస్తూ తనదైన ముద్రవేశారు పాలువాయి రామకృష్ణ.

నిజాయితీ, నిర్లిప్తత, ఔదార్యం, ఔన్నత్యం, కష్టపడి పనిచేసే మనస్తత్వం మంచి లక్షణాలు గల పాలువాయి రామకృష్ణ దర్శకత్వం చేయడం కోసమే సతీమణి భానుమతితో కలిసి కుమారుడి పేరున భరణి పిక్చర్స్ స్థాపించి తొలిసారి రత్నమాల (1947) చిత్రంతో దర్శకుడిగా మారి తొలి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా తొలి చిత్రాన్నే శతదినోత్సవ చిత్రంగా మలచడం విశేషం. అగ్రతారలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్ లతో సినిమాలు తెరకెక్కించి వాటిని విజయాలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా రామకృష్ణదే అని చెప్పాలి. ఆర్థికంగా బలంగా ఎదుగుతున్న రోజులలో చెన్నై లోని వడపళని దగ్గరలో గల సాల గ్రామంలో 15 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, తన కుమారుడు భరణి పేరిట ఒక స్టూడియోను నిర్మించారు.

తొలినాళ్లలో తన సతీమణి భానుమతి కథానాయికగా సినిమాలు తెరకెక్కించిన రామకృష్ణ, ఏడాదికి ఏడాది తీరిక లేకుండా భానుమతి సినిమాలు చేస్తున్న తీరు, సమకాలీన దర్శకులతో రాశిలో వాసిగా ఎక్కువ సినిమాలు తెరకెక్కించలేకపోయినా ఒక స్థిరమైన వేగంతో 20 సంవత్సరాలలో 18 సినిమాలు చిత్రీకరించి తన మార్కులు చూపిస్తూ వచ్చారు రామకృష్ణ. లైలా మజ్ఞు (1949), విప్రనారాయణ (1954), బాటసారి (1961) లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించగా, తన సతీమణి ఒకేసారి మూడు భాషలలో (తెలుగు, తమిళం, హిందీ) చండీరాణి (1953) అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.

నేపథ్యం…

పాలువాయి రామకృష్ణారావు 12 అక్టోబరు 1918 నాడు కర్నూలులో జన్మించారు. రామకృష్ణ నాన్న పేరు శ్రీనివాసరావు. ఆయన పాఠశాలలపై డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా ఊరురా తిరుగుతూ కొంతకాలం పత్తికొండలో, మరి కొంతకాలం పుంగనూరులో పనిచేశారు. చివరగా పుంగనూరులోనే పదవీ విరమణ కూడా చేశారు. పుంగనూరులో రామకృష్ణ వాళ్ళ చిన్నక్క, చిన్న బావ ఉండేవారు. చిన్న బావ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండేవారు. రామకృష్ణ ముందుగా నాన్న దగ్గరే చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కుటుంబ భారం ఎక్కువవ్వడంతో రామకృష్ణకు చదువు చెప్పించలేనని నాన్న శ్రీనివాసరావు తేల్చి చెప్పేసారు. దాంతో రామకృష్ణ పెద్ద బావ ఆర్థికంగా సహాయం అందించడంతో బందరు కళాశాలలో చేరి ఇంటర్మీడియట్ చదువుకుని 1937లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. 

డిగ్రీలో చేరాలని అనుకుంటుండగా అనూహ్యంగా పెద్ద బావ కన్నుమూశారు. రామకృష్ణ తండ్రి శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందుల వలన చదివించలేనని ముందే తేల్చిచెప్పడంతో రామకృష్ణ పైచదువులు చదవలేకపోయారు. అందువలన రామకృష్ణ తన పంతొమ్మిదో సంవత్సరంలోనే ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటర్మీడియట్ తో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అందువలన ప్రైవేటుగా ఏదో ఒక పని చేసుకుందామని మద్రాసులో ట్రిప్లికేన్ లో ఉన్న వాళ్ళ పెద్దమ్మ ఇంటికి చేరారు రామకృష్ణ. పెద్దమ్మ వాళ్లకి పిల్లలు లేరు. పెద్దమ్మ వాళ్లకున్న పరిచయాలతో వేల్ పిక్చర్ స్టూడియోలో శబ్ద గ్రాహక విభాగం (సౌండ్ రికార్డింగ్) లో చేరారు.

