
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, అర్హులైన వర్గాలకు శుభవార్త అందించింది. టిడ్కో ఇళ్లు, గృహనిర్మాణ శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పూర్తయిన ఇళ్లకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా రానున్న ఉగాది పండుగ నాటికి ఏకంగా ఐదు లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, ఎన్నికల హామీ మేరకు అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని, మొత్తం 20 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసేలా అధికారులు అత్యంత వేగంగా పనిచేయాలని ఆయన సూచించారు.
సమావేశంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీలకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY)-1.0 పథకం కింద ఇళ్లు నిర్మించుకునే ముస్లింలకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీల మాదిరిగానే అదనంగా రూ. 50,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 18,000 మంది మైనార్టీ లబ్ధిదారులకు రూ. 90 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ అదనపు సాయం గురించి అర్హులంతా తెలుసుకొని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలని ఆయన ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు, ఆలస్యం కాకూడదు అని చంద్రబాబు అధికారులను స్పష్టంగా ఆదేశించారు.
ఇళ్ల పథకాల విషయంలో అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, సర్వే పనులు త్వరగా పూర్తి చేసి అర్హుల తుది జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారికి స్థలం కేటాయించడం, స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకుంటామని చెబితే వారికి పొసెషన్ సర్టిఫికెట్లు అందించడం వంటి పనులు తక్షణం చేపట్టాలన్నారు. నిర్మాణ పురోగతికి సంబంధించిన అప్ డేట్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పారదర్శకంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. దీంతోపాటు, నిలిచిపోయిన ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం బిల్లులను విడుదల చేయించి, ఆ బిల్లులు ఎందుకు నిలిచిపోయాయో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని కూడా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.






