Telugu Special Stories

ఒక కృషి, ఒక పట్టుదల, ఒక నమ్మకం వెరసి విజయం.. రామోజీరావు.

ఒక కృషి, ఒక పట్టుదల, ఒక నమ్మకం వెరసి విజయం.. ఇట్టి వ్యాపార సూత్రాలను అవలంభించిన ఏ ఒక్కరూ కూడా వ్యాపారంలో గానీ, నిజ జీవితంలో గానీ ఓడిపోయిన సందర్భాల కంటే విజయాలు సాధించిన దాఖలాలే ఎక్కువ. అదే కోవకు చెందినవారు ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు. చిన్నతనంలోనే పాఠశాలలో తన పేరును రామయ్య నుండి రామోజీరావుగా మార్చుకున్నప్పుడే తన తెలివికి ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతైంది. చిన్నప్పుడే పనిలో తల్లికి సహాయం అందించడం, వ్యవసాయ పనులలో తోడుండడం, కష్టపడి చదువుకోవడం, ప్రతీ విషయాన్నీ భిన్నంగా అలోచించడం, ఢిల్లీలో ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చి మార్గదర్శి చిట్స్ స్థాపించడం ఇలా ఒక్కొక్క వ్యాపార సామ్రాజ్యన్ని విస్తరిస్తూ విజయపథంలో దూసుకెళ్లడం తనకు మాత్రమే సాధ్యం అనిపించేలా తన జీవితాన్ని మలుచుకున్న తీరు అద్భుతం అనే చెప్పాలి. విజయాలను ముద్దాడే క్రమంలో తాను ఎదుర్కొన్న చిక్కులు, తాను పడ్డ ఇబ్బందులు, ముళ్ల దారులను దాటుకుంటూ పూల బాటలలో నడవడానికి, విజయ సోపానాలను అందుకోవడానికి తాను ఎంచుకున్న మార్గాలు అద్వితీయం అనే చెప్పాలి.

రామోజీరావు విజయానికి కృషి పట్టుదలే పునాది

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు, ఎంతో ఆలోచన, అద్భుతమైన వ్యూహం, అలుపెరుగని కష్టం, ఎనలేని కృషి, మొక్కవోని పట్టుదలతో ఎందరో వ్యాపారులకు ఆదర్శంగా నిలిచిపోయారు.  తన ఆలోచనతో రాయిని రత్నంగా మార్చేవారు, తన నైపుణ్యంతో శిలను శిల్పంగా చెక్కేవారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని అయినా సరే తనకు సానుకూలంగా మలుచుకోవడం ఎలాగో తెలిసిన మహర్షి రామోజీరావు. భాగస్వామ్యంతో ప్రారంభించిన వసుంధర ఫర్టిలైజర్ అనే ఎరువుల వ్యాపారంలో నష్టాలు వచ్చినా భాగస్వాముల డబ్బులు వెనక్కి ఇచ్చి తరువాత రోజులలో భాగస్వామ్యం లేని వ్యాపారం చేసి విజయం సాధించిన ఘనత తనకు మాత్రమే చెల్లింది. తనకు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగతూ, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. తాను ఏ రంగంలో అడుగు పెట్టినా ఆయన అత్యున్నత స్థాయికి చేరేదాకా పట్టు విడవకపోవడం రామోజీరావుకు సహజగుణమనే చెప్పాలి. మధ్యాహ్నానికి వచ్చే వార్త పేపరును ఉదయమే అందేలా చేసి వ్యాపారంలో తాను నమ్మిన దారిలో జట్టును నడిపించగల సమర్థత, కార్యదక్షత కలిగిన నాయకుడిగా పేరుపొందిన రామోజీరావు ప్రస్థానం ఇలా సాగింది.

