Telugu Opinion Specials

ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న అనురాగం ప్రేమనా? లేక అహంకారమా?

ప్రేమనా? లేక అహంకారమా? అనేది ఒకరి పట్ల మరొకరికి ఉండే ప్రగాఢమైన అనురాగం, నిస్వార్థమైన ఆదరణ మరియు లోతైన భావోద్వేగపు స్థితి. ప్రేమలో ఒకరినొకరు పరస్పరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో ఇతరులు సంతోషంగా ఉండాలని, వాళ్ళ సంతోషానికి మనవైపు నుండి కూడా కారణాలు చాలా ఉండాలని కోరుకుంటారు. నిజానికి ప్రేమలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటే, ఆ ప్రేమ సార్వజనికమైనదిగా మరియు బేషరతుగా ఉంటుంది. ప్రేమ అనేది ఇతరుల అవసరాలకు సున్నితంగా ఉండే లక్షణం, అలాగే వారి సంతోషానికి దోహదపడే సుముఖతను కలిగి ఉంటుంది. ఇతరులు మనకు ఏమి చేశారనే దానితో సంబంధం లేకుండా ఈ ప్రేమను అందరికీ సమానంగా పంచవచ్చు. దానికి ప్రతిఫలంగా ఇంకేమీ కోరుకోదు. ప్రేమను మన వైపు మళ్లించుకున్నప్పుడు, ఆనందం, వినోదం కలుగుతుంది. మన కోరికను తీర్చడానికి ఏదోకటి కోరుకుంటారు. వాటి వల్ల మనకు లభించే కొద్దిపాటి ఆనందం ఎప్పటికీ నిలవదు. మనం ఇతరులను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, తాత్కాలిక ఆనందం మాత్రమే కాకుండా నిజమైన శాశ్వత ఆనందాన్ని పొందడానికి వీలు ఉంటుంది. మనల్ని మనం నిజంగా ప్రేమించుకున్నప్పుడే ఇతరులను కూడా నిజంగా ప్రేమించగలుగుతాం.

ప్రేమనా? లేక అహంకారమా? అసలు తేడా ఇదే

మనం రోజూ ఎన్నో ప్రేమ కథలు చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రేమ కథలు సునిశితంగా పరిశీలిస్తుంటాం. ఈ ప్రేమ కథలలో కొన్ని మాత్రమే విజయవంతం అవుతాయి. చాలా ప్రేమ కథలు ఆదిలోనే ఆటంకాలు ఎదుర్కొని ప్రారంభం దశలోనే ముగింపు కోరుకుంటాయి. వాటికి అనేక కారణాలు ఉంటాయి. ఇద్దరి ప్రేమికుల మధ్య అవగాహన లోపం, ప్రేమ తగ్గిపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఇద్దరి మధ్యలో అహం పెరిగిపోవడం లాంటి కారణాల వలన ప్రేమ విజయతీరాలకు నోచుకోదు. నిజానికి ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్నది ప్రేమ నా? లేక అహంకారమా? తాను ప్రేమించిన వ్యక్తి తనతోనే ఉండాలి, తాను చెప్పినట్లే నడుచుకోవాలి, తన గురించే ఆలోచించాలి, తాను ప్రేమించిన వ్యక్తికి సంబంధించిన ప్రతీ విషయం తన కనుసన్నలలో ఉండాలి అని ఆంక్షలు పెడుతూ ఉంటారు. దీనిని ప్రేమ అని భ్రమ పడుతూ ఉంటారు. కానీ ఇది ప్రేమ కాదు, ఇది అహంకారం. ఇద్దరి వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండొచ్చు, కానీ అది అహంకారంగా మారితే ప్రమాదానికి దారి తీస్తుంది. ఆ అహంకారం చివరకు హత్యగానో లేక ఆత్మహత్యగానో దారితీస్తుంది. అసలు ప్రేమ అంటే ఏమిటి? అహంకారం అంటే ఏమిటి? ప్రేమలో అహంకారం ఉంటే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు ఇలాంటి విషయాలను సరిగ్గా గమనిస్తే..

