Telugu News

నక్షలిజం(మావోయిస్టు)వ్యవస్థాపకులు.. కొండపల్లి సీతారామయ్య.

యావత్తు భారతదేశాన్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన పేరు కొండపల్లి సీతారామయ్య. ఆయన ప్రముఖ నక్సలైటు. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకులు. ఆయనంటే పోలీసులకు బెదురు, అదురు, భయం. ఆయన పేరు వింటే చాలు గజగజ వణికిపోయేవారు. భారతదేశంలోని సీనియర్ కమ్యూనిస్టు నాయకులలో ఆయన ఒకరు. కమ్యూనిస్టు ప్రభావంతో భర్త చనిపోయి విధవగా ఉన్న కోటేశ్వరమ్మను ఆదర్శ వివాహం చేసుకుని, ఆ రోజులలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. కమ్యూనిస్టు ఉద్యమానికి పుట్టినిల్లు అయిన కృష్ణా జిల్లాలో ఆయన జన్మించారు.

కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులకు వెళ్ళిన సీతారామయ్య లాంటి యువకులు ఉత్తర భారత దేశంలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీని కృష్ణా జిల్లా ప్రాంతానికి పట్టుకు వచ్చారు. వ్యవస్థ మార్పు కోసం, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన త్యాగశీలి, పెళ్ళాం పిల్లలను వదిలేసి ప్రజా సమస్యలకై అడవులకు చేరి తుపాకీ పట్టిన మార్గ దర్శకులు కొండపల్లి సత్యనారాయణ. ఏదో సాధిద్దామని జీవితం మొదలుపెట్టిన సీతారామయ్య, తాను అనుకున్నది సాధించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు,  సాధించాలనుకున్న దానికోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నారు. 

భారత కమ్యూనిస్టు పార్టీ నుండి విడిపోయి, పీపుల్స్ వార్ గ్రూప్ ను స్థాపించి అడవులకు వెళ్లి, ప్రభుత్వాలను విభేదించి, ప్రజా సమస్యల కోసం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంభించారు కొండపల్లి సీతారామయ్య. కమ్యూనిస్టు పార్టీ పేదల పార్టీ, కానీ దానిని నిర్వహించిన వారు మాత్రం ధనికే వర్గానికి చెందిన వారు కావడం విశేషం. వారిలో సీతారామయ్య ఒకరు. నిజానికి రెడ్డి కుటుంబంలో పుట్టి, సీతారామ రెడ్డిగా పేరున్న ఆయన కమ్యూనిస్టుగా మారిన తరువాత తన కలం పేరు చెప్పే “రెడ్డి” ని వదిలించుకున్నారు సీతారామయ్య. మొదట్లో కృష్ణా జిల్లాకు కమ్యూనిస్టు కార్యదర్శిగా ఉన్న సీతారామయ్య నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంతోనే ఆయుధం పట్టడం అలవాటయ్యి, తరువాత కాలంలో కమ్యూనిస్టు పార్టీలో ఆంధ్ర ప్రాంతపు నేతల మధ్య విభేదాలు తలెత్తి, పార్టీ చీలికకు దారి తీయడం లాంటివి కొండపల్లికి నచ్చలేదు. దాంతో వరంగల్ పట్టణంలోని ఒక క్రైస్తవ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పని చేశారు. అలాగే ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి ఉంటే సీతారామయ్య జీవితం ఎలా ఉండేదో..

ఏదో సాధిద్దామని, ఎక్కడి నుండో బయలుదేరి, అడవి జీవితం, జైలు జీవితం అనుభవించి, భార్య పిల్లల ఎడబాటు కలిగి, జీవిత చరమాంకంలో అల్జీమర్స్ వ్యాధి సోకి, మతిమరుపుతో జీవితం ముగించడం విషాదకరం. ఏదో సాధించాలని సంకల్పించి, అడవిబాట పట్టి, తుపాకీ చేతబట్టి, తాను కోరుకున్న గమ్యం చేరాడా? తాను ఎంచుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వాటికి సరైన సమాధానం దొరకక, ఆయనకు మానసిక దౌర్భాల్యాన్ని తెచ్చిపెట్టింది. తన చివరి సంవత్సరాల్లో, ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డారు. గొప్పగా మొదలైన ఉద్యమంలో ప్రజల కోసం పోరాడి, అలసిపోయి మతిస్థిమితం లేని మానసిక రోగిగా అర్థంతరంగా అంతర్దానమయ్యారు కొండపల్లి సీతారామయ్య. ఎఱ్ఱ జెండాను చేత పట్టుకుని, నెత్తుటి పోరాటాలను పిడికిటనెట్టుకుని జనం కోసం పోరాడి, జనం గుండెలో నిలిచిపోయారు నక్షలైటు వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్య.