నేపథ్యం…

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రుకి ఐదు కిలోమీటర్ల దూరంలో పెరిశేపల్లి అన్న గ్రామానికి చెందిన చెరుకూరి రామశేషయ్య దంపతులు ఉండేవారు. రామశేషయ్య దంపతులు అక్కడినుండి ఐదు కిలోమీటర్ల వలస వెళ్లి గుడివాడకు దగ్గరలో ఉన్న పెదపారుపూడి వెళ్లారు. వారికి సుబ్బారావు, వెంకటసుబ్బమ్మ అనే కొడుకు కోడలు ఉన్నారు. వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండే వాళ్లకి ఇద్దరు అమ్మాయిలు. రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. రెండో అమ్మాయి తరువాత ఏడు ఎనిమిది సంవత్సరాలకు ఒక అబ్బాయి పుట్టాడు. 16 నవంబరు 1936 నాడు ఆ కుర్రవాడు పుట్టడానికి 13 రోజులు ముందే రామశేషయ్య చనిపోయారు. అయితే తండ్రి మీద ఉన్న మమకారంతో రామశేషయ్య పేరును తన కొడుకుకి పెట్టుకున్నారు వెంకట సుబ్బారావు. అయితే పాఠశాలలో తన పేరును రామయ్య బదులు రామోజీరావు అని రాయించుకున్నాడు ఆ కుర్రాడు. 

తన పేరు ముసలాయన పేరు ఒకేలా ఉన్నందున పాఠశాలలో మార్చుకున్నట్టు తండ్రితో చెప్పారు. ఐదేళ్ల వయస్సు నుండే విభిన్నంగా ఆలోచించడం  తనకు అలవాటయింది. కుర్రాడిని పాఠశాలలో ఎవరైనా రామయ్య అని పిలిచినా గాని చక్కగా బదులిచ్చేవాడు గానీ కోప్పడే వాడు కాదు. పెదపారుపూడి ఊళ్ళోనే ప్రాథమిక విద్య పూర్తిచేసిన తరువాత దగ్గరలోనే ఉన్న గుడివాడ మున్సిపల్ పాఠశాలలో 1951 లోనే ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశాడు. ఒకవైపు పాఠశాల చదువుకుంటూనే మరోవైపు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తరువాత అమ్మకు ఇంటి పనులు సాయం చేస్తూ ఉండేవాడు. బావిలో నుండి నీళ్లు తోడి మొక్కలకు పోయడం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. వారికి పాలేరులు ఉండటం వలన పొలం పనులు చేసేవాడు కాదు గానీ వ్యవసాయం అంటే చిన్నప్పటినుంచి తను ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు.

ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం…

1951 వ సంవత్సరంలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యాక గుడివాడలో ఉన్న డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ మరియు బీఎస్సీ పూర్తి చేశాడు రామోజీరావు. కళాశాలలో చదివే రోజులలోనే ఆయన కమ్యూనిజంపై ఆసక్తి పెంచుకున్నాడు. అయన అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో కార్డు హోల్డర్ కూడా. డిగ్రీ పూర్తి అయ్యాక ఆయన ఉద్యోగ వేటలో పడిన ఆయన బిలాయిలో ఇంటర్వూకి ప్రయత్నం చేశారు. కానీ అందులో తాను ఎంపిక అవ్వలేదు. చిన్నప్పటినుండి రామోజీరావుకు పట్టుదల ఎక్కువ. ఏ పనినైనా చేపడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ విశ్రమించని తత్వం తనది. ఇలా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం వల్ల తనకు అవమానంగా తోచింది.

దాంతో ఉద్యోగం కన్నా కూడా ఆయనకు ఎప్పటికైనా వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే లక్ష్యం బలంగా ఉండేది. అలా ఆయన లక్ష్యం నెరవేరి, ప్రస్తుతం ఆ సంస్థలో పనిచేసే వారు సుమారు పాతికవేలమంది వరకు ఉన్నారు. అలా అప్పటి నుండి ప్రస్తుత సంస్థ వరకు ఎదగడానికి తనకు చాలా సోపానాలు ఉన్నాయి. బిలాయి ఇంటర్వ్యూలో తప్పిన తరువాత ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. యాడ్ ఏజెన్సీలో ఆర్ట్ ఉద్యోగిగా తనకు ఉద్యోగం వచ్చింది. యాడ్ ఏజెన్సీలో యజమానిగా ఉన్న అనంత్ అనే వ్యక్తి మలయాళీ. అయన దగ్గర యాడ్ ఏజెన్సీలో పనిచేసేటప్పుడు రామోజీరావు వ్యాపారంలో ఉండే మెలకువలను అధ్యయనం చేయడం ప్రారంభించారు.

