CINEMATelugu Cinema

చలనచిత్ర రంగంలో తారాలోకానికి నాన్నగారు.. దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య.

లనచిత్ర సృష్టికి త్రిమూర్తులు అనదగిన వారు ముగ్గురున్నారు. సి.పుల్లయ్య గారు, హెచ్.ఎం.రెడ్డి గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు. వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టు తన యుగంలోని తారలలో తొంభై ఐదు శాతం మందిని తానే సృష్టించి “పిల్లలకోడి” అనే బిరుదాన్నందుకున్న దర్శక పితామహుడు సి.పుల్లయ్య గారి జీవితం చలనచిత్ర పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ ఆవశ్యం, అవధరణీయం. డొంకతిరుగుడు లేని సూటి అయిన సినిమా తన విధానం. తన సినిమాలోనే కాదు, జీవితంలోనూ కూడా ఆచరించి చూపిన మహనీయుడు. ఆరడుగుల ఎత్తున బుర్ర మీసాలతో చూపరులకు భయం కలిగించేలా కనిపించే ఆ మూర్తి లోపలికి వెళితే వెన్నెల కొండ.

మూకీల నుంచి టాకీల దాకా తెలుగు సినిమా ఉత్థానానికి కృషి చేసిన తొలి తరం మహనీయుల్లో తనది అద్వితీయ పాత్ర, వాత్సల్య పూరిత చరిత్ర. సి.పుల్లయ్య గారిని ఆ రోజుల్లో చిత్రసీమలో తారా ప్రపంచానికి  తనని నాన్నగారు గా వ్యవహరించేవారు. తన తరంలో ఆనాటి నటీనటులు తొంభై అయిదు శాతం మందిని సి.పుల్లయ్య గారే పరిచయం చేశారు. నిజానికి అంతమందిని పరిశ్రమకు తీసుకువచ్చారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు, గానీ ఇది నిజం. భానుమతి, అంజలీదేవి, కృష్ణవేణి, పుష్పవల్లి, రేలంగి, కస్తూరి శివరావు గార్లు ఇలా చాలామంది ఆనాటి తారలు తాను మలచిన మట్టి బొమ్మలే.

ఆడపిల్లలను సినిమాలకు పంపించడం చాలా అవమానంగా భావించే ఆ రోజుల్లోనే ముత్యాల్లాంటి తారలు మన తెలుగు సినిమాకు ఆనాడే అమరారంటే అందుకు ప్రధాన కారణం దర్శకులు సి.పుల్లయ్య గారి నవనీత హృదయం. ఆ మీసకట్టు, పంచకట్టు, మాటపట్టు అచ్చంగా ఆంధ్రత్వం ఉట్టిపడే పుల్లయ్యను చూస్తే ప్రతీవారికి ముందు గౌరవభావం కలిగేది. మాట కలిపాక ఆ మనిషి మనసు ఎంత నవనీతమో అర్థం అయ్యేది. చిన్నా పెద్దా తేడా లేకుండా తాను తారలందరినీ ఒకే చోట బస చేయించేవారు. ఉదయాన్నే పెందరాలే లేచి తన పనులు ముగించుకుని బసకు వెళ్లి వారందరినీ పేరుపేరునా యోగక్షేమాలు విచారించి చిత్రీకరణ కు బయలుదేర తీసేవారు.

సినిమా చక్కగా తీయగలనని నమ్మకం, విశ్వాసం కలిగిన తర్వాతే సి.పుల్లయ్య గారు ఏదైనా సినిమా తీసేవారు. కథాపరంగా పెద్దపెద్ద పండితులతో, చరిత్ర పరిశోధకులతో చర్చించేవారు, వారి అభిప్రాయాన్ని తీసుకునేవారు, వారి సలహా పాటించేవారు కూడా. తన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మహా గ్రంధం అవుతుంది. మట్టిలోని మాణిక్యాలతో అందమైన హారాన్ని తయారుచేసిన రూపశిల్పి సి.పుల్లయ్య గారు. తెరపైన కథ చెప్పే విధానంలో డొంక తిరుగుడు లేని, సూటి అయిన విధానాన్ని అవలంబించేవారు. ఈనాటి మాదిరిగా ఫ్లాష్ బ్యాక్ లు, కళ్ళ ముందు గుండ్రాలు తిరగడాలు లాంటివి ఆ రోజుల్లో లేవు. ప్రేక్షకులకు కథ పూర్తిగా అర్థమయ్యే రీతిలో చిత్రాలు తీయాలి అనే సిద్ధాంతం తూ.చ తప్పకుండా పాటించేవారు సి.పుల్లయ్య గారు.

