మన ముఖంపై కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. వాటిలో డెమోడెక్స్ మైట్స్ కూడా ఒకటి. ఇవి చాలా చిన్నగా ఉండే పురుగులు. చర్మంలోని వెంట్రుకల కుదుళ్లు, నూనెను ఉత్పత్తి చేసే గ్రంథుల్లో ఉంటాయి. చర్మంపై పేరుకునే మృత కణాలు, సహజంగా విడుదలయ్యే నూనెను ఆహారంగా తీసుకుంటాయి. పగటి సమయంలో చర్మంలోనే ఉండే ఇవి రాత్రిపూట ఎక్కువగా బయటకు వస్తుంటాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో ఇవి ఉండవు. వయసు పెరిగే కొద్దీ ఇతరుల నుంచి చర్మానికి చేరుతాయి. అందుకే పెద్దవారిలో చాలామందికి ఇవి సహజంగానే కనిపిస్తాయి. అయితే ముఖంపై డెమోడెక్స్ మైట్స్ ఉండటం అనేది తప్పనిసరిగా వ్యాధి ఉన్నట్లు కాదు. సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ కలిగించవు. కానీ వీటి సంఖ్య అసాధారణంగా పెరిగినప్పుడు చర్మంపై దురద, ఎరుపుదనం, మంట, చిన్న చిన్న గడ్డలు వంటి సమస్యలు కనిపించవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గడం, చర్మంలో నూనె ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితులు వీటి పెరుగుదలకు కారణం కావచ్చు.
డెమోడెక్స్ మైట్స్ సమస్య రాకుండా చర్మ సంరక్షణలో ఈ జాగ్రత్తలు
వీటి సంఖ్య అదుపులో ఉండాలంటే రోజువారీ చర్మ సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోజుకు రెండుసార్లు మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మంపై ఎక్కువగా జిడ్డు పేరుకుపోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా భారీ ఆయిల్ ఆధారిత క్రీములు, మాయిశ్చరైజర్లను అవసరానికి మించి ఉపయోగించకూడదు. అయితే చర్మాన్ని పదేపదే గట్టిగా రుద్దడం, ఎక్కువసార్లు కడగడం కూడా మంచిది కాదు. దీనివల్ల చర్మం పొడిబారి సమస్య మరింత పెరగవచ్చు. టీ ట్రీ ఆయిల్ వంటి వాటిని నేరుగా ముఖంపై, ముఖ్యంగా కళ్ల చుట్టూ ఉపయోగించకూడదు. ఇవి చర్మానికి చికాకు కలిగించే అవకాశం ఉంది. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు టవల్స్, దిండు కవర్లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం మంచిది.
డెమోడెక్స్ మైట్స్ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
డెమోడెక్స్ మైట్స్‌ను ముఖం నుంచి పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. నిజానికి వాటిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం కూడా లేదు. వాటి సంఖ్య సాధారణ స్థాయిలో ఉంటే ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అయితే ముఖంపై తరచూ దురద, మంట, ఎరుపుదనం కనిపించడం లేదా కనురెప్పలు వాచడం, కళ్ల చుట్టూ ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. చర్మ వైద్యుడు లేదా కంటి వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే పరీక్షలు చేసి తగిన చికిత్స సూచిస్తారు. సొంతంగా క్రీములు, నూనెలు ఉపయోగించడం వల్ల సమస్య తగ్గకపోగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖంపై వచ్చే ప్రతి దురదను డెమోడెక్స్ సమస్యగా భావించకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, చర్మానికి సరిపోయే ఉత్పత్తులు వాడటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.