సినీ రంగ ప్రవేశం…

వేల్ పిక్చర్ స్టూడియోలో మొదట్లో జీతాలు ఇచ్చేవారు కాదు. కానీ శబ్ద గ్రాహక విభాగం (సౌండ్ రికార్డింగ్) లో ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. తాను తెరకెక్కించబోయే కొత్త సినిమా గురించి చర్చించడానికి  పిక్చర్స్ స్టూడియోకు హనుమప్ప మునియప్ప రెడ్డి (హెచ్. ఎం. రెడ్డి) వచ్చారు. అదే సమయంలో ఆయనను రామకృష్ణ పరిచయం చేసుకొని, చొరవ తీసుకొని ఆయన వద్ద అవకాశాల గురించి వాకబు చేశారు. ఆయన అభ్యర్థన ఫలించింది. ఆ సమయంలో “ద్విజేంద్రలాల్ రే” వ్రాసిన వివాదాస్పదమైన బెంగాలీ రంగస్థల నాటకం చంద్రగుప్తుడి అనుసరణ ఆధారంగా హెచ్.ఎం.రెడ్డి మాతృభూమి (1939) అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.

ఆ భారీ బడ్జెట్ చిత్రంలో రామకృష్ణకు ఎడిటింగ్ శాఖలో సహాయకుడిగా అవకాశం ఇచ్చారు. యం.వి.రాజన్ అనే సహాయకుల వద్ద రామకృష్ణ శిష్యరికంలో చేరారు. అందుకు జీతం ఉండదు, కానీ ఆయనకు ఇల్లు ఇచ్చి, భోజనం కల్పించారు హెచ్.ఎం.రెడ్డి. అందువలన పెద్దమ్మ ఇంటి నుండి హెచ్.ఎం.రెడ్డి ఇంటికి మకాం మార్చారు రామకృష్ణ. ఆయన కష్టపడే మనస్తత్వం హెచ్.ఎం.రెడ్డికి చాలా బాగా నచ్చింది. ఎడిటింగ్ లేని సమయంలో వివిధ గ్రామాలకు వెళ్లి సినిమా ప్రచార ప్రతినిధ్యం పనులు చూసుకుంటూ ఉండేవారు. రామకృష్ణ అలా బయటకు వెళ్ళినప్పుడు ఆయనకు హెచ్.ఎం.రెడ్డి రోజుకి రెండు రూపాయలు ఇస్తుండేవారు. అలా మొదలైన పారితోషికం తరువాత రోజులలో నెలకు 25 రూపాయలకు చేరింది.

రెండో ప్రపంచం యుద్ధంతో రోడ్డున పడ్డ జీవితం…

రామకృష్ణ ఎడిటింగ్ కు సహాయకుడిగా ఉన్న చిత్రం మాతృ భూమి 29 అక్టోబరు 1939 నాడు విడుదలైంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించబడడం వలన చిత్రీకరణకు చాలా సమయం పట్టింది. దాంతో ఎడిటింగ్ శాఖలో రామకృష్ణ ప్రాథమిక పాఠాలకు మించి నేర్చుకున్నారు. అప్పటికి రామకృష్ణ వయస్సు 21 సంవత్సరాలు. ఆయన శ్రద్ధాసక్తులు గమనించిన హెచ్.ఎం.రెడ్డి, తాను తెరకెక్కించిన బోండం పెళ్లి (1940) చిత్రానికి సహాయకుడిగా పదోన్నతి కల్పించారు. హెచ్.ఎం.రెడ్డి తాను వరుసగా నిర్మించిన బారిస్టర్ పర్వతీశం (1940), తెనాలి రామకృష్ణ (1941) సత్యమేవ జయం అను ఘరానా దొంగ (1942) చిత్రాలకు ఎడిటింగ్ శాఖలో పనిచేసి రామకృష్ణ మంచి అనుభవం సంపాదించుకున్నారు. 