సినిమా తీస్తే ఆ రోజుల్లో అందరూ ఆర్టిస్టులు కచ్చితంగా చిత్రీకరణ మొత్తం చూడాల్సిందే. అలా చూడడం కళాకారులకు ఎడ్యుకేషన్ అని పుల్లయ్య గారు అంటూ ఉండేవారు. అలాగే తాను తన తప్పులను, లోపాలను ఎవరైనా చెబితే ఎంతో ఆనందంగా వాటిని తీసుకునేవారు. తిరిగి ఆ తప్పులు లోపల జరగకుండా ఎంతో జాగ్రత్తగా తీసుకునేవారు. “వినదగునెవ్వరు చెప్పినా” సూక్తి అక్షరాల సి.పుల్లయ్య గారు పాటించేవారు. 1949లో దక్షిణ భారతదేశంలోనే మద్రాసు ఎయిర్ కండిషన్ థియేటర్ “మినర్వా టాకీస్” నిర్మించారు. అలాగే 1952లో మద్రాస్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్ స్థాపించారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    చిత్తజల్లు పుల్లయ్య

ఇతర పేర్లు  :    సి. పుల్లయ్య

జననం    :     16 సెప్టెంబరు 1916  

స్వస్థలం   :    కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి      :    దర్శకుడు, నటుడు, నిర్మాత

జీవిత భాగస్వామి    : రంగమ్మ 

పిల్లలు   :     చిత్తజల్లు శ్రీనివాసరావు 

మరణ కారణం  :  అనారోగ్యం సమస్యతో

మరణం    :   02 అక్టోబర్ 1967 (వయస్సు 69), కాకినాడ, ఆంధ్రప్రదేశ్..

నేపథ్యం

చిత్తజల్లు పుల్లయ్య గారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో 1895 వ సంవత్సరం లో జన్మించారు. సి.పుల్లయ్య గారు కాకినాడలో బీ.ఏ వరకు చదువుకున్నారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. దానికి గాంధీ గారు, జవలాల్ నెహ్రూ గారి లాంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. కుర్రవాడిగా ఉన్న సి.పుల్లయ్య గారిని ఆ మహాసభలు బాగా ప్రభావితం చేశాయి. దాంతో ఇంగ్లీషు దుస్తులైన ప్యాంటు, చొక్కాకు స్వస్తి చెప్పి కద్దరు దుస్తులు వేసుకోవడం మొదలుపెట్టారు. కాంగ్రెసు మహాసభలు అయ్యాక బొంబాయి వెళ్లి కాంగ్రెస్ మహాదళం లో చేరారు. అక్కడ తాను కలిసిన “బులుసు సాంబమూర్తి” సలహా మేరకు సినిమా స్టూడియోలో చేరారు.

