జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు సాధారణంగా మందులతో తగ్గిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్కు శరీరం స్పందించే విధానం అదుపు తప్పుతుంది. దీంతో ఇన్ఫెక్షన్తో పోరాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే సెప్సిస్ అంటారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కాకుండా.. శరీరంలోని కీలక అవయవాల పనితీరును దెబ్బతీసే ప్రమాదకర పరిస్థితి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తిలో పరిస్థితి ఒక్కసారిగా క్షీణిస్తే సెప్సిస్ అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
సెప్సిస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
సెప్సిస్ ప్రారంభంలో సాధారణ ఇన్ఫెక్షన్ మాదిరిగానే కనిపించవచ్చు. కానీ పరిస్థితి తీవ్రమవుతున్నప్పుడు కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస సాధారణం కంటే వేగంగా ఉండటం, తీవ్రమైన నీరసం లేదా బలహీనత, తికమకగా మాట్లాడటం, గందరగోళంగా ఉండటం, చర్మం చల్లగా లేదా అసాధారణంగా మారడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ శరీరంలోని అవయవాలపై ఇన్ఫెక్షన్ ప్రభావం చూపుతున్న సంకేతాలు కావొచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ఇన్ఫెక్షన్లు తీవ్రంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
ఆలస్యం చేయకుండా చికిత్స ముఖ్యం..
సెప్సిస్ వేగంగా తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇన్ఫెక్షన్కు తగిన చికిత్స, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటం, అవసరాన్ని బట్టి ఇతర వైద్య చికిత్సలు అందించడం ద్వారా పరిస్థితిని నియంత్రించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడం, కొత్తగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన బలహీనత, గందరగోళం లేదా మూత్రం బాగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలి. సెప్సిస్లో త్వరగా గుర్తించడం, సరైన సమయంలో చికిత్స ప్రారంభించడం ప్రాణాలను కాపాడడంలో కీలకంగా ఉంటుంది.