ఈ సినిమాలకు పనిచేస్తుండగా హెచ్.ఎం.రెడ్డికి సమీప బంధువు అయిన హెచ్.వి.బాబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా రామకృష్ణను దర్శకత్వ శాఖకు దగ్గర చేసింది. రామకృష్ణ మద్రాసుకు వచ్చి ఐదు సంవత్సరాలయ్యింది. అప్పుడే మద్రాసుకు రెండో ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. 1942 వ సంవత్సరంలో మద్రాసులో ఎన్నో సినిమా నిర్మాణ సంస్థలు మూతపడ్డాయి. అనేకమంది కళాకారులు, నటీనటులు, నిర్మాతలు మద్రాసు పట్టణం వదిలి వెళ్ళిపోయారు. హెచ్.ఎం.రెడ్డి కూడా తన చిత్ర నిర్మాణం తాత్కాలికంగా ఆపేశారు. ఉపాధి లేని 24 యేండ్ల రామకృష్ణ వ్యక్తిగత జీవితం, సినీ జీవితం కోల్పోయి మళ్లీ నడిరోడ్డుపై నిల్చున్నట్లయ్యింది.

హెచ్.వి.బాబు వద్ద సహాయ దర్శకుడిగా…

రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది, రామకృష్ణకు ఉపాధి కరువైపోయింది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి తనకు మొహమాటం అడ్డొచ్చింది. అంతకుముందు తన వద్ద ఉన్న డబ్బులతో కాలం గడుపుతూవున్న రామకృష్ణకు దర్శకులు హనుమప్ప విశ్వనాథ్ బాబు (హెచ్.వి.బాబు) దగ్గర నుండి పిలుపొచ్చింది. “కృష్ణ ప్రేమ” అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తనకు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేయాల్సిందిగా రామకృష్ణను అడిగారు. అవకాశాల కోసం అర్రులుచాస్తున్న రామకృష్ణ ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. వెంటనే మారు మాట్లాడకుండా “కృష్ణ ప్రియ” సినిమాకు సహాయ దర్శకుడిగా చేరిపోయారు.

“కృష్ణ ప్రియ” సినిమాలో నటించిన భానుమతితో పరిచయం కావడం, అది ప్రణయంగా మారడం, చివరకు పెళ్ళికి దారితీయడం జరిగాయి. పెళ్లి తరువాత భానుమతి సినిమాలలో నటించడం మానెయ్యాలని అనుకున్నారు. కానీ బి.యన్.రెడ్డి చొరవతో మళ్ళీ స్వర్గసీమ (1945) తో సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. చెంచులక్ష్మి (1943) సినిమా తరువాత రామకృష్ణ మరో రెండు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. స్వర్గసీమ (1945) సినిమా విడుదల తరువాత చిత్రసీమలో భానుమతి ఉజ్వల భవిష్యత్తు నిశ్చయమైపోవడంతో మరికొంత కాలం సినిమాలకు సహాయకులుగా పనిచేశారు రామకృష్ణ.

భరణీ పిక్చర్స్ స్థాపించి తొలి చిత్రంగా “రత్నమాల”…

ఒకవైపు భానుమతికి సినిమా అవకాశాలు వస్తున్నాయి, కాబట్టి వారు సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి రామకృష్ణతో దర్శకత్వం చేయించాలని ఆమె అనుకున్నారు. ఆ విధంగా భరణి పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అప్పటికే మద్రాసుకు వచ్చి ఎనిమిది సంవత్సరాలయిన రామకృష్ణ మూడు సంవత్సరాలు సహాయ దర్శకుడుగా పనిచేశారు. ఎడిటింగ్ శాఖలో వెండితెర అనుభవం కలిగిన రామకృష్ణకు కథ ఏవిధంగా చెప్పాలో తెలుసు. సముద్రాల రాఘవాచార్యతో కలిసి 1948లో కథా చర్చలు మొదలుపెట్టారు. ముందుగా రెండు, మూడు కథలు పరిశీలించారు. కానీ అవి వారికి ఎందుకనో సంతృప్తిని ఇవ్వలేదు. భానుమతి సూచించిన వ్రత కథ (చిన్నప్పుడు ఎప్పుడో రామకృష్ణ తన అమ్మ దగ్గర విన్న కథ) రామకృష్ణకు నచ్చింది. దాంతో రచయిత సముద్రాలను పిలిచి దానికి రచన చేయించారు.