నేపథ్యం…

కొండపల్లి సీతారామయ్య, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా, గుడివాడ మండలం లింగవరం గ్రామంలో 1914 వ సంవత్సరంలో జన్మించారు. పుట్టింది లింగవరంలోనే అయినా కూడా తాను జొన్నపాడు గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు చిన్న బుచ్చమ్మ (చిన్న అమ్మమ్మ) దగ్గర పెరిగారు. బుచ్చమ్మే సీతారామయ్యను పెంచి పెద్ద చేసింది. ఆ రోజులలో జాతియోద్యమంలో పాల్గొని, తరువాత రోజులలో కమ్యూనిస్టుగా మారిన వంగపాటి రంగారెడ్డి అనే వ్యక్తిది జొన్నపాడు. ఆయనంటే ఆ ఊరికీ, ఆ ఫిర్కాకు గౌరవం ఉండేది. ఆయన ప్రభావంతోనే సీతారామయ్య కూడా తరువాత రోజులలో కమ్యూనిస్టుగా మారిపోయారు. 

నిజానికి సీతారామయ్య తల్లికి తన కొడుకుని ధనవంతుడిని చేయాలనేది కోరిక. ఆమె బావ కొడుక్కి పాతిక ఎకరాల భూమి ఉంది. తన కొడుకుకు కూడా అంత భూమి ఉండాలనేది ఆమె ఆరాటం. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గేదెలను సాకి పాలు అమ్మేది, కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతూ వచ్చిన డబ్బును వడ్డీలకు తిప్పుతూ ఆదాయం పెంచుతూ ఉండేది. ఆమె చేసేది చూస్తూ సీతారామయ్య తండ్రి ఆమెను మెచ్చుకునేవారు. సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ రోకలి పట్టి ఒడ్లు దంచడం, పిడకలు కొట్టడం వంటి పనులు చూస్తుంటే, అతని తల్లి మాత్రం సంపాదన విషయం చూసుకునేవారు. అలాగే అధిక వడ్డీ లకు నామ్ పద్ధతిలో (కార్తీక మాసంలో బస్తా ఒడ్లు అప్పుగా ఇచ్చి, పంటలు పండిన తరువాత రెండు బస్తాలు తీసుకునే దాన్ని నామ్ పద్దతి అంటారు) ఒడ్లు అప్పుగా ఇచ్చి తిరిగి పంటలపై వసూలు చేసేవారు.

తన ఆస్తిని కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చేసి..

తల్లి నామ్ పద్ధతిలో అప్పు ఇచ్చి, తిరిగి వసూలు చేసే విషయం సీతారామయ్యకు తెలిసిపోయింది. దాంతో ఆమె ఎవరెవరికి అప్పు ఇచ్చిందో వారిని పిలిపించి, అదనంగా తీసుకున్న వడ్లను కొలిచి తిరిగి వారికి ఇచ్చేశారు. దాంతో సీతారామయ్య తల్లి ఇంటి నుండి బయటకు రాకుండా వెక్కి వెక్కి ఏడ్చింది. అన్నం తినకుండా పస్తులుండింది. భారతీయ కమ్యూనిస్టు పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్లాలానే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టు పార్టీని మరియు పార్టీ పత్రికను నడపడం కోసం పార్టీ అగ్రశ్రేణి నాయకులు “కమ్యూనిస్టు గాంధీ” గా పేరున్న నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు చండ్ర రాజేశ్వరరావు లాంటి పెద్దలు తమ తల్లిదండ్రుల నుండి తమకు వచ్చిన ఆస్తిని పంచుకొని ఆ సొమ్మును పార్టీకి ఇచ్చివేశారు. దాంతో వివిధ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాలో ప్రముఖులుగా పనిచేసిన కొండపల్లి సీతారామయ్య కూడా తన తండ్రి నుండి తనకొచ్చిన భాగాన్ని తీసుకుని, ఆ ఆస్తిని అమ్మి, ఆ సొమ్మును భారతీయ కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీతారామయ్య తండ్రి బాధపడ్డారు. ఆయన తల్లి ఏడుస్తూ నూతిలో పడతానని వెళ్ళింది. చుట్టు ప్రక్కల వారు వచ్చి వారించారు. దాంతో ఆమె కొడుకు, కోడలు ఉన్న ఇంట్లో ఉండలేనంటూ జొన్నపాడులో ఉన్న పిన్నమ్మ ఇంటికి వెళ్లిపోయింది.

