భారతదేశ తూర్పు తీరాన ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు అపూర్వమైన పారిశ్రామిక విప్లవానికి వేదికగా మారింది. అపారమైన మేధస్సు, కష్టపడే తత్వం ఉన్న ఈ గడ్డ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో ‘ఉత్తమ ఆంధ్ర’గా రూపాంతరం చెందుతోంది. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఇప్పుడు పెట్టుబడుల ప్రవాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్‌లుగా మారాయి. వలసలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు ప్రధాన చిరునామాగా మారుతుండటం గమనార్హం.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మౌలిక వసతులు:
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే గ్లోబల్ ప్రాజెక్టులు ఇప్పుడు శరవేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మకుటాయమానమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై 2026 నాటికి అందుబాటులోకి రానుంది. దీని చుట్టూ ఏరోసిటీ, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుతో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న మూలపేట పోర్టు నవంబర్ 2026 నాటికి పూర్తికానుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి కేంద్రంగా మారి ఉత్తరాంధ్ర వాణిజ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనుంది. విశాఖపట్నం ఇప్పటికే స్టీల్ ప్లాంట్, పోర్టులు, ఫార్మా సిటీలతో దక్షిణ భారతదేశంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా అవతరించింది.
పెట్టుబడుల వెల్లువ – ఐటీ, స్టీల్ రంగాల్లో విప్లవం:
విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అదానీ గ్రూప్ భారీ డేటా సెంటర్ తో పాటు, గూగుల్ సంస్థ ఆనందపురం మండలం తర్లవాడలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా హబ్ మరియు డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి ఈ నెల 28న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఐటీ దిగ్గజం TCS ఇప్పటికే తన కార్యకలాపాలు ప్రారంభించగా, ఇన్ఫోసిస్, ఏఎన్ఎస్ఆర్ వంటి సంస్థలు కూడా తోడయ్యాయి. మరోవైపు, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ రూ. 60,000 కోట్ల పెట్టుబడితో భారీ స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. అలాగే అచ్యుతాపురం సెజ్‌లో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రూ. 5,400 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
విద్వంసం తర్వాత పునర్నిర్మాణం:
గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం 24 శాతానికి పెరిగి రాష్ట్రం కుదేలైన పరిస్థితుల్లో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నింపింది. కేవలం 22 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రావడం ఒక రికార్డు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతంగా ఉండటం గమనార్హం. పరిశ్రమలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టుల్లో పిటిషన్లు వేసినా, న్యాయస్థానాలు ప్రభుత్వ విధానాలను సమర్థించాయి. పరిశ్రమలకు భూములు, రాయితీలు ఇవ్వకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మొత్తానికి, భోగాపురం నుంచి మూలపేట వరకు, విశాఖ ఐటీ హిల్స్ నుంచి నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వరకు సాగుతున్న ఈ ప్రస్థానం ఉత్తరాంధ్ర భవిష్యత్తును స్వర్ణమయం చేయనుంది. పారదర్శక పాలన, పారిశ్రామిక రాయితీలు మరియు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ‘పారిశ్రామిక మహోదయం’ దేశానికే ఆదర్శంగా నిలవబోతోంది. దీనివల్ల ఉత్తరాంధ్ర కేవలం వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపివేసి, నవ్యాంధ్ర ప్రగతికి అసలైన దిక్సూచిగా అవతరిస్తోంది.
మరిన్ని వార్తలు:
ఏపీ విద్యారంగంలో సరికొత్త చరిత్ర.. అమరావతి లో ప్రపంచ స్థాయి ఏఐ హబ్
ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే. స్వర్ణాంధ్ర-2047 విజన్!