భరణీ పిక్చర్స్ బ్యానరులో రామకృష్ణ దర్శక, నిర్మాతగా తొలి చిత్రం “రత్నమాల”. ఇందులో కథానాయిక భానుమతి. ఈ సినిమా సన్నాహాలు ప్రారంభిస్తుండగానే, దర్శకులు ఎల్వీప్రసాద్, తానే కథానాయకుడిగా మరియు దర్శకుడిగా తెరకెక్కిస్తున్న గృహప్రవేశం సినిమాలో కూడా భానుమతినే కథానాయకగా తీసుకున్నారు. భానుమతి మరియు రామకృష్ణలకు సినిమా రంగంలో కొనసాగడానికి అవకాశాలు కావాలి, గనుక ఒకవైపు గృహప్రవేశంలో భానుమతి కథానాయికగా నటిస్తూనే, మరోవైపు రత్నమాల సినిమా నిర్మాణ సన్నాహాలను ముమ్మరం చేశారు. అందులో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరావును అనుకున్నారు. భరణి పిక్చర్స్ కు నిర్మాణ నిర్వాహకుడిగా (ప్రొడక్షన్ మేనేజర్) గా ఉన్న డి.ఎల్.నారాయణను పంపించి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో “పల్నాటి యుద్ధం” సినిమాలో నటిస్తున్న అక్కినేని నాగేశ్వరావును ఖరారు చేయించారు.

దర్శకుడిగా తొలి సినిమా శతదినోత్సవం…

గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం లో తెరకెక్కే”పల్నాటి యుద్ధం” (1947) నాటికి అక్కినేని నాగేశ్వరావు ఇంకా వర్ధమాన నటుడే, భానుమతి మాత్రం అగ్రతార. అంతకుముందు ఏడేళ్ల క్రిందట పి. పుల్లయ్య దర్శకత్వం లో  వచ్చిన ధర్మపత్ని (1941) అక్కినేని నాగేశ్వరరావుకు తొలి సినిమా. ఇందులో ఓ చిన్న పాత్రలో ఆయన బాలనటుడిగా కనిపిస్తే, భానుమతి ప్రధాన పాత్రలో నటించారు. భానుమతి, నాగేశ్వరావుల మధ్యన చనువు ఏర్పడాలని బీచ్ కి తీసువెళ్లి, వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పి 16 ఎం.ఎం కెమెరాతో చిత్రీకరించి వారికి చూపించేవారు రామకృష్ణ. ఆ సన్నివేశాలను సినిమాలో ఉపయోగించేవారు. ఆ ప్రయోగం కేవలం ఆ ఒక్క సినిమా కోసమే కాకుండా, చాలా సినిమాలకు ఉపయోగపడింది.

ఎందుకంటే ఆ తరువాత భరణీ వాళ్ళు నిర్మించిన అనేక సినిమాలలో అక్కినేని కథానాయకుడిగా నటించారు. అంటే అక్కినేని నాగేశ్వరావు ప్రతిభను తొలి రోజుల్లోనే రామకృష్ణ పసిగట్టారు. రామకృష్ణ తన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ భాషలలో కలిపి 18 చిత్రాలు తెరకెక్కిస్తే, అందులో తమిళ వర్షన్ కూడా కలుపుకుని అక్కినేని నాగేశ్వరావు 11 సినిమాలలో నటించారు. ఆ అనుబంధానికి బీజం వేసిన సినిమా “రత్నమాల” జనవరి 1948 లో విడుదలైంది. రామకృష్ణ తొలిసారి దర్శకత్వం వహించి, తొలిసారి నిర్మాణం చేపట్టిన చిత్రం “రత్నమాల” శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా శతదినోత్సవ వేడుకను ఏలూరు, భీమవరం, గుడివాడ లాంటి పట్టణాలలో నిర్వహించి, రామకృష్ణ, భానుమతి మొదలగు వారు సందర్శించారు. దర్శకుడిగా రామకృష్ణకు గట్టి పునాది ఏర్పరచిన సినిమా “రత్నమాల”. ఆ సినిమా తరువాత దాదాపు 20 సంవత్సరాల వరకు రామకృష్ణకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