ప్రేమలో చంపబడిన వారే ఎక్కువ…

ప్రేమ విషయంలో నమ్మకం మంచిదే కానీ, గుడ్డిగా నమ్మడం మాత్రం ప్రాణాలకే ప్రమాదం. ఒక మనిషి (ఆడ మనిషి కానీ, మగ మనిషి కానీ) మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమలో స్వార్థం, ఈర్ష్య ఉండదని భరోసా ఏంటి? ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంత గాఢంగా, ఎంతో పిచ్చిగా ప్రేమిస్తున్నాడనేది ముఖ్యం కానే కాదు. కానీ ఆ ప్రేమలో అహంకారం ఎంత లోతుగా దాగివుందో గుర్తించడం ముఖ్యం.  ఈ ప్రపంచంలో ప్రేమలో పడి చనిపోయిన వారి కంటే ప్రేమలో పడి చంపబడిన వారే ఎక్కువగా వున్నారు. ప్రేమికులుగా ఉన్న అనేక బంధాలు, అనుబంధాలలో వాటి వెనుక నిజానికి ఉన్నది ప్రేమ కాదు. అవతలి వ్యక్తులను సొంతం చేసుకోవాలనే కోరిక, అవతలి వారిని తన ఆధీనంలో ఉంచుకోవాలనే అధికారం, అవతలి వారిని తాము నియంత్రించాలానే ఒక ఉద్దేశ్యం మాత్రమే. అంటే అందులో నీవు నా వాడివి, నీవు నా దానివి అనే ప్రమాదకరమైన భావన దాగి ఉంటుంది. నీవు నాతో లేకపోతే ఇంకెవరితోనూ ఉండకూడదనే పిచ్చి అందులో ఇమిడి ఉంటుంది. అనేక సందర్భాలలో మనుషులు ప్రేమ కోసం చనిపోరు, ప్రేమను సొంతం చేసుకోవాలనే అహంకారం కోసం చంపేస్తారు. 

“ద లేడీ అండ్ టైగర్” కథ…

అమెరికన్ కవి ఫ్రాంక్ స్టాన్‌ఫోర్డ్ వ్రాసిన “ద లేడీ అండ్ టైగర్” అనే కథను “ప్రేమ” అనే అంశానికి సరిగ్గా సరిపోతుంది.

వెనుకటికి రాజుల కాలంలో ఒక “పాక్షిక – అనాగరిక” రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు యొక్క కొన్ని ఆలోచనలు ప్రగతిశీలమైనవే, కానీ మరికొన్ని ఆలోచనలు మాత్రం ప్రజలను విపరీతమైన బాధలకు గురిచేస్తాయి. రాజు ఆలోచనలలో ఒకటి “కావ్య న్యాయానికి ఒక సాధనంగా” బహిరంగ అగ్నిపరీక్షను ఉపయోగించడం. అయితే ఈ పరీక్షలో ముద్దాయి నేరస్థుడా కాదా అనేది యాదృచ్ఛిక ఫలితం ద్వారా నిర్ణయించబడుతుంది. ఇందులో నేరం ఆరోపించబడిన వ్యక్తిని బహిరంగ ప్రదేశానికి తీసుకువస్తారు. అక్కడ ఉన్న రెండు తలుపులలో అతను ఒకదాన్ని ఎంచుకోవాలి. ఒక తలుపు వెనుక నిందితుడికి తగిన జోడీగా భావించిన ఒక స్త్రీ ఉంటుంది. మరొక తలుపు వెనుక విపరీతమైన ఆకలితో ఉన్న భయంకరమైన పులి ఉంటుంది. అయితే ఆ నిందితుడు తలుపుల వెనుక ఏముందో అక్కడి నుండి వచ్చే శబ్దం వినకుండా నిరోధించడానికి రెండు తలుపులకు అధిక ధ్వని నిరోధకత కల్పించబడి ఉంటుంది. ఒకవేళ అతను స్త్రీ ఉన్న తలుపును ఎంచుకుంటే, అతను నిర్దోషి అని నిర్ధారణ చేసి వెంటనే ఆ స్త్రీని అతనికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. కానీ అతను పులి ఉన్న తలుపును ఎంచుకుంటే మాత్రం అతను దోషిగా పరిగణించబడి వెంటనే ఆ పులికి ఆహారం అయిపోతాడు.