వరంగల్ లో ఉపాధ్యాయుడిగా…

కొండపల్లి సీతారామయ్య చాలా చిన్న వయస్సు లోనే కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. కమ్యూనిస్టుల సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. కమ్యూనిస్టులు నడిపిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పార్టీ తరుపున ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించిన తీరుపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిలో సీతారామయ్య కూడా ఒకరొకరు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ 1964లో చీలిపోయింది. దశాబ్దాలుగా కొనసాగిన ఉద్రిక్తతలు మరియు వర్గ అంతర్గత పోరాటాలకు ఈ చీలిక పరాకాష్ట. ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన విపక్షం ఉండాలని, అది కమ్యూనిస్టులతోనే సాధ్యం అని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశారు కమ్యూనిస్టులు. ఫలితంగా పార్టీలో చీలికలు వస్తూనే ఉన్నాయి.

తెలంగాణ తిరుగుబాటు సమయంలో చురుగ్గా పనిచేసిన భారత కమ్యూనిస్టు పార్టీ, 1964 చీలిక తరువాత భారత కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు, రాజకీయ జీవితం నుండి సీతారామయ్య వైదొలిగారు. ఆ సమయంలో ఆయన వరంగల్‌ లోని “సెయింట్ గాబ్రియేల్స్ ఉన్నత పాఠశాల” లో హిందీ బోధకుడిగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో వరంగల్‌లోనే ఆయనకు కె.జి. సత్యమూర్తితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ – లెనినిస్ట్) లో చేరారు. సీతారామయ్య సిపిఐ (మార్క్సిస్ట్ – లెనినిస్ట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్ – లెనినిస్ట్) అంతర్గత కలహాలతో నలిగిపోయినప్పుడు, 1972లో సీతారామయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్ – లెనినిస్ట్) కేంద్ర నిర్వాహక బృందంలో చేరారు. 1974 ఆగస్టులో, సిఓసి, సిపిఐ (మార్క్సిస్ట్ – లెనినిస్ట్) యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులలో సీతారామయ్య ఒకరు.

భర్తను కోల్పోయిన విధవను పెండ్లి చేసుకుని..

1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీలో మొదలైన నక్సలైట్ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన కొండపల్లి సీతారామయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములో నక్సలైట్ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. 1969 లో ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన నక్షల్ భరీ ఉద్యమం ఆయనను తిరిగి ఉద్యమ బాట పట్టించి, అడవితోవలో అజ్ఞాత జీవితం వైపు తీసుకెళ్లింది. తన జీవితం భారత కమ్యూనిస్టు పార్టీకి అంకితం అనుకున్న సీతారామయ్య, అప్పట్లోనే  కమ్యూనిస్టు పార్టీ పెద్దల సలహాలతో, ఆనాటి సాంఘిక కట్టుబాట్లను ధిక్కరించి పెళ్లయ్యి భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలు కోటేశ్వరమ్మను ఆయన వివాహం చేసుకున్నారు. 

అయితే కట్టుకున్న భార్యని, తన పిల్లలు వదిలేసి ఉద్యమంలోకి వెళ్లడం సరైనదా కాదా అనే ప్రశ్న అప్పుడు వేసుకోలేదు. నక్సలైట్ ఉద్యమంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు, నక్షలైటుగా ఉన్నత స్థాయికి చేరారు. కమ్యూనిస్టులలో చీలికలు రావడం మాములే, ఇతర కమ్యూనిస్టులతో చాలా సహజంగా విభేదించడాన్ని వారు జన్మ హక్కుగా భావిస్తారు. ఆ చీలికలలో భాగంగా “పీపుల్స్ వార్ గ్రూప్” అంటూ ఒక చీలిక వర్గాన్ని సీతారామయ్య సొంతంగా తయారుచేసుకున్నారు. కానీ నక్షలైటు అనే సాయుధ ఉద్యమం సరైంది కాదన్నది ప్రభుత్వ వాదనను దిక్కరించిన వారికి జైలు జీవితం తప్పనిసరి. ఆ కారణం వలనే కొండపల్లి సీతారామయ్యను 1977లో నాగపూర్ లో ఒక సారి అరెస్టు చేశారు. ఆ తరువాత తిరిగి 1982లో రెండవసారి అరెస్టు చేశారు.