ఘనవిజయం సాధించిన లైలా మజ్ను (1949)…

రత్నమాల (1948) ఘనవిజయం తరువాత దర్శకులు రామకృష్ణ ప్రారంభించిన చిత్రం “లైలా మజ్ను”. ఆ రోజులలో చారిత్రక ప్రేమకథ చిత్రం లైలా మజ్ను తీయడమే సాహసం అయితే, అందులో అక్కినేని నాగేశ్వరావును కథానాయకుడిగా తీసుకోవడం మరో సాహసం. జానపద కథానాయకుడిగా ఉన్న అక్కినేని నాగేశ్వరావు బాలరాజు (1948) సినిమాలో సాహాసోపేతమైన పాత్ర పోషించి ఉన్నారు. అలాంటి కుర్రవాడు ప్రేమ, విరహం, విషాదం లాంటి పాత్రకు సరిపోతాడా అన్న అనుమానం వ్యక్తం చేశారు యూనిట్ సభ్యులు.

కానీ ఇవేమీ పట్టించుకోని రామకృష్ణ హిందీ “లైలా మజ్ను” ప్రింట్ తెప్పించుకుని నాయకా, నాయికలైన అక్కినేని, భానుమతిలకు ప్రత్యేక ప్రదర్శన వేయించారు. సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత మీరు కూడా అంత బాగా నటించాలని వారికి తెలియపరచి చిత్రీకరణ మొదలుపెట్టారు రామకృష్ణ. 01 అక్టోబరు 1949 నాడు “లైలా మజ్ను” ఘనవిజయం సాధించింది. ఈ సినిమా లోని పాటలు ఆనాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సంగీత దర్శకులు సి.వి. సుబ్బరామన్ ఎదుగుదలకు ఈ సినిమాలోని పాటలు ఎంతగానో ఉపకరించాయి.  రెండు చిత్రాలు రత్నమాల (1948), లైలా మజ్ను (1949) ఘనవిజయంతో   దర్శకుడిగా, నిర్మాతగా భరిణీ పిక్చర్స్ అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు.

భరణి స్టూడియో నిర్మాణం…

లైలా మజ్ను (1949) తరువాత భరణి పిక్చర్స్ బ్యానరులో ఆ తరువాత రామకృష్ణ నిర్మించిన సొంత చిత్రం “ప్రేమ” (1952). దీనిని తెలుగుతో బాటు సమాంతరంగా తమిళంలో “కాదల్” అనే పేరుతో నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి నాయక, నాయికలుగా నటించిన ప్రేమ అనే తెలుగు, తమిళ భాష సినిమాలు 1952 లో విడుదలయ్యాయి. ఈ సినిమాకు భానుమతి కథ అందించడంతో బాటు రచన కూడా ఆమెనే చేశారు. కానీ అక్కినేని, భానుమతిల కలయికలో అంతకుముందు వచ్చిన “లైలా మజ్ను” సినిమాను సాంకేతికంగా అటూ ఇటూ మార్చి  నిర్మించారనే విమర్శలు వచ్చాయి. “రత్నమాల”, “లైలా మజ్ను” సినిమాలు విజయవంతమైనట్లుగా “ప్రేమ” సినిమా విజయం సాధించలేదు, పెద్దగా లాభాలు కూడా తీసుకురాలేదు.