ఒకసారి రాజు తన కుమార్తెను ఓక వ్యక్తి ప్రేమించాడని, ఆమెకు ఒక ప్రియుడు ఉన్నాడని, ఆస్తిలో, హోదాలో అతను రాకుమారి కంటే తక్కువైనా కూడా ఒక అందమైన, ధైర్యవంతుడైన యువకుడని రాజు తెలుసుకుని, విచారణ కోసం అతన్ని ఖైదు చేయిస్తాడు. అతనికి శిక్ష వేసే రోజు వచ్చేసరికి, రాకుమారి తన పలుకుబడిని ఉపయోగించి ఆ రెండు తలుపుల వెనుక ఉన్న మహిళ మరియు పులి ఉన్న స్థానాలను తెలుసుకుంటుంది. ఎందుకంటే అతనిని తనలాగే ఒక స్త్రీ ఇష్టపడిందని, రెండు తలుపులలో ఒక తలుపు వెనుక ఉన్న మహిళ ఆమెనే అని రాకుమారి కనుగొంటుంది. అయితే అతను సహాయం కోసం రాకుమారి వైపు చూడగా, ఆమె చాకచక్యంగా అతని కుడి వైపున ఉన్న తలుపును సూచిస్తుంది. దాంతో అతడు రాకుమారి చూపించిన తలుపును తెరుస్తాడు.

అయితే తరువాత ఏమి జరిగింది అనే విషయం రచయిత కథలో వివరించలేదు. దానికి బదులుగా, రచయిత కథ నుండి పక్కకు తప్పుకుని, నిందితుడు పులి చేతిలో మరణించాడా లేదా స్త్రీతో వివాహం జరిపించబడ్డాడా అనే విషయం పాఠకులకు వదిలేశాడు. తనకు సహాయం చేసే విషయంలో రాకుమారి మనఃస్థితిని, ఆమె ఆలోచనలను రచయిత సంగ్రహంగా వివరిస్తాడు. ఆమె ప్రతి ఎంపికలోని లాభనష్టాలను పరిశీలిస్తుంది, అయితే ముఖ్యంగా ఆ మహిళ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. చివరగా, “కాబట్టి నేను ఈ ప్రశ్నను మీ అందరికే వదిలేస్తున్నాను. తెరిచిన తలుపులోంచి బయటకు వచ్చింది ఎవరు? ఆ మహిళా? లేక పులా?” అనే ప్రశ్నతో కథను రచయిత ముగిస్తాడు.

రాకుమారికి ముందే తెలుసు…

 ఈ కథలో యువకుడు విచిత్రమైన న్యాయస్థానానికి తీసుకురాబడిన తరువాత ప్రజలు కూడా ఆసక్తికరంగా ఆ తీర్పును గమనించసాగారు. నిజానికి తాను చేసిన నేరం ఏమిటంటే రాజకుమార్తెను ప్రేమించడమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకుమార్తె కూడా అతనిని అంతే ప్రేమించింది. అయితే వారి ప్రేమ రాజుల చట్టాలను గెలవలేకపోయింది. ఆ రహస్యం బయటపడింది గనుకనే ఆ యువకుడు స్టేడియంలో ముద్దాయిగా నిలబడ్డాడు. అయితే వాస్తవానికి రాజకుమారికి ఆ రెండు తలుపుల వెనక ఏముందో అనే రహస్యం ముందుగానే తెలుసు. ఏ తలుపు వెనుక పులి ఉందో, ఏ తలుపు వెనక అందమైన యువతి ఉందో ఆమెకు స్పష్టంగా తెలుసు. అయితే తలుపు వెనకాల ఉన్న యువతి ఒక రోజు తన ప్రియుడి వైపు చూసి నవ్విందని ఆ యువతిపై రాకుమారికి అసూయ ఉండేది. ఇప్పుడు అదే యువతి రాకుమారి ఇష్టపడ్డ యువకుడికి భార్యగా మారే అవకాశం ఉంది. ఇదే స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆలోచించండి. ఆ రాజకుమారి స్థానంలో మీరు ఉంటే, మీరు నిజంగా ప్రేమిస్తే మీ బదులుగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వారు సుఖంగా ఉండడం మీరు చూడగలరా? మీకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు అని అనుకుంటారా? ఈ ప్రశ్నకు సమాధానం తొందరగా చెప్పకండి. ఎందుకంటే నిజానికి మనిషి తన గురించి చెప్పుకునే సమాధానం ఒకటి, తను నిర్ణయం తీసుకునే సమయంలో  చేసే పని ఇంకొకటి. అయితే ముద్దాయిగా ఉన్న అతను నేరుగా రాకుమారి వైపు చూశాడు. రాకుమారి కూడా అతని వైపు చూసింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక శబ్దం వినిపించలేదు. కేవలం తన కుడి చేతి వేలును స్వల్పంగా కదిలించి కుడి వైపు ఉన్న తలుపును చూపించింది. 