తాతినేని రమాదేవి తో వివాహం…

1960 ప్రాంతంలో ఢిల్లీలో తాను పనిచేసేటప్పుడే తనకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అయితే దానికి కూడా అయన వదిలేసుకున్నారు. అయన అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే 19 ఆగస్టు 1961 నాడు పెనమలూరు కు చెందిన తాతినేని రమాదేవితో వివాహం అయ్యింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. కానీ ఆమె పాఠశాలలో చేరేటప్పుడు రమాదేవి అని పేరు మార్చుకున్నారు. రామోజీరావు, రమాదేవి దంపతులు పెద్దలు పెట్టిన పేరు మార్చుకోవడం కాకతాళీయంగా జరిగిపోయింది. అప్పటికి వయస్సు పరంగా రామోజీరావుకు 25 సంవత్సరాలు కాగా, రమాదేవి వయస్సు 20 సంవత్సరాలు. పెళ్లయిన రామోజీరావు దంపతులు ఢిల్లీలో తెలుగు వారు ఉండే కరోల్ బాగ్ లోనే నివాసం ఉన్నారు.

మార్గదర్శి చిట్స్ ప్రారంభం…

రామోజీరావు ఒక సంవత్సరం తరువాత ఢిల్లీలో ఉద్యోగం మానేసి హైదరాబాదుకు వచ్చేసారు. హిమాయత్ నగర్ లో నెలకు 85 రూపాయల అద్దెకు తీసుకున్నారు. వారికి 21 మే 1962 నాడు పెద్దబ్బాయి కిరణ్ జన్మించారు. వారు హైదరాబాదు రాగానే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. తన 26 సంవత్సరాల వయస్సులో అక్టోబరు 1962లో  మార్గదర్శి చిట్ ఫండ్ మొదలుపెట్టారు. చిట్స్ అనేవి ఆడవారు చేసే పని కాబట్టి దీనికోసం కంపెనీ పెట్టడమేమి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రామోజీరావుకు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకోవడం, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనుదిరుగకపోవడం అలవాటు. అందుకే ఒకసారి మార్గదర్శి ప్రారంభించాక ఎవరేమన్నా ఆయన పట్టించుకోలేదు. మొట్టమొదటి నుంచి ఆయన అభివృద్ధి చేసుకున్న వ్యాపార సూత్రాలు, వినియోగదారుల పట్ల గౌరవం, వాళ్లకు నమ్మకం ఇవ్వడం, సంస్థ పట్ల క్రమశిక్షణ, చేసే ప్రతీ పనిలోనూ అంకితభావం మెండుగా ఉండేవి. హిమాయత్ నగర్ లో మార్గదర్శి కార్యాలయం ఉండేది. ఇద్దరు ఉద్యోగస్తులతో ప్రారంభమైంది రామోజీరావు వ్యాపార సామ్రాజ్యం.

నష్టాలతో ముగిసిన ఎరువుల వ్యాపారం…

మార్గదర్శి చిట్స్ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉండగానే మరో మూడేళ్ల తరువాత 1965 వ సంవత్సరంలో “కిరణ్ యాడ్స్ ఏజెన్సీ కంపెనీ” ని మొదలుపెట్టారు రామోజీరావు. ఆయన ప్రారంభించిన వ్యాపార సామ్రాజ్యంలో ముందుగా ప్రారంభించిన యాడ్ ఏజెన్సీ తప్ప మిగతా వ్యాపారాలు అన్నీ కూడా ఆయనకు మొట్టమొదటి ప్రయోగాలే. రామోజీరావు దంపతులకు 23 డిసెంబరు 1967 నాడు రెండో అబ్బాయి సుమన్ జన్మించారు. మార్గదర్శి చిట్స్ మరియు కిరణ్ యాడ్స్ రెండు వ్యాపారాలు నడుస్తుండగానే 1967 వ సంవత్సరంలో ఖమ్మంలో నలుగురు భాగస్వాములతో కలిపి “వసుంధర ఫర్టిలైజర్స్” అనే పేరుతో ఎరువుల వ్యాపారం మొదలుపెట్టారు.  దక్షిణ భారత హిందీ ప్రచార సభలో పనిచేస్తున్న అట్లూరి రామారావును ఆహ్వానించి ఎరువులు వ్యాపారికి పర్యావేక్షకుడిగా (ఇన్చార్జి) చేశారు. అప్పుడు అన్నీ కరువు రోజులు కావడంతో డబ్బులు వసూలు చేసుకోవడం కష్టంగా ఉండేది. దాంతో ఆ వ్యాపారాన్ని రెండేళ్లకే నష్టాలతోఎరువుల వ్యాపారం మూసేయాల్సి వచ్చింది. మిగతా నలుగురు భాగస్వాములకు ఎవరి పెట్టుబడి వారికి ఇచ్చేసి నష్టం మాత్రం తాను ఒక్కడే భరించారు రామోజీరావు. ఆ తరువాత ఎప్పుడు కూడా రామోజీరావు భాగస్వామి వ్యాపారాలు చేసిన దాఖలాలు లేవు.