అప్పటి వరకు నటించిన సినిమాలు విజయవంతం అవ్వడం, తెలుగు, తమిళ చిత్రాలలో భానుమతి నటిస్తూ ఉండడం దాంతో ఆమెకు వస్తున్న భారీ పారితోషికం వలన చెన్నైలోని వడపళని దగ్గర్లోని సాల గ్రామంలో రామకృష్ణ 15 ఎకరాల స్థలం కొని 1952 లో భరణి స్టూడియోని నిర్మించారు. ఈ స్టూడియోలో భానుమతి తొలిసారిగా దర్శకత్వం వహించిన చండీరాణి (1953) చిత్రాన్ని నిర్మించారు. తొలి చిత్రం ఆగస్టు 1953లో విడుదలైన చండీ రాని ఇందులో భానుమతి కథానాయికగా నటిస్తూనే ద్విపాత్రాభినయం చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, అభినయం చేస్తూ దర్శకత్వం కూడా చేసిన భానుమతి చండీరాణిగా నటించారు. మూడు భాషలలో (తెలుగు, తమిళం, హిందీ) సమాంతరంగా చిత్రీకరణ చేసి ఒకేరోజు 28 ఆగస్టు 1953 నాడు విడుదల చేసిన ఘనత భరణి పిక్చర్స్ అధినేత భానుమతికే  దక్కింది.

రెండు ఘనవిజయాలు చక్రపాణి, విప్రనారాయణ..

ఒకవైపు భానుమతి భరణి పిక్చర్స్ బ్యానరుపై తన స్వీయ దర్శకత్వంలో చండీరాణి చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, భాస్కరా ప్రొడక్షన్స్ పతాకంపై రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం బ్రతుకుతెరువు. కోవెలమూడి భాస్కర రావు ఈ చిత్రాన్ని నిర్మించగా అక్కినేని, సావిత్రిలు నాయకా, నాయికలుగా నటించారు. మొదటసారి భానుమతి కాకుండా రామకృష్ణ దర్శకత్వంలో మరో కథానాయికతో రూపొందించిన చిత్రం “బ్రతుకుతెరువు”. జూనియర్ సముద్రాలను ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు దర్శకులు రామకృష్ణ. ఈ చిత్రంలో మాటలు, పాటలు జూనియర్ సముద్రాల వ్రాశారు. 06 ఫిబ్రవరి 1953 నాడు విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. 

భరణి పిక్చర్స్ బ్యానరులో రామకృష్ణ దర్శకత్వంలో 1954లో రెండు సినిమాలు తెరకెక్కాయి. మొదటి చిత్రం “చక్రపాణి” అయితే, రెండవది “విప్రనారాయణ”. ఈ రెండు చిత్రాలలోనూ అక్కినేని నాగేశ్వరావు, భానుమతిలే నాయకా, నాయికలు. చక్రపాణి చిత్రం ద్వారా ప్రముఖ పాత్రికేయులు రావూరి వెంకట సత్య నారాయణను రచయితగా పరిచయం చేశారు రామకృష్ణ. ఆయన రూపొందించిన తొలి హాస్య చిత్రం “చక్రపాణి”. ఈ సినిమాకు భానుమతి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను 19 మార్చి 1954 నాడు విడుదల చేసి,  “విప్రనారాయణ” సినిమా చిత్రీకరణ వేగవంతం చేశారు. ఈ సినిమాకు అక్కినేని, రామకృష్ణ పట్టుదలగా పనిచేశారు. ఇద్దరిలో ఏ ఒక్కరికీ, ఏ సన్నివేశం నచ్చకపోయినా మళ్ళీ చిత్రీకరణ చేసేవారు. 10 డిసెంబరు 1954 నాడు విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ప్రశంసా పత్రం అందుకుంది.