ప్రతిరోజు చూసే విషాదాల వెనుక ప్రేమ ఉండదు…

ఇక్కడే ఒక గుడ్డి ప్రేమికుడైతే ఏమనుకుంటాడు? ఆమె నన్ను ప్రేమిస్తుంది గనుక నన్ను చంపాలి అని ఆమె అనుకోదు. ఆమె చూపించిన తలుపు వెనుక కచ్చితంగా యువతి ఉంటుంది కాబట్టి కనీసం తన ప్రాణాలైనా కాపాడాలని అనుకుంటుంది అని అనుకున్నాడు. ప్రేమలో పడిన చాలామంది ఇక్కడే ఓడిపోతారు. ఎదుటి మనిషి మాటలు నమ్ముతారు. కానీ వారి మనస్తత్వాన్ని అస్సలు చదవరు. తెలివైన మనిషి మాత్రం మరో ప్రశ్న అడుగుతాడు. ఆమె నన్ను ప్రేమిస్తుందో లేదో, అసలు ఆమె ప్రేమలో అహంకారం ఎంత ఉందో అన్నదే అదే అసలు ప్రశ్న. ప్రేమ, అహంకారం రెండు బయటికి ఒకేలా కనిపిస్తాయి. అవి రెండూ కూడా నీవు నాకు కావాలి అని చెబుతాయి. కానీ వాటి వెనక ఉద్దేశ్యం వేరుగా ఉంటుందని. నీవు సంతోషంగా ఉండాలని ప్రేమ చెబుతుంది, కానీ నీవు నాతోనే సంతోషంగా ఉండాలని అహంకారం చెబుతుంది. ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న ఒక్క పదమే ప్రస్తుత పరిస్థితులలో వేలాది విషాదాలకి కారణం. మనిషి నిజంగా గనుక ప్రేమిస్తే తన వల్ల కాకపోయినా ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అహంకారంతో ప్రేమించిన వ్యక్తి మాత్రం ఎదుటివారి సంతోషాన్ని తన మీద జరిగిన అవమానంగా భావిస్తాడు. అతనికి విడిపోవడం అనేది బాధ కాదు, తనను వదిలి ఇంకొకరితో నవ్వడం అనేదే బాధ, అదే తన అసూయకు కారణం. ఆ అసూయనే ప్రేమను హత్యగా మార్చే మొదటి మెట్టు. అందుకే మనం ప్రతిరోజు చూసే అనేక విషాదాల వెనుక ప్రేమ ఉండదు. నా ప్రేమను కాదన్నావు కాబట్టి చంపేస్తాను, నాతో విడిపోయావు కాబట్టి నీమీద యాసిడ్ పోస్తాను. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నీవు చావాల్సిందే. ఇవన్నీ ప్రేమ కథలు కావు, అహకారం మాట్లాడే మాటలు.

ప్రేమకు అధికారం ఉండదు…

నిజానికి ప్రేమ ఎప్పుడూ ప్రాణాలు తీయదు, అహంకారం మాత్రమే ప్రాణాలను తీస్తుంది. కానీ దురదృష్టం ఏమిటంటే అహంకారం ఎప్పుడూ కూడా ప్రేమ అనే ముసుగు వేసుకుంటుంది. కథలో రాజకుమారిని పరిశీలన చేసి చూస్తే ఆమె సాధారణ అమ్మాయి కాదు. ఒక రాజుకు కుమార్తె. ఆమెకు చిన్నప్పటినుండి తనకు కావలసింది దక్కించుకునే వాతావరణంలో పెరిగింది. అధికారానికి అలవాటు పడింది. ఆమెకు ఓటమి తెలియదు. మనిషి తాను ప్రేమించిన వ్యక్తి జీవితాంతం ఇంకో వ్యక్తితో కలిసి పిల్లలను కంటూ పూర్తిగా తనను మరిచిపోయి జీవించగలడం ఆమె భరించగలడా? లేదా తాను ఒక్క క్షణం బాధ భరించి చనిపోవడం భరించగలడా? ఇట్టి విషయాన్ని పరిశీలన చేసి చూస్తే చాలాసార్లు మనిషి ప్రేమను కోల్పోయినందుకు బాధపడడు, తన విలువ తగ్గిపోయిందనే భావనకు బాధపడతాడు. నన్ను వదిలి ఇంకొకరిని ఎంచుకున్నారనే ఆలోచన అతని ఆత్మగౌరవాన్ని చీల్చేస్తుంది. మనిషి ప్రేమ కోసం పోరాడడు, తన అహంకారం కోసం పోరాడుతాడు. అసలు ప్రేమకు అధికారం అనేది ఉండదు, అహంకారానికి అధికారం ఉంటుంది. అందుకే ప్రేమ నీవు స్వేచ్ఛగా ఉండు అంటుంది. అహంకారము మాత్రం నీవు నా సొంతం అంటుంది.