సతీమణి ఎం.డి గా ఇమేజెస్ సంస్థ ప్రారంభం…

రైతులకు, వ్యవసాయానికి దగ్గరగా ఉండాలని ప్రారంభించిన ఎరువుల వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలి అన్న ఆలోచన మాత్రం ఆయన మానుకోలేదు. దాని ఫలితంగానే జనవరి 1969 సంవత్సరంలో ప్రారంభమైనది “అన్నదాత”. అప్పట్లో ప్రత్యేకంగా రైతుల కోసం చాలా సంవత్సరాల కిందట 20 వ శతాబ్దంలో ఒకటి, రెండు పత్రికలు వచ్చాయి. కానీ అవి ఒక సంవత్సరం మించి నడవలేదు. 1969 సంవత్సరాలలో పత్రిక అంటే సినిమాలు, సాహిత్యం మాత్రమే అంశాలుగా ఆలోచించేవారు పాఠకులు. కానీ రైతులకు మాత్రం ఒక పత్రిక అవసరమనే ఒక ఊహ మాత్రం కూడా ఊహించలేదు. విజేతలు విభిన్నంగా ఆలోచిస్తారు అనడానికి “అన్నదాత” పత్రిక ఒక ఉదాహరణ. అప్పట్లో దాని వెల ఒక్క రూపాయితో ప్రారంభమై కొన్ని నెలలకే రైతులకు ఆత్మబంధువు అయిపోయింది అన్నదాత పత్రిక. ఆ విధంగా రామోజీరావు పత్రిక రంగంలో వేసిన తొలి అడుగే విజయపథం అయిపోయింది. అయితే వాస్తవానికి రామోజీరావుకు పత్రికా రంగంలో అప్పటివరకు అనుభవం లేదు. కానీ ఆయన తనకున్న మౌలికమైన సదుపాయాలు, ముందు చూపు, నిబద్ధత, క్రమశిక్షణ ఇలాంటి వాటితో పత్రికను పాఠకులకు ఎంత దగ్గర చేయాలో ప్రయోగాలు చేసి ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం 26 నవంబరు 1974 నాడు తన సతీమణి ప్రధాన నిర్వాహక అధికారి (ఎం.డి) గా ఇమేజెస్ అనే అవుట్ డోర్ సంస్థను ప్రారంభించారు.