సినీ నేపథ్యం…

అప్పట్లో బొంబాయిలో “కోహినూర్ కంపెనీ”, “ఇంపీరియర్ ఫిలిం కంపెనీ”, “రంజిత్ మూవీ టోన్” లాంటివి ఉండేవి. ఇందులో కోహినూర్ ఫిలిం కంపెనీలో సి.పుల్లయ్య గారికి అసిస్టెంట్ గా ఉద్యోగం దొరికింది. ఆ స్టూడియోని ఆనుకుని మరాఠీ ల్యాబ్స్ ఉండేది. “కోహినూర్ ఫిలిమ్స్” లో సినిమాలు తీసి మరాఠీ ల్యాబ్ లో ప్రాసెసింగ్ చేసేవారు. అసిస్టెంట్ గా చేరిన సి.పుల్లయ్య గారికి రెండు పూటలా భోజనం పెట్టి, నెలకు 5 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. పని మొత్తం నేర్చుకున్నారు. సినిమాలు ఎలా తీస్తారో తెలుసుకున్నారు. ల్యాబ్ యజమాని కాక కొండలు గారు ఆర్థిక నష్టాలతో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పుల్లయ్య గారికి ఒక డొక్కు కెమెరా, డెవలపింగ్ ఫిల్మ్స్ ఇచ్చి పంపారు. రెండు సంవత్సరాలు బొంబాయిలో ఉన్న పుల్లయ్య గారు ఆ కెమెరా ఫిల్మ్ తో కాకినాడకు వచ్చేసారు.

సొంతింట్లో మార్కండేయ సినిమా…

కాకినాడలో మూకీ సినిమాలు తీయాలని తన ఇంట్లోనే రేకుల షెడ్డులో సెట్ వేసి భక్త మార్కండేయ తీశారు. కాకినాడ రాజరత్నం గారు మార్కండేయుడి తల్లిగా, మద్దూరి అన్నపూర్ణయ్య జ్ఞాతి సోదరుడు బుచ్చన్న శాస్త్రి మృకండ మహర్షిగా, పుల్లయ్య గారు మార్కండేయుడుగా వెయ్యి అడుగుల నిడివితో ముక్తసరిగా తయారయ్యింది ఆ సినిమా. కదిలే బొమ్మను జనం కళ్ళముందు నిలబెట్టడానికి పుల్లయ్య గారు చాలా శ్రమ పడ్డారు. తన దగ్గర ఉన్న నెగెటివ్ ని, తాను తెచ్చిన పాజిటివ్ ని, తాను ఐదు వందల ముక్కలుగా విడగొట్టారు. ఒక నెగెటివ్ చుట్టలో పాజిటివ్ ను పెట్టి వాటిని మళ్ళీ చుట్ట చుట్టి కెమెరాలో జోడించి కెమెరా లెన్స్ ముందు మాంచి పెట్రోమాక్స్ లైటు పెట్టి కెమెరా ను తిప్పారు.

అలా తయారయిన ఐదు వందల ముక్కలను వంద అడుగుల ముక్కలుగా విడగొట్టి, ఒక్కో ముక్కని వెదురు పుల్లకు చుట్టి ఫిలింలు కడగడానికి తెచ్చిన పౌడర్ ను ఒక పెద్ద గంగాళంలో పోసి తాను తీసిన ఫిలింను కడిగి ఆరేశారు. కడగ్గా వచ్చిన ఫిలింను తన దగ్గర ఉన్న ఓపెన్ షట్టర్ ప్రొజెక్టర్ లో పెట్టి సూర్యరశ్మిని అద్దం గుండా పట్టుకొని ఒక అద్దం ముక్కను ప్రొజెక్టర్ లోకి వచ్చేటట్టు నిలబెట్టి తన ఇంట్లోనే తలుపులు మూసిన కిటికీ గదిలో గోడమీద మార్కండేయ సినిమాను తమ వీధిలో వాళ్లకు చూపించారు సి.పుల్లయ్య గారు. అయితే ఈ పద్ధతిని చరఖా వడికే పద్ధతి అంటారు. ఈ పద్దతి సి.పుల్లయ్య గారికి నచ్చలేదు. దాంతో మరిన్ని మెలకువలు తెలుసుకునేందుకు మద్రాసుకు బయలుదేరారు.