కొండపల్లిని బహిష్కరించిన గణపతి వర్గం

కొండపల్లి సీతారామయ్యను ఆ సమయంలో ఆస్పత్రి నుండి తప్పించడానికి అక్కడున్న పోలీసుల్ని చంపేసి, ఆయన్ను బయటికి తీసుకువచ్చారు. సీతారామయ్యకు అంత హవా ఉండేది. నక్షలైటు ఉద్యమకారులను పోలీసులు చంపుతారని సీతారామయ్య గగ్గోలు పెట్టేవారు. ఆ ఆకృత్యాలను సహించలేక, పోలీసుల అరాచకాలను భరించలేక, నక్షలైట్లు కూడా పోలీసుల ప్రాణం తీయడానికి ఏమాత్రం సందేహించేవారు కాదు. పోలీసుల చెరలో బందీగా ఉన్న కొండపల్లి సీతారామయ్య ఉస్మానియా దవాఖానలో ఖైదీల వార్డులో ఉండగా, ఆయనను తప్పించేందుకు ఆ సమయంలో నక్షలైట్లు ఒక పోలీసు కానిస్టేబుల్ ను చంపారు. దాంతో కొండపల్లి సీతారామయ్య 1984 జనవరిలో ఉస్మానియా ఆసుపత్రి నుండి పారిపోయి తిరిగి అడవి బాట పట్టారు. నక్షలైటు ఉద్యమంలో తనతో విభేదాలు ఉన్న వారిని బహిష్కరించడం, పీపుల్స్ వార్ గ్రూప్ పై ఎప్పటికప్పుడు తన పట్టు పెంచుకోవడం జరుగుతూ వచ్చింది.

కానీ అన్ని వేళలా మనం అనుకున్నదే జరుగదు. 1991 నాటికి ఆయనకు వ్యతిరేక వర్గం ఏర్పడింది. గణపతి వర్గం వారు సీతారామయ్యను పీపుల్స్ వార్ గ్రూప్ నుండి బహిష్కరించారు. అప్పటికీ గణపతి వర్గానిదే పైచేయి అయ్యింది. సీతారామయ్య కొడుకు ఎన్కౌంటర్ లో మరణించాడు. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది. సీతారామయ్యను వివాహమాడిన భార్య సీతారామయ్య గురించి ఆలోచించడం లేదు. పీపుల్స్ వార్ గ్రూప్ అయిన నక్షలైటు పార్టీ వారు కూడా క్రమక్రమంగా కొండపల్లి సీతారామయ్యను వదిలేశారు. నక్షలైటు ఉద్యమం మొదలైన కొత్తలో కొండపల్లి సీతారామయ్య అంటే ప్రతీ ఒక్కరికీ వణుకు. కానీ ఆయనకు తల దాచుకునేందుకు స్థలం లేదు. తిరిగి తన స్వగ్రామం వెళ్లారు. 36 యేండ్ల క్రిందట భర్త నుండి దూరమైన భార్య కోటేశ్వరమ్మను చూడాలనిపించి కబురు పెడితే, “తనతో నాకేమిటి సంబంధం అనే సమాధానం ఆమె నోటి నుండి వచ్చేది.

మతిమరుపు వ్యాధితో తన ఫోటోలను గుర్తుపట్టలేక..

తనను వదిలేసి అడవి బాట పట్టాడని భార్య కోటేశరమ్మ చూడడానికి రాకపోవడంతో కొండపల్లి సీతారామయ్యకు తన సొంత బంధువులే గతి అయ్యారు. ఆయన పీపుల్స్ వార్ ఉద్యమంలో లేకపోయినా కూడా పోలీసులు వెంటాడి, 1993లో ఆయనను మరోమారు అరెస్టు చేశారు. కొద్ది సంవత్సరాల పాటు జైలులో ఉన్న సీతారామయ్యను వృద్ధాప్యం కారణంగా ఎక్కువ రోజులు జైలులో ఉంచలేకపోయారు. 78 సంవత్సరాల వృద్ధ సింహం అయిన కొండపల్లి సీతారామయ్య చేయగలిగిన విప్లవం ఏమీలేదని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయనకు క్షమాభిక్షపెట్టి వదిలేసింది. తక్షణమే ఆయనను జైలు నుండి విడుదలచేశారు. 