వ్యాపారంలో వైవిధ్య ఆలోచన సరళి…

1970 సంవత్సరాలు వచ్చేసరికి రామోజీరావు వ్యాపార ప్రగతిని సమీక్షిస్తే అప్పటికి ఆయన వయసు 34 సంవత్సరాలు మాత్రమే. ఒకవైపు వసుంధర ఫెర్టిలైజర్స్ నష్టాలతో మూతపడింది. మార్గదర్శి చిట్ ఫండ్స్, కిరణ్ యాడ్స్, అన్నదాత, ఇమేజెస్ ఇలా నాలుగు వ్యాపారాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆ సమయంలో రామోజీరావుకు హోటల్ స్థాపించాలనే ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా ఆలోచిస్తే రామోజీరావు గారి వ్యాపారంలో వైవిధ్యీకరణ కనిపిస్తుంది. ఏ ఒక్క వ్యాపారం కూడా ఒకదానికొకటి పొంతన ఉండదు. రాబోయే అవకాశాలను ముందుగానే అంచనా వేయడం విజయవంతమైన ఒక వ్యాపారవేత్త ఉండాల్సిన లక్షణం. అది రామోజీరావులో పుష్కళంగా ఉంది. ఆ క్రమంలో విశాఖపట్నం నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని రామోజీరావు ముందుగానే ఊహించారు. అప్పటికి విశాఖపట్నంలో మంచి హోటల్ అంటే అప్సర మరియు మరో రెండు హోటల్స్ మాత్రమే ఉన్నాయి. జగదాంబ సెంటరులో మంచి హోటల్స్ లేవు. ఆ సమయంలో దాబా గార్డెన్స్ లో ఒక స్థలం తీసుకుని అక్కడ హోటల్ నిర్మాణం చేయాలని 1972 ప్రాంతంలో ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆయన ముందుగా సన్ భీమ్ హోటల్ అని మొదలుపెడదాం అనుకున్నారు. కాకపోతే అప్పటికే ఆ హోటల్ వేరే వాళ్లకు నమోదు అయ్యింది. దాంతో డాల్ఫిన్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుతో హోటల్ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈనాడు కు బీజం…

హోటల్ పని కోసం రామోజీరావు తరుచూ విశాఖపట్నం వెళ్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఆయన విశాఖపట్నంలో బస చేస్తూ ఉండేవారు. సహజంగానే అన్నిరకాల వ్యాపారాలు చేసే రామోజీరావుకు వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంది. అప్పటికే తెలుగులో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక అనే మూడు పత్రికలు కూడా విజయవాడలోనే ముద్రణ అవుతూ ఉండేవి. ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ పత్రికలు మద్రాసు నుండి వచ్చేవి. విశాఖలో మధ్యాహ్నానికి గానీ వార్తా పత్రికలు వచ్చేవి కావు. ఈ విషయాన్ని రామోజీరావు గమనించారు. విశాఖపట్నంలో వార్తాపత్రిక ప్రచురణ ఉంటే  ఎలా ఉండేది అనే ఆలోచన రామోజీరావులో మొదలైంది.

ఆ క్రమంలో విశాఖపట్నం ప్రయాణం వస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి, అప్సర హోటల్స్ వ్యవస్థాపకులు కే.ఎల్.ఎన్.రావు తారసపడడం జరిగింది. ఆ క్రమంలో రామోజీరావు ఆయనను విశాఖపట్నం నుండి కూడా వార్తాపత్రికను తీసుకురావచ్చు కదా అనే అభ్యంతరాన్ని తనతో వ్యక్తం చేశారు. అప్పుడు దానికి గల పరిమితుల గురించి కే.ఎల్.ఎన్.రావు చెప్పి పెదవి విరిచారు. అయితే మనమే ఎందుకు దినపత్రిక ప్రచురించకూడదు అనే ఆలోచన రామోజీరావుకు వచ్చింది. అందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా పనిచేసే యంత్రాంగం కావాలి. ఏదైనా చేయకుండా ఉండాలంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి, కానీ ఏదైనా సాధించాలనుకుంటే కావలసింది సంకల్పం, పట్టుదల, వ్యాపార నైపుణ్యం. దాంతో ప్రాజెక్టు లైన్ సిద్ధం చేసి ఈనాడు పత్రికకు బీజం వేశారు.

అప్పటి దినపత్రికలన్ని కూడా “ఆంధ్ర” అనే పేరుతో మొదలై ఉండేవి. అయితే కొత్తగా అనిపించాలంటే పేరు కూడా కొత్తగా ఉండాలి అని అనుకున్న రామోజీరావుకు స్ఫురించిన పేరు “ఈనాడు”. నిన్న అంటే చరిత్ర అయిపోయింది, రేపు అంటే భవిష్యత్తు ఇంకా రాలేదు, ఈనాడు అంటే ఇప్పుడు నడిచే వర్తమానం. ఇదే వార్త అంటే. ఆ విధంగా ఈనాడు పేరును సార్ధకం చేసుకుంటూ, ఈనాటి వార్తలు ఈనాడులో ఉండాలి. చద్ది వార్తలకు స్థానం లేదనే సిద్ధాంతాన్ని ముందు నుంచి అమలుపరిచారు రామోజీరావు.

Show More
Back to top button