Telugu Special Stories

చేతుల్లోకి పెద్ద వ్యాపారాలు.. ‘మహిళాశక్తి’తో తెలంగాణలో మారుతున్న లెక్క

మహిళలు అంటే చిన్నచిన్న పొదుపులు చేసుకోవడం, ఇంట్లో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడం వరకే పరిమితం అనే రోజులు పోతున్నాయి. ఇప్పుడు అదే మహిళలు బస్సులు కొనుగోలు చేస్తున్నారు.. పెట్రోల్‌ బంకులు నడుపుతున్నారు.. సౌర విద్యుత్‌ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. అంటే ఉద్యోగం చేయడం మాత్రమే కాదు.. ఏకంగా వ్యాపారాలకు యజమానులుగా మారుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహిళాశక్తి’ కార్యక్రమం ద్వారా ఈ మార్పు కనిపిస్తోంది.

‘మహిళాశక్తి’తో మహిళలకు పెద్ద వ్యాపార అవకాశాలు

రాష్ట్రంలో 6.64 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 75 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలకు చిన్న మొత్తాల్లో ఆదాయం వచ్చే పనులు కల్పించడం కంటే.. పెద్ద స్థాయిలో సంపాదించే అవకాశాలు కల్పిస్తే పరిస్థితి ఎలా మారుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు వ్యాపార అవకాశాలు, రుణ సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తూ.. వాళ్లే యజమానులుగా నిలబడేలా ప్రోత్సహిస్తోంది. దీని వల్ల మహిళ చేతికి డబ్బు రావడం మాత్రమే కాదు.. కుటుంబంలో ఆమె నిర్ణయం తీసుకునే స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

మహిళాశక్తి బజార్‌తో రూ.62 కోట్ల వరకు ఆదాయం

ఈ మార్పు ఇప్పటికే కొన్ని చోట్ల కనిపిస్తోంది. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన మహిళాశక్తి బజార్‌లో 106 మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. అక్కడి అమ్మకాల ద్వారా ఏటా దాదాపు రూ.62 కోట్ల ఆదాయం వస్తోంది. ఖమ్మంలో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మహిళా మార్ట్‌ కూడా మంచి ఫలితాలు సాధించడంతో.. దాని తరహాలో మరో తొమ్మిది జిల్లాల్లో మహిళా సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

బస్సులకు యజమానులుగా మహిళా సంఘాలు

ఇక బస్సుల విషయంలో అయితే మహిళా సంఘాలకు వచ్చిన అవకాశం మరింత పెద్దది. సంఘాల పేరుతో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటివరకు 553 బస్సులు రోడ్డెక్కాయి. బస్సు నడపడానికి అవసరమైన డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీనే సమకూరుస్తోంది. అన్ని ఖర్చులు, జీతభత్యాలు పోయిన తర్వాత ఒక్కో బస్సుకు నెలకు రూ.70 వేల వరకు అద్దె ఆదాయం వస్తోంది. ఈ సంఖ్యను వెయ్యి బస్సులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మహిళా సంఘం సభ్యురాలు తానే బస్సు నడపాల్సిన అవసరం లేదు.. బస్సుకు యజమానిగా ఉండి దానిపై ఆదాయం పొందే అవకాశం కలుగుతోంది.

సోలార్ ప్లాంట్లతో కొత్త ఆదాయ మార్గం

ఇక విద్యుత్‌ రంగంలోకి కూడా మహిళా సంఘాలు అడుగు పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఒక మహిళా సంఘం ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో ఒక మెగావాట్‌ సామర్థ్యం ఉన్న సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్లాంట్లను వెయ్యి గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో మెగావాట్‌ ప్లాంటుకు ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తుంది. మొత్తం ఖర్చులో మహిళా సంఘాలు 10 శాతం భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణంగా అందిస్తాయి.

పెట్రోల్ బంకుల్లోనూ మహిళలే యజమానులు

పెట్రోల్‌ బంకుల విషయంలోనూ ఇదే తరహా అవకాశం వచ్చింది. నారాయణపేట, సంగారెడ్డిలో ఇప్పటికే రెండు బంకులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం భూమి కేటాయించగా, చమురు కంపెనీలు 99 ఏళ్ల నిర్వహణ ఒప్పందం చేసుకున్నాయి. బంకుకు యజమానులు, మేనేజర్లు, క్యాషియర్లు, ఆపరేటర్లు కూడా మహిళా సంఘాల సభ్యులే. ఒక్కో సంఘానికి నెలకు సగటున రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. మరో 42 బంకులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. మహిళలకు ఉపాధి కల్పించడం నుంచి వాళ్ల చేతుల్లో వ్యాపారాలను పెట్టడం వరకు ఈ కార్యక్రమం వెళ్తోంది. సంపాదించే అవకాశం మహిళ చేతికి వస్తే.. దాని ప్రభావం ఆమె ఇంటి వరకే ఆగదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి నుంచి పిల్లల చదువుల వరకు చాలా విషయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మహిళా సాధికారత అసలు అర్థం.

Show More
Back to top button