విజయం సాధించిన “మనమగన్ తెవాయి” (1956)… 

విప్రనారాయణ (1954) సినిమా తరువాత భరణి పిక్చర్స్ బ్యానరులో రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చింతామణి (1956). కాళ్ళకూరి నారాయణరావు వ్రాసిన ప్రసిద్ధ రంగస్థల నాటకం చింతామణికి వెండితెర రూపం “చింతామణి” సినిమా. ఈ చిత్రానికి రచన రావూరి వెంకట సత్యనారాయణ రావు. ఎన్టీఆర్, జమున, భానుమతి నాయకా, నాయికలు. 11 ఏప్రిల్ 1956 నాడు “చింతామణి” సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా తరువాత రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం “వరుడు కావాలి”. 1952లో విడుదలైన అమెరికన్ సినిమా “ది ఫ్యాబులస్ సెనోరిటా” ఈ చిత్రానికి ప్రేరణ. భరణీ పిక్చర్స్ బ్యానర్‌పై పి.ఎస్.రామకృష్ణారావు తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించిన సినిమా ఇది. తమిళంలో “మనమగన్ తెవాయి” అనే పేరుతో విడుదలయ్యింది. జగ్గయ్య పోషించిన పాత్రను తమిళ సినిమాలో శివాజీ గణేశన్ పోషించారు. ఈ చిత్రానికి కూడా రచయిత రావూరు వెంకట సత్యనారాయణ రావు. ఏప్రిల్ 1956 లో విడుదలైన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో పరాజయం పాలయ్యింది.

భరణి స్టూడియో రెండేళ్లు లీజుకి…

చింతామణి (1956), వరుడు కావాలి (1956) సినిమాల నష్టాలతో కొన్నాళ్ళు భరణి స్టూడియోను కన్నదాసన్ అన్నయ్య ఎల్.ఎన్.శ్రీనివాసన్ కు లీజుకు ఇచ్చి మూడేళ్లు జపాన్ పర్యటనకు వెళ్ళొచ్చారు రామకృష్ణ. ఆ తరువాత బెంగాళీ రచయిత శరత్ చంద్ర రచించిన “బడా దీది” నవల ఆధారంగా రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం “బాటసారి”. అక్కినేని నాగేశ్వరావు, షావుకారు జానకి నాయకా, నాయికలుగా తెలుగు, తమిళ భాషలలో సమాంతరంగా ఏక కాలంలో తెరకెక్కించారు. బాటసారి సినిమా తెలుగులో 30 జూన్ 1961 నాడు విడుదలవ్వగా, తమిళంలో “కాణల్ నీర్” పేరిట 1961 జూలై 21న విడుదలయ్యింది. బాటసారి తరువాత రామకృష్ణ దర్శకత్వంలో “శభాష్ రాజా” అనే చిత్రం వచ్చింది. సుందర్ లాల్ నెహతా, డూండీ నిర్మాతలుగా, అక్కినేని నాగేశ్వరావు, రాజసులోచన జంటగా నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల తొలిసారిగా సంగీత దర్శకత్వం చేశారు. డిసెంబరు 1961 లో ఈ చిత్రం విడుదలైంది. 

“శభాష్ రాజా” చిత్రం తరువాత సారథి స్టూడియోస్ నిర్మాణంలో రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం “ఆత్మ బంధువు”. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 1962లో విడుదలయ్యి అత్యంత ఘనవిజయం సాధించింది. ఆ తరువాత ఆయన ఇతర నిర్మాణ సంస్థకు చేసిన నాలుగో చిత్రం వాసవి పిక్చర్స్ వారి “అనుబంధాలు”. జగ్గయ్య, కృష్ణకుమారి నాయకా, నాయకలు. 19 ఆగస్టు 1963 నాడు “అనుబంధాలు” విడుదలైంది. 1964 లో పి.ఎస్.రామకృష్ణారావు భరణీ పిక్చర్స్ బ్యానరుపై వివాహబంధం (1964), గృహలక్ష్మి (1967) తెరకెక్కించారు. బెంగాలీ రచయిత అషుతోష్ ముఖర్జీ బెంగాలీ రచన ఆధారంగా తీసిన “వివాహబంధం” (ఎన్టీఆర్ కథానాయకుడు) 23 అక్టోబరు 1964 లో విడుదలవ్వగా, 07 ఏప్రిల్ 1967 నాడు విడుదలైన “గృహలక్ష్మి” సినిమాలో అక్కినేని నాగేశ్వరావు కథానాయకులు. ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