రఘుపతి వెంకయ్య గారి వద్ద అసిస్టెంట్ గా చేరిక…

కాకినాడలో తాను చదివిన కళాశాల ప్రధానాచార్యులు “రఘుపతి వెంకటరత్నం నాయుడు” గారి దగ్గర సిఫారసు ఉత్తరం తీసుకుని సి.పుల్లయ్య గారు “చెన్న పట్నం” చేరారు. అక్కడ నాయుడు గారి సోదరుడు వెంకయ్య నాయుడు గారు సినిమాలు తీస్తున్నారు. తన కుమారుడు సూర్యప్రకాష్ ను ఆయన అప్పటికే హాలీవుడ్ పంపించి సిసిల్ బి డిమిలి వంటి వారి వద్ద తర్ఫీదు తీసుకునేలా చేశారు. రాక్సీ సినిమా థియేటర్ వెనుక వైపు వాళ్లకు “స్టార్ ఆఫ్ ది గ్లాస్ స్టూడియో” ఉండేది. ప్రకాష్ గారు తీసిన “నందనార”, “గజేంద్రమోక్షం”, “భీష్మ ప్రతిజ్ఞ” సినిమాలకు సి.పుల్లయ్య గారు సహాయ దర్శకులుగా పనిచేశారు. “భీష్మ ప్రతిజ్ఞ”లో వేషం కూడా వేశారు.

ఆంధ్రదేశంలో తొలి టూరింగ్ టాకీస్ నిర్మాణం…

ఆ రోజుల్లోనే రఘుపతి వెంకయ్య నాయుడుకు గారికి దాదాపు 15 చిత్ర ప్రదర్శనశాల లు (థియేటర్లు) ఉండేవి. మద్రాసు లోని ఆనాటి గెయిటీ, క్రౌన్, గ్లోబ్ థియేటర్లు తనవే. రఘుపతి వెంకయ్య నాయుడు గారు తన కుమారుడితో సమానంగా సి.పుల్లయ్య గారిని కూడా చూసేవారు. అందుచేత కొడుకు ప్రకాష్ గారు దర్శకుడు అయినందున, రెండో వారిని ప్రదర్శకుడిని చేయాలనుకున్నారు. తమ థియేటర్లలో పని లేక మూల పడి ఉన్న ఒక ప్రొజెక్టరు ని, ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకున్న “క్రోనో మెగా ఫోన్” అనే గ్రామ ఫోన్ పెట్టెను, రెండు మూడు సినిమా ప్రింట్లను ఇచ్చి సి.పుల్లయ్య గారిని తిరిగి కాకినాడకు పంపించారు.

అలా కాకినాడలో దర్శకులు సి.పుల్లయ్య గారి ఆధ్వర్యంలో సిటీ ఎలక్ట్రిక్ సినిమా పేరిట సినిమా హాలు వెలిసింది. ఆంధ్రదేశంలో తొలి టూరింగ్ సినిమా హాలు అదే. అలా సి.పుల్లయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు ఆ థియేటర్ ఉద్యమంలోనే ఉండిపోయారు. ఆ ఉద్యమంలో భాగంగానే రాజమండ్రిలో “కృష్ణ” సినిమా వెలిసింది. ఆ థియేటర్ యజమాని నిడమర్తి సూరయ్య గారు నిర్మాణరంగం కూడా చేపట్టినారు. వారి గ్రామంలోనే దుర్గా సినీ టోన్ అనే స్టూడియో స్థాపించారు. తెలుగు నేలపై వెలసిన తొలి సినిమా స్టూడియో ఇదే కావడం విశేషం. ఈలోగా మూకీ సినిమా పోయి టాకీ సినిమా వచ్చేసింది. దాంతో పుల్లయ్య గారి చూపు మళ్ళీ సినిమాల మీదికి మళ్ళింది.

