
“నీవు రమ్యాలోకన కలిగి ఉండే, ఒక్క గడ్డిపరక మీదనే రత్నఖచితమైనట్టి అద్భుత సౌధాన్ని వ్యక్తపరచగలవు. కానీ నీలో ఆ రమ్యాలోకన లేనప్పుడు మాత్రం ఒక గడ్డి పరకే ఆ అద్భుత సౌధాన్ని దాచివేస్తుంది” అని జపాన్ లో ఒక సూక్తి ఉంది. తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటులు ముదిగొండ లింగమూర్తి కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఉద్భటారాధ్య వంశానికి చెందిన ముదిగొండ లింగమూర్తి రంగస్థల నటులు మరియు ఒక భారతీయ చలనచిత్ర పాత్ర నటులు. బాల్యం నుండే నటనపై ఆసక్తి ఉన్న ఆయన ఆదిలోనే “శ్రీరామ విలాస సభ” లో ప్రవేశించిన “ప్రతాపరుద్రీయం” నాటకంలో పడవ నడిపేవాడి పాత్రతో మొదలుపెట్టి, యుగంధర పాత్ర వరకు సుమారు పది రకాల పాత్రలు ధరించి ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలు పొందారు.
స్పష్టమైన వాచకం, పాత్రోచితమైన వేషం, హద్దులు మీరని ఆంగికాభినయంతో ప్రతిపాత్రను రసరంజితం చేసి, నాటకాన్ని తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు రసానుభూతులు కలిగించేవారు లింగమూర్తి. కన్యాశుల్కం నాటకంలో ఒక సందర్భంలో “మధురవాణితో మాట్లాడి తలుపులు వేసుకోమని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రంగంలో నుండి నిష్క్రమించే సమయంలో, మధురవానిపై అనుమానం, అంతలోనే వృద్ధ రసికత్వం చూపుతూ, ఆయన చేసే అభినయానికి ప్రేక్షకులు మంత్రముగ్దులై, హర్షధ్వానాలతో హోరెత్తించేవారు. అంత గొప్ప అభినయాన్ని ఆయన కనబరిచేవారు.
ముదిగొండ లింగమూర్తి జన్మతః నటులు. ఆయన ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనే, కాలక్షేపం చేయకుండా నాటక రంగంలోకి వచ్చారు. ఆయన కొంతకాలం స్థానం నరసింహారావు వద్ద, మరి కొంతకాలం సి.యస్.ఆర్ ఆంజనేయులు వద్ద నాటకాలలోను వివిధ పాత్రలు పోషించారు. ఆ రోజులలో ప్రదర్శింపబడే నాటకాలలో బెల్లంకొండ సుబ్బారావు, మల్లాది గోవింద శాస్త్రి, కళ్యాణం రఘురామయ్య, ఏలేశ్వరపు కుటుంబశాస్త్రి, యస్.పి.లక్ష్మణ స్వామి, మాస్టర్ కళ్యాణి, టి.రామకృష్ణ శాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరి, పి.సూరిబాబు మొదలగు నటీనటులంతా కూడా అద్భుతంగా పద్యాలు పాడి పాత్రలను రక్తి కట్టిస్తే, అంతమంది నటులు, గాయకుల మధ్య ముదిగొండ లింగమూర్తి మాత్రం సంభాషణలను అద్భుతంగా పలికి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు.
ముదిగొండ లింగమూర్తి 1937 వ సంవత్సరంలో చలనచిత్ర రంగప్రవేశం చేసి చిత్తూరు వి.నాగయ్యతో కలిసి “తుకారాం” అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత విజయ వౌహిని స్టూడియోస్‌లో చేరి, ఏడు సంవత్సరాలు వారితో అనుబంధం కలిగి “భక్త పోతన” చిత్రంలో అజామిళగా, “స్వర్గ సీమ” లో గంగుడిగా, యోగి వేమన సినిమాలో అభిరామగా, పెద్దమనుషులు చిత్రంలో రామదాసుగా లింగమూర్తి నటించారు. 1937 లో తుకారాం తో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 1968 లో భాగ్య చక్రం సినిమా వరకు సుమారు 70 సినిమాల ప్రస్థానం తనది. వి.నాగయ్యను బావ అంటూ సన్నిహితంగా పిలిచే లింగమూర్తి ఆయన నటించిన “త్యాగయ్య” , “నా ఇల్లు” , “రామదాసు” లాంటి పలు చిత్రాలలో నటించారు. ఆయన “సినిమా సాంకేతిక నిపుణుల సంఘం వ్యవస్థాపక సభ్యులుగా పనిచేసిన లింగమూర్తి, ఆ తరువాత అసోసియేషన్ కార్యదర్శి మరియు చైర్‌పర్సన్ పదవులను కూడా నిర్వహించారు. అరవయ్యో యేట తన షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్న ముదిగొండ లింగమూర్తి, షష్టిపూర్తి తరువాత ఆ వృత్తికి మరియు పదవికి రాజీనామా చేశారు.