గుండె జబ్బుకు అమెరికాలో వైద్యం…

భానుమతి రామకృష్ణ దంపతుల కుమారుడు భరణి 1967 నాటికి వైద్య విద్య (మెడిసిన్) రెండో సంవత్సరం చదువుతూ,  కళాశాలలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. భానుమతికి ఇష్టం లేకున్నా రామకృష్ణ దగ్గరుండి మరీ తిరుపతిలో పెళ్లి చేశారు. ఆ తరువాత తలెత్తిన కుటుంబ సమస్యల వల్ల అబ్బాయి భరణి దంపతులు వేరే కాపురం పెట్టేశారు. దాంతో రామకృష్ణ ఆరోగ్యం దెబ్బతింది. అందువలన తన దర్శకత్వ బాధ్యతలకు స్వస్తి పలికి స్టూడియోకు సమయం వెచ్చిస్తూ ఉండేవారు రామకృష్ణ. 1972 తరువాత భానుమతి దర్శకత్వం చేయడంతో రామకృష్ణ ఆమెకు సలహాలు ఇస్తూ ఉండేవారు. కానీ మళ్ళీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. 1975 వ సంవత్సరంలో భరణి స్టూడియోస్ లో కార్మికుల సమస్య తలెత్తడంతో కొన్నాళ్లు స్టూడియో లాక్ అవుట్ చేయాల్సి రావడంతో, ఈ వ్యవహారాలన్నీ రామకృష్ణ తీరిక లేకుండా చేశాయి. దాంతో ఆయన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించాయి. ఆ రోజులలో వాళ్ళ అబ్బాయి భరణి అమెరికా వెళ్ళాడు. 1980 మొదట్లో రామకృష్ణకు గుండె జబ్బు వచ్చింది. అప్పుడు వాళ్ళ అబ్బాయి అమెరికా తీసుకెళ్లి వైద్యం చేయించి ఐదు నెలలు తనవద్ద ఉంచుకొని పంపించేశాడు.

మరణం…

రామకృష్ణకు 1986లో మళ్లీ ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్లిన అబ్బాయి భరణి, తన తండ్రిని పరామర్శించడానికి తిరిగి మద్రాసు వచ్చాడు. కొన్నాళ్లకు తన తల్లిదండ్రులు భానుమతి రామకృష్ణ దంపతులను అమెరికాలో ఉండవలసిందిగా ఒప్పించాడు. భానుమతికి జాతకాల మీద నమ్మకాలు ఎక్కువ. రామకృష్ణ జాతకం ప్రకారం అపశకునం ఉంది, ఆ రోజులలో ప్రయాణం చేయకూడదు అన్నారు భానుమతి. కానీ వాళ్ళ అబ్బాయి భరణి బలవంతం మీద అమెరికా ప్రయాణం చేయక తప్పలేదు. 1986 జూలై చివర్లో భానుమతి  రామకృష్ణ దంపతులు అమెరికాకు వెళ్లారు.

భానుమతి అది మొదటిసారి అమెరికా ప్రయాణం, రామకృష్ణకు మాత్రం రెండవసారి. అమెరికాలోని న్యూజెర్సీ లో వాళ్ళ అబ్బాయి ఇంట్లో విశ్రాంతిగా గడపాలన్నది వాళ్ళ కోరిక. నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. పిట్స్ బర్గ్ లోని దేవాలయం, నయాగర జలపాతం అన్నీ చూసి వచ్చారు. సెప్టెంబర్ మొదటి వారంలో రామకృష్ణకు గుండెపోటు రావడం ఆస్పత్రిలో చేర్పించారు. 04 సెప్టెంబరు 1986 శస్త్రచికిత్స చేయాలన్నారు. ఆ చికిత్స జరుగుతుండగానే రామకృష్ణ మరణించారు. అప్పటికి ఆయనకు 68 సంవత్సరాలు. భానుమతికి ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. రామకృష్ణతో జంటగా వచ్చిన భానుమతి దుఃఖంతో అమెరికాను వదిలి ఒంటరిగా మద్రాసు ప్రయాణామవ్వాల్సి వచ్చింది.

Show More
Back to top button