
ప్రతి సంవత్సరం జనవరి 26 వస్తే చాలు.. గల్లీ గల్లీలో జెండాలతో తోరణాలు కట్టి, ఆఫీసులు, స్కూళ్లలో జెండాలను ఎగురవేస్తాము. ఈ రోజు దేశ రాజధానిలో రాష్ట్రపతి జెండా ఎగురవేయగా (ఎర్రకోటపై ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎగురవేస్తారు), గొప్ప పరేడ్ నిర్వహిస్తారు. దేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించిన బ్రిటిష్ వారి నుండి 15 ఆగస్టు 1947న మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1950 జనవరి 26 వరకు భారతదేశానికి స్వంత రాజ్యాంగం లేదు.
దేశాన్ని పాలించడానికి సరైన చట్టం అవసరమని గుర్తించి.. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ‘రాజ్యాంగ ముసాయిదా కమిటీ’ని ఏర్పాటు చేశారు. సుమారు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల సుదీర్ఘ చర్చలు, మార్పుల అనంతరం, 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఈ ముసాయిదాను ఆమోదించింది. చివరకు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండి మన దేశం ఒక ‘గణతంత్ర దేశం’గా అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజున ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సైనిక పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు జరుపుకుంటాము.
భారత రాజ్యాంగంపై సభ్యుల సంతకాలు, తుది ఆమోదం 1950 జనవరి 24నే పూర్తయినప్పటికీ.. రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26నే అమలులోకి తేవడం వెనుక ఒక గొప్ప చారిత్రక కారణం ఉంది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ‘పూర్ణ స్వరాజ్’ (సంపూర్ణ స్వాతంత్ర్యం) తీర్మానాన్ని ప్రకటించింది. ఆ రోజును గుర్తుచేసుకుంటూ, దేశ స్వాతంత్ర్య కాంక్షకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యాంగ అమలుకు అదే తేదీని ఖరారు చేశారు. ఈ రోజు మనకు కేవలం పండుగ మాత్రమే కాదు, పౌరులుగా మన హక్కులు, విధులను గుర్తుచేసే సందర్భం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ, కులమతాలకు అతీతంగా దేశమంతా ఐక్యంగా ఈ వేడుకను జరుపుకుంటుంది. ఇది బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది, మనల్ని మనమే పరిపాలించుకునే సత్తాను చాటిచెప్పిన రోజు.