ప్రేమకు ధైర్యం, అహంకారానికి భయం అవసరం..

ప్రేమ చేతులు విడిచిపెడుతుంది, అహంకారం మాత్రం గొంతు పట్టుకుంటుంది. ప్రేమకు ధైర్యం అవసరం, అహంకారానికి భయం అవసరం, భయం ఉన్నచోటే నియంత్రణ పుడుతుంది. ఒక్క క్షణం ఆలోచించి చూస్తే కథలోని యువకుడు నిజంగా ఆలోచించి ఉంటే తలుపులను కాదు ఆ రాజకుమారి మనసును చదివి ఉండాలి. ఆమె ప్రేమను కాదు ఆమె అహంకారాన్ని అంచనా వేసి ఉండాలి. మన నిజ జీవితంలో కూడా మనం చేసే తప్పు ఇదే. మనం మనల్ని ప్రేమిస్తున్నారో లేదో చూసుకుంటాం కానీ వాళ్ల ప్రేమలో స్వేచ్ఛ ఉందా స్వార్ధం ఉందా అనేది చూడం. ఒక మనిషి మనల్ని రోజుకు వందసార్లు ఐ లవ్ యు చెప్పేయొచ్చు, అదే మనిషి మీ ఫోన్ చెక్ చేయాలి అనుకోవచ్చు, మీ స్నేహితులని వదిలేయమని నీకు ఆంక్షలు విధించొచ్చు. మీ జీవితం పై నిర్ణయాలు తానే తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. మీరు నవ్వే హక్కు కూడా తన అనుమతితోనే ఉండాలని కోరవచ్చు. బయటకు చూస్తే ఇవన్నీ ప్రేమలే అనిపిస్తాయి. కానీ లోపల చూస్తే అవన్నీ మనల్ని నియంత్రణ చేసే పనులే కావొచ్చు. 

అహంకారం జీవితాన్ని నాశనం చేస్తుంది…

నియంత్రణ ఎక్కువైన చోట ప్రేమ తక్కువవుతుంది. అతను ఎంత ప్రేమిస్తున్నాడనేది కాదు, ఎంత గౌరవిస్తున్నాడు అన్నది ప్రధానమైన అంశం. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే. అవతలి వ్యక్తి ప్రేమిస్తున్నాను అని చెప్పే ముందు వారి అహంకారాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రేమ మిమ్మల్ని బ్రతికిస్తుంది, కానీ అహంకారం మాత్రం (ప్రేమ భాషలోనే) మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మనుషులు మిమ్మల్ని ద్వేషించే వారు కాదు, నీవు నా సొంతం అని నమ్మే వాళ్ళు. ద్వేషించే మనిషి మీ నుండి దూరంగా వెళ్తాడు. కానీ అహంకారంతో ప్రేమించే మనిషి మాత్రం మీ నుండి దూరంగా వెళ్లకుండా ఏ హద్దుకైనా వెళ్తాడు. ఎవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నమ్మేముందు మీ ఆనందాన్ని కూడా ప్రేమిస్తున్నారో లేదో చూడండి. మీరు వాళ్ళతో లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడం ప్రేమ. మీరు వాళ్లతో లేకపోతే మీరు ఎవ్వరికీ దక్కకూడదని అనుకుంటే అది ప్రేమ కాదు అది గాయపడిన అహంకారం. ఆ అహంకారానికి పూలు ఇష్టం, ప్రేమ మాటలు ఇష్టం. ఆ అహంకారం ప్రేమ కంటే క్రూరంగా మారుతుంది. ప్రపంచంలో ప్రతి పులికి గోర్లు ఉంటాయి, కానీ అహంకారం ప్రేమ అనే ముసుగేసుకుంటుంది. దానిని గుర్తించడం అత్యంత కష్టమైన పని.

Show More
Back to top button