తెలుగులో తొలి రంగుల చిత్రం “లవకుశ”…

తన ప్రతిభ పాటవాల గురించి విన్న “కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ” వారు తమ తెలుగు విభాగానికి ఆహ్వానించి సినిమాలు తీయించుకున్నారు. తొలిటాకీ “సతీ సావిత్రి” సినిమాను పుల్లయ్య గారు “కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ” వాళ్లకు తీసి పెట్టినారు. ఆనాటి రంగస్థలం దిగజాలు వేమూరి గగ్గయ్య గారు, రామతిలకం గారు , నిడుముక్కల సుబ్బారావు గారు ఆ సినిమాలో తారలు. ఆ తర్వాత పుల్లయ్య గారు “లవకుశ”, “అనసూయ”, “ధ్రువ విజయం”, “కాసులపేరు”,  “మోహిని భస్మాసుర”, “వరవిక్రయం”, “మాలతీ మాధవం”, “బాలనాగమ్మ”, “సత్యనారాయణ వ్రతం”, “గొల్లభామ”, “చల్ మోహనరంగా”, “వింధ్యరాణి”, “పక్కింటి అమ్మాయి” మొదలగు చిత్రాలు తీశారు.

వాటిల్లో లవకుశ (1933) సినిమా ఆ రోజులలో కాసుల వర్షం కురిపించింది. నిర్మాతలకు “పారుపల్లి సుబ్బారావు”, “సీనియర్ శ్రీరంజిని” గార్లు అందులో నటించారు. ఆ తర్వాత 1963 లో ఎన్టీ రామారావు, అంజలి గార్లతో మళ్ళీ ఆ సినిమాను తీశారు. తెలుగులో తొలిసారి రంగుల చిత్రాన్ని చూసే భాగ్యం ప్రేక్షకులకు కలిగించింది సి.పుల్లయ్య గారే. “దేవాంతకుడు”, “పరమానందయ్య శిష్యుల కథ”, “భామా విజయం”, “భువన సుందరి కథ” లాంటి చిత్రాలు కూడా తన దర్శకత్వంలోనే తీశారు.

జెమిని వాళ్ళు అత్యధిక వ్యయం ఖర్చు చేసి మరీ తీసిన “అపూర్వ సహోదరులు” సినిమా తెలుగు విభాగానికి సి.పుల్లయ్య గారే దర్శకులు.

థియేటర్ నిర్మాణానికి ఉద్యమకర్త…

సినిమాలకు థియేటర్ ల ఆవశ్యకతను 80 ఏళ్ల క్రితమే గుర్తించి వాటి నిర్మాణం కోసం ఆహారహం శ్రమించిన ఉద్యమకర్త సి.పుల్లయ్య గారు. ఇవాళ చిన్న చిన్న గ్రామాలలో మనం చూస్తున్న 70 ఎం.ఎం, ఎయిర్ కండిషన్, డి.టి.యస్ చిత్ర ప్రదర్శన శాలలు నెలకొల్పడానికి పుల్లయ్య గారు ఎంతో శ్రమించారు. సినిమాలు తీయడమే కాదు, వాటిని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రదర్శించేందుకు రాష్ట్రమంతటా ముమ్మరంగా ప్రదర్శనశాలలు ఉండాలని భావించిన సి.పుల్లయ్య గారు వాటి నిర్మాణం కోసం శ్రీకారం చుట్టి 1927లో తాను కాకినాడలో “సిటీ ఎలక్ట్రిక్ సినిమా” ప్రారంభించారు. అప్పటికి కాకినాడకు ఇంకా కరెంటు రాలేదు. అందువలన “కార్బయిడ్ లైట్” ఉపయోగించి తాను సినిమాలు చూపించేవారు.

బొగ్గు మీద నీళ్ల చుక్కలు పడుతుంటే వచ్చే పొగను ఒక గొట్టం ద్వారా వెలిగించి నీలికాంతిని రప్పించి ఆ కాంతిలో తాను బయోస్కోపు చూపించేవారు.

ఒక చేత్తో ప్రొజెక్టర్ తిప్పుతూ, రెండో చేత్తో గ్రామ ఫోన్ రికార్డు నడిపేవారు. ప్రొజెక్టరులో నిమిషానికి 16 ఫ్రేములు తిరగాలి. అందుకు అణువుగా గ్రామఫోనులో రికార్డు నడపాలి.

ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా మూకీ అభాసు పాలవుతుంది. ఆరెంటినీ సి.పుల్లయ్య గారు చాలా అవలీలగా చేసేవారు.

ఆ సినిమాకు సంబంధించిన కరపత్రాలను జట్కాబండి మీద తాషామరపా మేళం పెట్టి జనాన్ని ఆకట్టుకుంటూ పంచేవారు.

ఆ జట్కా బండి ఇన్చార్జి కస్తూరి కామేశ్వరరావు గారు. ఆయన కస్తూరి శివరావు గారి అన్నగారు.

ఆయన నోరూరించే వ్యాఖ్యలతో జనానికి కరపత్రాలు పంచేవారు. సినిమా టెక్నిక్ గురించి జనానికి సరిగ్గా తెలియని రోజులవి.

అందుచేత సి.పుల్లయ్య గారు వారిని కొట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేసేవారు.

రంగుల అద్దాలను కొనుక్కొచి లంకాదహనం సన్నివేశం రాగానే ప్రొజెక్టర్ ముందు ఎర్ర అద్దాన్ని, కృష్ణుడు రాగానే నీలి అద్దాన్ని పెట్టేవారు. జనం ఆ వర్ణ వైభవానికి ఉబ్బితబ్బిబ్బు అయ్యేవారు.

కాకినాడకు మెల్లిగా ఆయిల్ మిల్లులు రావడం ఆరంభించాయి. వాటితో పాటు జనరేటర్లు కూడా వచ్చాయి.

పుల్లయ్య గారు తన సిటీ సినిమా హాలుకు జనరేటర్ కొని మద్రాస్ నుంచి ఆర్క్ ల్యాంపులు తెప్పించి సినిమాలు చూపించనారంభించారు.

సింగిల్ ప్రొజెక్టర్ విధానం కావడంతో రీలు రీలుకు మధ్య విరామం వచ్చేది.

బొంబాయి నుంచి డాన్సింగ్ గర్ల్స్ ను రప్పించి వాళ్ళ చేత నృత్యాలు చేయించి, ఆ విరామంలో వినోదాన్ని అందించేవారు.

అలా ఆ రోజుల్లో డాన్సులు చేసిన వారిలో రాంప్యారి, భిక్షావతి, సురభి కమలాబాయి లాంటి వారు ఉన్నారు.

అలా పుల్లయ్య గారు ప్రేక్షకుల దృష్టిని నాటకాల నుంచి సినిమాల వైపుకు మళ్లించుకురాగలిగారు.

మరోవైపు తన ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఒక్కొక్క టౌన్ లో ఒక్కో థియేటర్ ను నిర్మిస్తూ ముందుకు పోసాగారు.

రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఇలా అన్నిచోట్ల థియేటర్లు కట్టించి ఇచ్చేవారు. బెంగాల్, ఒరిస్సాలు కూడా తిరిగారు.

ఎప్పుడో 1949 లోనే దక్షిణ భారతదేశంలో తొట్ట తొలి ఎయిర్ కండిషన్ సినిమా థియేటర్ మినర్వ టాకీస్ ను తాను మద్రాసులో ఏర్పాటు చేశారు.

మద్రాసు తేనాంపేట మైదానంలో ఏడు వేల మంది చూసేందుకు వీలుగా తాను 1952లో అలాంటి థియేటర్ నడిపారు.

తాను చేసిన ఈ ప్రయోగం గురించి విని ఢిల్లీ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి ఆహ్వానించి తమకు ఒక థియేటర్ కట్టించి ఇమ్మన్నారు.

తనతో సినిమా తీద్దామని ఎవరైనా వస్తే సినిమా ఎందుకండీ థియేటర్ కట్టండి, అది చాలా లాభసాటి వ్యాపారం అని ప్రోత్సహించే వారు పుల్లయ్య గారు.

అవతల వాళ్ళు సరే అంటే వాళ్ళ ఊరు వెళ్లి దగ్గరుండి మరి ఆ పనులు చూసేవారు.

