Telugu News

 ‘స్వర్ణగ్రామం’గా.. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు! 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పేరును ఇకపై ‘స్వర్ణగ్రామం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని, సామాజిక పెన్షన్లను ప్రతి నెలా ఒకటో తేదీనే అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రూ. 14 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు, పేదల అభ్యున్నతి కోసం పీ4 (P4) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, పీపీపీ విధానంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని, అందులో 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా ఉంటాయని స్పష్టం చేశారు. రుషికొండ ప్యాలెస్ వంటి నిర్మాణాలపై వృథా చేసిన నిధులను ప్రజా ప్రయోజనాలకు వాడితే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు డేటా డ్రివెన్ గవర్నెన్స్ అవసరమని అధికారులకు సూచించారు. అధికారుల పనితీరును విశ్లేషించేందుకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల త్రైమాసిక ఫలితాలను విద్యార్థుల పరీక్ష ఫలితాల్లా గమనిస్తానని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, 17 కీలక రంగాల్లో (Verticals) పురోగతి సాధించినప్పుడే జీఎస్డీపీ పెరుగుతుందని స్పష్టం చేశారు.

ముఖ్యంగా లైవ్ స్టాక్, మాన్యుఫాక్చరింగ్, ఫిషింగ్ వంటి రంగాలపై కలెక్టర్లు దృష్టి సారించాలని, జిల్లా స్థాయిలోనే పక్కా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు చేయూతనిస్తామని, వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి అధికారుల పనితీరులో గణనీయమైన మార్పు (Quantum Improvement) కనిపించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Show More
Back to top button