NRI News

హెచ్‌-1బీకి బ్రేక్‌.. గ్రీన్‌కార్డుకు కొత్త దారి

హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు హెచ్‌-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ టిమ్ షీహీ ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఆయన అమెరికా సెనెట్‌లో ప్రవేశపెట్టారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ అలెక్స్ పాడిల్లా మాత్రం వలసదారులకు అనుకూలంగా మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. హెచ్‌-1బీ వీసాదారులతో పాటు అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాలుగా నివసిస్తున్న వలసదారులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. దీంతో చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

పాడిల్లా గత ఏడాది ‘ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929లో వలస నిబంధనల పునరుద్ధరణ’ పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమెరికా చట్టాల ప్రకారం 1972 జనవరి 1కి ముందు దేశంలోకి వచ్చిన కొంతమందికి మాత్రమే ప్రత్యేక నిబంధనల ద్వారా శాశ్వత నివాసం పొందే అవకాశం ఉంది. ఈ తేదీని మార్చి, కనీసం ఏడు సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న వారికి కూడా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని పాడిల్లా ప్రతిపాదిస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే వ్యక్తులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండకూడదు. వారు అమెరికాలో చట్టబద్ధంగా జీవిస్తూ, పని చేస్తూ, పన్నులు చెల్లిస్తూ ఉండాలి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపశమనం లభించవచ్చు.

వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలకు ప్రత్యామ్నాయంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు పాడిల్లా తెలిపారు. ఎన్నో కుటుంబాలు చాలా కాలంగా అమెరికాలోనే నివసిస్తూ అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. కానీ సరైన చట్టపరమైన మార్గం లేకపోవడం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వలసదారుల పాత్ర చాలా ముఖ్యమని, వారిని కాంగ్రెస్ విస్మరించకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. కాంగ్రెస్‌లో ఆమోదం పొందడంతో పాటు అధ్యక్షుడి సంతకం కూడా అవసరం. అయినప్పటికీ, ఈ ప్రతిపాదనపై చర్చ మొదలవడం హెచ్‌-1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారిలో కొత్త ఆశలు కలిగిస్తోంది.

Show More
Back to top button