సినిమా ఒక పరిశ్రమగా విరాజిల్లాలంటే భారతదేశానికి కనీసం యాభై వేల థియేటర్లు కావాలని ఆనాడు తాను అంచనా వేశారు. అప్పటికి దేశంలో ఉన్నవి అయిదు వేల థియేటర్లే.

సరిగ్గా యాభై ఏళ్లు దాటేసరికి తన అంచనాలను దాటేస్తూ దేశం నిండా ముమ్మరంగా ప్రదర్శనశాలలు వెలిశాయి.

సినిమా తక్కువ ఖర్చుతో బలమైన వినోద మాధ్యమంగా స్థిరపడింది.

కించిత్తు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా ఆనాడు పుల్లయ్య గారు చేసిన సేవలకు ఎగ్జిబిటర్స్, సెక్టార్ ఏనాటికి పుల్లయ్య గారికి ఋణగ్రస్థే.

శివ సాయుజ్యం…

డొంకతిరుగుళ్లు, పటాటోపాలు పుల్లయ్య గారికి నచ్చేవి కాదు. అనవసరంగా క్రేన్ షాట్లు గానీ, క్రాస్ ట్రాలీ షాట్లు గానీ తీసేవారు కాదు. అలాగని పుల్లయ్య గారు కొత్తదనానికి వ్యతిరేకం కాదు. తెలుగులో వ్యవహారిక భాషలో వచ్చిన తొలి తెలుగు సినిమా “సత్యనారాయణ వ్రతం” తాను తీసినదే. తన మిత్రుడు ముద్దుకృష్ణ కు రచయితగా అవకాశం ఇచ్చి ఆ సినిమాకు మామూలు వాడుక భాష వ్రాయించారు. జనాల నాడీ పట్టడంలో తాను జగజ్జెట్టీ. తాను మొదటిగా తీసిన లవకుశ (1932) సినిమా వచ్చినప్పుడు బెజవాడ దుర్గ కళామందిరం వద్ద ఒకటే తీర్థప్రజ. రవిస్ కాలువ వరుసంతా ఎడ్లబండ్లే. ఆ రోజుల్లోనే ఆ సినిమా సుమారు 40 వేల రూపాయలు వసూలు చేసింది.

కథ ఎప్పుడు సూటిగా డొంకతిరుగుళ్ళు లేకుండా ఉండాలని పుల్లయ్య గారు అంటుండేవారు. “అనగనగా ఒక రాజు” అంటూ మనం పిల్లలకు కథలు ఎలా చెబుతామో, ప్రేక్షకులకు కూడా అంతే సరళంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాలన్నది పుల్లయ్య గారి పద్ధతి. అదే పద్ధతిని చివరి వరకు అనుసరించారు.

మట్టిలోని మాణిక్యాలతో ఎన్నో అపురూప హారాలు తయారు చేసిన సి.పుల్లయ్య గారు తన 72వ యేట 02 అక్టోబరు 1967నాడు కాకినాడ జనరల్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

పుల్లయ్య గారు తన జీవితమంతా సినిమా పరిశ్రమ ఉన్నతి కోసం ఫణంగా పెట్టారు.

ఆహరహం శ్రమించారు. చివరికి తాను పుట్టి పెరిగిన కాకినాడలోనే శివ సాయుజ్యం గావించబడ్డారు.

దర్శక పితామహునిగా, తెలుగు నాట ప్రదర్శనశాలల ఆవిష్కర్తగా, తెలుగు సినిమా చరిత్రలో సి.పుల్లయ్య గారి స్థానం చిరస్మరణీయం.

ఆయన నిష్క్రమణతో తెలుగు చిత్రసీమ లో ఒక మహత్తరమైన, మహోజ్వలమైన అధ్యాయం ముగిసింది.

ఆయనకు నివాళిగా విజయచిత్ర పత్రికలో వచ్చిన వ్యాసంలో ఏం చెప్పారంటే… అనేక యుద్ధాలలో ఆరితేరిన వృద్ధమూర్తి.

