Telugu News
Trending

పాలనలో ‘రియల్ టైమ్’ మ్యాజిక్: సంజీవని నుండి అమరావతి వరకు.. గేట్స్ మెచ్చిన బాబు వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశాబ్దాల క్రితం సాకారం చేసిన సాంకేతిక విప్లవం, నేడు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ప్రశంసలు అందుకునే స్థాయికి చేరింది. సోమవారం(ఫిబ్రవరి 16) అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్, పాలనలో ఏపీ వాడుతున్న అత్యాధునిక సాంకేతికతను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించడం, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సామాన్యుడి ముంగిటకే ప్రభుత్వ సేవలను చేర్చడం వంటి వినూత్న ప్రయోగాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈ డిజిటల్ పరివర్తన పౌర సేవలను సులభతరం చేయడమే కాకుండా, పారదర్శకతను పెంచుతోందని గేట్స్ కొనియాడారు.

ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం, ఖచ్చితత్వం కోసం ‘అవేర్ 2.0’ ద్వారా రియల్ టైమ్ సమాచారాన్ని సేకరిస్తున్న తీరును బిల్ గేట్స్ ప్రత్యేకంగా పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIs) ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న విధానాన్ని చంద్రబాబు ఆయనకు వివరించారు. ముఖ్యంగా ప్రాపర్టీ రికార్డుల భద్రతపై బిల్ గేట్స్ ఆరా తీయగా.. బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు క్యూఆర్ కోడ్ విధానాలతో భూ రికార్డులను అత్యంత సురక్షితంగా భద్రపరుస్తున్నామని అధికారులు తెలిపారు. సాంకేతికతను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పారదర్శకతకు మారుపేరుగా మార్చడం అద్భుతమని గేట్స్ ప్రశంసించారు.

ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చిత్తూరు జిల్లాలో అమలవుతున్న ‘సంజీవని’ ప్రాజెక్టుపై బిల్ గేట్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పం వంటి ప్రాంతాల్లో ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి, వారి జీవనశైలికి తగిన సలహాలు ఇస్తున్న తీరును చూసి ‘నైస్’ అంటూ కితాబిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రజారోగ్య సేవలను మరింత చేరువ చేయాలన్న ఏపీ ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన అభినందించారు. అనంతరం అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలను కూడా చంద్రబాబు వివరించగా.. ఒక ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిని నిర్మిస్తున్న తీరు ‘గ్రేట్ వర్క్’ అంటూ బిల్ గేట్స్ ప్రశంసల జల్లు కురిపించారు.

Show More
Back to top button