నేపథ్యం…
ఆంధ్ర పారిస్ అని పిలిచే తెనాలి పట్టణంలో ముదిగొండ లింగమూర్తి 10 అక్టోబరు 1908 నాడు హిందూ శైవ కుటుంబంలో జన్మించారు. ఆయన ఉద్భటారాధ్య వంశానికి చెందినవారు. ఉద్భటారాధ్య వంశీకులది తెలంగాణలోని దేవరకొండ తాలూకా ముదిగొండ గ్రామం. వారిలోని కొందరు 19వ శతాబ్దంలో తెనాలి వచ్చి స్థిరపడ్డారు. ఆ ఉద్భటారాధ్య వంశంలోని వారే లింగమూర్తి. వారిది పూర్వం ముదిగొండ కాబట్టి ఆయనను ముదిగొండ లింగమూర్తి అంటుంటారు. ఆయన విద్యాభ్యాసం తెనాలి తాలూకా ఉన్నత పాఠశాలలో సాగింది. స్కూల్ ఫైనల్ వరకు ఆయన అక్కడే చదివారు. ఆయనతో పాటు ప్రముఖులు మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, గోవిందరాజుల సుబ్బారావు, లక్కరాజు విజయ గోపాలరావు, అబ్బూరి రామకృష్ణారావు, పిల్లలమర్రి సుందర రామయ్య, పెద్దిబొట్ల చలపతి మొదలగు వారందరూ ముదిగొండ లింగమూర్తితో కలిసి అదే పాఠశాలలో చదువుకున్నారు. ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు అదే పాఠశాలలో నాటకాలు ప్రదర్శించేవారు. వారందరూ పాఠశాలలో ప్రదర్శించే నాటకాలలో పాల్గొనేవారు. చదువు పూర్తయిపోయి, పాఠశాలను వదిలి వెళ్ళిపోయిన తరువాత వారంతా కలిసి “పూర్వ విద్యార్థుల నాటక సంఘం” స్థాపించి నాటకాలను ప్రదర్శించేవారు.
నాటక రంగం…
ముదిగొండ లింగమూర్తి పూర్వీకులలో నటులు గానీ, గాయకులు గానీ లేరు. కానీ ఆయన జన్మతః నటులు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపం చేయకుండా ఆయన నాటక రంగంలోకి వచ్చారు. “శ్రీరామ విలాస సభ” అనేది ఆంధ్రదేశంలో బాగా పేరున్న నాటక సభ. అందులో ప్రవేశించి, వారు ప్రదర్శించిన “ప్రతాపరుద్రీయం” నాటకంలో పడవ నడిపేవాడి పాత్రను పోషించారు. అలాగే శ్రీరామ విలాససభ వారు అద్భుతంగా ప్రదర్శించే “కన్యాశుల్కం” అనే నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించేవారు. ఆ పాత్రను మొదట్లో మాస్టర్ అంజి గా ప్రసిద్ధి పొందిన తంగిరాల ఆంజనేయులు పోషించారు.
కానీ ఆయన ఆకస్మిక మరణం చెంది, కన్యాశుల్కం నాటకానికి విగాథం ఏర్పడడంతో, రామప్ప పాత్రను ముదిగొండ లింగమూర్తి స్వీకరించి మాస్టర్ అంజికి సమవుజ్జీగా పోషించి ప్రశంసలు పొందారు. ఆ తరువాత కొంతకాలం స్థానం నరసింహారావు నాటక సమాజంలోనూ, మరి కొంతకాలం సి.యస్.ఆర్ ఆంజనేయులు ప్రదర్శించిన “భక్తతుకారం”, “పతిత పావన” నాటకాలలోను పలు రకాల పాత్రలు పోషించారు. హద్దులు మీరని ఆంగికాభినయంతో, స్పష్టమైన వాచకంతో, పాత్రోచితమైన వేషంతో ప్రతిపాత్రను రసరంజితం చేసి ప్రేక్షకులకు రసానుభూతులు కలిగించేవారు ముదిగొండ లింగమూర్తి. అందుకే ప్రేక్షకులు ఆయనను గుణచిత్ర నటులుగా అభిమానించారు.