చలనచిత్ర పితామహుడు, దర్శక ప్రముఖుడు, పారిశ్రామికవేత్త, పరిశ్రమ అభివృద్ధికి కారణభూతుడు అయిన సి.పుల్లయ్య గారు కీర్తిశేషులు కావడంతో చిత్ర పరిశ్రమ ఒక మహనీయున్ని కోల్పోయింది.

పరిశ్రమ మనుగడకు ముందంజగా, కారణంగా నిలబడిన మూల స్తంభమే విరిగిపోయినట్లు అయ్యింది.

అమృత హృదయం గల వ్యక్తిత్వం..

అమ్మాయి అంటూ సి. పుల్లయ్య గారు పిలిచే పిలుపు నటీనటులందరికీ అమృతతుల్యంగా అనిపించేది. చిత్రీకరణ అయ్యాక వాళ్లందరినీ బసకు పంపించి తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతూ, వాళ్ళందరూ భోజనాలు చేశారా లేదా కనుక్కొని మరీ వెళ్లేవారు సి.పుల్లయ్య గారు. భానుమతి, అంజలి, పుష్పవల్లి గార్లు  చిన్న వయస్సులో సినిమాలకు వచ్చారు.

ఎవరి మీదైనా వాళ్ళు అలిగి అన్నం తినకపోతే దగ్గర కూర్చోబెట్టుకుని లాలించి వాళ్ళ చేత అన్నం తినిపించేవారు.

వర్షం పడితే వాళ్ళ బసకు వచ్చి ఎవరికీ ఏ ఇబ్బంది లేదు కదా అని నిర్ధారించుకుని మరీ వెళ్లేవారు.

పిల్లలు చలితో వణుకుతున్నట్టు అనిపిస్తే కిటికీలు మూసి వాళ్లకు దుప్పట్లు నిండుగా కప్పి వెళ్లేవారు.

ఏ అమ్మ కన్న బిడ్డలో మనల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళ యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత మనదే కదా అన్న సిద్ధాంతం తనది.

ఎవరిదైనా పుట్టినరోజు వస్తే వాళ్లకు కొత్త బట్టలు కొనిపెట్టి మిఠాయిలు పంచి బసలోనే వేడుక జరిపించేవారు సి.పుల్లయ్య గారు.

కళాకారులు అంతా కూడా ఒక తండ్రి పట్ల ఎంత అభిమానంగా, భయభక్తులుగా ఉంటారో గారితో కూడా అలాగే వ్యవహరించేవారు.

ఒకనాడు “పక్కింటి అమ్మాయి” సినిమా చిత్రీకరణ లో “అంజలీదేవి” గారికి కారు ప్రమాదం జరిగి స్పృహ కోల్పోతే, ఆ పిల్లకు ఏమైపోతుందోనని తెల్లవార్లు వలవల ఏడ్చిన అమృత హృదయం తనది.

వాళ్లందరికీ ఏవిధంగా నటించాలో స్వయంగా నటించి చూపించేవారు. తారలే కాదు, తన సాంకేతిక నిపుణులను కూడా తాను అలాగే చూసుకునేవారు.

వాళ్లకి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని చేస్తున్న సినిమాను కూడా వదిలేసిన వ్యక్తిత్వం పుల్లయ్య గారిది.

ఏవండీ మీకెందుకు ఆ గొడవలు అని ఎవరైనా అడిగితే “ఆకలితో వాళ్ళు పనిచేస్తుంటే నేనెలా భరించగలను” అని కరాకండిగా అడిగేసేవారు.

ఇక దర్శకుడుగా తనది వజ్ర సంకల్పం. తన మనసులో ఏదైతే ఊహించుకునేవారో అదే తెరమీద చూపించేవారు. ఏ విషయంలోనూ రాజీ పడేవారు కాదు.

సినిమా కథ అనేది వాలుగాలిలో పడవలా తాపీగా, సంతోషంగా నడిచిపోవాలన్నది పుల్లయ్య గారి సిద్ధాంతం.

Show More
Back to top button