Telugu News

దక్షిణాఫ్రికాకు తెలంగాణ నీళ్లు.. ఈ విషయం మీకు తెలుసా!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చండూరు మండలం ఇటికూడ గ్రామం ఒక మాములు కుగ్రామం. అయితే ఇప్పుడు ఆ గ్రామం పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామానికి వెళితే ప్రతి వీధిలో ఒక బోరు వేసే వాహనం కనిపిస్తుంది. ఈ గ్రామంలో 40 వీధులు లేవు కానీ అక్కడ గ్రామస్థులకు బోరు వేసే వాహనాలు మాత్రం 40 ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రామంలో 300లకు పైగా ఇళ్లులు ఉండగా ప్రతి ఇంట్లో ఒకరిద్దరూ ఈ వాహనాల ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారు. 

అవన్నీ తెలుగు రాష్ట్రాలతో పాటు సమీప రాష్ట్రాల్లో కూడా బోర్లు వేస్తున్నాయి. అంతేకాదు ఈ గ్రామస్థులకు చెందిన మరో 8 వాహనాలతో దక్షిణాఫ్రికాలో బోర్లు తవ్వుతున్నారు. వాటి యజమానులు, 15 మంది డ్రైవర్లు, ఆపరేటర్లుగా అక్కడ  పని చేస్తున్నారు. ఖండాలు దాటిన తమ పనితో నీటిని అందిస్తున్న ఆ చిన్న ఊరి ప్రజలు ఉన్నారంటే నమ్మశక్యంగా అనిపించదు కానీ ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాలో నీటి సమస్యల అధిగమించేందుకు ఈ గ్రామ ప్రజలే ప్రధాన ఆధారమవుతున్నారు.

ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నట్లైతే.. 1980 సంవత్సరంలో ఈ గ్రామానికి చెందిన నల్ల నరసింహ  అనే వ్యక్తి బోరింగ్​ బండిపై కార్మికుడిగా వెళ్లి ఆపరేటింగ్​, డ్రైవింగ్ నేర్చుకుని 20 ఏళ్లు ఆ పని చేశారు. తర్వాత అయన కష్టపడి సంపాదించి సొంతగా వాహనం కొన్నారు. అలా ఆయన ఇప్పటి వరకు 6 వాహనాలను కొనుగోలు చేశారు. 2010లో దక్షిణాఫ్రికాకు ఓ వాహనాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ నాలుగు బండ్లను నడిపిస్తున్నారు. ఆ దేశంలో బోరుబండ్లు ఉండవని, అన్నీ మన దేశానివే ఉంటాయని వివరించారు. అప్పటికి అక్కడ ఉన్న 5 బోరు బండ్లు కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారివేనట. అయన ఓ వైద్యుడి సలహా మేరకు ఆ దేశానికి వెళ్లినట్లు తెలిపారు. ఒకప్పుడు స్థానికంగా చిన్న ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువకులు, ఇప్పుడు బోరు వేసే పనిలో శిక్షణ పొందిన ఆపరేటర్లు, డ్రైవర్లుగా తయారయ్యారు. వారంతా దక్షిణాఫ్రికా తో పటు ఇతర దేశాల్లోనూ  పని చేస్తున్నారు.

అంతేకాదు దక్షిణాఫ్రికాలో కేవలం తాగునీటి కోసం మాత్రమే కాకుండా రాగి తవ్వకం కోసం కూడా బోర్లు ఎక్కువగా వేస్తుంటారని నరసింహ వివరించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే డీజిల్​, లేబర్ ఖర్చులు కూడా అక్కడ చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా డ్రిల్లింగ్ పని సంవత్సరంలో 365 రోజులూ విరామం లేకుండా కొనసాగుతుంది. నల్గొండలో ఒక చిన్న గ్రామం అయినప్పటికీ తమ పని మైళ్ల దూరంలో ఉన్న ప్రజల దాహాన్ని తీరుస్తోందని, తమ చెమట మరొక ఖండంలో నీరులా ప్రవహిస్తున్నందుకు గర్వంగా ఉందని అక్కడి గ్రామస్థులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇలా ఓకే ఊరిలో ఒకే రకమైన వాహనాలను కలిగి ఉండటం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాదు.  భువనగిరి జిల్లా సంస్థాన్​ నారాయణపురం మండలం అల్లందేవి చెర్వు గ్రామంలోనూ గ్రామస్థులు 45 ఏళ్లుగా లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో 130 కుటుంబాలు ఉండగా, అందులో సుమారు 100కు పైగా కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడ్డాయి. ఇలా ఆ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేసే వారు కనిపిస్తారు. ఆ ఊరిలో కొన్ని కుటుంబాల్లో ఒక్కరికి రెండు, నాలుగు వరకు లారీలు ఉన్నాయి. అది కూడా మొదట క్లీనర్​గా పని చేసిన వారు డ్రైవర్లుగా మారడం, ఆ తర్వాత లారీ యజమానులుగా మారి లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​గా మారుతున్నారు. అలా లారీలకు యజమానులుగా మారి ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు లారీలతో వ్యాపారులుగా మారారు. మరికొంత మంది డ్రైవింగ్​ ఫీల్డ్​కు సంబంధం లేకున్నా, లారీ యజమానులుగా మారి ఉపాధి పొందుతున్నారు, అలాగే ఉపాధి కల్పిస్తున్నారు.

అసలు అంత దూరం యంత్రాలు ఎలా తీసుకెళ్లారన్న సందేహం వస్తుంది కదా . అక్కడి  గ్రామస్తులు చెబుతున్న ప్రకారం  ఆర్సిని రద్దు చేసుకొని షిప్పుల ద్వారా ఏజెన్సీల సహకారంతో ఆ యంత్రాలను అక్కడికి తరలించారు. ప్రస్తుతం ఆ బోర్ వెల్స్ యంత్రాలు బాగా నడుస్తున్నాయి.

అక్కడి పనులకు సహాయంగా స్థానిక వ్యక్తిని మేనేజర్‌గా పెట్టుకోవడంతో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం జరుగుతుందట. కానీ బోర్ వెల్స్‌కు అవసరమైన పనిముట్లు, రిపేర్లు మాత్రం హైదరాబాద్‌ నుంచే తరలించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ మన ఇండియన్ బోర్ వెల్ పరికరాల తయారీదారులు లేకపోవడమే కారణం. మన ప్రాంతంలో ఒక ఫీట్ బోరింగ్‌కు 80 నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అదే అక్కడి రేట్లలో 20-30 రూపాయల తేడా ఉంటుందట. అయినప్పటికీ పని బాగానే కొనసాగుతోందని, భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన కూడా ఉన్నట్ట్టు ఆ వ్యాపారులు చెబుతున్నారు.

ఒక దేశానికి నీటిని అందజేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిత్యవసరాల్లో ముఖ్యమైనది జీవకోటికి ప్రాణదారం నీరు. అలాంటి నీటి సమస్యను దక్షిణాఫ్రికాకు తెలంగాణ రాష్ట్రంలోని ఆ మారుమూల గ్రామ ప్రజలు తీరుస్తుండడం చెప్పుకోదగ్గ విషయమే. ఈ ఒక్క పనితో ప్రపంచంలోనే ప్రముఖమైనదిగా నిలిచిపోయింది ఆ గ్రామం పేరు.

Show More
Back to top button