సినిమా రంగ ప్రవేశం…
ముదిగొండ లింగమూర్తి తొలిసారిగా 1937 సంవత్సరంలో సినిమా రంగంలోకి వచ్చేశారు. ఆయన మొదటిసారి “తుకారం” సినిమాలో “గోస్వామి” పాత్ర పోషించారు. ఆ తరువాత వాహిని పతాకం మీద బి.యన్.రెడ్డి తీసిన మొదటి సినిమా వందేమాతరం (1939) లో డాక్టర్ పాత్ర అద్భుతంగా పోషించారు. ఈ సినిమా నుండే తన నటన వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత “సుమంగళి” (1940), “భక్తిమాల” (1941), దేవత (1941), భక్త పోతన (1943), స్వర్గసీమ (1945), నారద నారది (1946), త్యాగయ్య (1946), యోగి వేమన (1947), ధర్మాంగద (1949), పెద్దమనుషులు (1954), నా ఇల్లు (1953), మహామంత్రి తిమ్మరసు (1962), రామదాసు (1964), పాండవ వనవాసం (1965) ఇలా అనేక చిత్రాలలో వైవిధ్యం గల ఎన్నో పాత్రలు ధరించారు.
సూర్యుడు తూర్పున ఉదయిస్తారన్నది ఎంత సత్యమైనదో, మనకున్న గుణ చిత్ర నటులలో లింగమూర్తి ఒకరు అన్నది అంతటి సత్యమైనది. ఆయన తన సినిమా జీవిత కాలంలో సుమారు 80 చిత్రాలలో నటించి అన్ని రకాల పాత్రలను పోషించారు. వందేమాతరం సినిమా నుండి వాహినీ చిత్రాలలో లింగమూర్తి చేసిన పాత్రలన్నీ భిన్నమైనవే. ఒక పాత్రకి, మరో పాత్రకి సంబంధం ఉండదు. ఆయన హాస్య పాత్రలు, దుష్టపాత్రలు, కరుణారస ప్రధాన పాత్రలో ఎన్నో ధరించారు, మెప్పించారు. రంగస్థలం మీద అద్భుతమైన నటనను పండించి సినిమా రంగంలోకి వచ్చిన మహానటులు లింగమూర్తి. ఉచ్ఛారణకు తగ్గ ముఖభావం, మంచి కంఠం ఆయన సొంతం. పౌరాణిక చిత్రాలు, సాంఘికాలు, జానపద చిత్రాలు ఏవి కూడా ఆయన నుండి తప్పించుకోలేకపోయాయి.
సంభాషణోచ్ఛారణలో చమత్కారం చూపిస్తూ…
ముదిగొండ లింగమూర్తి ఆచరణాత్మకమైన మరియు లోతుగా పరిశీలన చేయగల వ్యక్తి. ఒక్కోసారి దర్శకులు ఎంత గొప్పగా చెప్పినా తనకు నమ్మకం కలగకపోతే ఒప్పుకోని మనిషి. స్వర్గసీమ (1945) సినిమాలో భానుమతి తండ్రి, పల్లెటూరు వాడి పాత్ర పోషించారు. హీరోని వలలో వేసుకోవాలని కూతురుతో చెప్పే సన్నివేశంలో “ఎన్నాళ్ళని ఈ బిగువులు, చేతులు కలిపితే అన్నీ సరిపోతాయి. వాడేం దయ్యమా? రాక్షసుడా? దగ్గరికెళ్ళి అంతా సరిచేసుకో” అని చెప్పాలి. కానీ అందులో ఆయనకు చమత్కారం కనిపించలేదు. ఆయన అదే మాట దర్శకులు బి.యన్.రెడ్డి తో అన్నారు. దానికి దర్శకులు “ఏం చమత్కారం చేస్తావో చెయ్” అన్నారు. అప్పుడు దర్శకుడికి నెమ్మదిగా నచ్చజెప్పి, నేను సంభాషణ చెబుతాను, బాగుంటే ఉంచండి లేకపోతే లేదు అని “వాడేం పులా, సింగమా? తెలివితేటలుండాలి. వూ” అని సంభాషణ పూర్తి చేశారు.
