భారత్‌లో బ్యాంకులు లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని, పెద్ద కంపెనీలకు మాఫీ చేశాయని వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. దీంతో సాధారణ ప్రజల్లో ఒక సందేహం వస్తుంది. చిన్న రైతు రుణం చెల్లించకపోతే నోటీసులు వస్తాయి, కానీ పెద్ద వ్యాపారవేత్తలు వేల కోట్ల రూపాయలు తీసుకుని తప్పించుకుంటున్నారా అని చాలామంది ప్రశ్నిస్తారు. ఈ అంశం రాజకీయ చర్చల్లో కూడా తరచూ వినిపిస్తుంది. అయితే నిజంగా బ్యాంకులు ఆ డబ్బును పూర్తిగా మాఫీ చేస్తున్నాయా? లేక ఇందులో మరో కోణం ఉందా? అనే విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
రైట్ ఆఫ్ అంటే అసలు ఏమిటి?
ముందుగా “రైట్ ఆఫ్” అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ అని భావిస్తారు. కానీ బ్యాంకింగ్ భాషలో అది వేరు. ఒక రుణం చాలా కాలం పాటు తిరిగి రాకపోతే, దానిని బ్యాంకు తన లెక్కల పుస్తకాల నుంచి తొలగిస్తుంది. దీనినే రైట్ ఆఫ్ అంటారు. అంటే రుణం తీసుకున్న వ్యక్తి లేదా కంపెనీ అప్పు నుంచి విముక్తి పొందినట్లు కాదు. బ్యాంకులు కోర్టులు, దివాలా చట్టాలు, ఆస్తుల వేలం వంటి మార్గాల ద్వారా డబ్బు తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. రైట్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాంకులు ఎంత మేరకు డబ్బు తిరిగి తెచ్చుకోగలుగుతున్నాయి అనేదే.
గణాంకాలు చెబుతున్న కథ
అక్కడే అసలు సమస్య కనిపిస్తుంది. కొన్ని ప్రముఖ కార్పొరేట్ కేసుల గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ కేసులో బ్యాంకులు అంగీకరించిన రుణాల మొత్తం సుమారు ₹64,838 కోట్లు. కానీ తిరిగి వచ్చిన మొత్తం కేవలం ₹2,962 కోట్లు మాత్రమే. అంటే రికవరీ శాతం 4.57 మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే దాదాపు 95 శాతం విలువ కోల్పోయింది. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కేసులో ₹41,563 కోట్ల క్లెయిమ్‌లకు గాను ₹3,720 కోట్లు మాత్రమే వచ్చాయి. డెక్కన్ క్రానికల్ కేసులో రికవరీ కేవలం 8 శాతం వరకు మాత్రమే పరిమితమైంది. సివా ఇండస్ట్రీస్ కేసులో 6.6 శాతం, జయపీ ఇన్ఫ్రాటెక్ కేసులో 11 శాతం, అలోక్ ఇండస్ట్రీస్ కేసులో 17 శాతం మాత్రమే రికవరీ జరిగింది. ఈ గణాంకాలు చూసినప్పుడు ప్రజల్లో అనుమానాలు రావడం సహజం. రుణం తీసుకునే సమయంలో జరిగిన అంచనాల్లో లోపమా? లేక తరువాత వసూళ్ల వ్యవస్థ బలహీనతా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు లెక్క ఏంటి?
అంతిమంగా చూస్తే “లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి” అని చెప్పడం పూర్తిగా సరైనది కాకపోవచ్చు. అదే సమయంలో “ఎలాంటి నష్టం జరగలేదు” అని చెప్పడం కూడా వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఎందుకంటే లెక్కల పుస్తకాల్లో రైట్ ఆఫ్ చేసినా, రికవరీ చాలా తక్కువగా ఉంటే బ్యాంకులపై భారం పడుతుంది. చివరికి ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల నమ్మకంపైనా పడుతుంది. అందుకే రుణాలు ఇచ్చే ముందు కఠినమైన పరిశీలన, రుణ ఎగవేతదారులపై వేగవంతమైన చర్యలు, పారదర్శక వసూళ్ల వ్యవస్థ చాలా అవసరం. బ్యాంకుల డబ్బు అంటే చివరికి ప్రజల డబ్బే. ఆ డబ్బు ఎంత ఇచ్చామన్నది కాదు, ఎంత తిరిగి తెచ్చుకున్నామన్నదే అసలు లెక్క.