ఆయన జైలు నుండివిడుదల అయిన వెంటనే ఆయనను కలుసుకునేందుకు, ఆయనను ఆదరించేందుకు సరిపడా జనం రాలేదు. చివరికి ఆయన మనవరాలు, ఆమె భర్త కలిసి సీతారామయ్యను విజయవాడకు తీసుకుని వచ్చారు. ఆయన మిత్రుల అతి బలవంతం మీద భర్త సీతారామయ్యను చూసేందుకు వచ్చిన భార్య కోటేశ్వరమ్మ కన్నీరు పెట్టుకుంది. కొండపల్లి సీతారామయ్య తన సిద్ధాంతాల కోసం ఎందరో కుటుంబ పెద్దలను చంపించారు. ఆ కుటుంబాల జీవితాలు ఎంతగా విషాదంలో కొట్టుకుపోయి ఉంటాయో, ఆయనకు ఆ క్షణంలో సీతారామయ్యకు అర్థమైందో లేదో తెలియదు, లేదంటే అర్థమై పశ్చాత్తాప పడ్డారో ఏమో గానీ, జీవన మలిసంధ్యలో ఆయన జీవితము ఒక పిచ్చివాడి జీవితమైంది. ఎంతో కాలం దాగివున్న మతిమరుపు వ్యాధి తీవ్రతరమైంది. ఆయనకు ఏది సరిగ్గా గుర్తుండేది కాదు. తన ఫోటోలను తానే గుర్తుపట్టలేకపోయారు.

పిచ్చి లోకంలో గడిపి, అనంత లోకాలకు పయనమయ్యారు.

వయసు మీద పడి, వృద్ధాప్యంలో తన సొంత ఊర్లో ఎవ్వరూ లేరని తెలిసినా అక్కడికి వెళ్లాలని వాదించేవారు సీతారామయ్య. విజయవాడలో బిజా రోడ్డు ప్రక్కనే మనమరాలు ఇల్లు ఉండేది. ఆ ఇంటి బాల్కనీలో కూర్చొని క్రిందికి చూస్తూ, రోడ్డు మీద తన పనుల కోసం హడావుడిగా తిరుగుతున్న జనాలను చూసి, తాను అడవిలో నిర్మించిన నక్షలైటు విప్లవ సైన్యం తరలివస్తుందని భ్రమపడుతూ ఉండేవారు. వారంతా వస్తున్నారని, దాంతో తాను ఆశించిన విప్లవ రాజ్యం ఏర్పడబోతుందని, దానికి తానే తిరుగులేని అధిపతిని అని సీతారామయ్య మానసికంగా సిద్ధపడేవారు. తరువాత రోజులలో అల్జీమర్స్ వ్యాధి ఆయన మతిని పోగొట్టింది.

ఆయన విప్లవ ప్రసంగాల స్థానంలో పిచ్చి ప్రేలాపణలు చేరాయి. ఆయనకు నచ్చజెప్పి ఆయన మనవరాలు భర్త సీతారామయ్యను ఇంట్లోనే ఉంచడం లాంటివి చేసేవారు. కొండపల్లి సీతారామయ్యను తాను నిర్మించిన పార్టీయే తిరస్కరించింది. ఎంతో గొప్ప బ్రతుకు బ్రతికి, ఉద్యమంతో ఎంతో దేశాన్ని గడగడలాడించిన కొండపల్లి సీతారామయ్యను పలకరించేందుకు ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఆయన మరణించినప్పుడు పట్టుమని పది మంది పార్టీ సభ్యులు రాలేదు. విజయవాడలో ఉంటున్న మనుమరాలి ఇంటి చుట్టుప్రక్కల వారికి ఆయన గురించి తెలియదు. తన స్వప్నం చెదిరి, చివరి రోజులలో మతి భ్రమించి, పిచ్చి లోకంలో గడిపి 2002 సంవత్సరంలో అనంత లోకాలకు వెళ్లిపోయారు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య.

Show More
Back to top button