“వూ” అనడంలోనే చమత్కారం చూపించారు లింగమూర్తి. దానిని దర్శకుడు బి.యన్.రెడ్డి, రచయిత సముద్రాల ఇద్దరు సరే అన్నారు. ఆ సంభాషణ మార్పు సినిమాలో ప్రేక్షకులను ఎంతో బాగా పట్టుకుంది. ఒక దశలో ఆయనకు సినిమాలు లేవు. ఖాళీగానే ఉన్నారు కదా! పారితోషికం ఎంత ఇస్తే, అంత తీసుకొని నటిస్తారని ఒక నిర్మాత తన పౌరాణికంలో నటించమని అడిగారు. అలాగే డబ్బు మాట మామూలుగా అడిగారు లింగమూర్తి. ఇంత అన్నారు నిర్మాత. దానికి లింగమూర్తి నేను ఒప్పుకోను, సినిమాలు తగ్గొచ్చు గానీ, నా ప్రతిభ తగ్గలేదు. నా ప్రతిభకి ఒక ధర ఉంటుంది. ఆ పారితోషికానికి పైసా కూడా తగ్గను. సినిమాలో వేషాలు లేకపోయినా పర్వాలేదు, కానీ నేను పెట్టుకున్న కనిష్ట పారితోషికానికి మాత్రం క్రిందికి దిగను అని కుండ పగలగొట్టినట్టు చెప్పడం లింగమూర్తికే చెల్లింది.
1949 లో ఉత్తమ నటుడిగా…
సంభాషణలు పలికే షాట్ లలో నిశ్శబ్ద ప్రతిచర్య కనబర్చడంలో ముదిగొండ లింగమూర్తి గట్టివారు అంటారు మార్గదర్శకులు కె.వి.రెడ్డి. ఆయన తెరకెక్కించిన “యోగి వేమన” (1947) చివరి దృశ్యంలో వేమన ఆఖరి సారిగా అభిరాముని (లింగమూర్తి) హత్తుకునే సన్నివేశం. కెమెరా లింగమూర్తి వీపును చూపిస్తోంది. వేమన కావలించుకోగానే తన ఒళ్ళు జలదరించినట్టుగా, పులకరించినట్లుగా అభిరాముడు వీపులోనే “భావ వ్యక్తీకరణ” ఇచ్చారు. అది చూసిన కె.వి.రెడ్డి నటులు లింగమూర్తిని అభినందించారు. అలా ముదిగొండ లింగమూర్తి సుమారు ఎనభై చిత్రాలలో వైవిధ్యం గల ఎన్నో పాత్రలను ధరించారు, మరెన్నో పాత్రలను పండించారు. యోగి వేమన లో అభిరాముడి పాత్ర, త్యాగయ్యలో జపేశన్ పాత్ర, పాండవ వనవాసంలో శకుని పాత్ర, పోతనలో అజామిళిని పాత్ర “నభూతో నభవిష్యతి” అన్నట్లు నటించి, నటుడిగా తన విశ్వరూపం చూపారు.
అలాగే పెద్దమనుషులు సినిమాలో రామదాసు పాత్ర, పాండవ వనవాసంలో శకుని పాత్ర నటనాపరంగా భిన్న ధృవాలున్న పాత్రలు. ఈ రెండు పాత్రలను పోల్చుకుని సమీక్షిస్తే ఆయన నటనలోని లోతుపాతుల్ని, నటనా నైపుణ్యాన్ని మనం గమనించవచ్చు. సారథి పిక్చర్స్ వారి “పంతులమ్మ” (1943) సినిమాలో ఒక విలక్షణమైన పాత్ర పోషించి ప్రజాభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలు పొందారు లింగమూర్తి. భక్త పోతన (1943), స్వర్గసీమ (1945) సినిమాలో నటించడమే కాకుండా, ఆ చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా లింగమూర్తి పనిచేశారు. సాధన వారి “సంసారం” అనే సినిమాకు కొంతవరకు ఆయన దర్శకత్వం వహించి, ఆ తరువాత విరమించుకున్నారు. 1949 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికై తన సత్తాని నిరూపించుకున్నారని అప్పటి “చిత్రకళ పత్రిక” వారు 1949లో ప్రముఖంగా ప్రచురించారు.
నాటక రంగాన్ని ఏనాడూ విస్మరించలేదు..
