Telugu News

మొంథా తుపాను నష్టంపై రైతులను ఆదుకుంటాం: పవన్ కళ్యాణ్ 

మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.38 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లగా, ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తుపాను కారణంగా నష్టపోయిన 56 వేల మంది రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి, కోడూరు మండలం ఇస్మాయిల్‌బేగ్‌పేటలోని ఆర్‌సీఎం చర్చి వద్ద 33 ఎకరాల్లో 15 మంది కౌలు రైతులు సాగు చేస్తున్న, తుపాను ధాటికి నేలకొరిగిన వరి పంటలను పరిశీలించారు.

మోకాలి లోతు బురద ఉన్న పొలంలోకి స్వయంగా దిగి, రైతులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లోని రైతులు, చిరు వ్యాపారులు మరియు గ్రామస్థులతో మాట్లాడి వారి కష్టాలను ఆలకించారు. అనంతరం, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించిన సహాయక చర్యల వివరాలు, వివిధ శాఖల (విద్యుత్తు, మత్స్య, పశుసంవర్ధక) అధికారులు తుపాను పరిస్థితులను ఎదుర్కొన్న తీరు, మరియు జిల్లాలో సంభవించిన ఆస్తి నష్టం వివరాలను ఆయన సమీక్షించారు.

ప్రభుత్వ సన్నద్ధత, ఉపశమన చర్యలు

తుపాను తీవ్రత ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో కూడిన దిశానిర్దేశం, మరియు ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు జిల్లాలను అప్రమత్తం చేయడం వల్ల భారీ నష్టాన్ని తగ్గించగలిగామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు, తీర ప్రాంతాల నుండి 1.16 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని చెప్పారు. తుపానుకు తీవ్రంగా ప్రభావితమైన 1,583 గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించడానికి క్లోరినేషన్, శానిటేషన్ పనులు చేపట్టేందుకు జిల్లాల వారీగా 21,055 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అలాగే, పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన వారికి ఇళ్లకు తిరిగి వెళ్లేలోపు నిత్యావసర సరకులతో పాటు రూ. 3000 చొప్పున అందిస్తామని ప్రకటించారు.

మౌలిక వసతులు, అధికారుల ప్రశంస

మౌలిక వసతుల కల్పనలో భాగంగా, సముద్ర కోతకు గురై దెబ్బతిన్న ఎదురుమొండి-గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ. 13.08 కోట్లు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కోడూరు మండల పరిధిలో సముద్రకట్టపై దెబ్బతిన్న అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ నిర్మాణాన్ని నాబార్డు సాయంతో పూర్తి చేస్తామన్నారు. దివిసీమలో కోతకు గురయ్యే ప్రాంతాలను త్వరలో ప్రత్యేకంగా వచ్చి పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, నాగాయలంక మండలం సంగమేశ్వరం సమీపంలోని పాతఉపకాలిలంకలో తుపానులో చిక్కుకున్న 910 గొర్రెలు మరియు నలుగురు కాపర్లను రక్షించడంలో నిబద్ధతతో విధులు నిర్వహించిన పశు వైద్యురాలు మౌనికను ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి చొరవతో దివిసీమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావోద్వేగం వ్యక్తం చేశారు.

Show More
Back to top button