ముదిగొండ లింగమూర్తి సహా నటులను మనస్ఫూర్తిగా గౌరవించేవారు, ప్రేమించేవారు కూడా. చిత్ర సాంకేతిక నిపుణుల సంఘం కార్యదర్శిగా కొంతకాలం ఆయన పనిచేశారు. 1957 సంవత్సరంలో సన్మాన సంఘానికి కార్యదర్శిగా ఉండి మద్రాసులో స్థానం నరసింహారావుని ఘనంగా సత్కరించారు. ప్రముఖ నటులు చిత్తూరు వి.నాగయ్యను బావ అంటూ సంబోధించేవారు లింగమూర్తి. భక్త పోతన వేషానికి నాగయ్య సరిపోతారా లేదా అనే సందిగ్ధ సమయంలో కె.వి.రెడ్డి కి ధైర్యం చెప్పి ఆ పాత్రకు నాగయ్యను ఎంచుకునేలా ఒప్పించారు లింగమూర్తి.
పోతన సినిమా విజయం సాధించింది, నాగయ్యలో భక్త పోతనను చూసే భాగ్యం ఆంధ్ర ప్రజలకు కలిగించినది ముదిగొండ లింగమూర్తే అని అప్పట్లో అందరికీ తెలుసు. సినిమా నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తరువాత కూడా తన ఉన్నతికి, అభివృద్ధికి కారణమైన నాటక రంగాన్ని ఏనాడూ విస్మరించలేదు. తనకు అవకాశం లభించినప్పుడల్లా రంగస్థలంపై నటిస్తూనే వచ్చారు. పెడత్రోవలు పడుతున్న నాటకారంగాన్ని నిర్మొహమాటంగా ఆయన విమర్శించేవారు. రంగస్థలం అభివృద్ధికి ఆయన ఎంతగానో పాటుపడ్డారు. కల్లాకపటము, ఈర్ష ఎరుగని మహోన్నత వ్యక్తిని ముదిగొండ లింగమూర్తిలో చూడవచ్చు.
కైవల్యం…
నాటక రంగంలోనే కాదు, సినిమా రంగంలో కూడా గుణచిత్ర నటులు అని పిలిపించుకున్న అతికొద్ది మంది నటులలో లింగమూర్తి అగ్రస్థానంలో ఉంటారు. ఏ పాత్ర ధరించినా కేవలం పాత్ర మాత్రమే కనబడేది, కానీ అందులో లింగమూర్తి కనపడేవారు కాదు, పాత్ర మాత్రమే కనపడేది. అంతే కాకుండా నాటక రచయితగా కూడా లింగమూర్తి పేరు పొందారు. “పెళ్లిచూపులు”, “వెంకన్న కాపురం”, “త్యాగం” మొదలైన కొన్ని నాటికలు కూడా రచించారు. ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని నాటక సమాజాల వారు “వెంకన్న కాపురం” నాటికను ఒక దశాబ్దం పాటు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ప్రతీ పరిషత్తులోనూ వెంకన్న కాపురం నాటిక ఉండాల్సిందే. ఆ నాటికకు బహుమతులు గెలుచుకోవాల్సిందే.
నాటకరంకం మీద ఏకాగ్రతతో పాత్రలో లీనమై పాత్ర ఔచిత్యం గ్రహించి, పాత్ర పోషణ చేసుకుంటూ నటించే నటునికి, ఆ అనుభవంలో ఉత్తీర్ణుడై తరించే మార్గం అతనికి అలబడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా ఉపకరిస్తుంది. అందుకు రంగస్థలం ఒక దేవాలయం లాగా ఉపయోగపడుతుంది. ఆత్మకు మోక్షాన్ని కలిగించే మార్గంలో ఇదొకటి. తన నాటక జీవితమంతా సరిగ్గా ఇదే దృక్పథంతో లింగమూర్తిగారు గడిపారు. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో 1974 వ సంవత్సరంలో లింగమూర్తి అర్ధాంగి శివైక్యం పొందారు. ఆ సంఘటన లింగమూర్తి జీవన గమ్యాన్ని మార్చివేసింది. మనసా వాచా కర్మణా నటరాజుని విశ్వసించి, ఉపాసించిన నటరత్నం ముదిగొండ లింగమూర్తి నాటక రంగాన్ని పూర్తిగా వీడి ఆధ్యాత్మిక చింతనాపరులైనారు. దాంతో పూర్తిగా సత్యాన్వేషణలో సన్యాసి జీవితాన్ని స్వీకరించి, శేష జీవితాన్ని కాశీ పుణ్యక్షేత్రంలో విశ్వేశ్వరుని సన్నిధిలో గడిపిన ముదిగొండ లింగమూర్తి 24 జనవరి 1980 నాడు కైవల్యం పొందారు.












